సంధ్యావందనం
సంధ్యావందన మనగానే అదేదో బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించినదని చాలామంది అనుకుంటారు. నిజానికి సంధ్యావందనం కులమత భేదంలేకుండా అందరికీ ఆచరణీయమయినది. సంధ్యావందనం పేరిట ఉపనయనం అయినవారికి ఏర్పరచిన వ్యవస్థ వారికి ప్రత్యేక విధిని ఆదేశించింది. ఆ ఉపనీతులందరూ తమతమ గృహ్యసూత్రాలు చెప్పిన రీతిగా సంధ్యావందనాన్ని ఆచరిస్తూ ఉండేవారు.
అహరహ స్సంధ్యాముపాసీత
అనే వైదిక శాసనాన్ని నేడు ప్రధానంగా బ్రాహ్మణులలోని శిష్టాచారులు మాత్రమే పాటిస్తున్నారు. ప్రతిరోజూ సంధ్యను ఉపాసించాలన్నది అందరికీ గ్రాహ్యం అనేదే ఆ శాసనం. సంధ్యావందనంలోని కీలకమైన గాయత్రి బ్రాహ్మణులకే పరిమితమయినదంటూ 1983లో ద్రవిడకజగం వారు మద్రాసు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రాజుగారు అది సెక్యులరిజానకి విరుద్ధం కాదని, వేదాలు మానవజాతికి చెందినవని, గాయత్రీమంత్రం అనగా శబ్దబ్రహ్మ ఋగ్వేదంలో వస్తుందని అది ఎవ్వరికీ పరిమితం కాదని తీర్పు చెప్పినట్లు 26-11-2006 నాటి ఒక పత్రిక వ్యాసంలో వచ్చింది.
పాపాలు 1. కాయిక అంటే శరీరంతో చేసేవి. 2. వాచిక అంటే మాటతో చేసేవి. 3. మానసిక అంటే మనస్సుతో చేసేవి అవి మూడు విధాల ఉంటాయి. ఈ మూడు రకాల పాపాలూ శ్రద్ధగా సంధ్యావందనం చేయటం వల్ల పోతాయి.
“త్రివిధం పాపశుద్ధ్యర్థం సంధ్యోపాసన మేవచ”
అని ఆ విషయం ఋషులచే చెప్పబడింది.
”యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే”
అంటూ ఏ పగలు చేసిన పాపం ఆ పగలు సంధ్యావందనంచేత, ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రి సంధ్యావందనంచేత తొలగిపోతుంది.
దేవతల భార్యలుగా వారి శక్తులను చెప్పడం పౌరాణిక సంప్రదాయం. సంధ్య అనేది సూర్యశక్తి. కనుక సూర్యుని భార్యగా సంధ్యాదేవిని పరిగణిస్తారు. ఏతావతా సంధ్యావందనం అంటే సూర్యోపాసనే.
“కాలే కాలే నరః కుర్యాత్ – ఆదిత్యస్య నమస్కృతిం ॥
తదన్తరే హి విశ్వస్య – ప్రభుః పరమపూరుషః ||”
సూర్యునికి చేసే నమస్కారం సంధ్యావందనం.
”నరః కుర్యాత్”
అని చెప్పడంవల్ల ప్రతి మనుజుడూ దీనిని ఆచరించాలన్నదే సిద్ధాంతం. లోకనాథుడు, పరమ పురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆ సూర్యుడిలోనే ఉన్నాడు. ఆయనే
“ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః||”
అందుకే ఆయనను సూర్యనారాయణుడని తెలిపారు. నిత్యం దర్శనమిచ్చే సూర్యుని చూస్తూ “దేవుడు కనబడ”డని అనడంలో ఔచిత్యం లేదు. తాను కనిపించడమే కాదు, కళ్లు తెరిపించేవాడు, లోకాన్ని కనిపించేలా చేసేవాడు సూర్యనారాయణుడే. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, కర్మసాక్షి అయి, ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకి కావలసినవన్నీ ప్రసాదించే ఆ దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి వ్యక్తీ మూడువేళలా వందన మాచరించాలి.
అదే త్రికాల సంధ్యావందనం.
“నమస్కుర్యా దుభే సంధ్యే – శక్తిభూతే ప్రజాపతేః |
అజ్ఞానేన కృతం పాపం – తదన్తీ త్యాగమాః జగుః||”
కనీసం ఉభయ సంధ్యలలో అయినా సంధ్యావందనం ఆచరించాలన్నారు. అది భగవత్ శక్తి ప్రకటమయ్యే సమయం. అలా సంధ్యావందనం చేయడంవలన తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఋషులు దీర్ఘకాలం సంధ్యావందనం చేయుట వల్లనే దీర్ఘాయువును, ప్రజ్ఞ, కీర్తి, బ్రహ్మవర్చస్సు పొందారని మనుధర్మశాస్త్రం చెప్పింది. సంధ్యాసమయానికే అంతప్రాధాన్యం తప్ప మడి కట్టుకోవడం వంటి అన్నింటికీ కాదు.
అశౌచే శౌచే వాపి కాలే సంధ్యా విధీయతే
శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా సకాలంలో సంధ్యావందనం చేయడం ముఖ్యమన్నారు మహర్షులు. అందుకే కొందరు రైల్లో ఉన్నా, బజారులో ఉన్నా పక్కకు వెళ్లి, గుడ్డపరచుకుని సంధ్యావందనం చేసేస్తారు. అందరూ అనుసరించవలసిన విధానమది.
సంధ్యాసమయంలో చదవకూడదు. సంసారం చేయకూడదు. రావణుని తలిదండ్రులలా చేయడంవల్లే బ్రాహ్మణుడయ్యూ రాక్షసుడైనాడు రావణుడు. సంధ్యవేళలో ఎవరూ భోజనం చేయకూడదు. నిద్రపోకూడదు. చేయ వలసిందల్లా సంధ్యావందనమే. సంధ్యాశక్తి సూర్యశక్తి కాబట్టి సూర్యారాధన ముఖ్యమైనదైనా, ఇతర ఇష్టదేవతలకు సంబంధించిన ప్రార్థనలను చేసుకోవచ్చు. ఉపనయనం అయినవారు తమతమ ఋషులు చెప్పిన మార్గంలో, గురువులు ఉపదేశించిన విధితో సంధ్యావందనం ఆచరించాలి. ఆ సూర్యశక్తే ప్రాతఃసంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్నసంధ్యలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగా ఉపాసింపబడుతూ ఉంటుంది. అలాగే ప్రాతః కాలంలో బ్రాహ్మీరూపంలో, మధ్యాహ్న సంధ్యలో మాహేశ్వరీ రూపంలో, సాయంసంధ్యలో వైష్ణవీ రూపంలో వందనా లందుకుంటుంది. గాయత్రీ మంత్రం 24 అక్షరాలలో 24 మంది దేవతలున్నారు. అలా అది సకలదేవతల ఉపాసనే.
సంధ్యావందనంలో సమయం ప్రధానం. సమయ పాలనను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు త్రిసంధ్యలకూ చెప్పబడ్డాయి. ప్రాతః సంధ్యలో ..
“ఉత్తమా తారకోపేతా – మధ్యమా లుప్తతారకా ।
అథమా సూర్యసహితా – ప్రాతస్సంధ్యా త్రిధామతా ॥”
నక్షత్రాలు ఉండగానే చేయడం ఉత్తమమనీ, నక్షత్రాలు వెళ్లిపోయాక సూర్యుడు రాకముందు చేసేది మధ్యమమనీ, సూర్యుడు వచ్చిన పిదప చేయడం అధమమనీ ప్రాతస్సంధ్య చెప్పబడింది. మాధ్యాహ్నిక సంధ్యావందనానికి సరిగా మధ్యాహ్న సమయం ఉత్తమం. మధ్యాహ్నానికి ముందు సమయం మధ్యమం. అపరాహం అధమం. సాయం సంధ్యావందనానికి “ఉత్తమా సూర్య సహితా” – సూర్యుడు ఉండగా చేయడం ఉత్తమం. సూర్యుడు వెడలి నక్షత్రాలు రాకముందు మధ్యమం. నక్షత్రాలువచ్చిన పిదప చేయడం అధమం. ఇలా కాలప్రభావాన్ని గ్రహించి సంధ్యావందనం ఆచరించడం ద్వారా కృతకృత్యులు కావాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹