Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – నిత్యపూజ -8

నిత్యపూజ

నిత్యమూ భగవంతుని పూజించాలి. “ఆ! ఈ పూజలకూ, పురస్కారాలకూ టైమ్ ఎక్కడుంటుందండీ! ఏదో ఒక దండం పారేసి మన త్రోవన మనం పోతూ ఉండడమే” అని పూజ చేయకపోవడాన్ని కొందరు సమర్థించుకుంటారు. దేవుడే ఇవ్వకపోతే మనకు టైమ్ ఉండదు కదా! కాబట్టి సమయం చూసుకుని పూజను తప్పక నిర్వహించాలి. మనసుంటే మార్గ ముంటుందనేది సత్యం. దేనినైనా పూర్తి విశ్వాసంతో చేయాలి. అన్యమతాలు విగ్రహారాధనను అంగీకరించవు. ఆ ప్రభావం హిందువులపైన కూడా పడి విగ్రహారాధన విషయంలో విశ్వాసం సడలుతోంది.

వివేకానందస్వామి కాలంలో ఉన్న ఆళ్వారుమహారాజు విగ్రహారాధనను అంగీకరించేవాడు కాదు. దివాన్ గారి కోరిక మేరకు వివేకానంద స్వామి ఆళ్వార్ మహారాజును కలవడం జరిగింది. మాటల మధ్యలో స్వామీజీ దివాన్ గారిని పిలిచి, “ఆ రాజుగారి చిత్రపటాన్ని తీసుకురండి” అన్నారు. అలా తేగానే “దానిపై ఉమ్మి వేయండి” అన్నారు. దివాన్ “అమ్మో! రాజుగారిపైనా?” అని తిరస్కరించారు. స్వామి ఆళ్వార్రాజుతో “రాజా! ఆ పటాన్ని పట్టుకుని మీరంటారేమిటి? మీరైనా చెప్పండి దాని మీద ఉమ్మేయమని” అని అన్నారు. ఆళ్వారు రాజుకి విషయం అర్థమయింది. స్వామివారికి నతమస్తకుడై, ఆ చిత్రంలో తనను చూచినట్లే విగ్రహాలలో భగవంతుని చూడడం, పూజించడం సముచితమే అని గ్రహించాడు. బ్రహ్మాండపురాణంలో విష్ణువు బ్రహ్మతో ఇలా అంటాడు..

“సౌలభ్యాయ తు భక్తానాం

సర్వలోకానుకంపయా

అర్చావతార రూపేణ

లోకే స్మిన్ చతురానన!”

“ఓ బ్రహ్మదేవా! భక్తులు నా అనుగ్రహాన్ని సులభంగా పొందడంకోసం సమస్త లోకాలలో దయతో నేను అర్చావతార రూపంలో ఉంటున్నాను” అన్నాడు విష్ణువు. అలాగే భాగవతంలో “వస్త్రము, ఉపవీత, ఆభరణాలు, పత్రాలు, పూలమాలలు, గంధం, మైపూతలు మున్నగువానితో నా భక్తులు ప్రేమతో నన్ను పూజింతురు గాక!” అన్నాడు. విగ్రహారాధన విషయాన్ని వేదమే అంగీకరించింది.

పాషాణ లోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజా పున ర్భోగకరీ ముముక్షోః

అని చెప్పింది యజుస్సంహిత. “మోక్షం కోరేవారికి శిలా విగ్రహాలు, లోహ విగ్రహాలు, మట్టి విగ్రహాలు,మణి విగ్రహాల పూజ ఇహానికి కావలసిన ప్రయోజనాలను చేకూర్చగలది” అని దీని అర్థం. అంటే ముముక్షువులు సైతం విగ్రహారాధనను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు.

ఆదౌ సగుణ మాశ్రిత్య నిర్గుణం చ తత:పరమ్

అంటే నిర్గుణోపాసన స్థాయిని అందుకునే దాకా సగుణోపాసన,అనగా విగ్రహారాధన చేయమని మహర్షులు చెప్పినప్పటికీ, ఏ దశలోయినా విగ్రహారాధన చేయవచ్చు. అది ఎవరికీ నిషిద్ధం కాదు. తైత్తిరీయారణ్యకం కూడా

సురూపాం ప్రతిమాం విష్ణోః

అంటూ భగవంతుని మంచి రూపం కల విగ్రహాలను అనుగ్రహభావం కనబడే ముఖం, నేత్రాలు కలవానిని పూజించండని చెప్పింది.

న తస్య ప్రతిమా అస్తి

అన్న వాక్యాన్ని వేదంలో చూపించి, భగవంతునికి అసలు విగ్రహస్థితి లేదు కాబట్టి విగ్రహారాధన వేదవిహితం కాదంటూ కొందరు విగ్రహారాధనను నిషేధిస్తారు. కానీ భగవంతునికి సాటి ఎవ్వరూ లేరని మాత్రమే ఆ వాక్యానికి వైదికపరమైన అర్ధం.

గృహే విష్ణుం ప్రతిష్ఠాప్య

అని గృహస్థులకు ఆరాధనా విధానాన్ని తెలిపారు విఖనస మహర్షి. వైఖానసాది ఆగమశాస్త్రాలన్నీ విగ్రహారాధనను అనేక రీతుల తెలిపాయి. కృతయుగాన

కమలాక్షు నర్చించు కరములు కరములు

వంటి రీతులలో భగవదారాధనను వివరించారు. త్రేతాయుగంలో రావణుడు నిత్యసహస్రలింగార్చన చేసేవాడుగా కనబడతాడు. శ్రీరాముడు కూడా.

రామేశ్వరంలో రామలింగ ప్రతిష్ఠను నిర్వహించాడు. ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మ రుక్మిణిని గౌరీపూజకు వచ్చిన సందర్భంలోనే తీసికొనిపోయాడు. భగవద్గీతలో కృష్ణపరమాత్మ

యో యో యాం యాం తనుం భక్త్యా శ్రద్ధయార్చితు మిచ్ఛతి

అని

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

అని ఇలా విగ్రహారాధన విధానాలను అనేక విధాలుగా చెప్పడం చూస్తాము. ఈ విధంగా సమస్త వాజ్మయంలోనూ, అన్ని యుగాలలోనూ విగ్రహారాధన కనబడుతుంది. ఆ భగవంతుని త్రికరణశుద్ధిగా సేవించడమనేది ఇటువంటి అర్చనావిధానంలోనే ఉంటుంది.

నిర్గుణోపాసనకు సోపానమే సగుణోపాసన. సగుణోపాసనా రూపమైన ఈ విగ్రహారాధనను అంగీకరించనివారు వారి నాయకులకు ఫోటోలు, శిలాకాంశ్య విగ్రహాలు ఏర్పరచి దండలు వేయడం, ఆయా మతాలు తమ తమ చిహ్నాలను మెడలో వేసి, అనేక స్థలాలలో ప్రదర్శిస్తూను పరోక్షంగా విగ్రహారాధన చేస్తున్నారు. చూస్తున్నాము. కాదంటూనే ఆచరించే ఆత్మవంచనకంటే హిందూధర్మంలోని విగ్రహాల విలువను గ్రహించటం, ఆచరించటం మేలు. నిర్జీవమైన శిలను పూజించడమేమిటని కొందరు ప్రశ్నిస్తారు. నిజానికి ఆలోచిస్తే రాతిలోనూ జీవశక్తి ఉంది. ఎందుకన పదార్థాలన్నీ అణునిర్మితాలు. అణువులో పరమాణువులుంటాయి. అందులో న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వాటి చుట్టూ ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయని సైన్సు చెబుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులున్నప్పుడు జీవంలేనివని ఎలా అనగలం? ఆ శిలామూర్తి మంత్రతంత్ర ప్రభావితమై దైవసాన్నిధ్యం పొందుతుంది. నిగ్రహానుగ్రహ శక్తి పొందుతుంది. అట్టి విగ్రహాన్ని పూజించటం మానవాళికి శ్రేయోదాయక మవుతుంది. కాబట్టి నిత్యం విగ్రహాలను, దైవప్రతీకలైన చిత్రాదులను పూజిస్తే దైవాలనుపూజించినట్లే. ఆ దైవరూపాలు కూడా కల్పితాలు కాదు. మహర్షులు, యోగులు తపస్సు చేసి సమాధిలో ప్రత్యక్షంగా దర్శించిన రూపాలను మనకు ధ్యాన, స్తుతుల రూపంలో అందించారు. ఆ ధ్యానాదుల ఆధారంతో ఆ దివ్యరూపాలను బహుధా చిత్రించుకోవడం, పూజించుకోవడం జరుగుతూ ఉంది. అందువలన సగుణోపాసనలోని చిత్రంలో, విగ్రహాదులలో దైవాన్ని చూడాలి. పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుని పూజించి, తరించాలి.

భగవద్విశ్వాసం

భగవంతుని విషయంలో, భగవత్కార్య విషయంలో విశ్వాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. అది లేకుంటే మనస్ఫూర్తిగా అర్చించలేం. మన భావనను బట్టే, భావనా శక్తిని బట్టే ఫలితం ఉంటుంది. రాతిలో భగవంతుని చూడగలగడంలో కారణం మన భావనాబలమే, విశ్వాసమే. నాస్తికునికి అది రాయి తప్ప భగవంతుడు కాకపోవడానికి కారణం ఆ భావనాబలం లేకపోవడమే.

“మంత్రే తీర్థే ద్విజే దైవే – దైవజ్ఞే భేషజే గురౌ |

యాదృశీ భావనా యత్ర – సిద్ధి ర్భవతి తాదృశీ” ||

అని శాస్త్రం చెప్పింది. అంటే మంత్రం, తీర్థస్థలం, బ్రాహ్మణుడు, దైవం, జ్యోతిష్కుడు, వైద్యుడు, గురువులకు సంబంధించిన విషయంలో మన భావన ఎలా ఉంటుందో సిద్ధి కూడా అలాగే ఉంటుంది. తీర్థస్థలానికి వెళ్లినప్పుడు, పుష్కర స్నానానికి వెళ్లినప్పుడు ”ఇవి పవిత్రజలాలు. సార్థత్రికోటి తీర్థాలూ ఇందున్నాయి. వీటిలో స్నానం చేయడం వలన నా పాపాలన్నీ పోతాయి” అనుకుంటూ స్నానం చేస్తే పాపక్షయమూ, పుణ్యప్రాప్తి చేకూరుతాయి. ”ఇవి మురికి నీళ్లు, ఇంత మంది స్నానం చేస్తే పుణ్యం రాకపోగా రోగాలే వస్తాయి” అనుకొంటూ స్నానం చేస్తే పుణ్యం రాకపోగా రోగాలే వస్తాయి. వైద్యుని విషయంలో నమ్మకముంటే నలిచి మన్ను పెట్టినా మహౌషధమవుతుందనే సామెత ఉంది. అలా అన్నీ మన భావన, విశ్వాసాలను బట్టే పనిచేస్తాయి.

మనలో చాలామందిది భగవంతునిపై విశ్వాసం ఉండీ లేని స్థితి. పరిపూర్ణమైన విశ్వాసం లేకపోవడంవల్లనే మనం బాధలు పడటం జరుగుతోంది.

”సంశయాత్మా వినశ్యతి”

నిశ్చయాత్మత లేకపోవడం, సంశయాత్మత ఉండటం వల్ల దుఃఖంలో పడుతున్నాం. భాగవతంలోని గజేంద్రమోక్షం – ప్రహ్లాద చరిత్ర ఈ విషయంలో మనకు ఆదర్శాలు. గజేంద్రుడు సంశయాత్మక బుద్ధి కలిగిన వాడు.

”కలడు కలండనెడి వాడు కలడో లేడో”

అని భగవంతునియెడ సందేహం వ్యక్తం చేశాడు. కాబట్టే, ‘కుయ్యో’ అంటూ ఏడ్చాడు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు. గట్టిగా కళ్లు ఎర్రచేస్తే ఏడ్చే వయస్సు. కానీ తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా అతడు ఏడవలేదు. అందుకు కారణం అతడు నిశ్చయాత్మక బుద్ధి కలవాడు. కని, పెంచిన తండ్రి రాక్షసరాజు, మహాబల పరాక్రమశాలి. విశేషించి విష్ణు విరోధి అయిన హిరణ్యకశిపుని ముందే..

“ఇందు గల డందు లేడని సందేహము వలదు,

చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన

అందందే కలడు దానవాగ్రణి! వింటే”

అని స్పష్టంగా, నిర్భయంగా భగవంతుని ఉనికిని చాటాడు. అందువల్లనే ఏ క్షణమూ భగవదనుగ్రహానికి దూరం కాలేదు. దుఃఖించే స్థితికి రాలేదు. అందుకు కారణం నిశ్చయాత్మక బుద్ధితో కూడిన భగవద్విశ్వాసం. ఇంగ్లండులోని డాక్టరు చాలామంది రోగులపై పరిశోధన చేసి, భగవద్విశ్వాసం కలవారికి, అది లేనివారికంటే రోగబాధలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. తమకొక దైవం తోడు ఉన్నదనే ప్రబల విశ్వాసం వారికి మిక్కిలి ధైర్యాన్ని చేకూర్చి, బాధోపశమనం కలిగించిందన్న మాట. శాస్త్రాన్ని మెండుగా ఆరాధిస్తూ, విశ్వాసానికి రెండో స్థానం మాత్రమే కల్పించే వారు శాస్త్రాన్ని ఎంతగా ఆరాధిస్తారో, విశ్వాసం పట్ల అట్టి పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దాని విలువను గ్రహించాలి. తన సాయుజ్యం ఈయ దలచుకొన్న భక్తులకు భగవంతుడు ముందుగా అనేక కష్టా లిచ్చి పరీక్షిస్తాడు. కాబట్టి కష్టాలు రాగానే భక్తులు వీగిపోకూడదు. దానిని భగవత్పరీక్షగా గ్రహించి నిలబడగల్గాలి. చాలామందిని భగవద్విశ్వాసం కలవారుగా అనుకుంటాము తప్ప, ఆ స్థితి వారిలో పూర్తిగా లేదు. కాస్త కష్టం రాగానే “ఏమిటో! దేవుడు ఉన్నాడనుకుంటున్నాం తప్ప, ఉంటే ఇలా జరుగనిస్తాడా?” అనేస్తారు. ఆలోచనలో అంత త్వరగా మార్పు తెచ్చేది నిజమైన విశ్వాసం కాదు.

ఈ విషయంమీద పార్వతీ పరమేశ్వరుల మధ్యనే చర్చ జరిగింది. పార్వతీమాత శివునితో “నాథా “!

“శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే”

అంటారు. అది నిజమేనా?” అని అడిగింది. “అందులో సందేహమే ముంది?” అన్నాడు పరమశివుడు. “అది నిజమైతే జనమంతా కైలాసానికి రావాలి కదా! యమలోకానికి వెళ్తున్నారేమిటి?” అని ప్రశ్నించింది. “నీ సందేహం తీరుస్తాను రమ్మ” ని పార్వతిని తీసికొని శ్రీశైల క్షేత్ర ప్రాంతానికి వచ్చాడు శివుడు. తాను 90 ఏళ్ల వృద్ధుడుగా రూపం మార్చుకొని, శ్రీశైలంనుండి వచ్చే మార్గంలో ఒక బురదగుంటలో దిగబడి ఉండిపోయాడు. ఒక పండుముత్తయిదువగా రూపం మార్చుకోవలసిందని చెప్పి, ఆమెకు కొన్ని సూచన లిచ్చాడు. ఆ ప్రకారం పార్వతి శ్రీశైలంనుండి వస్తున్న భక్తులను సంబోధిస్తూ “బాబూ! అమ్మా! రక్షించండి. నా పతిదేవుడు వృద్ధుడు. బురదలో కూరుకుపోతున్నాడు. బయటకు తీయండి” అని అర్థించేది. వారు ముందుకు వచ్చినప్పుడు “నాయనా! నీలో ఏ పాపమైనా ఉంటే ముట్టుకోకు. ఆత్మత్యాగం చేసుకుంటా రాయన” అనేది. ఆ మాట విని అంతా వెనక్కి తగ్గి పోసాగారు. అటుగా వస్తున్న ఒక వేశ్య ఆయనను తీయబోగా అలాగే పలికిందివృద్ధురాలు. వెంటనే ఆ వేశ్య “అమ్మా! ఇప్పుడే కదా! శ్రీశైల శిఖరం చూసి వస్తున్నాను. నాలో ఇంకా పాపం ఏముంటుంది? నీ భర్తను బయటకు తీస్తాను. బాధపడకు” అంటూ దగ్గరకు రాగానే పార్వతీపరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారు.

అంతట శివుడు పార్వతీ! వారంతా శ్రీశైల శిఖరం చూసిన వారే. కానీ వా రెవ్వరికీ అంతటి పరిపూర్ణ విశ్వాసం లేదు. అందుకే వారికి కైలాస ప్రాప్తి ఉండడం లేదు. అట్టి పరిపూర్ణ విశ్వాసం కలిగినందువల్లనే ఈమె వేశ్యగా బ్రతికినా మన దర్శనం పొందగలిగింది. “శివసాయుజ్యానికి అర్హురాలయింది” అన్నాడు. కాబట్టి దైవంయెడల పరిపూర్ణ విశ్వాసంతో పూజాదికం నిర్వహిస్తేనే మనం ఆ సత్ఫలితాన్ని, దైవానుగ్రహాన్ని పొందగలుగుతాం.

భగవత్సేవ – అభిమానత్యాగం

భగవదనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా కావలసినది అభిమాన త్యాగం కూడా. స్వామికి సంతృప్తిగా మోకరిల్లగలగాలి. ప్రక్కనున్నవారిని బట్టి, పరిసర పరిస్థితుల బట్టి భక్తి ప్రకటించడం నిజమైన భక్తి కాదు. అభిమాన త్యాగం చేసి, పూర్తిగా శరణాగతు లైననాడే భగవంతుని అనుగ్రహం పొందగలుగుతారు. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు చూస్తాం. ఉదాహరణకు గజేంద్రుడు, ద్రౌపది, గోపికలు వంటివారి నెందరినో చెప్పుకోవచ్చు.

గజేంద్రుని మొసలి పట్టుకుంది. వెంటనే భగవంతుడు జ్ఞప్తికి రాలేదు. తానూ శక్తిమంతుడిననే ఉద్దేశ్యంతో గజరాజు చాలాసేపు పోరాడాడు. అలా పోరాడుతూ ఉన్నంతసేపూ భగవదనుగ్రహానికి పాత్రుడు కాలేదు. పూర్తిగా అశక్తుడై, అభిమానం వీడి,

“నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్,

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”

అని అన్నాడో లేదో

“సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు”

అన్నట్లుగా పరుగున వచ్చాడు. అలాగే ద్రౌపది విషయంలో కూడా కౌరవ సభలో దుశ్శాసనుడు వలువలూడ్చే సమయంలో మనసులో కృష్ణుని ప్రార్థిస్తున్నా పూర్తి విశ్వాసం లేక, అభిమాన త్యాగం చేయలేక పెనగులాడింది. అలా పెనగు లాడినంతవరకూ దైవానుగ్రహం కలగలేదు. ఎప్పుడైతే తనదేమీ లేదని గ్రహించి, అభిమానం వీడి, చేతులెత్తి మొక్కిందో తక్షణమే రెప్పపాటు కూడా ఆలస్యం చేయక ఆమె కెట్టి మానభంగం కానీయక రక్షించాడు. వస్త్రం తొలగడానికి క్షణకాలం చాలు. అంతకూడా అవకాశం ఈయలేదంటే పూర్తిగా శరణాగతి చేసినది కాబట్టే. భగవదనుగ్రహం సాధించాలంటే అభిమాన త్యాగం కూడా అవసరం. ఆ విషయంలో చాలామంది వెనుకబడుతుంటారు. దారిలో దేవాలయం కనబడితే ప్రతి దేవాలయానికీ మొక్కుకుంటూ పోవడం సాధ్యం కాదు కాబట్టి మెదలకుండాపోతే పరవా లేదు. కానీ అటూయిటూ చూసుకుని ఎవ్వరూ చూడకుంటే దణ్ణం పెట్టడం, ఎవరన్నా చూస్తున్నారనుకుంటే మానడం ఇటువంటివి మంచివి కావు. అడవులలో, కొండలలో ఘోరతపస్సు చేసి, భగవదనుగ్రహాన్ని సాధించారని వింటుంటాము. కనీసం ఇంట్లోనైనా సహనంతో, దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టి, నేడు భగవత్ పూజ చేయలేక పోతున్నాం. సుఖంగా ఆసనం వేసుకుని, బాగా సింగారం చేసుకుని, ఫ్యానో, ఎ.సినో వేసుకుని, సెల్ ఫోన్ ని పక్కన పెట్టుకుని పూజకు ఉపక్రమిస్తున్నాం. కష్టసహిష్ణుతను భగవంతుడు కోరతాడు. కానీ సుఖంగా భగవత్కార్యం చేయాలని మనం కోరుతున్నాం. అనుకున్నది కాకపోతే నాస్తికులమైపోయి భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తున్నాం.

దేవునివద్ద జుట్టునివ్వడం, అలా అభిమానత్యాగాన్ని ప్రదర్శించడమే. జుట్టు చెదిరితే భరించలేక జేబులోంచి దువ్వెన తీసి పదే పదే దువ్వుకుంటూ ఉండేవారు అట్టి జుట్టుని భగవంతుని పాదాల వద్ద ఉంచడానికి సిద్ధమవడం అంటే అభిమాన త్యాగం చేయడమే. అది తల (అహంకారాన్ని) తీసి, దేవుని పాదాలవద్ద ఉంచడంతో సమానమే. భారతంలో ద్రౌపదిని చెరబట్టబోయిన సైంధవుని తల తెగేస్తామన్నారు భీమార్జునులు. సోదరి దుస్సలకు వైధవ్యం కలిగించడం తగదని ధర్మరాజు వారించాడు. మరి ప్రతిజ్ఞాభంగం చేయడమెలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సైంధవునికి శిరోముండనం చేస్తే, శిరస్సు ఖండించినట్లే అని చెప్పడంతో భీమార్జునులు అలాగే చేశారు. కాబట్టి తిరుపతి వెళ్లి జుట్టు ఇస్తున్నామంటే భగవంతుని ఎదుట అవసరమైనరీతిలో అభిమాన త్యాగం చేయడమే. ఆ విధంగా చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి.

భగవత్పూజ

భగవదనుగ్రహాన్ని సంపాదించుకొనడం కోసం జరిపే క్రియాకలాపమే పూజ. అదే

”గౌరవిత ప్రీతిహేతుక్రియా పూజా”

అని నిర్వచింపబడింది. గౌరవింపదగినవారి ప్రీతికొరకు చేయబడే సర్వకర్మలకూ పేరు పూజ. నిత్యుడు, నిత్యతృప్తుడు, పరిపూర్ణుడు అయిన భగవంతునికి మనం ప్రీతి కల్గించడమేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం ”ఆ దైవంయెడ మన ప్రీతి పరిపూర్ణమవడమే”నని. ఏ పరమాత్మనుండి వేరై , జీవాత్మగా వచ్చామో ఆ పరమాత్మను మరల చేరేదాకా జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, సకామంగానో, నిష్కామంగానో పూజాదిక కర్మలాచరించాలి. అజ్ఞాని తనకొరకే చేస్తే జ్ఞాని లోకసంగ్రహణార్ధం చేయాలి. అలా ప్రతివ్యక్తికీ ఉన్నంతవరకూ కర్తవ్యమైనది పూజ. నిత్యపూజ ద్వారా ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకొనటంవల్ల మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మిసౌరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా ఆధ్యాత్మిక స్థాయి ఎక్కువగా ఉన్నవారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వీరిలో కోపం, ఆందోళన, అస్థిరత వంటివి తక్కువ అని వెల్లడయిందని, స్వార్థచింతన తగ్గి అందరి క్షేమాన్ని కోరుకొనే విశాల భావన అలవడుతుందని, వీరికి క్యాన్సరు, పక్షవాతం,వెన్నెముక గాయాలు వంటి సమస్యలనుండి కోలుకొనే విషయంలో ఈ ఆధ్యాత్మిక భావనలు మంచి ఫలితం కనపరుస్తున్నాయని అధ్యయనకర్త డ్యాన్ కోహెన్ చెప్పారు. దైవభక్తి బాధలనుండి ఉపశమనం కల్గిస్తుందని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రయోగాత్మకంగా పరిశీలించి ఈ విషయం సశాస్త్రీయంగా తేల్చారు. మెదళ్ళను స్కానింగ్ ద్వారా పరిశీలించి. రోగబాధ నాస్తికు లెక్కువ అనుభవించారని పెయిన్ పత్రికలో వ్రాశారు.

భగవానుని స్వరూపం

  1. పర 2. వ్యూహ 3. విభవ 4. అంతర్యామి 5. అర్చాస్వరూపం అని ఐదు విధాలుగా ఉంటుంది.
  2. 1 సర్వులు దర్శించి, సేవింపరాని సనాతన నిత్యరూపం పరస్వరూపం. 2. బ్రహ్మరుద్రేంద్రాదులతో సేవింపబడుతూ ” పాలకడలిపై శేషునియందు అధివసించి ఉండే రూపం వ్యూహస్వరూపం.రామ, కృష్ణాద్యవతారాల రూపంలో దిగివచ్చేది, మరల స్వస్థానం చేరేది విభవరూపం. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు మొదలయిన వారు విభవాతారాలే. సమస్త ప్రాణులు హృదయంలో సూక్ష్మంగా ఉండేది అంతర్యామి. మంత్రపుష్పంలో “నీవార సూకవత్తన్వీ పీతా భాస్వ త్యణూపమా” అని చెప్పబడిన దదియే. 5. భక్త వత్సలుడైన భగవంతుడు భక్తులచే నిర్దేశింపబడిన విగ్రహాలలో ఆవాహనాదికం ద్వారా దివ్యసాన్నిధ్యాన్ని కలిగించుకుంటాడు. అది అర్చారూపం. అదే మనం పూజించేది. ఆ ఆవాహనను పటంలోకి చేస్తే పటంలోనే ఉంటాడు. విగ్రహం లోకి చేస్తే విగ్రహంలో ఉంటాడు. పసుపుముద్దలోకి చేస్తే పసుపు ముద్దలోనే ఉంటాడు.

”అర్చావతార స్సర్వేషాం బాంధవో భక్తవత్సలః”

అని ఈ అర్చావతారం అందరికీ అందుబాటులో ఉండునది, భక్తులయెడ మిక్కిలి వాత్సల్యం కలిగియుండునది. కాబట్టి అర్చావతారాన్ని ఆశ్రయించి, సేవించి, సకల జనులు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి యత్నించాలి. అట్టి భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యమైన మార్గం పూజాకర్మ. ఆ పూజాకర్మ నాలుగు విధాలు.

1. నిత్యం :- ఇది నిత్యమూ ఆచరింపవలసిన విధి. ఆచరించడంవలన కలిగే ప్రయోజనం ఎలా ఉన్నా, చేయకపోతే మాత్రం ప్రత్యవాయం ఏర్పడుతుంది. అంటే పాపం సంప్రాప్తిస్తుంది.

2. కామ్యం : – ఇది ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే పూజ. మొక్కుబడి పూజలు అన్నీ ఈ కోవకు చెందినవే.

3. నైమిత్తికం :- ఏదో ఒక నిమిత్తంతో చేసే పూజ. ఆయా దేవతలకు సంబంధించిన పండుగలలో ప్రత్యేకించి వారినే పూజిస్తారు. వ్రతాలవంటివి కూడా నైమిత్తికాలే. ఇవి నిత్యం చేసేవి కావు. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం శుభకార్యాలలో, కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే నిర్వహిస్తాము.

4. నిత్యకామ్యం :- ఇది చేయకపోతే దోషాన్ని, చేయడంవలన ఫలితాన్ని ఇవ్వగలది. మంత్రజపం, పారాయణాదికాలు ఈ కోవలోకి వస్తాయి. సంకల్పించిన నాటినుండి నిత్యం నిర్ణీత మండల, అర్థమండల పర్యంతం ఆచరింపవలసినదే. నియమభంగం చేయడం పాపం. నియమబద్ధమైన ఆచరణవలన కోరుకొన్న ఫలితం చేకూరుతుంది. పూజకు ప్రత్యేకమయిన గదిని ఏర్పరచుకొనటం మంచిది.

వంటకు,భోజనం చేయటానికి, పడకకు, చదువుకు, పిల్లలకు ఇలా చాలా గదులు నేర్పరచుకొనే మనం దేవుని పూజకు ప్రత్యేకంగా గది నేర్పరచుకోవాలి. లేకున్న ఇంటిలో ఈశాన్యభాగంలో దేవుని పెట్టుకోవాలి. పూజ చేసే మనము తూర్పుకు తిరిగి చేయుట శాంతి, ఉత్తరము వృద్ధి. పడమర పుష్టి, దక్షిణం దుఃఖకారణం. కాబట్టి దక్షిణానికి తిరిగి పూజ చేయకూడదు. పూజా ద్రవ్యాలు మనకు కుడివైపున ఉంచాలి. కంచాలు పూజయందు వాడరాదు. పూజా జపాదులకు ఆసనం కూడా సముచితంగా ఉండాలి. ఆసనం లేక రాతిపై కూర్చొనటం వ్యాధి, కొయ్యపైన దౌర్భాగ్యం, జింకచర్మం -జ్ఞానం; దర్భాసనం జ్ఞానం, పౌష్టికం; వెదురు -దరిద్రం; నేలపై – దుఃఖం, అభిచారము; చిత్రాసనం –సర్వార్థసాధకం; పులిచర్మం- మోక్షం; తృణం – యశోహాని; కంబళాసనం – దుఃఖవిమోచనం. అదియు ఎర్రనిది వశ్యానికి, తెలుపు శాంతికి హేతువు. మట్టి, కొయ్య, రాయి వంటివాటిలోకి మంత్రాలతో భగవంతుని ఆవాహన చేయాలి. ఆవాహన అంటే ఆ విగ్రహంలోకి భగవంతుని మంత్రాలతో ఆహ్వానించడం.

”మంత్రాధీనం తు దైవతమ్.”

అనగా భగవంతుడు మంత్రానికి అధీనుడు. కాబట్టి మన ఆహ్వానాన్ని మన్నించి నిర్ణీత ప్రతిమలలోకి చేరుతాడు. నాల్గంగుళాలు మించిన రాతివిగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించకూడదు. ఈ విగ్రహాలు, పట్టుబట్టలు, మందిరాలు, పూజాసామగ్రి ఇదంతా ఒక పెద్ద ప్రదర్శన అని కొందరు విమర్శిస్తూ, మనస్సులో ధ్యానించుకోవడం ద్వారానే భగవదనుగ్రహాన్ని పొందాలని అంటూంటారు. అది పూర్తి సత్యం కాదు. ఎందుకంటే అనంతర తరాలు మనలను అనుసరించి, ఈ మార్గంలో ఉండాలంటే వారికి ప్రత్యక్షానుభవం అవసరం. ఒక వ్యక్తి తన కుమారునికి దైవకార్యాన్ని గురించి చెప్పకుండానే మరణించినా, తండ్రి నిత్యం దేవుని వద్ద కొంత సమయం కూర్చోవడం, పూజచేయడం, అందుకోసం పట్టువస్త్రాలు ధరించడంవంటివన్నీ చూసి ఉండడంవలన తండ్రియెడల శ్రద్ధతో అతడుకూడా ఆ పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అదే తండ్రి మానసికంగా ధ్యానాలు చేసుకుని గడిపి ఉంటే, మనసులో ఏం జరిగేదనేది తెలిసేది కాదు కాబట్టి తాను ఏమీ చేయక,

“మా ఇంట్లో పూజలు చేసే అలవాటు లే”దని చెప్పి,

సమర్థించుకుని మిన్నకుండే ప్రమాదముంది. కాబట్టి అధికమైన ఆడంబరాలు అవసరం లేదు తప్ప, ఇతరులకు ఆదర్శంగా పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్త విధానంతో ఆచరించడం శ్రేయస్కరం. భక్తిశ్రద్ధలతో నిత్యనైమిత్తిక పూజలు చేసి, భగవదనుగ్రహానికి పాత్రులం కావాలి. భగవత్ పూజకు భక్తిశ్రద్ధలు ముఖ్యం. వస్తులోపం జరిగినా భక్తిశ్రద్ధలుకలిగి ఉంటే ఆ లోపం లెక్కలోకి రాదు. అలాకాకుండా వస్తు సేకరణ బాగా జరిగినా భక్తి శ్రద్ధలు లోపిస్తే అది శ్రేష్ఠమైన పూజ కాదు. భగవంతుడు ఇట్టి పూజను ఇష్టంగా గ్రహించడు. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో “పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి” అన్నాడు. సమర్పించేది పత్ర మాత్రమైనా, పుష్ప మాత్రమైనా భక్తిమాత్రం ముఖ్యం. తిన్నడు నోటితో నీరు తెచ్చి శివలింగంపై పోశాడు. ఆతని భక్తి కారణంగా అది భగవంతునిచే అభిషేకం వలె ఇష్టంగానే స్వీకరింపబడింది. రామునికి శబరి ఎంగిలిపండ్లు పెట్టగా ఆమె భక్తికి రాముడు మెచ్చినట్లుగా జనహృదయాలలో నిలచిపోయింది

. “భక్తితోడి కూడు పట్టెడైనను చాలు”

అని వేమన అన్నట్లు, భక్తిశ్రద్ధలతో పవిత్రంగా ఏది ఎంత సమర్పించినా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అట్టి భక్తిశ్రద్ధలు లేక పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఇష్టపడడు. కాబట్టి, భక్తిశ్రద్ధలతో నిత్యనైమిత్తిక పూజలు చేసి, భగవదనుగ్రహానికి పాత్రులం కావాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment