స్త్రీ సదాచారము
పురుషులకంటె స్త్రీల భిన్నత ప్రథమ రజస్వల, బహిష్ఠు, ప్రసవము అనే వానియెడ ఉంటుంది. వాటి విషయంలో సదాచారం పాటించటం స్త్రీ విషయంలో ముఖ్యమైనది. ఆడపిల్లగా శారీరకమయిన మార్పులు పొందే ముఖ్యమయిన సమయం రజస్వల అవటం. మానసికంగా కూడ అప్పటినుండి పరిణతి ఉంటుంది. తల్లి తన కుమార్తెకు ముందుగానే దానినిగూర్చి అవగాహన ఇవ్వాలి. పరాయిచోట ప్రథమరజస్వల అవటంవల్ల జీవితంలో కొన్ని చెడులకు అవకాశం ఉంటుందని చెప్తారు. అనుభవములో కూడా అది యథార్థమనటానికి నిదర్శనాలున్నాయి. కాన ఆ కాలంలో వీలయినంతవరకు తల్లిదండ్రులకడ స్వగృహంలో ఉండేటట్లు చూడాలి. పిల్లకు అవగాహన కల్గించటంవల్ల వెంటనే తల్లికి చెప్పటం, తగు జాగ్రత్తలు తీసికొనటం జరుగుతుంది. అలాగే సరియైన సమయాన్ని గ్రహించి సమయ దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకొనే అవకాశం ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, లగ్న, వర్జ్య, దుర్ముహూర్త దోషములు ఉంటే వాటికి తగిన పరిహారం చేసికొనాలి.
రాత్రిపూట అయినప్పుడు రాత్రి ప్రొద్దు మూడుభాగాలు చేసి మొదటి రెండు భాగములు క్రిందటిరోజుగాను, మూడవభాగంలో జరిగితే మరుసటి రోజుగాను పరిగణించాలి. ఆసమయంలో చినిగిన వస్త్రాలు, అశుభ్రవస్త్రాలతో ఉండటం మంచిది కాదు. కాబట్టి ఆకాలంలో మంచి వస్త్రాలు ధరింపజేస్తూ ఉండాలి. అందునా తెల్లటి వస్త్రాలు శుభప్రదం. ఆరోజులలో పథ్యము చాలా ముఖ్యము. అప్పటి అజాగ్రత్త జీవితాంతము ప్రభావం చూపుతుంది. కాబట్టి విధి నిషేధాలు తెలిసికొని ఆహారం ఇవ్వాలి. పులగము, బెల్లము, బెల్లముతో చేసిన పిండివంటలు ఆరోజులలో పెడతారు. అది ఆచారము కాదు. ఆరోగ్యము. ఆరోజులలో వాతం చేయకూడదు. కాబట్టి వేడిచేసే పదార్థాలు అలా వాడతారు. పాలు వాడవచ్చు కాని మజ్జిగ వాడకూడదు. ఆ నాల్గు రోజులు పరగడుపున మంచి పసుపుతో చిన్న ఉండలు చేసి తినిపించాలి. పుసుపు గుణం చాలా గొప్పది. అందులో శుచి, ఆరోగ్యంరెండూ ఉన్నాయి. అందుకే స్నానం రోజున పసుపు రాసుకొని స్నానం చేయటం, కథ చెప్పిన పసుపునీళ్ళు ఆమె వాడిన వస్తువులన్నిటిపై చల్లటం చేయించాలి. నాల్గవరోజు అట్లబంతి పెట్టటం, ఆరోజు తప్పక కంద బచ్చలి కూర చేయటం జరుగుతుంది. అదికూడా ప్రథమ రజస్వల అయిన అమ్మాయి ఆరోగ్యమును దృష్టియందుంచుకొని ఏర్పరచిన నియమమే. ఆ నాల్గవనాడు పసుపు, నువ్వులు నేతితో కల్పి మూడు ఉండలు తింటే నాభి శీతలం పోతుంది. ఆ దశలో శీతవాత దోషములు తగిలే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకారి అవుతుంది. అటువంటి సమస్యలేవీ రాకుండా ఆ నియమాలేర్పరచారు.
హిందూ ఆచార వ్యవహారాలు స్త్రీని దూరం పెట్టాయి అని విమర్శిస్తూ ఉంటారు. నిజానికి ముట్టు దోషం ఇతర మతాలు కూడా అంగీకరించాయి. పూజాపురస్కారాలు, జపతపాలు వంటి ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాలన్నిటి విషయంలో ముట్టువారిని తాకటం, దగ్గరకు రానివ్వటం దోషంగా మన శాస్త్రాలు చెప్పాయి. ఆధ్యాత్మిక గ్రంథాలేకాదు చాణక్యుడు తన అర్థశాస్త్రంలోకూడా ఋతుకాలాన్ని దాచిన స్త్రీకి, ఋతుమతి అయిన భార్యను కూడిన పురుషునకు దండన విధించాడు. ధర్మశాస్త్రాలయితే అట్టి స్త్రీలు పుణ్య కార్యక్రమాలలో పాల్గొనటం, వారిని తాకినవారు పాల్గొనటం చాలా పాపంగా చెప్పాయి. హిందూ శోత్రియ కుటుంబాలలో తప్ప ఆ నియమాన్ని ఇప్పుడు ఎవ్వరూ పాటించటం లేదు. కాని దోషమే అని గ్రహించాలి. దుర్గంధపూరితమైన ఋతుస్రావం ఆ మూడురోజులు స్త్రీలనుండి వెలువడుతుంది. అది సక్రమంగా వెడలకుండుటయే స్త్రీల అనారోగ్యాలన్నిటికీ కారణం. అది ఆగినరోజులలోనే స్త్రీలకు మెనోపాజ్ అని అనారోగ్యముల అవస్థలుంటాయి. కాబట్టి అది చెడురక్తమనటం స్పష్టం. దానిని పౌరాణిక గాథలు బ్రహ్మహత్యాపాతకంగా చెప్తున్నాయి. విశ్వరూపుని సంహరించినందువల్ల ఇంద్రుని కేర్పడిన బ్రహ్మహత్యాపాతకాన్ని స్త్రీలుకూడా పంచుకున్నారు. ఆ బ్రహ్మహత్య స్త్రీల ఋతు రక్తమునందు ఉంటుంది.
స్త్రీల రజస్వలా కాలాన్ని “బహిష్టు” అంటారు. అంటే బహిః అంటే బయట స్థ అంటే ఉండటం. ముట్టు అంటే తాకుట అది తగదని ఆ పదాలే చెప్తున్నాయి. ఆ నాల్గురోజులు స్త్రీకి పూర్తి విశ్రాంతి నీయటం ఆమె ఆరోగ్యానికి అవసరం. ఆమె అన్నిటినీ ముట్టుకొనకుండటం మిగిలినవారి ఆరోగ్యానికవసరం. అన్నీ దృష్టియందు ఉంచుకొని ఆరోజులలో దూరంగా ఉండే విధానమును మన పెద్దలు ఏర్పరచారు. ముట్టువారు మంచివారిని తాకటమే కాదు, మరో ముట్టు స్త్రీనికూడా తాకరాదంటే అందలి దోషం గ్రహించవలసి ఉంది. చంటిబిడ్డలను కన్నతల్లి తప్ప మరో ముట్టు స్త్రీ తాకరాదు. ఇటువంటి విషయాలపై చాల పరిశోధనలు కూడా జరిగాయి. ఒక ప్రకృతి శాస్త్ర పరిశోధకుడీ విషయంలో గుర్తించిన రీతి గమనింపదగినది. విదేశీ ప్రకృతిశాస్త్ర పరిశోధకుడు మేడమీద ఉండి క్రింద పూలతోటలో రమ్యంగా ఉన్న ఒక పూవుని చూచి పనిపిల్లతో దానిని కోసుకురమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి అలాగే తెచ్చింది. కాని తాను చూచిన రమ్యత అందులో కానరాలేదు. ఏదో పొరపాటు జరిగిందని మరో పూవు మంచిది చూపి తెమ్మన్నాడు. అదీ అలాగే అయింది. ఎందుకలా అవుతోందా అని విచారిస్తే ఆ అమ్మాయి చెప్పింది. ఇలా తన చేత ఎన్నిసార్లు తెప్పించినా ఆ పూలు రమ్యత కోల్పోతాయని. తాను బహిష్టు అయి ఉన్నానని, ఆరోజులలో ఏపూవు తాకినా అలాగే అవుతుందని చెప్పింది. ఇది నీ విషయంలోనేనా స్త్రీలు అందరివిషయంలో ఇలా జరుగుతుందా? అని ఆ పరిశోధకుడు ప్రశ్నించగా “అందరికీ ఇంతే” అని ఆమె బదులిచ్చింది. అంతట ఆ పరిశోధకుడు అనేక బహిష్ఠు స్త్రీల రక్తం తెప్పించి మామూలు స్త్రీల రక్తంతో పోల్చి తన పరిశోధనలద్వారా స్త్రీల బహిష్టు రక్తంలో ఒకవిధమయిన విషం ఉంటుందని గుర్తించి తెల్పాడు. ఆకాలంలో వారితోడి సంసర్గంవల్ల ఆ విషప్రభావం మగవారిపైకూడా పడుతుందని తెల్పాడు. కాబట్టి బహిష్ఠ స్త్రీలను సాధ్యమయినంత దూరం ఉంచటం అవసరమని చెప్పాడు. రజస్వల (ముట్టు) అయిన స్త్రీ తాకటంవల్ల పదార్థం విషపూరిత మౌతుందని జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1949 అక్టోబరులో వచ్చింది. ఈవిషయం చిరకాలం పరిశోధించిన జర్మన్ , అమెరికా పరిశోధకులు అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసియే మన మహర్షులు వారియెడ నియమాలు చెప్పారు. అవి సమాజ శ్రేయస్సుకోసం ఏర్పరచినవే అని గ్రహించాలి. అత్యంతము ప్రేమించే తన భార్య, కుమార్తెల విషయంలో వారు ఆ నియమాలు పాటిస్తున్నారంటే అది ఏ ద్వేషంతోనూ కాదని, అందరి శ్రేయః కాంక్షతోనే అని గ్రహించాలి. స్త్రీలు బహిష్టు నాలుగు రోజులు ఎట్టి వ్యాయామం చేయరాదు. అలాగే గర్భవతులు 4వ నెల తర్వాత, పురుడు వచ్చిన అనంతరం నాలుగు నెలలు గడిచేదాకా క్రమంగా తగ్గిస్తూ ఆపాలి.
ఈ విషయంలో పరాశర స్మృతి ”పతితునకు ఒక బారెడు దూరంలోను, బహిష్ఠయైన స్త్రీకి రెండు బారల దూరంలోను, ప్రసవమయిన స్త్రీకి మూడు బారల దూరంలోనూ ఉండాలని తెల్పింది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు బహిష్ఠ స్త్రీల విషయమై ధర్మరాజుతో చెప్పిన వృత్తాంతంచే బహిష్ఠ స్త్రీలు ఇంట్లో అన్ని వస్తువులను తాకి యింటిని దోషగ్రస్తం చేయుటవల్ల వారు అనంతరం ఎటువంటి దుస్థితులు పొందుతారో తెలుస్తుంది, కాబట్టి బహిష్ఠ స్త్రీలగూర్చి మహర్షులు చెప్పిన సదాచారం పూర్తి విజ్ఞానశాస్త్ర సమ్మతం. ఇందుకు కొన్ని పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు కూడా వారే చెప్పారు. ఈ విషయంలో తెలియక జరిగిన పొరపాట్లకు ఋషిపంచమి వ్రతం, లక్షవర్తి వ్రతం చెప్పబడ్డాయి. స్త్రీల ఋతుదోష పాపం సేతుస్నానంవల్ల కూడా పోతుంది. పెద్దవారయాక రామేశ్వరం వెళ్ళిన అక్కడ ఋతు సంబంధమయిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిపిస్తారు. ముట్టు స్నానము, బాలెంత స్నానము వంటివి సూర్యోదయం అయిన పిదపనే చేయాలి. అప్పుడే దోష పరిహారము. ధర్మ కార్యాలు, దైవకార్యాలు బహిష్ఠ అయిన స్త్రీలు చేయకుండా ఉండటమే కాక చేసేవారిని తాకటంకూడా చేయరాదు. కాబట్టి తగినంత దూరములో ఉండాలి. ఐదవ రోజు స్నానం చేసిన తరువాతే వారు అన్ని పుణ్యకార్యాలు చేయటానికి అర్హత పొందుతారు. గంగ కూడా తీసికొంటే పూర్తి పవిత్రతయే.
గర్భవతిగా ఉన్న కాలంలో కూడా స్త్రీకి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. గర్భధారణ తరువాత ఐదవమాసం వచ్చేదాకా వేడిచేసే పదార్ధాలు తినకూడదు. నువ్వులతో చేసిన పదార్ధాలు, బొప్పాయికాయ వంటివి తినరాదు. అందువలన గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు నదీస్నానాలు, సముద్రస్నానాలు, కొండలు ఎక్కటాలు చేయకూడదు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణములలో జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహణ తేజస్సు ప్రభావం అపరిపక్వ దశలో ఉన్న శిశువుపై పడితే ఆయా అవయవభాగాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీస్రీలను బయటకు రానీక పరుండబెడతారు. గ్రహణసమయంలో వ్యాపించే ఒక విధమయిన బాక్టీరియా, గర్భస్థంగా ఊరే రసాలుకూడా గర్భస్థ శిశువుకు ఇబ్బంది చేస్తాయి కాన ఆ జాగ్రత్తలు అవసరం. గర్భిణులు కొబ్బరికాయలు కొట్టటం, ముత్తయిదువులకు పండ్లు తమ చేతులమీదుగా ఈయటం, శంకుస్థాపన చేయటం, చెట్లు, మొక్కలు పీకివేయటం చేయరాదు. ఉపనయనంలోని కొన్ని మంత్రాలు, స్నాతకమందలి మంత్రాలు వినకూడదు. కాబట్టి అవి వినబడని దూరంలో ఉండటం మంచిది. గృహప్రవేశ సమయంలో చేసే కూష్మాండబలి అంటే గుమ్మడికాయ పగులగొట్టటము చూడకూడదు. వివాహసమయంలో బలిమంత్రాలు, సూర్యనమస్కారాల అరుణంలోనివి కొన్ని మంత్రాల ప్రభావం గర్భస్థ శిశువుపై పడి వారికి కీడు కల్గిస్తుంది. కాబట్టి అట్టివానికి గర్భిణీస్త్రీలు దూరంగా ఉండాలి.
“నాతిచరామి” అని భర్త చెప్పాడు కాబట్టి అది పాటించాల్సినది ఆయనే అనుకోకూడదు.
”నాతిచరే త్రికరణయా భర్తారం”
అని గౌతమ మహర్షిచెప్పారు. కాబట్టి స్త్రీ కూడా మనసా, వాచా, కర్మణా భర్తను అతిక్రమించకూడదు. 1840 లో ఫక్కి లక్ష్మీనరసింహకవి రచించిన కుమారీశతకం అంతా స్త్రీల సదాచారాన్ని తెల్పేది. ఒకప్పుడు ప్రతి బాలికచేతా దానిని చదివించేవారు. పెనిమిటి వలదని చెప్పిన పనియెన్నడు చేయరాదు” అని మొదలుగా అందు తెల్పిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. అందరిచే కొనియాడబడేటట్లు అత్తమామలకు, భర్తకు సేవ చేయాలి. బిగ్గరగా మాట్లాడటం, నిందావాక్యాలు పల్కటం తగదు. పెద్దలు వచ్చినపుడు ఆసనంనుండి దిగాలి. చెడుమార్గాన పోయే భర్త మనస్సు మంచిగా మార్చగల్గాలి. పుట్టినింటికి, మెట్టినింటికి వన్నె తేవాలి. భర్త దీనుడైనా, రాజ్యహీనుడైనా నాకు నా భర్తయే గొప్పవాడని సీత అన్నట్లు ఉండాలి. మృతియైనా బ్రతుకైనా పతితోనే సతికి చెల్లు పతిబాసిన ఆ బ్రతుకొక బ్రతుకా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు బంగారంతో తులతూగుతున్నా వారి యింట స్త్రీ కలకాలం ఉండటం మర్యాద కాదు. భర్త ఏమీ అనటంలేదుకదా! అని చెడుపనులు చేయకూడదు. నీ కిష్టమయిన పనులు చేస్తున్నారని పనివాళ్ళకు ఎక్కువ చనువు ఈయవద్దు. సంధ్యాసమయంలో నిద్రపోవద్దు. దానిచే దరిద్రం ప్రాప్తిస్తుంది. వేకువజామున లేచి పాచిపనులు చేసుకో. వీధి గుమ్మంవద్ద నిలబడి ఉండక. కులదేవతలను పూజించు. అతిగా నవ్వకు. వేళాకోళం, గయ్యాళితనం, చాడీలుచెప్పడం, తగాదాలు పనికిరావు. ఎన్ని నగలున్నా పసుపు కుంకుమలు వానికి మించినవే. వడ్డనలో భేదభావాలు చూపక. ఇల్లు, ఒళ్ళు, బట్టలు, తల అపరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకొనక. అసత్య మాడకు. కష్టములకు చలింపకు. అతిథులను కాదనకు. వస్త్రాభరణములను ఎరువు తెచ్చుకోకు. తగువులాడుకొనే ఇంటికి లక్ష్మి రాదని గ్రహించు. నీ భర్తకు మంత్రివలె సలహాలిస్తూ, రంభవలె సుఖాన్నిస్తూ, దాసివలె సేవ చేస్తూ, తల్లివలె తృప్తిగా భోజనం పెడుతూ, భూదేవివలె ఓర్పుతో జీవించు. దీపపు నీడలో, మనిషినీడలో, మంచపు నీడలో, తాడిచెట్టు నీడలో ఎప్పుడూ నిలబడకు. తలవెంట్రుకలనుండి నీరు జారి ఇంట్లో పడనీకఅని ఇలా సకలశ్రేయస్సులు, యశస్సులు పొందటానికి కావలసిన సదాచార మంతా చెప్పబడింది.
స్త్రీల ఆభరణధారణ కూడా సదాచారంలో భాగమే. శరీరంపై బంగారం ధరించుటే కొన్ని చిన్న చిన్న దోషాలను నివారిస్తుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. బంగారంనుండి నీరు స్నానసమయంలో శరీరంపై పడుట ఆరోగ్య, బలములు చేకూరుస్తుంది. మంగళసూత్రాలయినా తప్పక శరీరంపై ఉండి అలా ఉపకరిస్తాయి. బంగారం శరీరపు ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. గర్భోత్పత్తికి కూడ సహాయకారియౌతూ గొడ్రాలితనం తొలగిస్తుంది. ఆభరణాలలో పొదిగే రత్నాలు అందానికే కాక గ్రహదోషాలూ పోగొట్టగల్గుతాయి. ఉంగరపువ్రేలని ప్రత్యేకంగా చిటికెన వ్రేలు ప్రక్కన చెప్పబడింది. దానినుండి ఒక ప్రత్యేక రక్తనాళం నేరుగా హృదయానికి పోతుందని, దానికి ఉంగరం ధరించటం మేలని చెప్తారు. బంగారానికి అనేకశక్తు లున్నాయి. బుద్ధివికాసానికి, దేహకాంతికి, పుష్టికి, నేత్రహితానికి, విషహర, ఉన్మాదహరములకు విశేషించి స్త్రీల ఆర్తవదోషములకు ఉపకరిస్తుంది. కాలిమెట్టెలు స్త్రీత్వం పెంపొందించేవే కాక
”కామం చాష్టగుణం”
అన్న శాస్త్రం ప్రకారం పురుషునికన్నా ఎనిమిది రెట్ల కామం స్త్రీకి ఉన్నను మెట్టెలు వారికి తగినంత నిగ్రహశక్తి నిస్తాయి. అవి మాంగళ్యమగుటే కాక జననేంద్రియ వ్యాధులు రాకుండా కూడా చేస్తాయి. కంఠాభరణాలు శోభకు, హృదయవ్యాధులనుండి రక్షణకు ఉపకరిస్తాయి. అడ్డబేసరి అనబడే ముక్కెర సంప్రదాయ స్త్రీలకు భర్త చుంబనంవల్ల ఉండే దోషాన్ని పోగొట్టుతుంది. పరస్పర ఉచ్ఛ్వాస నిశ్శ్వాసల దోషాన్ని తొలగిస్తుంది. వడ్డాణము సింహమధ్యలుగా సన్నని నడుముతో ఉండటంలో తోడ్పడుతుంది. సకాలంలోకాక పొట్ట పెరిగిన పిదప చేయించుకొంటే ఆభరణమాత్రంగా సహకరిస్తుంది. వెన్నుదన్నుకు సహకరిస్తుంది. అంతేకాక బొడ్డువద్ద ఉండే మణిపూరకచక్ర మధ్యభాగంలో ఓడ్యాణ పీఠం ఉంటుంది. అక్కడ ధరించిదానిని రక్షించుకొనుటం లక్ష్యం కాబట్టి దాని అసలు పేరు ఒడ్డియాణం. అదే వ్యవహారంలో ఒడ్యాణం, వడ్డాణం అయింది. ఆ పీఠంలో ఉండే శక్తి మహాలక్ష్మి. ఆమెకు పూజవంటిదే ఈసువర్ణాలంకారధారణ. ఒడిబియ్యం, ఒడిలో చలిమిడి పెట్టటం వంటివి తమ బిడ్డకు ఆ లక్ష్మీకటాక్షం చేకూరాలని కూడా. సంపన్న స్త్రీలు ధరించే ఏడువారాల సొమ్ములు కూడా ఆయా వారాధిదేవతలకు చెందిన గ్రహరత్నాలు కలవి కాన గ్రహదోషాలు పోగొట్టి గ్రహానుకూల్యము చేకూరుస్తూ ఉంటాయి.
వివాహ విషయంలో మన శాస్త్రవిధానము ననుసరించి సమున్నత స్థానమే స్త్రీకి ఉంది. అధర్వణవేదమంత్రంలో వరుడు ఓ ప్రియా! జ్ఞానంతో నిన్ను నేను పరిగ్రహిస్తున్నాను. నన్ను నీవు గ్రహిస్తున్నావు. నేను సామవేదమును. నీవు ఋగ్వేదమవు. నీవు పృథివివలె గర్భాది ధర్మం వహించు గృహిణివి. నేను సూర్యునివలె వర్షమును కురిపించువాడను. మన మిర్వురము ప్రసన్నతా పూర్వకంగా పరిణయమాడుదాం. మన మిర్వురము వీర్యమును వహింతము. సత్సంతానము బడయుదము (అధర్వ, 14వ-2-71) అంటాడు. ఇందు స్త్రీ పురుషునితో సమానస్థాయి కలిగినదే అని స్పష్టంగా తెలుపబడింది. గోభిలీయ గృహ్యసూత్రంలో
“న గృహం గృహమిత్యాహుః – గృహిణీ గృహ ముచ్యతే తయా
హి సహిత స్సర్వాన్ – పురుషార్థాన్ సమశ్నుతే”
అని గృహము అంటే అసలు గృహిణియే అని, ఆమెతో కలిసియే పురుషార్థా లన్నిటినీ అనుభవిస్తాడు అని దాని అర్థం. అలా భార్యాభర్తలు అనివార్య సహాయకులుగా చెప్పబడ్డారు తప్ప స్త్రీకి తక్కువదనం లేదు. ఆమె తన సదాచారం ద్వారా ఎల్లరకు పూజ్యురాలవుతుంది. అదేవిషయం అధర్వణవేదం చెప్తూ స్త్రీ ఎలా ఉండాలనేది
“మృదు ర్నిమన్యుఃవేవవీ ప్రియవాది న్యనువ్రతా
(అధర్వ 3-23-3) అని మృదుశాలిని, క్రోధంలేనిది, ప్రియంగా మాట్లాడేది, పతివ్రత అయి ఉండాలని స్త్రీ సదాచారాన్ని తెల్పింది.అలా ఆమె ఇంద్రాణిగా, మహారాణిగా ఋగ్వేదాధర్వణ వేదాలు చెప్పాయి. కార్యాచరణలో భేదమున్నా స్త్రీకి మన వైదిక వాఙ్మయము గౌరవస్థాన మిచ్చింది. సదాచారపరురాలు, సత్యపరాయణ అయిన స్త్రీని గూర్చి యజుర్వేదం
”నమో దేవి రిర్న్వతే తుభ్యమస్తు”
అని నమోవాకము లర్పించింది.
భార్యాభర్తలమధ్య అన్యోన్యతకు ఏ రీతిగానూ భంగం కలుగరాదనేదే పెద్దల ఆశయం.
”తావ త్కులస్త్రీ మర్యాదా యావ ల్లజ్జావకుంఠనమ్”
అని స్త్రీకి సిగ్గు అనే ముసుగు ఉన్నంతవరకే కులస్త్రీ మర్యాద ఉంటుందని చెప్పబడింది.
కన్య బ్రహ్మచర్యమును పాటించి యోగ్యురాలుగా భర్తను పొందవలెనని అధర్వణవేదం
“బ్రహ్మచర్యేణ కన్యా యువానం విందతే పతిమ్”
అని చెప్పింది. గృహకృత్యములలో కౌశల్యం సంపాదించుకొని లలితకళలు, సంతాన పాలన పోషణాది విధానాలు, పతివ్రతా ధర్మాలు తెలిసికొని భర్తను పొందాలని చెప్పబడినది.
”ఆర్యమాణందేవా”
అంటూ స్త్రీ తేజస్వియు, ధర్మ స్వరూపుడు అయిన పరమాత్మ నన్ను పితృకులమునుండి విముక్తను గావించి పతికులాన సక్తను గావించుగాక! అని కోరుతుంది. కాబట్టి పుట్టింటి ధ్యాస పరిమితంగా ఉండాలి తప్ప అది ఎక్కువ అయినప్పుడు వివాహబంధము దెబ్బతింటుంది. ఆమె భర్తతోబాటు సత్సంతానము, జవ సత్వ సంపాదన, ధనైశ్వర్య సంరక్షణ, సుఖప్రాప్తి, సంతానపాలన పోషణ, షడృతు ఆనుకూల్యము, భర్తతో స్నేహ సంపాదనలగూర్చి ఏడడుగులు వేసినందున వాని లక్ష్యంతో ఆమె జీవించాలి. స్త్రీకి ఋగ్వేదం సదాచరణను
”అఘోర చక్షుః”
అనే దశమ మండల మంత్రంలో చెప్పినట్లు ప్రణయార్టీభూత సౌమ్య దృష్టికల్గి పశుపక్ష్యాదుల కష్టసుఖాలను కరుణకల హృదయంతో చూస్తూ ఉండాలి. ఉత్తమ సంతతి బడసి సౌభాగ్య సౌమంగళ్యాలతో సుఖించాలి. పరిజనము నాదరించాలి. బంధువులను ఉచితమర్యాదతో సత్కరించాలి. అతిథి అభ్యాగతులను గౌరవించాలి. సదాచారము, సత్కర్మ ప్రవణత కల్గి పతికులమున విశేషసేవ యొనరించి దానిని సుఖమయం చేయాలి. పతికులమే నీకు స్థిరము అంటూ బోధించింది. ఆ రీతిని ప్రవర్తించిన నాడు స్త్రీ అందరికీ పూజ్యురాలవుతుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹