Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై మూడ వ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం

రోమహర్షణుడన్నాడు : –

ప్రాచీన కాలంలో దర్వినాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కోక్కదానిలో స్నానం చేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణమవుతుంది. అక్కడే శతసాహస్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్థంలో మునిగినవాడు రాజసూయ యాగఫలం పొందుతాడు. రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్ధాశువు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు. బ్రహ్మసేవితమైన ఋణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పితృఋణాలనుండి ముక్తుడౌతాడు. ఓజస తీర్థంగా వినుతిగాంచిన కుమారాభిషేక తీర్థాన మునిగినవాడు యశస్వి అవుతాడు. అచ్చట శ్రాద్ధ మొనరించినచో కుమార పురప్రాస్తి కలుగుతుంది. అక్కడ చైత్రశుద్ధ షష్ఠినాడొనర్చిన శ్రాద్ధం గయాశ్రాధ్ద ఫలంయిస్తుంది. అంతేకాదు. సన్నిహిత క్షేత్రంలో సూర్యగ్రహణవేళ చేసిన శ్రాద్ధఫలం గూడ లభిస్తుంది. సందేహం లేదు. ఓ జసక్షేత్రంలో చేసిన శ్రాద్ధం. అక్షయ ఫలమిస్తుంది పూర్వం వాయుదేవుడుచెప్పాడు. కనుక ఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్రషష్ఠినాడుచేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉదక ప్రాప్తి కలుగజేస్తుంది.

అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తియైన మహాదేవ నివాసమైన పంచవట తీర్థముంది. అక్కడ స్నానంచేసి మహేశ్వరుని అర్చించినచో గాణపత్యం సిద్దించి దేవతలతోకలిసి సుఖిస్తాడు నరుడు. ఓ బ్రాహ్మణోత్తములారా! అక్కడే భూమిదున్నుటకై కురురాజు ఘోరతపస్సు చేసినకురుతీర్థంఉంది. ఆయన చేసిన ఉగ్రతపస్సుకు సంతోషించి”రాజర్షీ! నీ తపస్సుకు సంతోషించాను. ఈ కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసిన వారు పాపరహితములయిన సుకృతలోకాలను పొందుతారన్నాడు. అంతట నవ్వుతూ ఆ యింద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. అలాగే యింద్రుడు నవ్వుతూ మాటిమాటికి వస్తూవెళ్తూ కురుతోమాట్లాడుతూ గడిపాడు. చివరకు తీవ్రమైన తపస్సుచేసి కురు తనదేహం పవిత్రంగావించుకొనగా ఇంద్రుడు సంతోషంతో వచ్చి నీకేం కావలెనో కోరుకొనుమని ప్రేమతో అడిగాడు. అప్పుడు కురువిలాఅన్నాడు. ” యీ తీర్థంలో శ్రద్ధా భక్తులతో నివసించిన వారికి బ్రహ్మలోకప్రాప్తి కలగాలి. ఈతీర్థంలో స్నాంచేసిన వారలెక్కడ ఏ పాపాలుచేసినా పంచపాతకాలు చేసినాసరే ముక్తులై పరమపదం పొందవలె.” కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది. బ్రాహ్మణులారా ! దాని దర్శనమాత్రానే పాపముక్తులై పరమపదం పొందుతారు. కురుతీర్థంలో స్నానంచేసినవాడు ముక్తపాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతాడు.

తర్వాత శివద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి. అక్కడ శివద్వారంలో స్నానంచేస్తే పరమపదం లభిస్తుంది. అచటనుంచి ముల్లోకాల్లో పేరొందిన అనరకతీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ తూర్పుదిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు పశ్చిమాన రుద్రపత్ని ఉత్తరంగా పద్మనాభుడు ఉంటారు. మధ్యభాగాన అనరకమనే దుర్లభమైన తీర్థంఉంది. అక్కడస్నానంచేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి. వైశాఖషష్ఠి మంగళవారంనాడు అచట స్నానం చేసి పాపవిముక్తులు కాగలరు. అక్కడ నాలుగుపాత్రలలో అన్నము, అప్పాలతో నింపిన కలశాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి. సర్వపాప నాశనానికి కలశదానం చేయాలి. ఈ విధంగా ఎవరుస్నానం చేస్తారో వారు సర్వపాపముక్తులై పరమపదానికి వెళ్తారు. షష్ఠితో కూడిన మంగళవారంరోజున యితరత్రా కూడ యీ విధంగాచేస్తే ముక్తిలభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా ! తీర్థాల్లో ఉత్తమ మైన ఈ తీర్థంలో స్నానంచేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు. పుణ్యదాయి అయిన కామ్యకవనంలో ప్రవేశించినతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తిపొందుతాడు. ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లుతున్నాడు. ఆయనను దర్శించినంతనే ముక్తికలుగుతుంది. ఆదివారంనాడచట స్నానంచేయు నరుడు విశుద్ధదైహుడై మనోరథాలన్నీ సఫలంగావించుకుంటాడు.

ఇది శ్రీ వామన మహాపురాణం లోని సరోవర మాహాత్మ్యంలో యిరువదవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment