Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹🌹 – ముప్పై తొమ్మిదవ భాగము

సరోవర మహాత్మ్యం

రోమహర్షణుడిట్లనెను :-

పవనకుండంలో స్నానంచేసి మహేశ్వరదర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్రశోకంతోవాయువు అందులో లీనుడైపోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరలప్రతిష్ఠింపజేశారు. అక్కడనుండి దేవగంధర్వులద్వారా హనుమంతుడెచ్చడ ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృతక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడస్నానంచేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కలోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడస్నానంచేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీతటాన ముల్లోకవిఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలోభక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. అక్కడనుండి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిషంలో స్నానంచేసిన ఫలకం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన వేదవతి తీర్థముంది. అక్కడ రావణుడామె కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతనివధార్థం శరీరత్యాగం చేసింది. సీత అనే పేరులో జనకునకుపుట్టి రామపత్నిగా విఖ్యాతివహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించికొనిపోగా రాముడాతనిని వధించి విభీషణుడినిలంకాధిపతిని చేశాడు. ఆ సాధ్విని మరల తనయింటికి గొనిపోయి నాడు. ఆలాంటి పవిత్రవేదవతి తీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలుపోయి కన్యాయజ్ఞఫలం కలుగుతుంది. పరమపదం లభిస్తుంది.

అచటనుంచి బ్రహ్మకు ఉత్తమస్థానమైన క్షేత్రానికిపోవాలి. అక్కడస్నానంచేసినచో నిమ్నవర్ణాలవారు కూడ బ్రాహ్మణ్యంపొందుతారు. పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభమైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సోముడు ద్విజరాజ్యాన్ని పొందాడు.అక్కడ స్నానంచేసి దేవపితృ తర్పణములుచేస్తే పాపరహితుడై కార్తికపూర్ణిమా చంద్రుడిలాంటి స్వర్గాన్ని పొందుతాడు. సుప్రభ కాంచనాక్షి విశాల, మానసహ్రదా, సరస్వత్యోఘనామ సువేణా, విమలోదక అనే సప్తసరస్వతులు ఏకమై ప్రవహించే సప్తసారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగినది. పుష్కర క్షేత్రంలో యజ్ఞంచేస్తున్న బ్రహ్మనుచూచి ఋషులు, నదీ శిరోమణి అయిన సరస్వతిలేనిచోట తలపెట్టిన ఆ యజ్ఞం సత్పలం యివ్వదని వంచింపగా సంప్రీతుడై పితామహుడు సరస్వతిని స్మరించాడు. అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కరక్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మమీది గౌరవంతో వడివడిగావచ్చిన. ఆ సరస్వతినిచూచి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడగు మంకణునిద్వారా కురుక్షేత్రానికి కోనిరాబడినది.

శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షణుని అడిగాడు. ”మేము సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందేమార్గం తెలుపండి, అంతటనా మహానీయుడా ఋషులకు శిరసాప్రణామంచేసి అన్నాడు. సరస్వతీనది ఉన్న ప్రదేశం గొప్పయజ్ఞ ఫలాన్ని యిస్తుంది. అంతట స్వాధ్యాయపరులయిననా ఋషులు ఒకచోటచేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగ నిష్ఠులగువారు ధ్యానించగానే వారల స్నానార్ధం సరస్వతీ వారయజ్ఞ స్థలాన్ని చేరుకుంది. మంకణ మహర్షి ధ్యానించగానే కాంచనాక్షియను సరస్వతి నైమిషంనుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడను రాజు గయలో మహాక్రతువు ఆరంభించి అచటకు నదీశిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలా గయనుచేరిన సరస్వతిని విశాల అంటారు. ఆ సరస్వతే మంకణుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది.

దేవర్షిసేవితమైన ఉత్తరకోశల పుణ్యభూమికి ఉద్దాలకముని ధ్యానించగా సరస్వతివచ్చి చేరింది. అచటనాశ్రేష్ఠ తరంగిణిని వల్కలాజిన ధారులైన మునిసమూహం పూజించినది. సర్వపాపహారిణి అయిన ఆనది మనోహరగా పిలువబడినది. ఆ నది మంకణుని ప్రార్థన నంగీకరించి ఋషులపట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలోఉన్న సరస్వతిని సువేణు అంటారు. ఋషులు సిద్ధులచే సేవించబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్రక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే యజ్ఞదీక్షుతుడైన దక్షునిచేత గంగా ద్వారంలో విమలోదకరూపాన వెలువరింపబడింది. మహాత్ముడైన మంకణుని పిలుపునందుకొని ఆమె కూడా కురురాజు యజ్ఞ స్థలమైన కురుక్షేత్రం చేరుకొంది. మహానుభావుడైన మార్కండేయ మునిస్తోత్రానికి సంతోషించి ఆ పుణ్యోదక సరస్వతి సరోవర మధ్యస్థలానికివచ్చి చేరింది. మహాదేవునిచేత నివారింపబడిన సిద్ధుడు మంకణుడా సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోవర మహాత్మ్యంలో పదునారవ అధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment