Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – పద్దెనిమిదవ భాగము

చతుర్ధి (చవితి) – గణపతి వృత్తాంతం

పూర్వం దేవతలు, ఋషులు, సిద్ధులు తాము చేసే పనులు చక్కగా కొనసాగించేందుకు వీలుగా మంచి ముహూర్తంలో తమ కార్యాల్ని ప్రారంభించేవారు.

అయితే విచిత్రంగా మంచి వారు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, చెడ్డబుద్ధితో ఆలోచించి చేసే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకపోవటం జరుగుతోంది. అది చూసి దేవతలు, ఋషులు, సిద్ధులందరూ కలిసి చెడ్డపనులు చేసేవారికి విఘ్నాలు కలగాలని ఆశించారు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించి సరాసరి మహాదేవుడు నివసించే కైలాసానికి వెళ్ళారు.

అక్కడ కొలువై వున్న శంకరుణ్ణి స్తుతించి భక్తిగా నమస్కరించి ప్రభూ! శంకరా! శూలపాణీ! త్రిలోచనా! దుష్టులు చేసే కార్యాలకి లోకంలో విఘ్నాలు కలిగేలా నీవు ఒకణ్ణి పుట్టించాలి స్వామీ!

అలా చేయకపోతే అసురశక్తులు విజృంభించి లోకాలన్నిటికీ ఉపద్రవాలు కలిగే ప్రమాదం ఉంది స్వామీ! అని విన్నవించారు. దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఎంతో ఆనందించి ఒక్కసారి పార్వతీదేవివైపు చూసాడు.

పార్వతీదేవిని చూస్తున్న పరమేశ్వరుడి మదిలో ఒక ఆలోచన బయలుదేరింది. అసలు ఆకాశానికి ఏరూపం లేదు ఎందుకని? భూమికి, నీటికి, నిప్పుకి, గాలికి కూడా ఒక రూపం వుంది కదా! మరి ఆకాశానికి ఎందుకు రూపం ఏర్పడలేదు? అని ఆలోచిస్తూ ఒక్కసారిగా నవ్వాడు. జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఉమాదేవిని, ఆకాశాన్ని వెంటవెంటనే చూసాడు.

భూమి, నీరు, నిప్పు, గాలి అనే నాలుగు భూతాల గణాలతో కూడి ఆకాశం గురించి ఆలోచిస్తున్న పరమేశ్వరుడి శరీరం నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక కుమారుడు జన్మించాడు. దిక్కులన్నిట్నీ ప్రకాశింపచేస్తున్న ఆ మహాతేజస్వి అపర రుద్రుడిలాగా భాసిస్తున్నాడు. తేజస్సులో, రూపంలో, ఆకారంలో సాటిలేనివాడుగా ఉన్న ఆ కుమారుణ్ణి దేవతలంతా రెప్పలార్పకుండా చూస్తున్నారు.

జగదేక సౌందర్యవంతుడిలా ప్రకాశిస్తున్న ఆ కుమారుణ్ణి చూసి దేవకాంతలంతా ఎంతో వ్యామోహం పొందుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన శంకరుడు తన కుమారుణ్ణి పిలిచి నీ రూపం వల్ల అందరికీ విపరీతమైన మోహం కలుగుతుంది. కనుక నీకు ఏనుగుతల, మరగుజ్జు,శరీరం పెద్దపొట్ట, పాముల జందెం కలుగుగాక! అని శపించాడు. వెంటనే ఆ కుమారుడు శివుడు శపించిన విధంగా మారిపోయాడు.

శివుడు ఒక్కసారి దేవతల్ని చూసి తన శరీరాన్ని గట్టిగా విదిల్చాడు. వెంటనే ఆయన శరీరం మీదున్న వెంట్రుకల నుంచి చెమటనీరు కారి ధారలుగా ప్రవహించింది. ఆ నీటి నుంచి ఏనుగుముఖంతో కాటుకలాంటి నల్లటి దేహంతో ఎన్నో ఆయుధాలు ధరించి వినాయకులు లక్షలాదిమంది ఆవిర్భవించారు. ఆ అద్భుతదృశ్యాన్ని చూసి దేవతలకి నోట మాటరాలేదు. వారంతా ఒక్క వినాయకుడే మన కార్యానికి సరిపోతాడు కదా! ఇంతమంది. వినాయకులు పుట్టుకొస్తున్నారే! పరమేశ్వరుడు వీళ్ళనెందుకు సృష్టిస్తున్నాడు అని చింతిస్తున్నారు.

దేవతలంతా అలా చింతించేంతలోనే వినాయకులతో భూగోళమంతా నిండి పోయింది. అప్పుడే బ్రహ్మదేవుడు విమానం మీద వచ్చి దేవతలందరితో “సురులారా! మీరెంతో ధన్యులు. మహాదేవుడైన పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. ఆయన సృష్టించిన ఈ గణాలన్నీ మీ శత్రువులకి విఘ్నాలు కలిగిస్తాయి అని పలికాడు. ఆ తరువాత పరమేశ్వరుడి వైపు తిరిగి ” ఈశ్వరా! నీ శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ వినాయకుడు ఈ గణాలన్నిటికీ ప్రభువవుతాడు. నీవు అందరికన్నా గొప్పవాడిగా సృష్టించిన నీ కుమారుడు ఆకాశంలో సంచరిస్తాడు. ఆకాశమంత ఉన్నతుడై అందరికీ అధిపతిగా ఉంటాడు. నీ పుత్రుడు చాలా గొప్పవాడౌతాడు. నీవతనికి అస్త్రాల్ని ఆయుధాల్ని ప్రసాదించు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

బ్రహ్మ మాటలు విన్న ఈశ్వరుడు తన కుమారుణ్ణి పిలిచి “నాయనా నీవు నేటినుంచీ….

వినాయకో విఘ్నకరో గజాస్యోగణేశ నామాచభవస్య పుత్రః||

ఏతేచ సర్వేతవయాస్తు భృత్యా వినాయకః కౄరదృశః ప్రచండాః ॥

ఉచ్చుష్మదానాది వివృద్ధదేహః కార్యేషు సిద్ధం ప్రతిపాదయంతు ॥

(శ్లో॥ 27, అధ్యా-23)

“వినాయకుడు, విఘ్నకర్త, గజాస్యుడు, గణేశుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతావు. కఠోరమైన చూపులతో భయంకరంగా కనిపించే ఈ వినాయక గణాలందరూ నీకు సేవకులౌతారు. తాపాలు లేని ప్రజలు పెట్టే నైవేద్యాలతో వృద్ధిచెందే వీరు తమకి నైవేద్యం పెట్టిన వారి కార్యాల్ని సఫలం చేస్తుంటారు. నీవు కూడా సకలలోక వాసులచేత యజ్ఞయాగాది శుభకార్యక్రమాలలో తొలి పూజలందుకుంటావు. అలా నిన్ను పూజించకుండా ఎవరైనా తమ కార్యాల్ని ప్రారంభిస్తే వాటికి విఘ్నాలు కల్పిస్తావు” అని పలికి దేవతలతో పాటూ తానుకూడా బంగారు కుండలతో పవిత్రజలాన్ని నింపి దానితో వినాయకుణ్ణి అభిషేకించాడు.

ఆ విధంగా అభిషేకించబడుతున్న గణనాధుణ్ణి చూసి దేవతలంతా శ్రద్ధా భక్తులతో ఇలా స్తుతించారు.

నమస్తే గజవక్త్రయ నమస్తే గణనాయక।

వినాయక నమస్తేస్తు నమస్తే చండ విక్రమ ॥

నమో స్తుతే విఘ్నకర్తే నమస్తే సర్పమేఖల |

నమస్తే రుద్రవస్త్రోత్థ ప్రలంబజఠరాశ్రిత ॥

సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।

(శ్లో॥30-32, అధ్యా-23)

ఈవిధంగా దేవతలందరి చేతా గణనాయకుడిగా వినాయకుడు అభిషేకించబడ్డాడు. ఈ గణనాథపదవి వినాయకుడికి చతుర్థి (చవితి) తిథినాడు వచ్చింది. అందుకే చతుర్థి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చతుర్థి తిథినాడు నువ్వుల్ని ఆహారంగా స్వీకరించి గణపతిని భక్తిగా పూజిస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా సాధకుడికి లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేవతలు చేసిన గణపతి స్తుతిని విన్నవారికి పఠించినవారికి ఎలాంటి విఘ్నాలూ కలుగవు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment