భోజన దోషాలు
భోజన విషయంలో గుణాలు పాటించటం ఎలాగున్నా కనీసం దోషాలనైనా తెలిసికొని వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భోజనానికి కూర్చోవడంలో కూడా పెద్దలు కొన్ని నియమాలు, దోషాలు చెప్పారు. ఎడమకాలు చాపి దానిపై ఎడమ చేయి పెట్టడం తగదు. కాళ్లు బారచాచి తినకూడదు. కుక్కుటాసనం అంటే గొంతుక కూర్చుని తినకూడదు. అలాగే తడిబట్ట కట్టుకుని తినరాదు. తలమీద స్నానం చేశాక తల పూర్తి పొడిగా ఉండేటట్లు తుడుచుకోకుండా అన్నం తినకూడదు. శూన్యగృహంలో, అంటే ఎవ్వరూ నివసించని ఇంట్లో, ఎవరో వదలివేసిన ఇంట్లో భోజనం చేయదగదు.
దేవాలయంలో భోజనం చేయకూడదు. రజస్వల, పతిత చూస్తుండగా, కుక్క, కోడి వంటివి చూస్తుండగా భోజనం చేయకూడదు. జున్నుపాలు తీసికొనరాదు. దేవునికి నివేదించని పులగం, పొంగలి, పాయసం, అపూపభక్ష్యాలను తినకూడదు. స్తనద్వయ జంతువులైన మేకల పాలు, గుఱ్ఱంపాలు, ఒంటె పాలు వంటివి వాడకూడదు. భోజన విషయములో ప్రత్యేకించి 13 దోషాలను ఋషిసత్తములు తెలిపారు. వాటిని గ్రహించినప్పుడు ఉత్తమ జీవన విధానంలో భోజనం కూడా ఎంత శ్రద్ధ తీసుకోవలసిన విషయమో అర్ధమవుతుంది. ఆ దోషాలు ఈ విధంగా ఉంటాయి.
1. జాతి దోషం :- స్వభావసిద్ధంగానే కొన్ని ద్రవ్యాలు పనికిరావు.
“వస్తూని లశునాదీని – వర్ణ్యాన్యాహు ర్మనీషిణః”
అని చెప్పారు. తామస పదార్థాలు బుద్ధిని, తేజస్సునీ హరిస్తాయి. కనుక నీరుల్లి, వెల్లుల్లి, ఇంగువ, కుక్కగొడుగులు, అడవి మెంతి, అమేధ్యంలో పెరిగినవి, అట్టి జాతులు భుజింపదగవు, అలాగే జాము ముందు, అంటే వండి మూడుగంటలకు పైగా కాలం గడచినవి, సరిగా పక్వం కానివి, రుచి పోయినవి, దుర్వాసన కొట్టేవి, చద్దివి, ఎంగిలివి అపవిత్రాలు. ఇవి భుజించడానికి అర్హమైనవి కావు. అవి రోగాలు కలిగిస్తాయి. బుద్ధిని నాశనం చేస్తాయి. తెలకపిండి కూడా తినకూడదు. ఆరోగ్య కారణాలపై బాలింతలకు పాలు బాగా పడడానికి తెలకపిండిని, వాతరోగగ్రస్తులకు వెల్లుల్లిని వాడడంలో దోషం లేదు. ఎందుకంటే,
“ఆతురే నియమం నాస్తి”
అంటే వ్యాధిగ్రస్తులకు నియమాలు అక్కర్లేదు” అని ఋషులే చెప్పారు. ఎక్కువ వేడివి, ఎక్కువగా చల్లబరచినవి, ఎక్కువ కారపువి తినరాదు. ప్రాణి హింసతో దొరికిన పదార్థాలు కూడా భుజింపరాదు.
2. ఆశ్రయదోషం : – ఆవుపాలు మంచివే. కానీ అవి కల్లుముంతలో, రాగి పాత్రలో పోసి తెస్తే స్వీకరింపదగవు. పాలు ఏ పాత్రను ఆశ్రయించాయో దానినిబట్టి వచ్చిన దోషం ఆశ్రయ దోషం. ఆ దోషాలకు ఉదాహరణ మజ్జిగను ఇత్తడి పాత్రలో పోస్తే ఆశ్రయదోషం తథ్యం. కొత్త వంటపాత్రను మేకపాలతో తడిపాకనే వాడాలని వేదం చెబుతోంది. మేకపాలు దొరకని పక్షంలో ఏదో ఒక పాలతో శుద్ధి చేసిన పాత్రలనే వాడాలి. పాత్రను పైన తోమకుండా లోపల మాత్రమే తోమడంవల్ల కూడా ఆశ్రయదోషం సంక్రమిస్తుంది.
3. నిమిత్తదోషం : – ఆవు పాలు, పెరుగు మంచివి. కానీ కుక్క ముట్టుకోవడం, బల్లి తాకడం, సాలీడు పడడం వంటి వాటితో నిమిత్తదోషం ఏర్పడుతుంది. కాకి, పిల్లి, ఈగలు తాకితే దోషం లేదు. వెంట్రుక పడడం కూడా దోషమే. భారతంలోని ఉదంకోపాఖ్యానంలో అన్నంలో వెంట్రుక వచ్చినందుకు శాపం ఇవ్వడం కూడా జరుగు తుంది. కానీ, నేతిని అభికరించడంవల్ల కేశదుష్ట దోషం పోతుంది.
*4. భావదోషం :-
”యజమానికృతం పాపం అన్న మాశ్రిత్య తిష్ఠతి”
ఒక వ్యక్తి చేసిన పాపం అతని అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే హంతకుల ఇంట భోజనం చేయదగదు. రాయబారానికి వెళ్లిన కృష్ణునికి దుర్యోధనుడు విందుని ఏర్పాటుచేస్తాడు. భావదోషం కారణంగా కృష్ణుడు ఆ దుష్టభోజనం చేయకుండా విదురుని ఇంటికి వచ్చి, భుజిస్తాడు. గురునానక్ ఒక ఊరు వెళ్లినప్పుడు అక్కడి జాగీర్దారు ఇంట భోజనం చేయకుండా, ఒక కూలివానిని అడిగి భోజనం పెట్టించుకుని తింటాడు. ఆ జాగీర్దారు “నాదేం రక్తపు కూడా?” అని అడుగగా, “అవును. పేదల రక్తం పీల్చి, సంపాదించిన దది” అని సూటిగా జవాబిస్తాడు. దుష్ట భావన కలిగినవారి అన్నం తినడంకన్నా అడుక్కుని తినడం, అదీ లేకపోతే నీళ్లు తాగి పడుకోవడం మేలని ఆర్షవాక్యం. మన సంతతి సద్భావంతో జీవించాలంటే వారికి మనం మంచి సంపాదనతోనే తిండి పెట్టాలి. ద్రౌపది వలువలను ఊడ్చిన సమయంలో భీష్ముడు మిన్నకున్నాడు. దానికి కారణం అన్నదోషమే అంటాడు.
5. దృష్టి దోషం :- కొందరి చూపు చాలా ప్రమాదకరమైనది. కాబట్టి తలుపులు వేసుకుని భోజనం చేయాలని చెప్పబడింది. దృష్టితోనే దేవుడు మనం పెట్టే నివేదనను స్వీకరిస్తాడు. దానిపై ఇతరుల దృష్టి పడరాదనే తెరవేసి, దేవునికి నైవేద్యం పెడతారు. ఇతరులే కాదు. నివేదించే వ్యక్తి తప్ప, తక్కిన అర్చకులుకూడా బయటకు రావలసిందే. నోరూరిన ఉచ్ఛిష్టదోషం నివేదనకు పడుతుంది. మనకి వంట చేసి వడ్డించేవారు తల్లిలా మంచి దృష్టితో ఉండాలి. క్షేత్రాలలో అంటే తిరుపతి వంటిచోట్ల అన్నప్రసాదం స్వీకరించేటప్పుడు, నదీ తీరాలలో, గిరి, వనాలలో జరిగే సమారాధనలలో ఈ దోషం లేదు.
6. అశుచిదోషం : – వండేవారు, వడ్డించేవారు శుచిగా, శ్రద్ధగా ఉండాలి. వారు శీలం, శౌచం కలిగి ఉండడం మేలు. వంటచేస్తే చెమట పడుతుంది కాబట్టి, ఏకంగా వంట చేశాకే స్నానంచేద్దా మనుకునేవారున్నారు. ఉద్యోగానికి పరుగులు పెట్టేవారు ఉదయాన్నే సమయం చాలడంలేదంటూ నోట్లో బ్రష్షు పెట్టుకుని, కుక్కరుని స్టౌ మీదికి ఎక్కించేవారున్నారు. వీరందరి వంటలకూ అశుచిదోషం ఉంటుంది. స్నానం, మడిబట్టలు వంటి నియమాల ఉద్దేశ్యం ఆరోగ్యమే. తిరిగి తిరిగి వచ్చి, ఆ బట్టలతోనే వండడం, వడ్డించడం, భుజించడం తగదు. ఇతరులను తాకి రావడంవలన సంక్రమించే కొన్ని వ్యాధులకు దీనిలో ఆస్కార ముంటుంది. కాబట్టి అశుచి లేని రీతిలోనే భోజనం చేయాలి.
7. అసంస్కారదోషం :- వైశ్వదేవం వంటి సంస్కారాలు పొందకున్నా, అభికరించి ఒక ముద్దని పొయ్యిలో వేసే అలవాటు ఈ దోషం తగలకుండా నివారించడానికే. స్టౌలు వచ్చిన ఈ కాలంలో ఈ సంస్కారం ప్రసక్తే ఉండదు.
8. అనివేదితదోషం : – దేవునికి మహానివేదన పెట్టడంవలన ఈ దోషం నివారణ అవుతుంది. భగవంతునికి పెట్టకుండా, తానే తింటే అది పాపాన్ని తిన్నట్లే అని కృష్ణుడు చెప్పగా, రాముణ్ణి తలచుకోకుండా అన్నం తినరాదని చెప్పింది పద్మపురాణం. అన్నదాత రాముడు. అందుకే “అన్నమో రామచంద్రా” అనే వేడికోలును నుడికారంగా వింటూఉంటాము.
9. పాత్రదోషం : –
”విచ్ఛిన్న పాత్రే నాశ్నీయాత్ న భూమ్యాం న చ పాణిషు”
అంటే పగిలిన పాత్రలో చినిగిన విస్తరిలో, తినరాదు. ఎంత శుభ్రంగా ఉన్నా నేలపైన, ఎడమచేతిలో పెట్టుకుని అన్నం తినరాదు. ఆకు కొస ఎడమవైపునకు ఉండాలి. అన్ని ఆకులూ భోజనానికి అర్హమైనవి కావు. ఇటువంటివి పాత్రదోషాలు.
10. పరివేషితదోషం :- వడ్డనలో కూడా విధానాన్ని పాటించాలి. మొదటే అన్నాన్ని వడ్డించరాదు. కుడివైపు పప్పు, తీపి పదార్థం, ఎడమవైపు పచ్చళ్లు, వెనుక కూరలు, ముందు అన్నము ఇలా వడ్డించాలి. అన్నీ వడ్డించి, అభికరించాలి. భగవన్నివేదన అయిన పిదపే ఉప్పు వడ్డించాలి. వడ్డనలో పేర్కొన్న దోషాలు జరగకూడదు.
11. పంక్తిదోషం : – శాస్త్రం పంక్తిబాహ్యులను తెలిపింది. పంక్తిపావనులను కూడా తెలిపింది. దుష్టులు, పాపులు అగు పంక్తిబాహ్యులతో కాక పంక్తిపావనులతో అంటే పుణ్యాత్ములు, ఉత్తములు అయినవారితో కూర్చుని తినాలి.
12. క్రియాదోషం :- పరిషేచనం, భగవన్నామస్మరణ వంటివి లేకుండా తినివేసెయ్యడం క్రియాదోషం.
13. భోజనదోషం :- కూర్చునే పద్దతి, పదార్థాలను తినే క్రమం రెండూ ముఖ్యమే. తక్రాంతంతు భోజనం అన్నారు. అంటే భోజనం చివరిలో మజ్జిగఅన్నం తినాలి. మన సంస్కృతిలో భోజనానికి కూడా సముచిత స్థానముంది. దానిని గ్రహించి, మంచిగా భుజించడంవలన ఆరోగ్య, సద్భావ, సద్గతులు కలుగుతాయి.
ఉపవాసం
కొన్ని పర్వదినాలలో అసలు భోజనం నిషేధించారు. అవే ఉపవాస దినాలు. అట్టి ఉపవాసమూ సదాచారంలో భాగమే. ఉప = సమీపే, వాసం = ఉండటం. భగవత్సమీపంలో ఆయన సేవలోనే ఉండటంవలన ఇక భోజనం ఆరోజు ఉండదు. కాబట్టి ఉపవాసమంటే భోజనం చేయకుండా ఉండటమనే అయింది. అది పూర్ణోపవాసం, ఏకభుక్తం అని రెండు విధాలు. ఏకభుక్తం అంటే ఒంటిపూట. అది మరల పగటి భోజనం, నక్తం అనగా రాత్రి భోజనం చేయటం, ఛాయానక్తం అనగా కార్తికమాసంలో సాయంత్రం భోజనం చేయటంగా మూడు విధాల ఉంటుంది. ఏకభుక్తం తమ ఇష్టదైవమును దృష్టియందుంచుకొని ఎక్కువమంది పాటిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు, హనుమద్భక్తులు శనివారం, సాయిబాబా భక్తులు గురువారం, అమ్మవారి భక్తులు శుక్రవారం ఇలా నియమం పెట్టుకొని మధ్యాహ్నం మాత్రం భుజించి రాత్రి ఉపవసిస్తారు. అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, మొక్కుబడి. భగవదనుగ్రహం కోసం పాపపరిహారంకోసం ఆ నియమం పెట్టుకొన్నా అందులో ఆరోగ్యసూత్రం ఇమిడి ఉంది. అలా వ్రతదినాలలో, పర్వదినాలలో కూడా ఉంటారు. భోజనం మాని అంతకు మించి ఉపహారాలు, ఫలాహారాలు తీసికొంటే ఆ పుణ్యానికి, ఈ ఆరోగ్యానికి కూడా అర్హులము కాము.
కార్తికమాసంలో పగలుమాని రాత్రి భోజనం చేయటం ఉంటుంది. నక్షత్రదర్శనం అయ్యాక భోజనం చేయాలి. అది నక్తం. మన నీడ మనకు రెట్టింపు పడే సాయంసమయంలో భోజనం చేస్తే అది ఛాయానక్తం. కార్తికమాసంలో కఫవికారా లెక్కువగా ఉంటాయి. అలాగే జఠరదీప్తి తగ్గి ఉంటుంది. ఆరోజులలో పగలు తినకుండుట ఆరోగ్యకరం. అందుకే నక్తం, ఛాయానక్తం ఏర్పరచి మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే మార్గం మన మహర్షులు చూపారు. ఆమావాస్య వంటి పితృతిథులందూ ఏకభుక్తం చేస్తాము. గ్రహణ, సంక్రమణ, జయంతులందూ ఉపవసించటం ఉంది. ఇంద్రియనిగ్రహానికి, మనః ప్రశాంతతకు అప్రమత్తస్థితికి కూడ ఉపవాసాలు దోహదపడతాయి. “తపము లేదు ఉపవాసవ్రతముకంటె” అని ఉపవాసము గొప్ప వ్రతంగా చెప్పబడింది.
ఏకాదశి, నాగులచవితి, మహాశివరాత్రి, జయంతులు వంటివి పూర్ణోపవాస దినాలు. అంటే రోజంతా భోజనం చేయకుండా ఉండేవి. విష్ణుప్రీతికరమయిన ఏకాదశి మహిమకు అంబరీషోపాఖ్యానము, రుక్మాంగద చరిత్ర వంటి పురాణగాథలు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఏడాదిలోని 12నెలల శుక్ల, బహుళ ఏకాదశులకు ప్రత్యేకనామాలు, ప్రత్యేకవిధానాలు ఉన్నాయి.
ఉపవాసాల విలువ గ్రహింపక పోవటంవల్ల, ఉపవాసం పేరుతో ఉపాహారాలు ఎక్కువ చేస్తూ ఉండటంవల్ల కొందరు వీనిని విమర్శిస్తారు. కాని ఉపవాసం మానవదేహంలోని జీవ, జీర్ణ వ్యవస్థని ఉత్తేజపరచి పునరుజ్జీవాన్నిస్తుందని సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ సంస్థ (CMB) జరిపిన తాజా పరిశోధనలలో వెల్లడయింది. ఉపవాసం ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని, కొత్తజీవితాన్నిస్తుందని ముదుసలితనం కూడా త్వరగా రాదని తమపరిశోధనలో వెల్లడయినట్లు ఆ పరిశోధన బృందం ఛీఫ్ డా|| పి.డి. గుప్తా చెప్పినట్లు 10.8.1998 ఈనాడులో వచ్చింది. చంద్రాకర్షణచే సముద్రమునందు ఆటుపోటులు వచ్చినట్లు మనదేహమునందు ఆ యా కాలాలలో చంద్రుని ప్రభావం పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన దేహంలో 68 శాతం నీరే. కాన దానిపై చంద్ర ప్రభావం ఉంటుంది. ఏకాదశికి చంద్రుని ప్రభావం ఉదరస్థానంలో ఉంటుంది. కాబట్టి ఆనాడు ఉపవసించటంవలన జీర్ణశక్తి దెబ్బతినక, జఠరాగ్ని చల్లపడక, కఫవికారాదులేర్పడక ఆరోగ్యం చేకూరుతుంది. లేకున్న దాని ప్రభావం ఉదరంపై తప్పక ఉంటుంది. కాని మనం గుర్తించక వేరే కారణాలు చెప్పుకొంటాము. అనేక కారణాలవల్ల మన శరీరంలో విషతుల్య పదార్థాలు చేరుతూంటాయి. దేహంలో పేరుకొన్న అట్టి విషతుల్య పదార్థాలన్నీ ఉపవాసంవల్ల తొలిగిపోతాయి. మనస్సు, ఇంద్రియాలను నియంత్రణలో పెట్టటానికి మిక్కిలి తోడ్పడేది ఉపవాసం. భోజన నియమాలలో ఉపవాసం కూడా పాటించి తీరవలసినది. దీనిని కూడ మహర్షులు మూఢంగా చెప్పలేదు. 8 ఏళ్ళలోపువారు, 80 ఏళ్ళు దాటినవారు ఉపవాస నియమం పాటింప నవసరంలేదనటాన్ని గ్రహించాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹