Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై నాల్గవ అధ్యాయం

సరోవర మహాత్మ్యం

ఋషులిలా అన్నారు :-

కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడే లతాగృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి. అందుకు రోమహర్షుణుడిలా చెప్పసాగాడు. మునులారా ! ఉత్తమైన ఆ తీర్థమహిమనూ ఋషుల దివ్యగాథనూ వినండి. అందువలన పాపవిముక్తి కలుగుతుంది. ఒక పర్యాయం సరస్వతీనదీ స్నానార్థం నైమిషారణ్య వాసులైన ఋషులు కురుక్షేత్రానికి వెళ్ళారు. కాని వారికక్కడ ప్రవేశం దొరకలేదు. అంతట నా ఋషులు యజ్ఞోపవీతికమనే తీర్థాన్ని నెలకొల్పారు. మిగిలిన ఋషులకుగూడా అందులోకి ప్రవేశం దొరకలేదు. రంతుకాశ్రమం నుంచి చక్రతీర్థం పర్యంతంగల ప్రదేశమంతా బ్రాహ్మణులతో నిండియుండుట చూచి ఆ సరస్వతీనది ఆ మునుల వసతికొరకై ఎన్నో లతా గృహాలునిర్మించి సర్వప్రాణుల కల్యాణార్థమై పశ్చిమాభిముఖంగా ప్రవహించసాగింది. తూర్పుప్రవాహంలో స్నానంచేస్తే గంగాస్నాన ఫలం కలుగుతుంది. దక్షిణదిక్కున పవిత్ర నర్మదానద స్నానఫలం లభిస్తుంది. పడమరదిశలో యమునానదిగాను, ఉత్తర దిక్కున సింధునదిగాను ఆ నది రూపొందుతుంది. యిలా ఆ పుణ్యాపగ నలుదిశలలో ప్రవహిస్తుంది. అట్టి సరస్వతిలో మునిగిన వానికి సర్వతీర్థ స్నానఫలం లభిస్తుంది. అటనుండి విహారమనే పేరుతో త్రిలోక ఖ్యాతి వహించిన మహాత్ముడగు మదనుని తీర్థానికి వెళ్ళాలి. అచట శివదర్శనార్థం దేవతలందరూ గుమిగూడగా వారలకు శివపార్వుతుల దర్శనంకాలేదు. అంతట అందరూ కలిసి మహాదేవుని నందీశ్వర గణేశ్వరులను స్తుతించారు. అంతట సంతోషించి నంది, శివుడు ఉమాదేవితో విహార తీర్థంలో విహరిస్తున్నాడని చెప్పాడు. అదివిని దేవతలు గూడా తమతమ భార్యలను పిలిపించి వారలతోకలిసి విహరించారు. వారల క్రీడలకు సంతోషించి ఈ విహారతీర్థంలో స్నానంచేసిన వారలు ధన ధాన్య ప్రియురాండ్రతో సుఖిస్తారని ఈశ్వరుడు వరమిచ్చాడు.

అనంతరం దుర్గాదేవికి ఆవాసమైన దుర్గాతీర్థానికి వెళ్ళాలి. అచట స్నానంచేసి పితృపూజచేస్తే ఎలాటి దుర్గతులు కలుగవు. అక్కడే త్రిలోక విశ్రుతమైన సరస్వతీ కూపం ఉంది. దానిని దర్శించినంతనే పాపాలు నశించి విముక్తి కలుగు తుంది. అక్కడ శ్రద్ధాభక్తులతో దేవపితృ తర్పణాలు చేస్తే అంతాఅక్షయ ఫలప్రదం అవుతుంది. పితృతీర్థం చాల విశిష్టమైనది. ప్రాచీ సరస్వతిలో స్నానంచేస్తే మాతాపితృ బ్రహ్మహత్య చేసినవాడు, గురుభార్యా సంగమంచేసిననాడు సైతం పాపరహితులై శుద్ధులౌతారు. దేవమార్గాన (ఆకాశాన ) ఉద్భవించి ఆకాశాన ప్రవహించిన ప్రాచీసరస్వతి వరమదుర్మార్గులను సైతం పవిత్రులను గావిస్తుంది. ప్రాచీసరస్వతీ తీరాన మూడురాత్రులు గడిపినవారి శారీరికాలయిన దుష్కర్మలు నిలువజాలవు. నరనారాయణులు బ్రహ్మరుద్రాదిత్యులు ఇంద్రాదిదేవతలందరూ తూర్పుదిక్కును సేవిస్తూ ఉంటారు. అలాంటి ప్రాచీదినాశ్రయించి శ్రాద్ధకర్మలొనర్చు మానవులకు యిహపరాల్లో దుర్లభమైనదేదీ ఉండదు. కనుక మానవుడెల్లప్పుడూ, ముఖ్యంగా పంచమీతిథులతో తూర్పుదిక్కును ఆరాధించాలి. పంచమినాడు తూర్పుదిశనారాధించినవాడు ఐశ్వర్యవంతుడౌతాడు. అక్కడ ముల్లోకాల్లో దుర్లభమైన ఉశనాతీర్థం ఉంది. అక్కడ ఉశమడు (శుక్రాచార్యులు) పరమేశ్వరునారాధించి సిద్ధిబొంది గ్రహమండలంలో పూజ్యుడైనాడు. అలా శుక్రసేవితమైన ఆ ఉత్తమతీర్థాన్ని శ్రద్ధగాసేవిస్తే పరమగతి లభిస్తుంది. అక్కడ భక్తితో శ్రాద్ధంచేసినవాని పితరులు తరిస్తారు. సందేహములేదు. చతుర్దశినాడుపవసించి విధ్యుక్తంగా చతుర్ముఖ బ్రహ్మతీర్థ సరస్సును సేవించినా, చైత్రకృష్ణ అష్టమినాడు దానినారాధించినా అట్టివారలు ఓ విప్రోత్తములారా! పునరావృత్తిలేని పరమసూక్ష్మ పదమును పొందుతారు. అక్కడనుండి సహస్రలింగ శోభితమైన స్థాణుతీర్థానికి వెళ్ళి స్థాణువటాన్ని దర్శిస్తే సకల కిల్బిషాలు తొలగిపోతాయి.

ఇది శ్రీ వామన మహాపురాణం లోని సరోమహాత్మ్యంలో యిరవై ఒకటవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment