Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 -నాల్గవ భాగము

సృష్టి వృత్తాంతం :-

భూదేవి చేసిన స్తుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో “దేవీ! నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి. ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు అందరికీ కలగవు. నీవు నన్నడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు. అవి శాస్త్ర జ్ఞానంతో చెప్పతగినవి. వాటినిప్పుడు చెబుతున్నా విను” అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. భూదేవీ! పురాణాలన్నిటికీ ఒక సామాన్య లక్షణముంటుంది. ఆ లక్షణం మొత్తం అయిదు విధాలుగా చెప్పబడింది.

సర్గశ్చ ప్రతిసర్గశ్చవంశో మన్వంతరాణిచ ||

వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్ ॥

సృష్టి, లయం, వంశం, మన్వంతరం, రాజవంశాల చరిత్ర అనే అయిదు లక్షణాలతో కూడుకున్నదే పురాణం. దేవీ! నీకు పురాణలక్షణాలలో మొదటిదైన సృష్టిని గురించి చెబుతాను.

ప్రారంభంలో నేను ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను. ఆ తరువాత అణువు అనేది ఏర్పడింది. అణువు తరువాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది. అణురూపంలో ఉన్న ఆ బుద్ధే సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు తత్త్వాలుగా మారింది. వాటినే త్రిగుణాలంటారు. ఆ మూడు గుణాల సముదాయంలో నేను ”మహత్” అనే వాడుగా ఉంటున్నాను. సర్వాన్ని తెలిసిన వాళ్ళలో నేనే మొదటివాడిని. నా నుంచి క్షేత్రజ్ఞుడనేవాడు ఆవిర్భవించాడు. తిరిగి ఆ క్షేత్రజ్ఞుడినుంచి బుద్ధి రూపొందింది.

దేవీ! బుద్ధి నుంచి అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి. అలా ఇంద్రియాలు నెలకొన్న తరువాత ఆ పంచభూతాలు సాయంతో ఒక పిండస్వరూపాన్ని నేనే తయారుచేసాను.

దేవీ! సృష్టి మొదట్లో అంతా శూన్యమే ఉంది. ఆ శూన్యం నుంచి ఆకాశం, దానినుంచి శబ్దం, వాయువు, దాని నుంచి అగ్ని, ఆ అగ్నినుంచి జలాన్ని నేనే సృష్టించాను. ఆ జలం నుంచే సకలజీవులకీ తల్లివైన (భూమాత నిన్ను సృజించాను. ఆకాశాదులకి భూమివైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల ఋడగలతో కూడి జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అందంగా మారింది. కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా అయ్యింది. దేవీ! ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయస్వరూపుడిగా సృష్టించుకున్నాను.

ఆ విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి ఆ నీళ్ళనే నా నివాస స్థానంగా మార్చుకోవటం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది. ప్రతికల్పంలో నేను తిరిగి ఆ ఆండంలోకి వెళుతూనే ఉంటాను. దేవీ! కొంత కాలం తరువాత నా నాభికమలం నుంచి ఒక పద్మం ఆవిర్భించింది. ఆ పద్మం నుంచి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు. అలా అవతరించిన బ్రహ్మను చూసి “ఓయీ! నీవు ప్రజల్ని సృష్టించు” అని పలికాను. దేవీ! నేనలా పలికి అతడికి కనపడకుండా అదృశ్యమయ్యాను. అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు. కొంత సేపటికి బ్రహ్మకి – తన జన్మానికి కారకుడైన వారెవరు? అన్న సందేహం కలిగింది. అది కూడా ఎంత సేపటికీ తెలియకపోవటంతో, ఆయనకి ఒక్కసారిగా తనమీద తనకే కోపం వచ్చింది. వెంటనే ఆయన కోపం నుంచి ఒక పిల్లవాడు జన్మించి ఆయన తొడమీద వచ్చి కూర్చున్నాడు. ఉన్నట్టుండి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాణ్ణి బ్రహ్మ ఓదార్చటానికి ప్రయత్నించగా అతడు తనకొక పేరుపెట్టమని బ్రహ్మని కోరాడు. గట్టిగా రోదిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ.

దేవీ! బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు. అయితే అతడు శక్తి లేక నీళ్ళలో మునిగి తపస్సు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. అలా రుద్రుడు నీళ్ళలో మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలి నుంచి ఒక ప్రజాపతిని, ఎడమ బొటనవేలి నుంచి ఆ ప్రజాపతికి తగిన ఒక భార్యని ప్రజల్ని సృష్టించటం కోసం సృజించాడు. అలా బ్రహ్మ వేలి నుంచి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదట స్వాయంభువ మనువుని కన్నాడు. ఇక ఆ స్వాయంభువ మనువు నుంచి ప్రజాసృష్టి ప్రారంభమైంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment