Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఐదవ భాగము

బ్రహ్మపార స్తోత్రం :-

ప్రియవ్రతుడు నారదమహర్షి చెప్పిన వృత్తాంతం విన్నాక ఎంతో ఉత్సాహంగా “మహర్షీ! మీరు చెప్పిన విషయం ఎంతో కుతూహలంగా ఉంది. తరువాత ఏం జరిగిందో చెప్పండి” అని అడిగాడు. రాజేంద్రా! నేను సావిత్రీదేవి మాటననుసరించి అక్కడున్న వేదసరోవరంలోకి దిగి స్నానం చేసాను. వెంటనే నాకు వేయి జన్మల స్మరణ ఒక్కసారిగా కలిగింది. ఆ జన్మల్లో జరిగిన విశేషాలు చెబుతున్నా విను. పూర్వం అవంతీపురం అనే మహానగరం ఉండేది. పూర్వకాలంలో నేనా నగరంలో ఒక విప్రుడుగా జన్మించాను. అప్పటి నా పేరు సారస్వతుడు. వేదవేదాంగాలన్నీ పరిపూర్ణంగా అధ్యయనం చేసాను. అప్పడు నాకు ఎంతోమంది సేవకులు, దాసదాసీలు, పరివారం ఉండేది. గొప్ప ధనధాన్య సంపదలు కలిగినవాడిగా పేరు పొందాను.

ఒకనాడు నేను ఏకాంతంగా కూర్చుని ఇలా ఆలోచించాను. సుఖ దుఃఖాలతో కూడిన ఈ జీవితాన్ని ఇంకెంతకాలం అనుభవించాలి. ఈ సంపదలేవీ నాకు సుఖాన్నివ్వటం లేదు. ఇక నా బాధ్యతలన్నీ నా కుమారులకి అప్పగించి తపస్సు చేసుకుంటే మంచిది” అని భావించాను. వెంటనే అన్ని బాధ్యతల్నీ పుత్రులకి అప్పగించి వైరాగ్య భావంతో సారస్వతం అనే పేరుతో ప్రసిద్ధమైన ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడే తపస్సు చేసుకోవటం ప్రారంభించాను. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తూ ఎంతోకాలం ధ్యానం చేసాను.

నారదుడు చేసిన బ్రహ్మస్తుతి :-

పరం పరాణా మమృతం పురాణం పారం పరం విష్ణు మనన్త వీర్యమ్ ।

నమామి నిత్యం పురుషం పురాణం పరాయణం పారగతం పరాణామ్ ॥

పురాతనం త్వప్రతిమం పురాణం పరాపరం పారగ ముగ్రతేజసమ్||
గమ్భీరగమ్భీరధియాం ప్రధానం నతో స్మి దేవం హరి మిశితారమ్ ॥*

పరాత్పరం చాపరమం ప్రధానం పరాస్పదం శుద్ధపదం విశాలమ్ ||

పరాత్పరేశం పురుషం పురాణం నారాయణం స్తమి విశుద్ధ భావః ॥

పురా పురం శూన్య మిదం ససర్జ తదా స్థితత్వాత్ పురుషః ప్రధానః |

జనే ప్రసిద్ధః శరణం మమాస్తు నారాయణో వీతమలః పురాణః ॥

ధృతక్షమం శాన్తిధరం క్షితీశం శుభం సదాస్తామి మహానుభావమ్ ।

సహస్రమూర్ధన మనస్తపాద మనేకబాహుం శశిసూర్యనేత్రమ్ ॥

పారం పరం విష్ణు మపారరూపం

పురాతనం నీతిమతాం ప్రధానమ్|

క్షరాక్షరం క్షీర సముద్ర నిద్రం

నారాయణం సౌమ్యమృతం పరేశమ్ ॥

త్రివేద గమ్యం త్రినవైకమూర్తిం త్రిశుక్ల సంస్థం త్రిహుతాశభేదమ్ |

త్రితత్త్వలక్ష్యం త్రియుగం త్రినేత్రం నమామి నారాయణ మప్రమేయమ్ ||

కృతే సితం రక్తతనుం తథా చ త్రేతాయుగే పీతతనుం పురాణమ్ ||

తథా హరిం ద్వాపరతః కలౌ చ కృష్ణకృతాత్మాన మథో నమామి ॥

ససర్జ యో వక్త్రత ఏవ విప్రాన్ భుజాన్తరే క్షత్ర మథోరుయుగ్మే |

విశః పదాగ్రేషు తథైవ శూద్రాన్ నమామి తం విశ్వతనుం పురాణమ్ ॥

పరాత్పరం పారగతం ప్రమేయం యుధాంపతిం కార్యత ఏవ కృష్ణమ్ ||

గదాసిచర్మణ్య భృతో తపాణిం నమామి నారాయణ మప్రేయమ్ ॥

(శ్లో॥ 11-20, అధ్యా-3)

ఈ విధంగా పరబ్రహ్మతత్త్వంతో కూడిన స్తోత్రాన్ని పఠించగానే భగవానుడు ఎంతో ప్రసన్నుడై మధురమైన స్వరంతో వరం కోరుకోమన్నాడు. అప్పుడు నేను ఆయనకి నమస్కరించి ప్రభూ! నన్ను నీలో లయం చేసుకో. ఇదే నేను కోరే వరం” అని అన్నాను. వెంటనే ఆ దేవదేవుడు ఓబ్రాహ్మణోత్తమా!

ఇదిగో నాశనం లేని నా ప్రకృతిలోకి ప్రవేశించు. నీ దివ్యస్తుతి నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నీకు వెయ్యి బ్రహ్మయుగాల ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తున్నాను. అలాగే నీకు ఒక అర్ధవంతమైన పేరు కూడా ఏర్పడుతుంది

నారంపానీయమిత్యుక్తం తం పితౄణాం సదభవాన్ దదాతి తేన తే నామ నారదేతి భవిష్యతి ॥

(శ్లో॥ 24, అధ్యా – 3)

నారం అంటే త్రాగేనీరు, నీవు పితృదేవతలకి ఎల్లప్పుడూ నీటిని ఇస్తావు. నీకు ”నారదుడు” అనే పేరు కలుగుతుంది”. అని పలికి ఆ పరమాత్మ కాబట్టి అంతర్ధానమయ్యాడు.

ప్రియవ్రతా! ఆ పరమాత్మ ఇచ్చిన వరం ప్రకారం నేను నా దేహాన్ని విడిచి బ్రహ్మ దేహంలో లయమైపోయాను. తిరిగి ఆ బ్రహ్మదేవుడి మనసునుంచి పుట్టిన మరీచ్యాది మహర్షులతో పాటు నేను జన్మించాను. ఆ విధంగా ఎక్కడనుంచి ఆవిర్భవించాడో తెలియని బ్రహ్మదేవుడి రోజు మొదలే సమస్త దేవతల సృష్టికీ మొదలు. రాజా! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదే సమస్తజగత్తు సృష్టి ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం. నేను ఏవిధంగా నారాయణుణ్ణి ధ్యానించి ఉత్తమ పదవిని పొందానో అలాగే నీవు కూడా శ్రీ మహావిష్ణువుని సేవిస్తే ఉత్తమ గతులు పొందగలవు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment