భూదేవి ప్రార్ధన
నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీమ్
ఖురమధ్యగతోయస్య మేరుః ఖణఖణాయతే
దంష్ట్రాగ్రేణోద్ధృతా గౌరుదధిపరివృతా పర్వతైర్నిమ్నగాభిః
సాకం మృత్పిండవత్ ప్రాగ్బృహదురువపుషా నంతరూపేణయేన
సో యంకంసాసురారిరుర నరక దశాస్యాన్తకృత్ సర్వసంస్థః
కృష్ణో విష్ణుః సురేశో మద్దతు మమరి పూనాది దేవో వరాహః
యః సంసారార్ణవే నేరివ మరణ జరావ్యాధి నక్రోర్మి భీమే
భక్తానాం భీతి హర్తా మురనరక దశాస్యాన్త కృత్ కోలరూపీ
విష్ణుః సర్వేశ్వరోయం యమిహ కృతధియోలీలయా ప్రాప్నువన్తి
ముక్తాత్మానో నపాపంభవతు ప్రణుతా రాతిపక్షః/క్షితీశః
(శ్లో॥1-3, అధ్యా1) ఎవరు విలాసంగా భూమిని ఉద్ధరిస్తుంటే ఆయన కాలి గిట్టల మధ్య చిక్కుకున్న మేరుపర్వతం ఖణ ఖణలాడిందో అలాంటి వరాహదేవుడికి నమస్కరిస్తున్నాను.
పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో- పర్వతాలు, నదులు, సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా, తన కోర అంచుతో ఒక మట్టిబెడ్డలాగా పైకెత్తాడు. ఆయనే వివిధ అవతారాలు ధరించి, కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అనే రాక్షసుల్ని తుదముట్టించాడు. అలాంటి దివ్య పరాక్రమం చూపిన నల్లనివాడు, సర్వత్రా వ్యాపించినవాడు, దేవతలందరికీ ప్రభువు, అన్నిటా నెలకొన్నవాడు, ఆదిదేవుడు అయిన ఆ వరాహమూర్తి నా పగవారిని పారద్రోలుగాక!
సంసారం అనే సముద్రం భయంకరమైన చావు, వార్ధక్యం, రోగం అనే మొసళ్ళతో, అలలతో నిండి వుంటుంది. అలాంటి సంసారం ఎంతో భయానకమైంది. తన భక్తుల్ని ఆ సంసారభయం నుంచి దూరం చేసేవాడు. మురనరక రావణాది అసురుల్ని పరిమార్చినవాడు, వరాహ రూపాన్ని ధరించినవాడు, స్వర్గలోకాధిపతి అయినవాడు, భూదేవికి నాథుడు, శుత్రువుల్ని అవలీలగా అంతం చేసేవాడు మహాపండితులకు ముక్తి పొందిన పుణ్యాత్ములకు మాత్రమే లీలగా దర్శనమిచ్చేవాడు అయిన శ్రీమహావిష్ణువు అందరికీ సుఖస్వరూపుడు అగుగాక!
ఈ విధంగా పూర్వం తనని ఉద్దరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది.
ప్రభూ! ప్రతికల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్దరిస్తున్నావు. చాలా సంతోషం. అయితే స్వామీ! నేను నీ మొదటిరూపం ఎలాంటిదో నీవు చేసిన తొలిసృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను. పూర్వం హయగ్రీవాసురుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోకి వెళ్ళి ఆ వేదాల్ని పైకితెచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆ తరువాత దేవదానవులు సముద్రాన్ని మధించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మథనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేసావు. ఇంకో కల్పంలో భూదేవినైన నేను రసాతలంలోకి జారిపోతుంటే నీవు వరాహరూపాన్ని ధరించి ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు.
లోకరక్షకా! భూలోకంలో హిరణ్యకశిపుడు బ్రహ్మచేత అజేయమైన వరాల్ని పొంది లోక కంటకుడైనప్పుడు నరసింహావతారాన్ని ధరించి అతన్ని దారుణంగా వధించావు. అలాగే వామన రూపాన్ని ధరించి మహారాక్షసుడైన బలి చక్రవర్తి దర్పాన్ని అణిచావు. ఆ తరువాత భార్గవరాముడిగా (పరశు రాముడిగా) అవతరించి అమోఘమైన నీ గండ్రగొడ్డలితో క్షత్రియలోకాన్నంతా సమూలంగా రూపుమాపావు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించి లోక కంటకుడైన రావణాసురుణ్ణి సంహరించి ముల్లోకాల్నీ రక్షించావు.
దేవా! ఇలా నీ లీలలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే వాటి అంతరార్ధాన్ని నేను ఏ కొంచెం కూడా తెలుసుకోలేక పోతున్నాను. స్వామీ! అసలు ఈ సృష్టి అంతా ఎవరిచేత నాశనం చేయబడుతోంది. ఎవరిద్వారా రక్షించబడుతోంది. నన్ను ఉద్దరించిన తరువాత తిరిగి ఈ విశ్వాన్ని నీవెలా సృష్టిస్తావు? ఎలా దాన్ని పాలిస్తావు? ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావు స్వామీ! నిన్ను చేరుకునే మార్గం ఏది? అసలు ఈ సృష్టికి మొదలు ఏది? ఇది ఎలా ఎప్పుడు అంతమవుతుంది? యుగాలు ఎలా ఏర్పడ్డాయి? నాలుగు యుగాల విభాగం ఎలా ? ఆ నాలుగు యుగాలలో జరిగిన విశేషాలు ఏమిటి? మహాప్రభూ!
ఈ యుగాల్లో ప్రస్తుతం నడుస్తున్న యుగం ప్రత్యేకత ఎలాంటిది? అసలు కోరిక అంటే ఏమిటి? యజ్ఞాలు ఎవరెవరు చేశారు? అలా చేసిన వారిలో రాజులెవరు? సిద్ధిపొందిన వారెవరు? దయచేసి నా సందేహాల్ని తీర్చి నన్ను ధన్యురాల్ని చేయి ప్రభూ!
భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారి నోరుతెరిచి గట్టిగా నవ్వటం ప్రారంభించాడు. అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశరుద్రులు, అష్టవసువులు, సిద్ధులు, మహర్షులు దర్శనమిచ్చారు. ఇంకా సూర్యచంద్రులతో గ్రహాలతో కూడిన సమస్తలోకాలూ తమ తమ ధర్మాల్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా ఒణికిపోయింది. వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తరువాత మరోసారి తన నోటిని తెరిచాడు. అప్పుడు నాలుగు భుజాలు కలిగి, మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి ఆమెకి కనిపించాడు. శేషపాన్పు మీద నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డునుంచి ఉద్భవించిన తామరపువ్వులో కొలువున్న బ్రహ్మను కూడా చూసింది. ఒక్కసారిగా ఆమెకి ఆనందం కలిగి వారిద్దర్నీ ఇలా స్తుతించింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹