దాంపత్యం
ఇది రాత్రి భోజనానంతర కర్తవ్యం. వివాహముయొక్క లక్ష్యం ఉత్తమ సంతానాన్ని కనటం. అందుకే భార్యాభర్తలు చేయు ప్రయత్నము కూడా సదాచారంలో భాగమే. పురుషునికంటె స్త్రీ చిన్నది అయి ఉండుట ఇర్వురకు ఆరోగ్యకరము, సుఖకరము. కాకున్న దినదినము ఆయుఃక్షీణముగా చెప్పబడినది. స్త్రీ పురుషుల కలయిక విధానం బట్టి సంతానం యొక్క మంచి చెడులుంటాయి. సంధ్యా సమయమున కైకశి, విశ్రవులు కలిసినందున రావణుడు రాక్షసుడైనాడు. సమయజ్ఞానంతో పరాశరమహర్షి అప్పటికి లభ్యమయిన చేపలుపట్టుజాతి కన్యను పొందినా సద్గురువు వేదవ్యాసుడు జన్మించాడు. శాస్త్రము ధర్మపత్నిని ఋతుసమయమునందే కలియవలెనని, బహుళ అష్టమి, చతుర్దశి, అమావాస్య, సంక్రాంతి, పూర్ణిమ, వ్రతదినాలు, శ్రాద్ధదినాలలో కలవరాదని, రజస్వల అయినది, ఇష్టములేనిది, రోగబాధతో, గర్భభారంతో ఉన్నది, ముదుసలియైనది అగు భార్యను కూడా బలాత్కారము చేయరాదని చెప్పింది. బహిష్టు స్త్రీ సంగమంవలన ప్రజ్ఞ, తేజస్సు, బలము, చూపు, ఆయువు నశిస్తాయని ధర్మశాస్త్రం చెప్తున్నది. పరస్త్రీని పొందుట సర్వ విధముల అనర్థములకు మూలము.
”మరణం బిందుపాతేన, జీవనం బిందు రక్షణాత్”
అని బ్రహ్మచర్యపాలనము ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అతి మైథునం రోగకారణంగా చరకుడు చెప్పాడు. దీపం లేకుండా రమించటం జన్మజన్మల దారిద్య్ర హేతువుగా చెప్పబడింది.
”దివా జన్మ దినే చైవ”
అని హేమాద్రికారుడు పగటిపూట, పుట్టిన రోజునాడు కలియరాదన్నాడు. రాత్రిపూట స్త్రీల నోరు పవిత్రమని, కాన చుంబనం చే ఉచ్ఛిష్టదోషం రాదని శంఖుని మాట.
బ్రహ్మచర్యం పాటించవలసిన ఏ వ్రతదీక్షాది నియమాలను భార్య అనుమతి లేక భర్త, భర్త అనుమతి లేక భార్య సంకల్పించకూడదు. దాంపత్య సుఖలోపం జీవితంలో ఎన్నో వికృతులకు హేతువు. దివాసంభోగం నిషిద్ధము.కాని చిరకాలం దూరంగా ఉన్న దంపతుల కలయికను శాస్త్రం అంగీకరించింది. రోజులో ఒక్కసారే కలవాలి. సంభోగానంతరం విడిగానే శయనించాలి. ఉదయం సచేలస్నానం చేయాలి. పురుషులు శిరస్నానమే చేయాలి. స్త్రీలు తలకు నూనె రాసుకొని పసుపుతో కంఠస్నానం చేసిన చాలు. వ్రతము, ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు స్త్రీలుకూడా శిరస్నానం చేయాలి.
“త్రిభి స్త్రీభి రహోరాత్రైః సమీయాత్ప్రమదాం నరః”
అని అన్ని ఋతువులలో మూడురోజుల కొకసారి, గ్రీష్మఋతువులో 15 రోజుల కొకసారి కలవాలని వైద్యశాస్త్రం చెప్పింది. స్త్రీ సంతతి కోరే దంపతులు ఋతుస్నాత అయిన పిదప బేసి దినములందు కలవాలని చరకుడు చెప్పాడు. పిల్లలు, పెద్దలను గమనించి మధ్యరాత్రమున భయరహితులై సుఖ శయనమున కూడాలి. కోపంతోను, భయంతోను, దుఃఖంతోను ఉన్న ఆమెను కూడరాదని; ఆమె, తాను ఆకలిదప్పులతో ఉండగా కూడరాదని, ఎక్కుగా తిని కూడ కూడతగదని వాత్స్యాయనుడు చెప్పాడు. సముచిత దాంపత్య సాంగత్యంచే ఉభయులకు ఆయురారోగ్యాలు, సుఖము చేకూరుతాయి. అనుచిత వ్యవహారంచే ఉభయులకు నాడీరోగములు, జననేంద్రియ రోగములు, మానసికరోగములు, అకాల వార్థక్యము, అర్ధాయుష్షు ఏర్పడుతాయి. భార్యాభర్తలు సాంసారిక జీవితమున సదాచారము పాటించటం ద్వారా ఉత్తమ సంతానం పొంది దేశమును, ధర్మమును కాపాడగలరు.
నిద్ర
పగలల్లా శ్రమపడిన దేహం, మనస్సు అలసి విశ్రాంతి తీసుకొంటాయి. అదే నిద్ర. శారీరక, మానసిక ఆరోగ్యాలు రెంటికీ నిద్ర ముఖ్యం. నిద్ర అవసరమగునంత పోయినప్పుడే మరుసటి దినమందు అన్ని కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించుకొనగలం. ఏడుగంటలు నిద్రించుట అన్నివిధాల మేలు. రోజూ ఆరుగంటల కంటె తక్కువ నిద్రపోతే గుండెజబ్బులు వస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వలన రైతు నుండికూలీదాకా, టీచర్ల నుండి డాక్టర్లదాకా, పైలట్ల నుండి డ్రైవర్ల దాకా అందరి పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. నాలుగు దేశాల్లో 1,11,205 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు 2019 నవంబరు 23 ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
నిద్ర తక్కువ ఎంత అనర్థమో ఎక్కువ నిద్రించుటకూడా అట్లే అనర్థం. పగటి నిద్ర తగదు. దానివలన కఫం వృద్ధి అవుతుంది. పుణ్యం నశిస్తుంది. రాత్రి మేల్కొన్నవారు, ఉపవాసం ఉన్నవారు, పగటి నిద్ర అవసరమయిన ఆరోగ్య స్థితి ఉన్నవారు నిద్రింపకున్న వాతప్రకోపం జరుగుతుంది కావున వారు పగలు నిద్రింపవచ్చు. జ్వరపీడితులు, పసిపిల్లలు, వృద్ధులు తప్ప సామాన్యులు పగలు నిద్రించుట మంచిదికాదు. వ్రణబాధితుడు పగలు నిద్రించటంవల్ల త్రిదోషప్రకోపము, జరిగి వ్రణబాధ పెరుగుతుంది. రాత్రి నిద్రపోనివారు పగలు భోజనం చేయకముందే నిద్రించుటవలన పగటినిద్రవలని దోషాలు కలుగవు. వాతావరణము, శయనము, మనసు అనుకూలం గావించుకొనటంవలన దుస్స్వప్నాదిక బాధలు లేక సుఖనిద్ర లభిస్తుంది. స్వగృహంలో తూర్పుదిక్కునే తలపెట్టుకొని పడుకొనటం మేలు. గ్రామాంతరాలలో పడమటిదిక్కు తల పెట్టవచ్చు. అత్తవారింట దక్షిణదిక్కు తల మేలు. ఉత్తరదిక్కు తల పెట్టి ఎప్పుడూ పడుకోకూడదు. అలా మన పెద్దలు నియమించటంలో ఎంతో వైజ్ఞానిక విశేషం ఇమిడిఉంది. విద్యుదయస్కాంత తరంగాలు ఎప్పుడూ దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటాయి. మన తలవెంట్రుకలలో రాగిలోహం ఉంటుంది. కాబట్టి విద్యుత్తు సులభంగా ప్రవేశంగల వెంట్రుకల కొనలు అభిముఖంగా ఉండటం శారీరకంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని గ్రహించిన మన ఋషులు అదంతా వివరించుట అసాధ్యం కాన పురాణకథల నెపంతో ఉత్తరదిక్కు తలంబిని నిషేధించారు. పడుకొన్న వెంటనే వెల్లికిల 10 శ్వాసల కాలం ఉండి, కుడిప్రక్కకు తిరిగి 20 శ్వాసల కాలం ఉండి, అనంతరం కనీసం ఆహారం జీర్ణమయేదాకా అయినా ఎడమవైపు తిరిగి పడుకొనవలెనని పెద్దలు తెల్పారు. అలా వారు పల్కటంలో ఎంతో విశేషం ఉంది. జఠరాగ్ని ఎడమ ప్రక్క నుండటంవల్ల ఆహారం జీర్ణం కావటానికి, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరగటానికి ఉపకరిస్తుంది.
“వామశాయీ ద్విభుంజానో షణ్మూత్రో ద్విపురీషకః
అల్ప మైథునమే వాపి శతవర్షాణి జీవతి”
అని ఎడమవైపు ఒత్తిగిలిపడుకొనటం, రెండుపూటలే భోజనం చేయటం, రోజులో ఆరుమార్లు మూత్రవిసర్జన, రెండుపూటల మలవిసర్జన చేయటం, అల్పమైధునముతో నుండువారు నిండునూరేళ్ళు బ్రతుకుతారని చెప్పబడింది. దుస్స్వప్నములు కల్గినప్పుడు కాళ్ళు కడిగిగొని దైవస్మరణ చేయాలి. అడుగడుగునా మన వర్తనకు మార్గదర్శనం చేశారు పెద్దలు. వాని నన్నిటినీ అంతరార్థాలు గ్రహించి ఆచరించటంవల్ల మూఢాచారులం కాక సదాచారులం అనబడతాము. సుదీర్ఘకాలంలో స్వార్థపరుల కారణంగా కొన్ని దురాచారాలు, మూఢాచారాలు చోటుచేసికొనటం సహజం. వానిని పరిహరించుకొంటూ సదాచారాలనే అనుసరించాలి. నిద్ర విషయంలో చాలా నియమాలు చెప్పారు.
పాడుపడిన ఇంటిలో ఒక్కడుగా నిద్రపోరాదు. తడి కాళ్ళతో పడుకొన కూడదు. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోవటం మహాపాపంగా చెప్పబడినది.
”రాత్రైచ వృక్షమూలాని దూరతః పరివర్జయేత్”
రాత్రులందు చెట్లక్రింద ఉండరాదని శాస్త్రం చెప్పింది. వృక్షములు రాత్రివేళల శ్వాసప్రక్రియ ద్వారా కార్బన్డేయాక్సైడ్ వదులుతాయి అనే వైజ్ఞానికశాస్త్ర విషయం పై నియమాన్ని సమర్థిస్తున్నది. నిద్ర అగ్నిదీప్తిని కల్గించి, అలసటను తగ్గించి, ధాతు సమత్వం కల్గించి, తంద్రను పోగొట్టి, పుష్టిని, ఉత్సాహాన్ని కల్గిస్తుందని భావప్రకాశం చెప్తోంది. నగ్నంగా పడుకొనటం, ఇతరుల పాన్పులపై పడుకొనటం, విరిగిన మంచంపై పడుకొనటం, ఎత్తుపల్లాలుగల శయ్యపై పడుకొనటం అనారోగ్యకరము, దోషము. రాత్రులందు జలపాత్రను తలకడదిక్కున ఉంచుకొని నిద్రించాలి. అది దాహం వేసినప్పుడు త్రాగటానికే కాక మంగళప్రదం కూడా. దైవ మందిరాలలో, శ్మశానంలో నిద్రించకూడదు. నోటిలోని తాంబూలం వంటివి ఉమ్మేసి నోరు శుభ్రంగా కడిగికొని నిద్రించాలి. గ్రీష్మఋతువులోను, అనారోగ్యంలోనూ తప్ప పగటి నిద్ర పనికిరాదు.
అగస్త్యః మాధవశ్చైవ ముచికుందో మహాబలః
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః||
అని ఈ శ్లోకంలోని సుఖశయనం చేసిన అగస్త్యుడు, మాధవుడు, ముచికుందుడు, కపిలుడు, ఆస్తీకముని అను వారిని స్మరించి నిదురించాలని పెద్దలు చెప్పారు. ఇష్టదేవతకు, దిక్పాలకులకు నమస్కరించి శయనించాలి.
జీవితంలోని ఒడిదుడుకులు అన్నిటినుండి రక్షణ కల్గించగలది నిద్రయే. అట్టి నిద్ర తక్కువ అయినా అనారోగ్యమే. ఎక్కువ అయినా అనారోగ్యమే. అతి నిద్రవలన బద్ధకము, అగ్నిమాంద్యము, సోమరితనము, అలసత్వము ఏర్పడుతాయి. సుఖనిద్రవలన శరీరం ఎంతో శక్తిని కూడదీసుకొంటుంది. ఇలా నిద్ర అనేది దేహశక్తులను కూడదీసే ఒక అమృత ప్రక్రియ. తగినంత శారీరకశ్రమ, మితమయిన మంచి భోజనము, తగినన్ని నీరు త్రాగుట అనే మూడింటివలన మంచినిద్ర పొంది ఆరోగ్యం సాధించుకొనగల్గుతాము. అలాకాక అక్రమమయిన ఆహార, పానీయ, శ్రమలవలన నిద్ర సుఖమును కాని, బలమును కానీ ఈయజాలదు. దాని ప్రభావం నిత్య జీవితంపై వికృతంగా పడుతుంది. సంతృప్తిగా రాత్రియందు నిద్రించినవాడే పగలు సంతృప్తిగా కర్తవ్యాలు నెరవేర్చుకొనగల్గుతాడు. వేకువను నిద్రలేచాక మరల పడుకోకూడదు.
ఆహారంతో బాటు నిద్రకూడ అన్ని ప్రాణులతో మనుష్యునకు కూడా సమానం. భగవదిచ్ఛతో అవి ప్రవర్తిస్తాయి. కాబట్టి వాటి చర్య క్రమబద్ధంగానేఉంటుంది. కాని స్వేచ్ఛతో ప్రవర్తించే మనుష్యుడే ఆ విషయంలో తెలిసికొని ప్రవర్తించవలసి ఉంది. కాళ్ళు కడిగికొని కాళ్ళు, చేతులు, ముఖము బాగా తుడుచుకొని పొడిగా ఉంచుకొనే ఒక్కమారు భగవద్ధ్యానం చేసుకొని పడుకోవాలి.
“రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరే న్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి||”
అని చదువుకొని పడుకోవటం వలన దుస్స్వప్నములు రావని పెద్దలు చెప్తారు. ధర్మశాస్త్రాలు రెండుజాములు అనగా రాత్రి పదిగంటలనుండి తెల్లవారుజామున నాల్గుగంటలవరకు నిద్రపొమ్మని చెప్పాయి. అది సాధారణ ఆరోగ్యవంతులకు అవసరమయిన నిద్ర. బాలురు, వృద్ధులు, శ్రామికులు, రోగులు వారి వారి అవసరము బట్టి అధికంగా నిద్రించవచ్చు. రాత్రిభోజనానంతరం కొంత వ్యవధి ఇచ్చి నిద్రించాలి. కావున అందుకు తగినట్లుగా రాత్రి భోజనం చేయాలి. నిద్రవలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి దేహపుష్టి, ఉత్సాహము, జఠరదీప్తి, ధాతు సామ్యము, సర్వేంద్రియ సామ్యము, వీర్యపుష్టి, సుఖము, బడలిక తీరుట, బుద్ధిబలము, కాంతి, ఆరోగ్యము మొదలైనవి. నిద్ర లేకపోవుటవలన ఉష్ణము, నేత్రవ్యాధులు, బడలిక, అజీర్ణము, బలక్షయం, బుద్ధిబలక్షయం, రోగం, నరాల బలహీనత ఏర్పడుతాయి. నిశాచర ప్రవృత్తి అనేకరీతుల అనర్ధదాయకం. హఠాత్తుగా నిద్రాభంగం జరుగరాదు. దానివలన భ్రమ, ఒళ్ళునొప్పులు, తల బరువు, ఆవులింతలు, బలహీనత, బడలిక, అజీర్ణం, సోమరితనం, త్రిదోష ప్రకోపం జరుగుతాయి. ఫోనువచ్చి హాఠాత్తుగా లేచుట ఈ కాలంలో ఎక్కువగా జరుగుచున్న అనర్థము. మనసును ప్రశాంతముగ ఉంచుకొనటం నిద్ర కవసరం. సదాలోచనవల్ల సుఖనిద్ర పడుతుంది. అసూయ, కామములవలన నిద్ర రాదు. శ్రమచేయటం, అభ్యంగస్నానం చేయటం మంచి నిద్రకు ఉపకరిస్తాయి. స్వభార్య, పుస్తకము, జపము అనేమూడు నిద్రకల్గించేవని, పరాంగన, జారత్వం, చోరత్వం, అనే మూడూ నిద్రను రానీయనివని పెద్దలు చెప్పారు. సదాచారపరుడై మంచి మనస్సుతో ఉన్నవాడు నిశ్చింతగా సుఖనిద్ర పోగలడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹