“కృష్ణస్తు భగవాన్ స్వయం”
భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్ణావతారము చాలా గొప్ప అవతారము.
"కృష్ణస్తు భగవాన్ స్వయం"
అందుకే భాగవతమునకు "జయ" అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే,
“నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్!
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!”
అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.
"కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం "కృష్ణం వందే జగద్గురుమ్" అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు.
ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి" అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.
అశ్వత్థామ పరాభవము
పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.
ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు.
అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి "నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను" అని చెప్పాడు.
తెల్లవారింది మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు, "నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపదీ! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో" అన్నాడు.
పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది. తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు అన్నారు.
ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు. పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారధ్యం చేస్తున్నాడు. "ఈ రథమే, ఈ సారధ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు" అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.
అర్జునుడు వెనక్కితిరిగి కృష్ణుడివంక చూశాడు. "మహానుభావా, ఎవరు సారధ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను.
లోకములన్నిటిని నిండిపోయి సంక్షోభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది’ అని అడిగాడు.
అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు చెప్పాడు "ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇపుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు" అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడ ఉత్కంఠను పొందాయి.
అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన అన్నాడు – "ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసెయ్యి" అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹