Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – వస్త్రధారణ – 5

వస్త్రధారణ

స్నానానంతరం కర్తవ్యం వస్త్రధారణ. వస్త్రధారణ మనుజుని అభిమానానికి చాలా ముఖ్యమైనది. అలంకారాలలో ముఖ్యమైనదికూడా వస్త్రమే. ఆరోగ్యంపై దాని ప్రభావ మెంతో ఉంది. వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. దేశ, కాల, జాతి, వృత్తి భేదాలనుబట్టి వేషంలో మార్పుఉంటుంది. అలా ఎక్కడ ఎప్పుడు ఎలా వస్త్రధారణ చేయటం సముచితమో అలా ధరిస్తేనే వ్యక్తిత్వం పెరుగుతుంది. వస్త్రధారణ తనకు అన్నివిధాలా అర్హమయినట్లే చేయటం అవసరం. అధికారి పరిచారకునివలె, పరిచారకుడు స్థాయికిమించి వస్త్రాలు ధరించటం ఇర్వురుకూ ప్రమాదకరమే. అభిమాన రక్షణకై ఆకులు, పట్టలు కట్టిన ఆదిమానవుడు క్రమంగా అత్యంతం సూక్ష్మవస్త్రాల స్థాయికి, మెత్తని సుఖకరవస్త్రాల స్థాయికి ఎదిగాడు. ఇది మానవచరిత్ర చెప్పే విషయం కాగా మన హిందూసంస్కృతిలో వస్త్రధారణ వేదకాలంనుండి అంటే అనాదిగా కన్పడుతుంది.

”దేవస్య త్వా సవితుః” మంత్రంతో వస్త్రం స్వీకరించి ”ఆవహన్తీ వితన్వానా” మంత్రం ఉచ్చరిస్తూ ధరించాలని తైత్తిరీయసంహితా ఆరణ్యకాలు చెప్తున్నాయి. ఇది వేదవిహిత ఆచారం.

చలి, ఎండ, గాలి నుండి రక్షణే కాక వస్త్రధారణలో ఎన్నో ప్రయోజనాలున్నట్లు గుర్తించిన భారతీయులు కాలోచితమైన రీతులుకూడా వివరించారు. ఎరుపురంగు వాతశ్లేష్మహరం. శరీరోష్ణం పెంచి ఉత్తేజం ఇస్తుంది. పురుషుల కిది మేలుకాదు కాని స్త్రీలకు ఋతుస్రావం సక్రమం గావించటంలో సహకరిస్తుంది. దీనిని సాధారణంగా శీతాకాలంలో వాడాలి. కాషాయవర్ణం పైత్యదోషహరం. పిత్తశాంతితో బాటు శుచి, శాంతిని పెంపొందిస్తుంది.

ఈ రంగువస్త్రం వేసవిలో శ్రేష్ఠం. తెలుపు శుభకరం. చలి, వేడి నివారించునది, తేలికగా ఆరుదలకలది కాబట్టి వర్షాకాలంలో శ్రేష్ఠం. ఈ వివేచన లేక వ్యతిరేకవర్ణాలు సౌందర్యాపేక్షతో ధరించి స్త్రీలు తలనొప్పి, ఒళ్ళునొప్పులతో బాధపడటం చూస్తాము. ఉష్ణప్రాంతాల్లో నూలుబట్ట శ్రేష్ఠం. నూలుబట్టలు వేసవిలో శరీరం వదిలే స్వేదాన్ని పీల్చుకొనటంలో, శీతాకాలంలో బయటి చల్లదనాన్ని శరీరానికి తగలకుండా చేయటంలో సమర్థాలు. కాన అవి శ్రేష్ఠం. ప్రత్తిలోని ఓషధీగుణాలు వస్త్రధారుల కుపకరిస్తాయి.

టెరికాటన్ వంటివి హుందాకు, నిలువకు తప్ప ఏ కాలమునా ఉపకారులు కాదు. మడతపోక, మురికికానరాక పలుపర్యాయాలు ధరించటం ద్వారా పరోక్షంగా అవి అనారోగ్య కారకాలవుతాయి కూడా. నిత్యం ఉతికి ధరించే పద్ధతి దేశీయవస్త్రాలది. అందుకే దేశీయ వస్త్రాలు విదేశీదుస్తుల కంటే అన్నివిధాలమేలైనవి.

పాశ్చాత్యులు మన వేష భాషలను మార్చటం ద్వారానే వాళ్ళ వ్యూహంలో తొలివిజయం సాధించారు. నాగరికతపేరుతో అది సంస్కృతిని భంగపరుస్తోంది. సంప్రదాయవిషయాలు గ్రహించి వీలైనంత అమలు పరచటం మంచిది. ఇతరులు విడిచిన చెప్పులు, వస్త్రాలు ధరింపరాదని మనువు చెప్పాడు.

స్నాన, జప, హోమ, దాన, దేవపూజా, భోజనాదికము లన్నిటా అంచుగల వస్త్రాలే ధరించాలి. అంచులేనివి తగవు. కట్టినది వేసికొనకూడదు. గుర్తులప్రకారం ఒకేవైపు ధరించాలితప్ప తడిపెదాకా బట్టమార్చి కిందివైపుని పైకి కట్టకూడదు. గోచీలేకుండా బట్ట కట్టటంవలన మనలోని ప్రాణశక్తిని భూ ఆకర్షణశక్తి లోపింపజేస్తుంది.

తలగుడ్డ శిరస్సుకు బలం, చలి, ఎండ, గాలి బాధలనుండి విముక్తి, సుఖము చేకూరుస్తుంది. క్రొత్త బట్టలను పసుపు పెట్టి ధరించటం సంప్రదాయం. అది మంగళప్రదం. శవంపై కప్పే వస్త్రానికి పసుపు పెట్టరు. నూతనవస్త్రాల నిర్మాణంలో గంజి వంటివి వాడటంద్వారా అవి శుభకార్యాలకు శౌచానికి తగవు.

నిల్వగంజి క్రిమిదోషాలకూ కారణం. పసుపు అలంకరించటం ద్వారా ఆ రెండువిధాలా వస్త్రాలకు అర్హత చేకూరుతుంది. నూతనవస్త్రాలు బొట్టులేకుండా ఇచ్చుట,పుచ్చుకొనుట కూడా అశుభం. వస్త్రధారణలో అథశ్శరీర స్పర్శ జరుగుతుంది.కాబట్టి వస్త్రధారణ చేయగానే శుచికై ఆచమనం చేయటం పుణ్యకార్యాలలో విధి. మలినవస్త్రాలు దారిద్య్ర్యం, బడలిక, దురదలను కల్గింపజేయగా,నూతనవస్త్రాలు ఆయుష్యము, సంతోషము, కాంతులను ప్రసాదిస్తాయి. అందుకే పుట్టినరోజున, ముఖ్య పర్వదినాలలో క్రొత్తబట్టలు కట్టుకొనటం;మన శ్రేయస్సు కోరేవారు శుభకార్యాలలో నూతన వస్త్రాలు చదివించటం సంప్రదాయంగా నెలకొంది.

కట్టు, బొట్టు, జుట్టు మన సంస్కృతిలో భాగాలు. సభ్యతను ప్రకటించే అంశాలు. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి అసలు మనదేమిటో మరచిపోతున్నాం. అవి నేడు విస్మరణకు గురవుతున్నాయి. వాటి గురించి అవగాహన కలిగిఉండడం అవసరం. కట్టు అన్నది వస్త్రధారణ విషయం. నేడు తొడగడం తప్పితే కట్టడమనేది చాలా వరకు తగ్గిపోయింది. పురుషులు పంచె కట్టడం, స్త్రీలు చీరె కట్టడం కారణంగా కట్టు అనేది వచ్చింది. దానికీ అనేక నియమాలు చెప్పారు. ఆయా సందర్భాలకు తగినట్లు వినీత వేషధారణ ఉండేది. నేటి విధానం వేరు. పురుషులు, స్త్రీలు కూడా ప్యాంట్లు, షర్టులు లేదా డ్రస్సులు తొడగడమే తప్ప కట్టుకోవడమనేది తగ్గిపోయింది. పురుషులలో బ్రహ్మచారులు అడ్డపంచె ధరించడం, గృహస్థ వానప్రస్థులు గోచి పెట్టి పంచె కట్టడం, సన్యాసులు కాషాయాంబరాలు ధరించడం ఉండేది. వస్త్రధారణ గురించి వసిష్ఠ మహర్షి.

“అష్ట హస్తం నవం శ్వేతం – సదశం ధౌత మంబరం |

శుష్కంచ ధారయే ద్విద్వాన్ సర్వకర్మసు పావనమ్ ॥”

అని చెప్పారు. అంటే పంచె ఎనిమిది మూరల పొడవుండాలి. తెల్లనిదై ఉండాలి. తడి బట్ట కూడదు. పొడిగా ఉండాలి. బాగా ఆరకపోతే రోగకరం. అంచు ఉండాలి. అది అన్ని పనుల్లో అర్హమైనది. అంచులేనిది మరణ సమయములో చేసే కలాపాలలో ధరిస్తారు. కాలిన, చినిగిన, మలినమైన వస్త్రం దరిద్రసూచకం. రక్తవస్త్రం నిషిద్ధం. పితృకార్యాల్లో అయితే ఎఱ్ఱని అంచువి కూడా ప్రశస్తం కాదు. దైవకార్యాల్లో, ఘనకార్యాల్లో పట్టువస్త్రాలు ధరించడం ఉంది. రాజదర్శనంలో ప్రత్యేక వేషధారణ ఉండేది.

వస్త్రధారణ ప్రయోజనాలను వైద్యశాస్త్రం కూడా చెప్పింది. ముఖ్యంగా చేనేత వస్త్రాలు అన్ని కాలాలలో ధారణయోగ్యాలు.

”కఫకృత్పిత్త శమనం శ్రమతృడ్డాహ నాశనమ్”

అని ఆయా వస్త్రాల ప్రయోజనాలను ప్రత్యేకంగా చెప్పింది. వేషధారణ మనుజుని వ్యక్తిత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. కాబట్టి వేషధారణలో నిర్లక్ష్యం తగదు. వేషభాషలు మనిషి గౌరవాన్ని పెంచుతాయి. స్థాయీభేదాన్ని సూచించేది కూడా వేషమే. పూర్వం మూడోతరగతిలో వేషమహిమ అని ఒక పాఠం ఉండేది. అందులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఒక ఇంటికి భోజనంకోసం వెళ్తాడు. ఈతని మాసిన వస్త్రాలు చూసి ఆ గృహస్థు భోజనానికి ఆహ్వానించడు. ఆ బాటసారి వెళ్లిపోయి విలువైన వస్త్రాలు ధరించి వస్తాడు. అప్పుడు అదే గృహస్థు అతడిని ఇంటిలోకి ఆహ్వానించి భోజనం పెడతాడు. భోజనానికి కూర్చుని ఆ బాటసారి ముద్ద తీసుకుని తన వస్త్రానికి పెడుతూ “తినవే, తినవే” అనసాగాడు. ఆ దృశ్యాన్ని చూసిన యజమాని, “నీకేమైనా పిచ్చా? వస్త్రాలకు అన్నం పెట్టి తినమంటా వేమిటి?” అని ప్రశ్నిస్తే, ఆ బాటసారి “అయ్యా! గంట క్రితం మీ ఇంటికి వచ్చింది నేనే. అప్పటి వస్త్రాలు చూసి భోజనం పెట్టనన్నారు. మీరు నాకు కాక నా వేషానికే అన్నం పెట్టారు. కనుక వాటినే తినమంటున్నా” అని జవాబిచ్చాడు. దానితో యజమాని తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడని కథ. ఇది అంతటా జరిగే విషయమే.

మన మహర్షులు వస్త్రధారణ విషయంలో ఎన్నో సూచనలు చేశారు.

”న కంఠావృత వస్త్రస్స్వాత్”

అని గురువులను, దైవాలను దర్శించేటప్పుడు మెడను ఆశ్రయించిన వస్త్రంతో ఉండకూడదని శాండిల్యుని మాట. ఉత్తరీయం లేకుండా కూడా ఉండరాదు. అందుకే పీఠాధిపతుల వద్ద, దైవం వద్ద ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకుంటారు. కాలినబట్ట, కుట్టినబట్ట కట్టినవాడు నగ్నుడు. అట్టివాడు శ్రౌత, స్మార్త, కర్మల కనర్హుడు. కావుననే శుభకార్యాలు, దైవకార్యాలు, పితృకార్యాలు పంచె, ఉత్తరీయాలతోనే నిర్వహించాలి. చినిగిన వస్త్రాలలో దరిద్ర దేవత ఉంటుందని, భోజుడు చెప్పాడు. అందుకే వానిని ధరించటం శ్రేయస్కరం కాదు. నల్లని, ఎర్రని వస్త్రాలు వైదిక క్రియలలో ధరింపరాదని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఒంటిబట్టతో ఆచమనం, జపము చేయరాదని విష్ణుపురాణం చెప్పింది. ఉత్తరీయం కుడిభుజంపై వేసికొని ఆచమనం చేయకూడదు, అది అపరకర్మలందు చేసేది. తడిబట్టలతో చేసే జప, హోమ, దానగ్రహణ, తర్పణాలు ప్రయోజనం లేనివి, నిష్ఫలాలు అవుతాయి.శాండిల్య మహర్షి

“న రక్త మలిన వాసాంసి ధారయేత్”

అని చెప్పారు. అంటే ఎఱ్ఱరంగు వస్త్రాలు, మురికివస్త్రాలు ధరించవద్దని. ఎర్రవి శరీరోష్ట్రాన్ని పెంచే ఉత్తేజకాలని చెప్పారు. శీతాకాలంలో వాటిని వాడవచ్చని చెప్పారు. నీలవస్త్రం అశుభమనీ, వాడరాదనీ చెప్పారు. మనది ఉష్ణదేశం. కాబట్టి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండే వస్త్రాలు మంచిది కాదు. కావున పంచె, చీరె వంటివి శ్రేయస్కరం. గృహస్థు కాషాయం ధరించటం, ఉత్తరీయం లేకుండా ఉండటం, లోపలి వస్త్రాలు ధరించటం, గోచీ పెట్టకుండా కట్టుకొనటం, వంటివి నగ్నసమములుగా చెప్పబడ్డాయి. రావణుడు నల్లని వస్త్రాలతో త్రిజటా స్వప్నంలో కానవచ్చాడు. తెలుపు శుభకరం. పవిత్రత, శాంతి, జ్ఞానాలకు సంకేతం. పసుపు మంగళకరం. నూతన వస్త్రానికి పసుపు పెట్టాలి. అశుభకార్యాలలో పసుపు పెట్టరు. నూతన వస్త్రధారణకు సోమ, మంగళ వారములు, ద్వాదశితిథి, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, పుబ్బ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రాలు తగవు. పర్వదినాలలో ఈ నిషేధం లేదు. ఆ కూడని దినాలలో కట్టుకొనదలిస్తే ముందు మంచిరోజున పసుపు పెట్టి ఉంచుకొని ఆరోజున కట్టుకొనవచ్చు.

కాలిన వస్త్రాలను, ఎలుకలు కొట్టినవాటిని ధరించేవాడిని నగ్నుడు అంటారని భోజుడు అన్నాడు. స్నానానంతరం పొడిబట్ట కట్టుకుంటూ తడిది పైకి తీయాలనీ, దానిని కిందకు వదిలితే స్నానం వ్యర్థమనీ చెప్పాడు. ఆరోగ్యం దృష్ట్యా ఋతువులకు అనుకూలమైన వస్త్రాలను చెప్పారు. చలికాలంలో ఎరుపు, వేసవిలో కాషాయం, వర్షాకాలంలోనూ, ఇతర కాలాలలోనూ తెలుపు వస్త్రాలు వాడాలని చెప్పబడింది. దైవ, శుభ కార్యాలలో చినిగిన వస్త్రాలు ధరించకూడదు. ప్యాంట్లు, షర్టులు గుడ్డను చించి కుట్టినవి కాబట్టి కనీసం అటువంటి పవిత్ర సమయాలలోనైనా సంప్రదాయ వస్త్రాలను ధరించి తీరాలి. ఇప్పటికాలంలో కొందరు పంచలా కుట్టిన వస్త్రాన్ని ధరిస్తున్నారు. ఇదికూడా తగదు మడికి ధావళి, పట్టుబట్ట, ఉతికి ఆరేసినవస్త్రం వాడాలి. ధావళీ శ్రేష్ఠం. పట్టుబట్టను పక్షానికి తడిపి శుద్ధి చేయాలి. నూలు వస్త్రం 24 గంటలకే పరిమితం.

”కట్టిన వస్త్రంబు కట్టడే విభుడు”

అని ధర్మరాజును గురించి లక్ష్మీదేవి చెబుతుంది. విడిచి మరల కట్టడం తగదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఉతుక్కుని వాడేవారు.

ధావళీకి ఏ దోషమూ అంటదు. అమెరికాలోని ఒక కంపెనీ 100 రోజులపాటు ఉతకకుండా వేసుకొనే చొక్కాను రూపొందించింది. కాబట్టి ధావళీ విలువ గుర్తించవచ్చు. దాత అనగా ఇచ్చేవాడు, ప్రతిగ్రహీత అంటే పుచ్చుకునేవాడు. పూజ, జపం, హోమం, భోజనం చేసేవాడు ఉత్తరీయాన్ని తప్పక ధరించాలి. తడిబట్టతో జపతపాదులు చేయకూడదు. తప్పని సమయంలో తడిపి, పిండి సూర్యున కెదురుగా ఆరుసార్లు విదిలిస్తే ఆరేసినట్లు అర్థం. సంస్కృతిని గ్రహింపదలచినప్పుడు వస్త్రధారణ విధానాన్ని తెలుసుకోవాలి.

”శుచివో హవ్య..”

మంత్రంతో ఉతికిన వస్త్రం మీద జలాన్ని ప్రోక్షించి,

“దేవస్య త్వా”

మంత్రంతో వస్త్రం తీసికొని, ”అవధూత..” మంత్రంతో సూర్యుడికి చూపి ”ఆవహన్తీ వితన్వానా..” మంత్రాన్ని చదువుతూ ధరించాలి. ఇట్టి విషయాలను గ్రహించినప్పుడు మహర్షులు మన జీవితాన్ని ఎంతగా మంత్రపూతం చేశారో తెలుస్తుంది.

మడి ఏమిటి? దేవుని పూజ చేసే వాళ్ళు అందరినీ తాకితే ఏం? అని ఇలా కొందరు ప్రశ్నిస్తున్నారు.

Magnatism, Personal magnatism వంటివి ప్రాణశక్తికి సూచకాలు. నీళ్ళు పారటం, నిప్పు మండటం వంటి సమస్త కార్యాలూ ఈ ప్రాణశక్తి వల్లే జరుగుతాయి. ప్రాణశక్తి నశిస్తే అన్నీ నశిస్తాయి. అది దేహంలో ఎంత ఎక్కువ ఉంటే తేజస్సు, వీర్యం, మేధ, వర్చస్సు, ఆయుష్షు, సత్త్వబలాదులు అంత ఎక్కువ ఉంటాయి. ఈశక్తి శుద్ధమైన చన్నీటిని త్రాగటం, చన్నీటి స్నానం, ప్రాణాయామపు వాయువు, సాత్త్వికాహారం వంటి వానిచే సాధింపగలం. మాట, చేత, చూపువంటి అన్నిటివల్లా ఇది క్షయిస్తుంది. కాబట్టి ఏకాంతవాసం, మితభాషణం వంటివిమేలు. ప్రాణశక్తి మహిమ తెలిసిననాడు దాని నేమాత్రం వ్యర్థం చేయడు. కాబట్టే ఋషులు రాక్షసుల బాధలు పడుతూ ఎవరి రక్షణో ఆశించారు తప్ప తమ తపస్సు, సదాచారం ద్వారా సాధించిన ప్రాణశక్తిని నిందలు, శాపాలతో పోగొట్టుకొనలేదు. ఆ శక్తి దేహం కొనభాగాలు కాలివ్రేళ్ళు, చేతివ్రేళ్ళ ద్వారా వెలుపలకు పోతుంది. కాబట్టే దురాచారుల కరగ్రహణం (shake hand) చేయటం అనర్థం. అట్టివారిని తాకటమూ ప్రాణశక్తికి నష్టదాయకమే. పెద్దల పాదాలకు నమస్కరించటంలో కూడా ఆంతర్యం ఆశక్తి పాదముల యందు ప్రసరిస్తుంది కాబట్టే. అది భూమిని తాకి క్షయం కాకుండుటకే చెక్క పాదుకలు వాడేవారు. దేహంలోని ప్రాణశక్తిని బయటికి పోనీయకూడదు. దీనికి వస్త్రాల ఆచ్చాదన సహకరిస్తుంది. ఆ వస్త్రాలు ప్రాణశక్తిని నిల్పగలవిగా ఉండాలి. అందుకు నార చీరెలు శ్రేష్ఠమని గుర్తించినందువల్ల మహర్షులు వాటిని ధరించేవారు. వానికంటె వెంట్రుకలవి, ఉన్నివి శ్రేష్ఠం. ధావళీ, పట్టు వస్రాలు వంటివి వాడటంలో ఆంతర్యం అదే. అవి ప్రాణశక్తిని బయటకు పోనీయవు, బయటి స్పర్శవలన వాని విషశక్తులను లోపలకు ప్రవేశింపనీయవు. వస్త్రం అంచులనుండి కూడా ప్రాణశక్తి భూమిలోకి పోతుంది. మనం ఎర్త్ అవటం అంటూ ఉంటాము. అందుకే వస్త్రం అంచులు భూమికి సమీపంలోకి రారాదు. కాబట్టి కచ్చాపోసి, గోచి పెట్టటం ద్వారా అంచులను పైకి పెట్టుకొనటం జరుగుతుంది. స్త్రీలు పైటచెంగు దోపటంలో కూడా ఉద్దేశ్య మదే. ఈ శక్తి రక్షణకే దుష్టులకు దూరంగా ఉండమనటం కూడా. ప్రాణశక్తి వంటివాని విలువ నేడు గ్రహించుటలేదు. కాని సదాచారంద్వారా తెలియకుండగానే దానిని సాధించవచ్చు, నిల్పుకొనవచ్చు కూడా. స్పర్శ, ధారణల ప్రభావం అలా పడుతుంది కాబట్టే

”ఉపానహౌ చ వాసశ్చ – ధృత మన్యై ర్న్ ధారయేత్ |

ఉపవీత మలంకారం – స్రజం కరక మేవచ” ||

అని ఇతరులు వాడిన చెప్పులు, వస్త్రాలు, జందెము, ఆభరణాలు, పూలదండ, కమండలము వంటివి మనం వాడకూడదని ఆర్షవాక్యం. అలాఅని అస్యశ్యతను ప్రోత్సహించుమని చెప్పలేదు. తీర్థ స్థలాలలో, వివాహాదులలో, యాత్రలందు, యుద్ధసమయములో, ఉప్పెన ఏర్పడినప్పుడు, గ్రామంలో దహనకాండ ఏర్పడినప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు స్పర్శదోషాదులు ఉండవని పరాశర స్మృతిలో తెలియజేయబడింది. పాద్మసంహితలో విష్ణుసేవార్థం విష్ణ్వాలయానికి వచ్చిన పతితులను తాకినా స్నానం చేయనవసరం లేదని చెప్పబడింది. కాబట్టి ఆచారం పేరుతో అందరినీ దూరం చేసికోవటం తగదు. అది సదాచారం కాదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment