గరుడుని పుట్టుక
ఒక కల్పాంత ప్రళయ కాలంలో లోకమంతా నాశనం అయి జగమంతయు ఏకార్జమైపోయెను. ఒక్క స్థావరము కూడా లేదు. జంగమములు లేవు. సూర్యచంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేడు. అంత సర్వశూన్యముగా మారిపోయి వుండెను. అన్నిచోట్లా అంధకారము వ్యాపించియుండేది. ఆ చీకటి కావల ఏదో ఒక మహాజ్యోతి.
అది స్వయంప్రకాశమై వెలుగుచుండెను. అదే సర్వ జగత్కారణమైన మహస్సు. ఆ జ్యోతిస్స్వరూపుడైన భగవానుని సంకల్ప బలం వల్ల ఆ మహాజలనిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు) తేలుచుండెను. అది కొంతకాలం తర్వాత చితికి రెండు ముక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశంగా రూపందాల్చాయి. ఆ అండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను.
అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను. అతనికి ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తుండగా “తప, తప” అని మాటలు వినిపించెను. అతడు చుట్టూ చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానిస్తూ కొన్ని వేల ఏండ్లవరకు తపము చేసి మానసిక శక్తిని సంపాదిస్తాడు. నారాయణుడు అతడిని సృష్టి చేయమని ఆదేశించెను.
బ్రహ్మ మనః స్సంకల్పంతో ముందు సనకసనందనాదులను సృజించగా వారు సంపారమునందు వైరాగ్యము గలవారై తపమునకు వెళ్తారు. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయడం తన ఒక్కడివల్ల కాదని తెలిసి, దక్ష,మరిచి,కశ్యపాది ప్రజాపతులను సృజించి, వారివారికి తగిన భార్యలను కూడా సృష్టించి, మీరు సృష్టిని వ్యాపించజేయండని ఆదేశించెను. వారు తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించి సృష్టిని కొనసాగించిరి.
కశ్యపు పుత్రుడైన గరత్మంతుడు
కశ్యపునికి చాలామంది భార్యలు వున్నారు. వారిలో వినత, కద్రువ అని ఇద్దరు. వీరిలో కద్రువకు సవతి మచ్చరం ఎక్కువ. కాని పతిని సేవించడంలో మాత్రం ఎవరికెవరూ తీసిపోరు. వినత సాధు స్వభావం గలది. ఆమె.. గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆదిపురుషుడు అని వివి.. అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని తపము చేస్తుంది.
నారాయణుడు ఆమెను అనుగ్రహించి.. “నీ గర్భమున గరుడునిగా జన్మనిస్తాను” అని వరమిచ్చాడు. దాంతో ఆమె సంతోష భరితురాలయ్యింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అవుతుంది. ఒకనాడు కద్రువ, వినతలు క్షీరసాగరతీరానికి విహారమునకు వెళ్తారు. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడుతుంది.
దానిని చూసి కద్రువ.. “అదేంటి..? గుర్రం శరీరమంతా తెలుపుగానే వుంది. కానీ తోక మాత్రం నల్లగా ఉంది” అని అంటుంది. దానిని విన్న వినత “అదేమి? అలా అంటున్నావు? తోక కూడా తెల్లగానే వుంది కదా?” అని సమాధానం ఇస్తుంది. కద్రువ “కాదు నలుపే. అది నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యము చేయాలి. తెల్లగా వుంటే నేను నీకు దాస్యము చేస్తాను ” అని చెబుతుంది. అప్పుడు వినత ” సరే.. వెళ్లి చూద్దాం రమ్ము ” అని పిలుస్తుంది.
కద్రువ “ఇప్పటికే సంధ్యాకాలం అయింది. మన భర్తకు కావలసినవి చూడవద్దా? పదా వెళ్దాం. రేపు పొద్దున్నే చూద్దాం “అని చేయిపట్టుకొని తీసుకునివెళ్తుంది. ఆ రాత్రి కద్రువ తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్పరాజులను పిలిచి “మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు” మని అంటాడు.” విషయం ఏమి??’’ అని వారు అడగగా, జరిగినది చెప్తాడు. వారిది అన్యాయం అంటారు. ఆ పని మేము చేయము అని చెబుతారు. ఆమె వారిని “సర్పయాగములో నశింపు” మని శపించినది. ఆమె శాపానికి భయపడి కొందరు తల్లి మాట చేయడానికి సిద్ధపడ్డారు.
వాసుకి “నీవు అన్యాయంగా ఇచ్చిన శాపము మాలో వున్న ధర్మపరులకు గాకుండా ఇతరులకు వర్తించు” నని అంటాడు. మరునాడు కద్రువ, వినతను తీసుకునివెళ్లి నల్లగావున్న గుర్రపుతోకను దూరం నుండి చూపిస్తుంది. వినత అమాయకురాలు. వినత కద్రువకు దాస్యం చేస్తుంది. ఈ దాస్యం చేయడానికి అనూరుని శాపమే కారణం.. ఎందుకంటే.. తన సవతి కద్రువకు సర్పసంతానం కలుగుచుండెను. తాను గర్భవతియై వెయ్యి ఏళ్ల గర్భభారమును మోసినా సంతానం కలుగలేదని వినత గర్భమును బాదుకుంటుంది.
అపుడు తొడలు, కాళ్లు సరిగా ఏర్పడని అనూరుడు పుడతాడు. పుట్టిన అతడు “నీ సవతి మీద మత్సరముతో నన్ను ఈ విధంగా అంగవికలుడిని చేశావు. కావున నీ సవతికి దాస్యము చేయు” మని శాపమిస్తాడు. అలాగే తాను సూర్యుని రథసారథిగా వెళుతూ.. “నీ గర్భములో ఇంకొక కొడుకు ఉన్నాడు. వాడు ఇంకా వెయ్యి ఏళ్లకు పుడతాడు. వాడు మహాబలవంతుడు అవుతాడు. వాడు జన్మించేంతవరకు తొందర పడకు. వాడే నీ దాస్యమును పోగొట్టు” నని చెబుతాడు.
వినతకు దాస్యములో ఉండగానే గరుత్మంతుడు జన్మిస్తాడు. అతనిని కూడా కద్రువ దాసి కొడుకుగానే చూస్తుంది. తన పిల్లలను (సర్పములను) వీపుమీద ఎక్కించుకుని త్రిప్పి మోసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. గరుడుడు వారిని ఎక్కించుకుని సూర్యమండలం దాకా ఎగిరేవాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలిపోయేవారు. ఆరోజున పాపము గరుడినికి ఉపవాసము. సవతి తల్లి కోపంతో తిండి పెట్టేది కాదు. ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి.. “మనకీ దురవస్థ ఏమి ” అని ప్రశ్నిస్తాడు. ఆమె సర్వమును వినిపిస్తుంది.
గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి ” ఏమిచ్చినచో నీవు నా తల్లిని దాస్య విముక్తిరాలిని చేస్తావు ” అని అడిగాడు. ఆమె “దేవలోకం నుండి అమృతభాండమును తెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడిచిపెడతాను ” అని చెబుతుంది. గరుడుడు తండ్రి అయిన కశ్యపు దగ్గరికి వెళ్లి.. తన తల్లి దాస్యమును.. దాని విముక్తికి చేయవలసిని కార్యమును చెప్పి, ఇన్నాళ్లు తనకు సరైన ఆహారము లేక కృశించిపోతాడు. నాకు కడుపునిండా భోజనం పెట్టు” మని అడుగుతాడు.
కశ్యపుడు సముద్రతీరాన విస్తరించువున్న మ్లేచ్ఛజాతిని భక్షింపుమనగా గురుడు అలాగే చేస్తాడు. వారిలో చెడిన ఒక బ్రాహ్మణుడు గరుడుని గొంతులో అడ్డుపడతాడు. అతని కోసం మ్లేచ్ఛులను విడిచి పెడతాడు గరుడు. కశ్యపుడు గజకచ్ఛపములు పోరాడుచున్నవి, వానిని తిను అనగా ఆ రెండింటిని రెండు కాళ్లతో పట్టుకుని పోవుచూ.. ఎక్కడ పెట్టుకొని తినాలి అని వెదుకుతూ జంబూ వృక్ష కొమ్మపై వాలుతాడు. అది విరిగుతుంది. దానిపై వాలఖిల్యాది మునులు బొటన వ్రేలంతా ప్రమాణము గలవారుండి తపము చేసుకుంటుంటారు. అది తెలుసుకొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలంగా మేరు శిఖరంపై దింపి, తాను మరొక వైపు కూర్చొని గజకచ్ఛములను భక్షిస్తాడు.
ఆ తరువాత దేవలోకానికి వెళ్లి, అమృతకుంభమును తెస్తుండగా.. రక్షకులు అడ్డగిస్తారు. వారిని గెలిచి వస్తుండగా ఇంద్రుడు వచ్చి ఎదురించి పోరాడుతాడు. కాని గరుడునితో పోరాడలేక వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అదికూడా అతనిని ఏమి చేయలేకపోతుంది. అప్పుడు ఇంద్రుడు గరుడునితో “దేవతలకు సర్వస్వమైన ఈ అమృతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమించుకో “అని అంటాడు. దానికి గరుడుడు ” నా తల్లి దాస్యవిముక్తికై ఈ పని చేస్తున్నాను.
దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో, నా తల్లి విముక్తురాలవుతుంది “అని సమాధానం ఇస్తాడు. “అయితే దీనిని నీవు నీ సవతి తల్లికి ఇవ్వు. ఆమె, నీ తల్లికి దాస్యవిముక్తి అయినది అనగానే, అదృశ్యరూపుడనై వచ్చి ఈ అమృతకలశమున తీసుకుని పోయెదను. దీనికి నీవు అంగీకరించు ” అని ప్రార్థిస్తాడు. గరుడుడు దీనికి ఒప్పుకుంటాడు. అమృత భాండమును కద్రువ చేతిలో పెట్టి “మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా!” అంటే ఆమె అవును అని సమాధానం ఇస్తుంది. వెంటనే ఆమె చేతిలోని అమృతకలశము అదృశ్యమవుతుంది. అంటే ఇంద్రుడు దానిని అపహరిస్తాడు. ఈ విధంగా గరుడుడు తన తల్లికి స్వాతంత్య్రాన్ని కలిగిస్తాడు.
గరుడుడు తల్లి దీవెనను పొంది, తండ్రి దగ్గరకు వెళ్లి మొత్తం విషయాన్ని వివరిస్తాడు. ఆయన తన కుమారుడి పరాక్రమ విశేషాలకు సంతోషించి ” కుమారా! ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుని గురించి తపము చేసి ఆయన అనుగ్రహము సంపాదించు. ధర్మవర్తనుడనై వుండు. నీకు త్రిలోకములో ఎదురుండదు” అని చెప్తాడు. తండ్రి హితబోధను విని గరుడుడు శ్రీహరిని గూర్చి తీవ్ర తపము చేస్తాడు. చాలాకాలం వరకు అలా చేయగా శ్రీనాథుడు ప్రత్యక్షమై ” గరుడా! నీ భక్తికి నేను మెచ్చినాను. నీవు నాకు వాహనమై ఉండి నేను చెప్పిన పనులను నిర్వర్తించు” అని వరమిచ్చి తనకు వాహనంగా చేసుకున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹