Skip to content Skip to footer

సదాచారము – వైజ్ఞానిక విలువలు – స్నానానికి వర్జ్యనిషేధం లేదు – 4

స్నానానికి వర్జ్యనిషేధం లేదు.

స్నాన దాన జపాదికే ప్రశస్తా విషనాడికా –

స్నానం, దానం, జపాలకు వర్జ్యం ప్రశస్తమైనదిగా చెప్పబడింది. రోగి అయినవానికి అశుచి ఏర్పడితే కానీ, తప్పక వ్రతాదికం ఆచరింపవలసి వచ్చినప్పుడు కానీ వానికొరకై వేరొకరు స్నానం చేసే విధానం కూడా ఉంది.

మజ్జయేత్తు యముద్దిశ్య -అష్టమాంశం లభేత సః

అని, అలా స్నానం చేసినవానివలన ఎనిమిదవ వంతు శుద్ధి అవుతుందని అత్రిమహర్షి చెప్పాడు. అంటే రోగిని ప్రక్కన కూర్చుండబెట్టి వానికోసం మరొకరు స్నానం చేసి వచ్చి రోగిని తాకాలి.

స్నాత్వా స్నాత్వా స్పృశే ద్దేహం తతఃశుద్ధేత్ స ఆతురః

అని పరాశర మహర్షి చెప్పాడు. అంటే అలా మరల మరల స్నానం చేసి వచ్చి ఎనిమిది సార్లు తాకితే ఆ రోగికి స్నానం చేసినట్లు శుద్ధి అవుతుంది అని అర్థం. పక్షవాతం, కంటి, నోటి, చెవి వ్యాధులు కలవారు, కడుపు ఉబ్బు వంటి రోగాలు కలవారు, అప్పుడే భోజనం చేసినవారు స్నానం చేయకూడదు. కఫాధి వ్యాధిపీడితుడు కంఠస్నానమే చేయాలని చరకుడు చెప్పాడు. వేడినీటిలో గుడ్డ ముంచి తుడవాలి. ఇటువంటి పరిష్కారాల ద్వారా మన ఆర్ష సంప్రదాయం మన కెంతో శ్రేయస్కరమైనదే తప్ప మూర్ఖంగా ఆచరించి అనారోగ్యం పాలు కమ్మని చెప్పదనేది అర్థమవుతుంది. స్నానం చేస్తూ మాట్లాడరాదనీ, అలా మాట్లాడడంవలన శక్త్యుత్సాహాలు నశిస్తాయనీ ఆపస్తంబుడు చెప్పాడు.

ప్రవాహానికి ఎదురుగా పురుషులు, వాలుగా, స్త్రీలు స్నానం చేయాలి. స్నానానంతరం ముందు ముఖం, తరువాత వక్షస్థలం, పిదప శిరస్సు, మిగిలిన అవయవాలు తుడుచుకోవాలి. వస్త్రం మార్చుకునేటప్పుడు స్నానానంతరం తడిబట్ట పైకి తీయాలి. ప్రేతకార్యాలలో మాత్రం అంటే కర్మ చేస్తున్న పన్నెండు రోజులలో మాత్రం క్రిందనుండి తీయాలి. అలాగే గంగాది మహానదుల వద్ద కూడా క్రిందనుండి తీయాలి. ప్రాతఃకాలంలో చన్నీటితో శిరస్నానం, రాత్రివేళ వేడినీళ్లతో కంఠస్నానం శ్రేష్ఠం. భోజనానంతరము, దట్టమైన మబ్బు, మంచు ఉన్నప్పుడు, సూర్యాస్తమయంలో, రాత్రివేళ శిరస్నానం, అభ్యంగస్నానం చేయకూడదు. వేడినీటి శిరస్నానం తల, వెంట్రుకలు, కండ్లకు బలహీనత కలిగిస్తుందని వాగ్భటుడు చెప్పాడు. శిరస్సు కాక క్రింది భాగానికి మాత్రం ఆ స్నానం బలావహమ్ అని అష్టాంగ హృదయంలో చెప్పాడు. చన్నీటి స్నానం వలన అనేక ప్రయోజనాలున్నను వాతకఫాలను పెంచే గుణముంది.

వేడినీటిస్నానం త్రిదోషాలను వాతపిత్తకఫాలను హరిస్తుంది. ధాతుసౌమ్యత, ఆరోగ్యం, దేహబలం కల్గించి శ్రమ, బడలిక, మార్గాయాసం, దుస్స్వప్నాలను పోగొడుతుంది. కాని వెంట్రుకలకు, నేత్రాలకు బలం తగ్గుతుంది. అతివేడి నీటి స్నానంవలన రక్తం ఉడికి పైత్య ప్రకోపం కల్గుతుంది. కాబట్టి అన్నీ పరిమితంగా వినియోగించాలి. చన్నీటి స్నానాన్ని ముందుగా శిరస్సునుండి కిందికి చేయాలి. వేడినీటి స్నానం ముందు పాదాలకు, పిదప పైకి చేయాలి. వైద్యశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ ఉసిరికపప్పు చూర్ణం చేసి దానిని రుద్దుకొని స్నానం చేస్తే చాలా మంచిది.

విశేష స్నానాలలో సముద్రస్నానం ఒకటి. ఈ సముద్రస్నానం అన్ని రోజులలో చేయకూడదు. పర్వదినాలలోనే చేయాలని శాస్త్రవిధి. పెద్దలుకూడదన్నారంటే అది మన ఆరోగ్యాధికానికి మంచిది కాదనే అర్థం. “ఆకామావై” అని ఆషాఢ పూర్ణిమ , కార్తిక, మాఘ, వైశాఖ, పూర్ణిమలందు తప్పక సముద్ర స్నానంచేయుమని అర్ధోదయ మహోదయాదులలోనూ సముద్రస్నానం చేయమని కూడా శాస్త్రవిధి.

కాబట్టి అది మనకు చాలా మేలు చేకూరుస్తుందని అర్థం. సముద్రస్నానవిషయంలో కొన్ని నియమాలున్నాయి. సముద్రస్నానానికి ముందు, స్నానానంతరం కూడా మంచినీటి చన్నీటి స్నానం చేయాలి. 15 నిమిషాలపైన సముద్రస్నానం చేస్తే పుంస్త్వం నశిస్తుంది.

శుక్ర, మంగళవారాలు, నిర్ణయింపని రోజులలో సముద్రస్నానం తగదు. సముద్రమునకు పోయి అక్కడ ధనుర్బాణాలు లిఖించి సంకల్పం చెప్పుకొని “సింధుస్నానం కరిష్యే” అని చేయాలి. సముద్రునికి నమస్కరించి పండు, యజ్ఞోపవీతములను సముద్రంలో వేయాలి. కృత్యకు ఆహారంగా ఒక రాయిని, లేదా కొంత ఇసుకను సముద్రంలో వేస్తూ

“పిప్పలాద సముత్పన్నే – కృత్యే! లోకభయంకరి!

పాషాణం తే మయా దత్తం – ఆహారార్థం ప్రకల్పయ”

అని చదువుకొనాలి. అలా కృత్యవలన మనకు ప్రాణభయం లేకుండా చేసికొని స్నానం చేయాలి. పిదప సముద్రమునకు అర్ఘ్యం ఇచ్చే విధానం కూడా పెద్దలు తెల్పారు. సముద్రునితో బాటు పిప్పలాది పదిమంది ఋషులకు, సముద్రాన్ని దాటిన 13 మంది వానరవీరులకు, చివరకు సేతుబంధం గావించి లోకకంటకుని సంహరించిన ఆరాధ్యులు శ్రీ సీతారామలక్ష్మణులకును తర్పణాలీయాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment