శౌచవిధి
మలములను వదలుకొని శుచి కావటం కాబట్టి దీనిని శౌచవిధి అన్నారు. నిజానికి ఇది అశుచికార్యం. దీనిని శౌచ విధి అని పిలవటంలో మన సంప్రదాయపు విలువ ఇమిడిఉంది. బియ్యం అయిపోతే ”బియ్యం నిండుకున్నాయి” అంటారు. ”దీపం ఆరిపోయింది” అనకుండా ”దీపం కొండెక్కింది” అంటారు. ఒంట్లు లెక్క పెడుతూ 6 తరువాత ఆరున్నొక్కటి అంటారు. ఏడు అనరు. అమంగళమైన కుజవారాన్ని మంగళవారం అంటారు. ఇలా చెడుని పలకటానికి కూడా సిద్ధంకాని సత్సంప్రదాయం మనది. క్రమంగా మన సంస్కృతికి దూరమౌతూ నోరుతెరిస్తే బూతులుతప్పితే మాట్లాడనివారు తయారువుతున్నారు. అది విచారకం. ఈ శౌచవిధికి వస్తే మన శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధములైన మలాలు ఆయా సమయాలలో తప్పక విడువబడాలి. లేకుంటే అవి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఆ విడుదల నాలుగురూపాలలో జరుగుతుంది. 1) వాయురూపంలో నిశ్శ్వాసలు, అపానవాయువులద్వారా 2) జలరూపంలో – మూత్రం, చెమట, కన్నీరు మున్నగువానిద్వారా 3) కించిత్ ఘనరూపంలో – మలము, శ్లేష్మము, గులిబి, కంటిపుసి వంటివానిద్వారా 4) ఘనరూపంలో – గోళ్ళు, వెంట్రుకల వంటివానిద్వారా ఆ విడుదల జరుగుతుంది. వీటిని సక్రమంగా ఉంచుకొనటం శరీరారోగ్యానికి ముఖ్యం. అందువలన ఈ విధినికూడా మన పెద్దలు సదాచారంలో చేర్చారు. లేకుంటే అవి క్రమబద్ధం కాక అకాలంలో అవసరములేర్పడి తీర్చుకొనే అవకాశం లేక నిరోధించటం వంటివి జరుగుతాయి. అసలు రోగా లన్నిటికి ముఖ్యకారణం ఇలాఅవసరాలను నిరోధించటమే అని “అష్టాంగహృదయం అనే వైద్య గ్రంథం చెప్తోంది”.
వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో కానీ, సామాజిక ఆరోగ్యవిషయంలో కాని చాలా ప్రభావాన్ని చూపేది శౌచవిధి. అందుకే మన ప్రధాని స్వచ్ఛ భారత్ కావాలని కోరుతూ ఆరోగ్యవంతమైన సమాజానికై పిలుపునిచ్చారు.
దేహంలోని మలినాలను సక్రమంగా వెలువరించకుండా శరీరంలోనే ఉంచుకుంటే ఆరోగ్యం భంగపడి ప్రమాదకారణ మవుతుంది. ఆ మలినాలనే ఎక్కడపడితే అక్కడ వెలువరిస్తే సామాజికమైన ఆరోగ్యభంగం కలుగుతుంది. కాబట్టి, నిత్యకృత్యమైన శౌచవిధానాన్ని గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రతివ్యక్తికీ 6 మానసిక వేగాలు, 13 శారీరక వేగాలు ఉంటాయి.
మానసిక వేగాలు
1) కామం 2 క్రోధం 3) లోభం 4) మోహం 5) మదం 6 మాత్సర్యం.
ఈ మానసిక వేగాలను తప్పక నిరోధించాలి. వీనినే “అరిషడ్వర్గం” అంటారు. మానసిక వేగాలను నిరోధించాలి. శారీరక వేగాలను నిరోధించకూడదు. అరిషడ్వర్గాన్ని జయించాలని మహర్షులు ఎప్పుడూ బోధ చేస్తూ ఉంటారు.
శారీరక వేగాల ఉదీరణ, ధారణల వల్లనే రోగాలన్నీ వస్తాయని భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది. ఉదీరణమంటే మలము బలవంతాన వెలువరించడం. ధారణమంటే ఆ వేగాలను బలవంతంగా ఆపడం. అష్టాంగ హృదయం ఆ వేగాలను గూర్చి ఇలా చెప్పింది.
వేగా న్నధారయే ద్వాత విణ్మూత్ర క్షవ తృట్ క్షుధాం నిద్రా కాస శ్రమ శ్వాస జృంభాశ్రు ఛర్ది రేతసామ్
అని ఆ వేగాలు
1. అపాన వాయువు 2. మలం 3. మూత్రం 4. తుమ్ము 5. దాహం 6. ఆకలి 7. నిద్ర 8. దగ్గు 9. శ్రమశ్వాస 10. ఆవులింత 11. కన్నీరు 12. వాంతి 13. రేతస్సు అనేవి. వీటిని బలవంతాన ఆపకూడదు. బలవంతాన వెలువరించకూడదు. అలా చేయడమే రోగాలన్నింటికీ కారణం. అలా అని ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడు వెలువరించడము తనకూ, తోటి సమాజానికీ కూడా అపకారం. అందుకే వాటి విషయంలో జాగ్రత్తలు తెలియజేసేదే శౌచవిధి.
ఏ శారీరక వేగాన్ని ఆపడంవలన ఏయే రోగాలు వస్తాయో కూడా ఆయుర్వేదశాస్త్రం వివరించింది. అపాన వాయువును నిరోధించడంవలన కడుపు ఉబ్బరం, నొప్పి, నడుము నొప్పి, వాతరోగాలు వస్తాయని చరకుడు చెప్పాడు. అలా అని జనం మధ్యలో వాటిని వదలడం సభ్యత కాదు. అంతే కాదు. జపతపాదులు, దైవపూజాదికాల సమయంలో కూడా, వదలకూడదు. కాబట్టి ఆహారనియమాలను సక్రమంగా పాటిస్తే అసలు అకాలంలో అటువంటి అవసరాలే రావు. 2. మల నిరోధంవల్ల కడుపునొప్పి, తల, పిక్కలలో నొప్పి, కడుపుబ్బరం, ఉదరం జారడం, మలబద్ధకం వంటివి ఏర్పడతాయి. 3. మూత్రనిరోధంవల్ల మర్మావయవాలు, గజ్జలు, మూత్రాశయం, బొడ్డు, తల- వీటిలో నొప్పి, మూత్రాశయం ఉబ్బడం, ఏకాగ్రత భంగంకావడం వంటివి జరుగుతాయి. 4. తుమ్మును నిరోధించడంవల్ల తలనొప్పి, శ్వాసనాళంలో దుమ్ము ఉండిపోవడం జరుగుతాయి. 5. దాహాన్ని ఆపుకోవడంవల్ల గొంతు, నాలుక ఎండిపోవడం, చెవులు గడియలు పడడం, రక్తం చిక్కబడడం, మాలిన్యాలు పెరగడం, కంఠధ్వని భంగం, మూత్రపు మంట వంటివి ఏర్పడతాయి. 6. ఆకలిని ఆపుకోవటంవల్ల బలహీనత, తలత్రిప్పు, రుచి తగ్గడం జరుగుతాయి. 7. నిద్రని ఆపడంవల్ల ఆవులింతలు, ఏకాగ్రత లోపించడం, చికాకు, కళ్లు బరువెక్కడం జరుగుతాయి. 8. దగ్గుని ఆపుకోవడంవలన ఊపిరితిత్తులు, గొంతులోని కళ్లె వెడలకపోవడం, దగ్గు పెరగడం, ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడతాయి. 9. శ్రమవలన ఏర్పడిన శ్వాసను ఆపుకోవడంవలన శరీరానికిఅవసరమైనంత ఆక్సిజన్ అందక అలసట, తలత్రిప్పు, మూర్ఛ వంటివి ఏర్పడతాయి. 10. ఆవులింతను ఆపుకోవడంవల్ల కంటి వ్యాధులు, రక్తపు పోటు, పెద్దపేగులో పుళ్లు ఏర్పడతాయి. కన్ను ఏడవకుంటే కడుపు ఏడుస్తుందని శాస్త్రం. 11. దుఃఖపు కన్నీటిని ఆపడం ప్రమాదకరం. కాబట్టే ఆత్మీయులను పోగొట్టుకొన్నవారిని పలకరించి ఏడిపించడం జరుగుతుంది. 12. వాంతిని బలవంతాన ఆపుకుంటే ఆహారం రుచింపకపోవడం, దద్దుర్లు, అలర్జీ వంటివి ఏర్పడతాయి. 13. రేతస్సును ఆపుకోవడంవలన మర్మావయవాల్లో పోట్లు, లైంగిక బలహీనత వంటివి ఏర్పడతాయి. కాబట్టి ఆహార నియమాలను సరిగా పాటించడం, కాలకృత్యాలను సకాలంలో తీర్చుకుంటూ మంచి అలవాట్లతో ఉండడం వంటివాటిద్వారా పై విషయాలలోని ఇబ్బందులను తొలగించుకోవచ్చు.
వేగాలను నిరోధించకూడదనే మిషతో వాటిని ఎక్కడపడితే అక్కడ విసర్జించడం చాలా ప్రమాదకరం. సమాజానికి చేటు. అందువలన ఈ విషయంలో మన మహర్షులు అందించిన ఆదేశాన్ని గ్రహించాలి. ముని ఆశ్రమ పరిసరాలు, దేవాలయ పరిసరాలు, పుట్టలు వంటి వాటివద్ద విసర్జన చేయరాదని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. అలాగే జలం, భస్మం, గోమయం, సస్యక్షేత్రం, మెట్లు, క్రిమికీటకాదులు గుంపుగా ఉన్నచోట, పొదరిళ్లలో విసర్జన కూడదని చెప్పాడు. బాటసారులు విశ్రాంతి తీసుకునే చెట్ల నీడలలో, పూజనీయులకు ఎదురుగా ఉండి విసర్జనలు చేయరాదని గౌతముడు చెప్పాడు. చెట్ల మొదళ్లు, గుడులు, గోతులు, గుహలు వంటివాటిలో విసర్జన జరపడం నరకహేతువని యముడు చెప్పాడు. నేడు గ్రామాలలో కూడా ఆధునిక వసతులు ఏర్పడుతుండడం మేలే. దేవుని మందిరం పక్కన, వంటశాల గోడ పక్కనే లెట్రిన్ ఏర్పరచుకోవడం శ్రేయస్కరం కాదు. పైన లెట్రిను, కింద దేవుడి గది ఇలాగూ తగదు.
ప్రత్యాదిత్యం న మేహేత
అని ఋషి వాక్యం. అంటే సూర్యునకు అభిముఖంగా శౌచం చేయరాదు. కాబట్టి లెట్రిన్ కిట్టును దక్షిణ, ఉత్తరాలుగా బిగించుకోవాలి తప్ప, తూర్పు పడమరలుగా బిగించుకోరాదని గ్రహించాలి. ఉత్సవాలు, తీర్థ స్థావరాలు వంటిచోట్ల కూడా సర్వకాలాలలోనూ మహర్షుల సూచనలు గ్రాహ్యాలే. నిలబడి విసర్జన చేయడం చాలా దోషమని గౌతమమహర్షి చెప్పాడు.
తిష్ఠన్నపి న కుర్యా న్మూత్ర పురీష కర్మణి
అని.
శౌచవిధిలో మలవిసర్జన రెండు పూటలా ఆచరించటం మంచిది. ప్రాతఃకాలంలో తప్పనిసరి. దీని విషయంలో చాలా నియమాలు చెప్పారు. ఆరోగ్య ఆయుర్వృద్ధులకు, ఆధ్యాత్మికంగా నిర్దుష్టతకు ఆ నియమాలు ఎంతో అవసరం. శౌచము నాచరించుట పగలు ఉత్తరాభిముఖంగా, రాత్రి దక్షిణాభిముఖంగా జరగాలి. ఉపనీతులు జందాన్ని కుడిచెవికి చుట్టటం, అది లేనివారు చెవిపైకి వచ్చేటట్లు తలగుడ్డ చుట్టటం చేసి విసర్జన గావించాలి. ఒకప్పుడు ఇలాంటి సదాచారాలనుగూర్చి ఎదురు ప్రశ్నించక ఆచరించేవారు. నేడు వాటి విలువ నెఱుగక తిరస్కరిస్తున్నారు. మన సదాచారంవలని ప్రయోజనం తెలిస్తే ఎవ్వరూ కాదనలేరు. డా. ప్రభా భోర్వాంకర్ తమ పరిశోధనావ్యాసాన్ని అంతర్జాతీయ సదస్సులో 30-12-1987న వినిపిస్తూ యావత్ శరీరానికి చెవి ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ ప్రాథమికసూత్రాన్ని గుర్తించటంవల్లనే మన పూర్వీకులు తప్పక చెవులుకుట్టే సంప్రదాయాన్ని పెట్టారని చెప్పారు. చలికాలంలో చెవులకు గుడ్డచుట్టటం, వడగాడ్పు సమయంలో చెవులకే గుడ్డచుట్టటం, బిగ్గరంగా రాగం తీసేటప్పుడు చెవిని మూయటం, బాలింత చెవి గుడ్డ కట్టుకోవడం ఇలా అన్ని పరిస్థితులందు చెవి విషయంలోనే జాగ్రత్త తీసికుంటాం. అది వికారం కాదనటానికి ఆభరణాలుంచారు. ఆక్యుపంక్చర్ విధానంలో చాలా వ్యాధులకు చికిత్స ఆయా అవయవాలపై వత్తిడి కల్గించుట, సూదులతో గ్రుచ్చుట వంటి వానితో ఉంటుంది. ఏ అవయవాలకు ఏ నరాలతో ఎట్టి సంబంధము ఉంటుందో దానినిబట్టి ఆ చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కళ్ళకు పసికర్లు వస్తే మణికట్టుపై కాల్చటం చూస్తున్నాం. అలా మలమూత్ర విసర్జకావయవాలతో చెవివద్ద నరాలకు సంబంధం ఉంది. ఈ నరాలపై ఒత్తిడి జరగడం విసర్జకావయవాల విధికి దోహదకారి అవుతుంది. అందుకే జందెం చెవికి చుట్టుకొనటం లేక చెవిపైకి తలపాగా చుట్టటం. ఈ అవసరం స్త్రీలకు చెవికుట్టటం, కర్ణాభరణాలు వంటివాటి ద్వారా తీరుతుంది. పేపర్ యూజింగ్ సిస్టమ్ నాగరికంగా భావించే మనుష్యజాతి విలువైన మన సదాచారాన్ని విమర్శించక గ్రహించటం, పాటించటం మంచిది.
త్రోవలోనూ, భస్మము, గోశాల, దున్నిన నేల, నీరు, శ్మశానము, నదీతీరం, పర్వతం, పుట్ట, ప్రాణులున్న గుంటలు మున్నగువానిచోట మలమూత్ర విసర్జనము నిషిద్ధము. పవిత్ర స్థలాలలోను, పవిత్ర వ్యక్తులను చూస్తూకూడా ఆ పని చేయరాదు. మూత్రవిసర్జన నిలబడి చేయరాదు. అది చాలా నిందింపబడింది. ఆలోచిస్తే ఆ కారణం అర్థమౌతుంది.
న పశ్యే దాత్మన శ్శకృత్
అని చెప్పుటచే తన పురీషం చూచుకోకూడదు. రోగ నిర్ణయాలయందు ఈ విధినిషేధాలకు వేనికీ తావులేదు. శౌచకార్యాలు అన్యచిత్తంలో ఉండి చేయటంకూడా తగదంటాడు బోధాయనుడు. పాచిపట్టి నిలువయుండు నీటిగుంటల సాయంతో శౌచం తగదు. మన పెద్దలు నియమాలతోపాటు కొన్ని అవకాశాలూ చూపారు. కటికచీకటియందు, సూర్యుడు కానరాని కొండలచాటున, ప్రాణభీతి కల్గినప్పుడు ఏ దిక్కు తిరిగియైనా అవసరాలు తీర్చుకొనవచ్చు అన్నారు.
యద్దివా విహితం శౌచం–తదర్థం నిశి కీర్తితం ।
తదర్థ మాతురే ప్రోక్త మాతురస్యార్థం అధ్వని
అని పగలు చెప్పబడిన శౌచనియమంలో సగం పాటించినా రాత్రి వేళకు సరిపోతుంది. రోగగ్రస్తుల కందు సగమే చాలునని, ప్రయాణ మధ్యంలో అయినచో అందులో సగమే చాలునని చెప్పబడింది.
అనంతరం పాదప్రక్షాళన చేయాలి. ముందు ఎడమపాదం కడిగి, తరువాత కుడిపాదం కడగాలి. శుభకార్యాలలో ముందు కుడికాలు కడగాలి. కొద్దిమాత్రం పొడి కూడా ఉండనీక పూర్తిగా కడుగుకొనాలని పెద్దలు చెప్పిననియమం. స్నానంచేసిన పిమ్మట లఘశంక (మూత్ర విసర్జన) చేస్తే పిక్కలవరకు, గురుశంక (మలవిసర్జన) చేస్తే తొడలు, లేదా నడుమువరకు కడిగికొని రెండుమార్లు ఆచమనం చేయాలని భరద్వాజుడు చెప్పిన నియమం. నిరంతరం దైవకార్యక్రమాలు, ఉత్తమకార్యక్రమాలలో ఉండువారికి ఆమాత్రం శౌచం తప్పనిసరి. లఘుశంక పిదప విసర్జకావయవం నీటితో కడగటం ఎంతో మంచిదని ఇటీవల ఫ్రాన్సుకు చెందిన వైజ్ఞానికులు గ్రహించారు. అది మనకు అనాది ఆచారం. దానివలన కొన్ని సాంక్రమిక రోగాలనుండి విముక్తి కలుగుతుందని ఆ విదేశ శాస్త్రవేత్తలు గ్రహించి చెప్పారు. మూత్రబిందువులు దేహంపై ఉండటం తగదు. నిలబడి విసర్జించటంవలన అలాటి ప్రమాదం ఉంది. కాబట్టే మనవారు దాన్ని బాగానిందించారు.
“తిష్ఠన్మూత్రుడు”
అనేది ఆ రోజులలో పెద్దతిట్టు. నేటి మన నాగరికత మనలను నిలబడే విసర్జింపమని శాసిస్తోంది. అలాటి తిష్ఠన్మూత్రులు మన సదాచారాన్ని విమర్శించబోవటంలో అర్థమే లేదు.
ఆ పిదప గండూషవిధి అంటే పుక్కిలింత విధింపబడింది. లఘుశంకపిదప 4 సార్లు, గురుశంకపిదప 8 పర్యాయాలు, భోజనానంతరం 12 పర్యాయాలు, మైథునానంతరం 14 పర్యాయాలు పుక్కిలించి ఉమ్మేయాలని మహర్షులు ఆదేశించారు. మారిన కాలంలోకూడా అవి ఎందుకు ? అనుకోరాదు. ఏమి మారినా అశుద్ధం శుద్ధంకాదు. అనారోగ్యం ఆరోగ్యం కాదు. మంచి అలవాట్లు ఏ కాలంలోనైనా పాటించాలి. అంటే ఇలా చెప్పటంలోని ఉద్దేశ్యం చిన్ననాటినుండి శాస్త్రాచరణం అంటూ వింతజంతువులా సమాజానికి దూరంగా బ్రతకమని కాదు మన సదాచారసంపత్తి ద్వారా కలకాలం ప్రయోజనం పొందాలనే ఆశయం. గురుశంక అయాక 3సార్లు మట్టితో తోమి శుభ్రంగా చేతులు కడుగుకొనాలని శాస్త్రం చెప్తోంది. వాసన కలిగి ఉండటం పృథివీపదార్థపు లక్షణంగా శాస్త్రం చెప్పింది. ఆ పృథివీ పదార్థంలో అతి నీచమైనది మానవపురీషం. దుర్గంధందాని లక్షణం. ఆ దుర్గంధం పోవాలంటే జలం చాలదు. పృథివీ పదార్థమే వినియోగించటం అవసరం. ప్రాచీనులు మట్టి వాడితే నేడు సబ్బులు వాడుతారు. కాలానుగుణంగా పదార్థం మారవచ్చు తప్ప అవసరం మారదు. దుర్గంధాన్ని పోగొట్టే లక్షణం ముఖ్యంగా మట్టికి ఉంది. పిల్లి, కుక్కలు విసర్జనచేసి దానిపైకి మట్టి తోస్తాయి. అది వాటి సంస్కారం. మట్టికి చర్మరోగాలను పోగొట్టే శక్తి ఉంది. అందుకే ప్రకృతివైద్యంలో మట్టికి విశేషస్థానం ఉంది. మనకు ఎదురు దేవస్థానం. కుడివైపు గురుస్థానం. కాబట్టి గండూషవిధితో సహా ఉమ్మివేయుట ఎప్పుడైనా ఎడమవైపే చేయాలి. ఈ గండూషవిధిలో ఎంతో ఆరోగ్యశాస్త్రం ఇమిడిఉంది. ప్రతివస్తువును మనం నోటితోనే తింటాము. అనేక పదార్థాలు పళ్ళసందున నిలిచే అవకాశం ఉంది. వాటివలన అనేకవ్యాధులు వస్తాయి. మల మూత్ర విసర్జనలో ఆ కలుషిత వాతావరణంవలన ఏరూపంలోనైనా దుష్టక్రిములు, వాయువులు, ప్రవేశించవచ్చు. అందుకై నోటిని శుభ్రపరుచుకోవటం అత్యంత అవసరం. భోజనానంతరం ఏవో పదార్థాలు నోట ఇరుకవచ్చు కాన అప్పుడూ గండూషం అవసరం. రతిక్రియలో చుంబనాదికంలో ఒళ్ళు తెలయక ప్రవర్తించినందున జరిగే దోషానికికూడా గండూషం చాలా అవసరం. అలా జాగ్రత్తగా ఆలోచిస్తే పెద్దలు మనకు ఎంతో ఆరోగ్యం ఆశించే ఈ గండూషం విధించారని గుర్తింపగలం. పెద్దలు చెప్పారంటే వినం. కాబట్టి అవే అలవాట్లు మారిన కాలంలో కొత్త పద్దతులలో చెపితే నచ్చుతుంది. ఇటీవలి కాలంలో అయిల్ పుల్లింగ్ విధానం విశేషప్రచారం పొందింది. అక్కడి విశేషం అయిల్లోకంటే పుల్లింగ్లోనే ఉంది. అందుకు నూనెలు వేరు వేరు చెప్పారు. అలాటిఖర్చు లేకుండా నియమితమైన గండూషవిధి పాటిస్తే అన్ని ప్రయోజనాలు పొందగలం. చాలా వ్యాధులు దంతాలు, నోటిద్వారా వస్తాయి కాబట్టి గండూషవిధి పాటిస్తే ప్రత్యేకయత్నం లేకుండగానే ఆ సకలవ్యాధులనుండి మనం బయటపడవచ్చు. మనమహర్షులు చెప్పిన విషయాలనే ఆధునికులు క్రొత్త సిద్ధాంతాలుగా ప్రవేశ పెడుతున్నారు. ఇలా జెమ్ థెరఫీ, రుద్రాక్షథెరఫీ, హోమథెరఫీ వంటి వెన్నో వచ్చాయి. కాలానుగుణమైన మార్పులతోనైనా మన ఆర్షసంప్రదాయం పాటింపబడటం హర్షింపదగిన విషయం.
తుమ్మితే “చిరంజీవ”అనడం, మన పెద్దలు ఆవులిస్తూ చిటిక వేసేవారు. అది శాస్త్రంలో చెప్పిన విధే. తుమ్ము వచ్చినప్పుడు, ఆవులించినప్పుడు, రేతః స్థలన మయినప్పుడు, దోషాలు పోవటం కోసం ధూళితో నొసట బొట్టు పెట్టేటప్పుడు చిటిక వేయటమనే ప్రతిక్రియ జరగాలని చెప్పబడింది. మొగము మూయక తుమ్మరాదు, ఆవలించరాదని చరకుడు చెప్పాడు. కాకున్న రోగకారకాలైన తుంపరలు, ఎదుటివారిపై పడతాయి.
“క్షుతే త్రిరాచామేత్”
అని ఆచమనం చేయడం, కొన్ని చోట్ల తుమ్మడానికి పరిహారాలు చేయడం వంటివాటిని బట్టి ఆయుక్షీణం వంటి వేవో దోషా లుంటాయని మహర్షుల సూచన. తుమ్ము వేగం బట్టి అది ఒక్కోసారి ప్రాణప్రమాదకారి కూడా. అందుకే చిరంజీవ అనటం. ఏమయినా మహర్షులు చేసిన సూచనలన్నీ ఆయురారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని చెప్పినవే అని గ్రహించాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹