Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం🌹🌹🌹 – నలబై ఒకటవ అధ్యాయం

సరోవర మహాత్మ్యం

రోమహర్షణ వాక్యము :-

అచట నుండి విప్రోత్తములారా ! ఔశనస తీర్థానికి శ్రద్ధాభక్తులతో వెళ్ళవలెను. అక్కడనే ఉశనసుడు (శుక్రుడు) సిద్ధిపొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానంచేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృత్తిలేని బ్రహ్మలోకానికిపోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడింపబడిన రహోదరుడనేముని అక్కడనే ఆ శిరస్సునుండి విముక్తుడైనాడు. అంతట ఋషులిలా అడిగారు. రహోదర మునికి శిరోగ్రహణం ఎలా పట్టింది? అది ఆ తీర్థమహిమవల్ల ఎలాతొలగిపోయింది. దయచేసిచెప్పండి. అందుకు రోమహర్షణుడిలా చెప్పసాగాడు. ఓ బ్రాహ్మణులారా ! పూర్వం దండకారణ్యంలో ఉన్నప్పుడు మహాత్ముడగు శ్రీరాముడెందరో దుష్టరాక్షసులను సంహరించాడు. అప్పుడొక దుర్మార్గుడి తలను నిశిత కరవాలంతో ఖండించగా అదిపోయి ఒక మహారణ్యంలో పడ్డది. ఆ అడవిలో తిరుగుతున్న రహోదరుని తొడకు ఆ రాక్షసుని తలతగిలి ఎముకను చీల్చుకొని లోపలప్రవేశించింది. తొడ భిన్నమైనందున ఆ బ్రాహ్మణుడు సంకల్పించుకొన్న తీర్థాలకు వెళ్ళలేకపోయాడు. అలా చీముకారుతున్నప్పటికీ ఆ బాధను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు భువిలోగల సర్వతీర్థాలనూ సేవించాడు. దారిలో తాను దర్శించిన ఋషులకు తనబాధతెలుపుకోగా వారాతనిని ఔశనస తీర్థానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అంత రహోదరుడక్కడకు వెళ్ళి జలస్పర్శ చేయగానే ఆ శిరస్సు ఆయనతొడ నుండి ఊడి నీళ్ళలోపడి పోయింది. అలా అతనిబాధ తొలగిపోయి పాపముక్తుడైనాడు. అలా పవిత్రుడై ఆశ్రమానికి తిరిగివెళ్ళి ఆ విషయం అందరకూ వివరంగా చెప్పడు. అది వినిన ఋషులంతా ఆ తీర్థమహిమకు సంతసించి దానికి కపాలమోచనమని నామకరణం చేశారు.

అక్కడే సుప్రసిద్ధమైన గొప్పతీర్థం విశ్వామిత్ర తీర్థంఉంది. అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆ మహాముని తీర్థంలో స్నానంచేస్తే బ్రాహ్మణత్వం లభిస్తుంది. పరిశుద్ధాత్ములయిన బ్రాహ్మణులు పరమపదం పొందుతారు. తప్పదు. అక్కణ్ణుంచి మితాహారియై నరుడు పృథూదక తీర్థానికి వెళ్ళాలి. అక్కడ రుషంగుడనే బ్రహ్మర్షి సిద్ది పొందాడు. పూర్వజన్మస్మృతి గల్గిన రుషంగుడు మొదట గంగాద్వారంలో ఉండేవాడు. తనకు అంత్యకాలం రానున్నట్లు తెలిసికొని పుత్రులతో యిలా అన్నాడు. ఇక్కడ నాకు శ్రేయస్సు కలుగదు. వెంటనే నన్ను పృథూదక క్షేత్రానికి తరలించండి. తండ్రి భావాన్ని గుర్తించిన కుమారులాయనను వెంటనే పృథూదకానికి తీసికెళ్ళారు. రుషంగుడు సరస్వతీ నదిలో స్నానంచేసి ఆ తీర్థమహిమను తలంచుకొని యిలా అన్నాడు. సరస్వతి ఉత్తరపుటొడ్డున పృథూదక తీర్థంలో జపం చేస్తూ శరీరం చాలించిన వానికి తప్పక అమరత్వం లభిస్తుంది. అక్కడే బ్రహ్మ నిర్మితమైన బ్రహ్మయోని ఉంది. బ్రహ్మ సరస్వతి తటాన పృథూదకంలో నివసించి చతుర్వర్ణముల సృష్టించేందుకు తగిన ఆత్మజ్ఞానం పొందాడు. అవ్యక్తజన్ముడైన బ్రహ్మ సృష్టించాలని సంకల్పించుకొనినంతనే అతని ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు పాదములనుండి శూద్రులు జన్మించారు. ఆ నాలుగు వర్ణాల వారిని ఆశ్రమ ధర్మాల్లో అన్నిచోట్ల స్థాపించాడు. ఆ కారణాన ఆతీర్థం బ్రహ్మయోనిగా పిలవబడింది. ముముక్షువగునాతడక్కడ స్నానంచేస్తే మరల జన్మ అంటూ పొందడు.

అక్కడనే అవకీర్ణమనే తీర్థం ఉంది. అక్కడే దాల్ఛ్యుడైన బకుడు అసహిష్ణుడైన ధృతరాష్ట్రుని అతని బోయీలతో గడిపి యజ్ఞంలో బలియివ్వ సిద్ధపడగారాజుకు బుద్ధివచ్చింది. అంతట ఋషుడు, ఆ అవకీర్ణ తీర్థమెలా ఏర్పడ్డది? దానిని ధృతరాష్ట్రుడెందులకు సేవించాడని అడిగారు. అందుకు రోమహర్షణుడిలా చెప్పాడు. పూర్వం ఋషులు నైమిషారణ్యవాసులు, ధృతరాష్ట్రుని వద్దకు దక్షిణకై వెళ్ళారు. వారలతరపున దాల్భ్యుడైన బకుడు ఆ నరపతిని యాచించాడు. ధృతరాష్ట్రుడు పలికిన నిందాగర్భితమైన అసత్యానికి మండిపడి దాల్భ్యుడైన బకుడు అభిచారిక హోమం ఒకటి పృథూదకక్షేత్రం లోని అపకీర్ణ తీర్థంవద్ద ప్రారంభించి అందులో ధృతరాష్ట్రుని రాజ్యంలో సహా పేల్చేందుకై తనతొడ మాంసాన్ని బయటకు తీసి హోమగ్నిలో వేశాడు. అలా యజ్ఞం ప్రారంభంకావడంతో అదుష్టుడైన నరపతి రాజ్యం క్షీణించిపోయింది. రాజ్యనాశనానికి చింతాకులితుడై వెనుక తాను ఋషులనవమానించుట జ్ఞప్తికిరాగా భీతుడై తన పురోహితునితోబాటు రత్న రాసులు తీసికొన అవకీర్ణ తీర్థానికి వెళ్ళి దాల్భ్యునకవి సమర్పించి పాదాల మీదబడి శరణాగతుడయ్యాడు. అందులకు సంతోషించి ఆ మహర్షి యిలా అన్నాడు. విజ్ఞానియైనవాడు బ్రాహ్మణులనెన్నడు నవమానించరాదు. బ్రాహ్మణులకు గావించిన అవమానం మూడు తరాలవారిని దహించివేస్తుంది సుమా. అలా హెచ్చరించి ధృతరాష్ట్రుని రాజ్యాన్నీ అతని కీర్తి ప్రతిష్ఠలనూ తిరిగి నిలబెట్టాడు. అలాంటి అవకీర్ణంలో విజితేంద్రియుడై శ్రద్ధాసక్తులతో స్నానంచేస్తే చింతిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. ఆపైన ప్రసిద్ధి చెందిన యాయూత తీర్థం వస్తుంది. యయాతి చక్రవర్తి చేసిన యజ్ఞ ఫలంగా అచ్చట తేనెవాకలు ప్రవహించాయి. అచట భక్తితో స్నానం చేసి సర్వకిల్చిషాలు పోగొట్టుకోవచ్చు. అశ్వమేధ ఫలం పొందవచ్చు. మధు స్రవమనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది. అందులో మునిగి పితరులకు తేనెతో తర్పణాదులిచ్చి నరుడు తరించగలడు. అక్కడనే వాసిష్ఠోద్వాహమనే మహత్తరమైన తీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే వసిష్ఠలోకం సంప్రాప్తిస్తుంది.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోవర మహాత్మ్యంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment