Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – పన్నెండవ భాగము

గౌరముఖుడి వృత్తాంతం

పూర్వం కృతయుగంలో ”సుప్రతీకుడనే” మహారాజుండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. అయితే వారికి ఎప్పటికీ సంతానం కలుగలేదు. అప్పుడా సుప్రతీకుడు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్న ఆత్రేయుడనే మునిని దర్శించాడు. ఆయన అనుగ్రహంతో మహావీరుడైన దుర్జయుడనే పుత్రుణ్ణి కన్నాడు.

దుర్జయుడు అపారమైన సైన్యసంపత్తి కలిగిన మహాబలవంతుడు. అతడు దిగ్విజయయాత్రకి వెళ్ళి భూమండలాన్నంతా అవలీలగా జయించాడు. అంతేకాదు అష్టదిక్పాలకుల్ని కూడా జయించి విజయ గర్వంతో తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు. దారిలో అతడికి గౌరముఖుడనే మహర్షి ఆశ్రమం కనిపించింది. తన అపార సైన్యాన్ని వెలుపలే ఉంచి దుర్జయుడు లోపలికి వెళ్ళి గౌరముఖుడికి నమస్కరించి ఆశీర్వాదాన్ని కోరాడు. గౌరముఖుడు రాజుని గౌరవించి అతడికి అతడి సైన్యానికీ ఆతిథ్యమిస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు అన్ని లక్షలమంది ఎలా ఈ ముని ఆహారం పెడతాడు అని ఆలోచించాడు. అంతలో గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించివస్తానని చెప్పి అక్కడే ఉన్న గంగానది దగ్గరకి వెళ్ళాడు. ఆ గంగలోనిలిచి ఎంతో భక్తిగా నారాయణ స్తుతి చేసాడు.

గౌరముఖుడు చేసిన నారాయణస్తుతి :-

నమోస్తు విష్ణవే నిత్యం నమస్తే పీతవాసినే

నమస్తే చాద్యరూపాయ నమస్తే జలరూపిణే ॥

నమస్తే సర్వసంస్థాయ నమస్తే జలశాయినే,

నమస్తే క్షితిరూపాయ నమస్తే తేజపాత్మనే ॥ నమస్తే

వాయురూపాయ నమస్తే వ్యోమరూపిణే

2.త్వం దేవః సర్వభూతానాం ప్రభు స్త్వమసి హృచ్ఛయః ॥

త్వమోజ్కారో వషట్కారః సర్వత్రైవచ సంస్థితః

త్వం మాదిః సర్వదేవానాం త వ చాది ర్న విద్యతే ॥

త్వంభూ స్త్వం చ భువో దేవ త్వంజన స్త్వం మహః స్మృతః

త్వం తప స్వం చ సత్యం చ త్వయి దేవ చరాచరమ్ ||

త్వత్తో భూత మిదం విశ్వం త్వదుద్భూతా ఋగాదయః

త్వత్తః శాస్త్రాణి జాతాని త్వత్తో యజ్ఞాః ప్రతిష్ఠితాః ॥

త్వత్తో వృక్షా వీరుధశ్చ త్వత్తః సర్వా వనౌషధీః

పశవః పక్షిణః సర్పా స్వత్త ఏవ జనార్దన ॥

మమాపి దేవదేవేశ రాజా దుర్జయ సంజ్ఞితః

అగతో భ్యాగత స్తస్య ఆతిథ్యం కర్తు ముత్సహే ||

తస్య మే నిర్దన స్యాద్య దేవదేవ జగత్పతే

భక్తినమ్రస్య దేవేశ కురుష్వ న్నాద్య సంచయమ్ |

యం యం స్పృశామి హస్తేన యం యం పశ్యామి చక్షుషా

వృక్షం వా తృణకన్దం నా తత్త దన్నం చతుర్విధమ్ ||

తథా త్వన్యతమం వాపి యధాధ్యాతం మనసా మయా

తత్ సర్వం సిద్ధ్యతాం మహ్యం నమస్తే పరమేశ్వర॥

(శ్లో॥ 11-21,అధ్యా-11)

గౌరముఖుడి స్తుతి పూర్తికాగానే శంఖ చక్ర గదాధరుడైన శ్రీహరి అక్కడ సాక్షాత్కరించాడు. వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న స్వామిని చూసి ఎంతో పులకించిన గౌరముఖుడు “స్వామీ! దుర్జయుడనే మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతడి సైన్యనికి సంపూర్ణంగా భోజనం పెట్టే వరాన్నివ్వు అని ప్రార్ధించాడు. గౌరముఖుడి ప్రార్థన విన్న నారాయణుడు కరుణించి ఆయనకొక దివ్యమణిని ప్రసాదించి ఇది నీవు కోరినవన్నీ ఇస్తుందని చెప్పి అదృశ్యమయ్యాడు.

గౌరముఖుడు నారాయణుడు తనకి ప్రసాదించిన మణి ప్రభావంతో తన ఆశ్రమ ప్రాంగణంలో ఒక పెద్ద మహానగరాన్ని, అందులో దాస దాసీ జనాన్ని కావలసిన భోజన పదార్థాల్ని సంకల్పించాడు. ఒక్క క్షణంలోనే అవన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. దుర్జయుడు అతడి పరివారం ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి కావలసింది తిని ఆనందంగా విశ్రమించారు. మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేసరికి నగరం, దాసదాసీజనం అంతా అదృశ్యమైపోయారు. దుర్జయుడికి అతడి పరివారానికీ గౌరముఖుడి దివ్య శక్తినిచూసి ఆశ్చర్యం కలిగింది.

అందరూ ఆయన వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొద్ది దూరం వచ్చాక దుర్జయుడికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఆ మహర్షి ఏవిధంగా తమకి ఆతిథ్యం ఇవ్వగలిగాడో తెలుసుకుని రమ్మని పరివారాన్ని పంపాడు. వారు తిరిగి వచ్చి శ్రీహరి అనుగ్రహంతో ఆయనొకమణిని సంపాదించాడని, దాని ప్రభావంతోనే తమందరికీ ఆతిథ్యం ఇవ్వగలిగాడని చెప్పారు. దుర్జయుడు ఎలాగైనా గౌరముఖుడి దగ్గరున్న మణిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. వెంటనే తన మంత్రిని ఆ ముని దగ్గరకి పంపాడు.

దుర్జయుడి మంత్రి వెనక్కి తిరిగివచ్చి గౌరముఖుడు మణిని రాజుగారికి ఇవ్వనన్నాడని చెప్పాడు. దుర్జయుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన సైన్యాన్ని వెనక్కితిప్పి గౌరముఖుడి ఆశ్రమం మీదకి వచ్చాడు. అదిచూసిన గౌరముఖుడు దివ్యమణిని చేతిలో ధరించి ఒక్కసారి మనసులో స్మరించాడు. అంతే ఒక్కసారిగా ఆ మణినుంచి వేలకొద్దీ అస్త్రధారులైన సైన్యం ఆవిర్భవించారు. దుర్జయుడి సైన్యానికి ఈ సైన్యానికీ మధ్య ఘోరంగా పోరు ప్రారంభమయ్యింది. మణినుంచి ఆవిర్భవించిన సైన్యం చేతిలో దుర్జయుడి సైన్యం వధించబడ్డారు. కొంత సమయం తరువాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్ళి అక్కడే కూర్చుని భక్తిగా శ్రీహరిని ధ్యానించాడు.

పీతాంబర ధారియై శంఖ, చక్ర, గదాపద్మాల్ని ధరించిన శ్రీహరి ప్రత్యక్షమై ఎందుకు స్మరించావు అని అడగగా, గౌరముఖుడు నమస్కరించి, దుర్జయుడు చేసిన దుర్మార్గాన్నంతా ఆయనకి వివరించాడు. ఎలాగైనా ఆ దుష్టదుర్జయుణ్ణి సంహరించమని శ్రీహరిని కోరాడు. వెంటనే శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దుర్జయుణ్ణి అతడి సైన్యాన్ని భస్మీపటలం చేసాడు. ఆ విధంగా గౌరముఖుడు శ్రీహరి అనుగ్రహంతో, కోరినవన్నీ చేయగలిగిన దివ్యశక్తిని సాధించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment