Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై ఐదవ అధ్యాయం

సరోవర మాహత్మ్యం

ఓ మహామునీ ! స్థాణుతీర్థం , అక్కడి వటవృక్ష మాహాత్మ్యం సాన్నిహిత్య సరోవరోత్పత్తి దానినిమట్టి (దుమ్ము) తో పూడ్చటం , ఆ సరోవరమహిమ అక్కడి లింగాల దర్శన స్పర్శలవల్ల కలిగేఫలం , అన్నీ విశదంగా వివరించండి. అందుకు రోమహర్షణుడిలా చెప్పసాగాడు. మునులారా ! మీరందరూ , దేనిని విన్నంతనే శ్రీ వామనదేవుని కృపవల్ల ముక్తికలుగుతుందో అలాంటి ఉత్తమైన వామనపురాణాన్ని శ్రద్ధగా వినండి. స్థాణువట సమీపాన , వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహనీయులతో ఆసీనుడైన బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయముని యొకపరి వినయంగా అభివాదంచేసి , ఆ సరోవరంయొక్క విస్తారం , మహిమలు , ఉనికీ వివరించవలసినదిగా అర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడవైన బ్రహ్మకుమారా ! సర్వపాపాలు క్షాలనంచేసే సరోవరమహిమ నాకు తెలుపగోరెదను. ఏఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి , ఏ తీర్థాలుగుప్తంగా ఉన్నవి? స్థాణువుకు అతిదగ్గరగా ఉన్న అతి పవిత్ర లింగాలు ఎవ్వి? దర్శనమాత్రాన ముక్తి పాదాలైన ఆ లింగాలను గురించీ పవిత్ర వటవృక్ష దర్శన పుణ్యం. దాని ఉత్పత్తీ , తీర్థప్రదక్షిణ స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉండే దేవతలనారాధించిన కలుగుఫలం దేవాధిదేవుడైన స్థాణువు సరోవరం మధ్య ఉండుట, శుక్రుడా తీర్థాన్ని మట్టితోపూడ్చుట , ఆస్థాణు తీర్థమహిమ , చక్రతీర్థ సూర్యతీర్థ సోమతీర్థాల మహిమా విశేషాలు వివరించండి. మహామునీ ! బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో , ఈశ్వరుని గుహ్యస్థానాలు విష్ణుస్థానాలు సరస్వతీ వృత్తాంతం దేవాధిదేవుని మహిమ మొదలగునవన్నియు సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి విన్నవించాడు.

రోమహర్షణుడిలా అన్నాడు. మర్కండేయముని మాటలువిన్న వెంటనే బ్రహ్మాత్ముడైన ఆ మహాముని , తీర్థము లందు అతిశ్రద్ధకలవాడై ఎంతో భక్తితో తనపర్యంకాసనముద్రవీడి పరమశివునకు నమస్కరించి తాను పూర్వం బ్రహ్మవలన విన్నదంతయు చెప్పనారంభించాడు. ఓ మహామునీ! వరదుడు కల్యాణకరుడునగు మహేశ్వరునకు నమస్కరించి మున్నునేను బ్రహ్మవలన వినివట్టి తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జల ప్రళయమేర్పడి స్థావరజంగ మాత్మకమైన జగత్తంతా నశించిపోయింది. సకల జీవసృష్టికి మూలమైన పెద్ద అండం (గ్రుడ్డు) ఒకటి పుట్టింది. ఆ అండంలో ఉన్న బ్రహ్మ వేయియుగాలపాటు నిద్రించి మేలుకొన్నాడు. లోకమంతా శూన్యంకావడం చూచి ఆయన రజోగుణమోహితుడై సృష్టిచేయ నాలోచించాడు. సృష్టి గుణం రజస్సు , స్థితిగుణం లయంకాగా ఉపసంహారకాలంలో తమోగుణం ప్రవర్తిస్తుంది. యిక ఈ సకల జీవులను వ్యాపించియున్న ఆ పరమపురుషుడగు భగవానుడో సకలగుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా ఈశ్వరుడుగా గోవిందుడు గా పిలవబడే సనాతనుడు. ఆ పరతత్వాన్ని గుర్తించినవానికి సకలంతెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలిసికొన్న మహనీయులకు ఈ తీర్ధాలు ఆశ్రమాలు యేవీ అవసరంలేదు. వారు ముక్తులు. సంయమమునే పవిత్రతీర్థాలతో , సత్యం శీలం సమాధులనే పవిత్రోదకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానంచేసిన పుణ్యుడు పవిత్రుడౌతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటివల్ల కలుగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడొనర్చవలసిన ప్రధానకర్తవ్యం. అదే తెలియవలసిన ఏకైకవస్తువని , దానిని పొందినవాడు సమస్తమైన కోరికలను వదలివేయుననీ పెద్దలగు సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడగువానికి సర్వసమతాభావాలు ఏకత్వం శీలం వదలకుండుట హింసాత్యాగం క్రోధరాహిత్యం ఉపరతి (అసంగం) అనే గుణాలే నిజమైన ధనం. దానిని బోలినవిత్తం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా ! సంక్షేపంగా మీకు బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాను. దీనిని తెలుసుకున్నవాడు నిస్సందేహం గా పరమబ్రహ్మను పొందుతారు.

ఇక పరమాత్మయగు బ్రహ్మఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతూ ఉంటారు. నీళ్ళు “నార” శరీరం కలవి. (నీటికి నారమని పేరు) వాని మీద శయనిచినందున నారాయణుడని భగవంతునకు పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలిసికొన్న ఆ ప్రుభువు ఆ పెద్దగ్రుడ్డును బ్రద్దలుచేయగా అందులోనుంచి ఓంకారం బయలుదేరింది. అందులోనుచి భూః భువః , స్వః అనే మూడు భూర్భవస్వః లోకాలు వచ్చినయి. వానినుంచి తేజస్సు , తత్సవితుర్వరేణ్యం , బయటకు వచ్చింది. ఆ తేజస్సానీళ్ళన్నింటిని ఎండింపజేసింది. మిగిలినది పిండం (కలలంగా మారింది. దానినుంచి బుడగఏర్పడి అదిగట్టిపడింది. ఆ గట్టితనంవల్ల దానిని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలచిన ప్రదేశమే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుడన్నారు. లోకపితామహుడైన విరించి గ్రుడ్డుమధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండంమేరువు, యోనిపర్వతాలు, సప్తసముద్రాలు వేలాది నదులూ గర్భోదకం (ఉమ్మనీరు) బ్రహ్మనాభి ప్రదేశానఉన్న నిర్మలమైన ఉత్తమజలమే అ మహత్సరోవరంలో నిండినది. దానికి మధ్యలో స్థాణురూపమైన వటవృక్షం వెలిసింది. ఆస్థాణువటం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుద్భవించారు. విప్రుల కార్యసాధనకు శూద్రులు వెలసారు. అంతట అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టికార్యాన్ని ఆలోచించగా ఆయన మనస్సునుండి సనకాదిఋషులుద్భవించారు. ప్రజసృష్టీకాయన మరల సంకల్పించుకోగా సప్తఋషులుత్పన్నమైనారు. వారే ప్రజాపతులు.

రజోగుణమోహితుడై బ్రహ్మమరల ఆలోచించగా తపఃస్వాధ్యాయ నిరతులైన వాలభిల్యమునులు జన్మించారు. వారు స్నానదేవతార్చన ఉపవాస ప్రతాదులలో మునిగి, వానప్రస్థ పద్దతిలో అగ్ని కర్మలు నెరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమశరీరాలు శుష్కింపజేసుకున్నారు. వేయిదివ్య సంవత్సరాలావిధంగా తపించినందున వారలదేహాల్లోని రక్తమాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలిపోయాయి. అలా ఆరాధించినాశంకరుడు ప్రసన్నుడుకాలేదు. తర్వాత చాలాకాలానికి శివపార్వతులాకాశమార్గాన పోతుంటే పార్వతివాళ్ళఎండిన దేహాలుచూచి దుఃఖించి భర్తను ప్రసన్నునిగావించి యిలా అన్నది. “ప్రభో! దేవదారువనంలో ఆ మునులావిధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారలక్లేశాలు తొలగించండి. అస్తికులై వేదధర్మనిష్ఠతో అస్థిశల్య మాత్రావశిష్టులై యింతకాలంగా ఘోరతపస్సు చేసినా యింకా శుద్ధులుకాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా? కనికరించి అనుగ్రహించండి. పార్వతిదేవిమాటలువిని ఆచంద్రమౌళి, పినాకపాణి, అంధకాంతకుడు చిరునవ్వునవ్వి యిలా అన్నాడు. దేవీ! నీవు ధర్మసూక్ష్మం ఎరుగక యిలా అంటున్నావు. వీరంతగా తపించినా ధర్మమెరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్ధులు; నీవెరుగవు” అందులకాతల్లి ప్రభూ! తపోవ్రతనిష్ఠులైన వీరినిగురించి అలా అనకండి. అనుగ్రహించివారలకు దర్శనమొసగి రక్షించండి. నాకు చాలా బాధగాఉంది. అని వేడుకోగా నా దేవదేవుడు నవ్వుతూ యిలా అన్నాడు. అయితే నీవిక్కడే ఉండి చూస్తూండు. నేనువెళ్లి వారుచేసే కఠోరతపస్సు అసలురంగు బైట పెట్టెదను. వారలచేష్టితాలు నీకే అర్థమౌతాయి.” అందుకుసంతోషించి పార్వతిభర్తతో మంచిది, నడవండి అలాగే వెళ్ళుదాం. నేను కూడా వస్తానని యిద్దరూ బయలుదేరారు. కట్టెపుల్లలు యినుపఊచల్లాగ ఉండి వేదాధ్యయనాలు అగ్నికర్మలు అదేపనిగా చేస్తున్న ఆ మునులనుచూచి పరమేశ్వరుడు సర్వాంగ సుందరమూ, దిగంబరమూ, వనమాలాభూషితమైనయువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకొని ఆ మున్యాశ్రమాల వెంటభిక్షాటనం చేయసాగాడు.

తమ ఆశ్రమాలవెంట తిరుగుతున్న ఆ అందమైన యువతపస్విని నగ్నంగాచూచుటతో సహజమైన ఉత్కంఠతో ఆ మునుల భార్యలు మోహంలోమునిగిపోయారు. అందరూ ఒకచోట చేరి తమలోతామా సుందరతపస్విని చూచెదమనుచూ కందమూల ఫలాలు తీసికొని భిక్షపెట్టుటకు బయలుదేరారు. ఆ దేవదేవుడుకూడ “తెండు ! తెండ”నుచు వారలిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షాకపాలాన్నిచూచి భిక్షతీసికొంటూ మేలుకలుగుగాక!” అని నవ్వులొలకబోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నలవర్షం కురిపించారు. “ఓయీ తాపస యువకుడా: ఈవిధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనంచేసే వ్రతం ఎలాటిది ? దానివిధానం ఎక్కడఉంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేముకూడ అందచందాలలో నీకు తీసిపోము”. ఆ కామార్తుల ప్రశ్నవిని శివుడు : – సుందరులారా ! ఇది చాల రహస్యమైన వ్రతం. దీని విధానం ఫలం పదిమందిలో వెల్లడించకూడదు. కాన మీరు మీరు వెళ్ళిపోండి.” అనగానాస్త్రీలు ” అలాగైతే ఏకాంతస్థలానికి వెళ్దాం పదండి. అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చు” నంటూ ఆయన చేయిపట్టుకొనిరి. కొందరు సుందరాంగనలాయన మెడను మోహావేశంతోపెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు, పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభిప్రదేశాన్ని చుట్టివేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమస్త్రీల వికారచేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రండు రండంటూ కర్రలూ, రాళ్ళూ తీసికొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడినేలపైబడిన వెంటనే ఆ మహాదేవుడంతర్హితుడైపోయాడు.

పార్వతితో కలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడుటతోనే సృష్టిఅంతా అతలకుతలమైపోయింది. భగవానుని వ్యాకులపాటువల్ల ఆత్మజ్ఞానులయిన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతటనా మునులలో బుద్ధిమంతుడయినఆతడొకడు, మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేకపోయాము. ఇపుడందరం వెళ్ళి విరించిని శరణువేడుదాము. ఆయనే ఇందులోని రహస్యం తెలిసినవాడు అని సలహాయిచ్చాడు. ఆ ప్రకారం ఆ మునులందరు తమ తొందరపాటుకు మూర్ఖత్వానికి సిగ్గుపడి, దేవతలచేత పరివేష్టితుడైన బ్రహ్మసన్నిధికి వెళ్ళి ప్రజతులై తలవంచుకొని నలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులను చూచి బ్రహ్మ యిలా మందలించాడు. ” క్రోధం మిమ్ములను కలుషాత్ములను గావించింది. దానికిలోబడి పరమ మూర్ఖులైపోయారు. మూఢబుధ్దులారా ! మీరలు ఏ మాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరుగకపోయారు. పరమక్రూర కార్యమాచరించారు. ధర్మ స్వరూపం, సారతత్వం యిప్పుడైనావిని తెలుసుకోండి. ధర్మస్వరూపం గుర్తించిన విజ్ఞుడు శ్రీఘ్రమే ఉత్తమఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోనే, ఆత్మలోనే సదా నిలచి యున్నాడు. మీకంటె భిన్నుడుకాడు. అనాదితత్వమైన ఆ మహాస్థాణువు, పరమ ప్రకాశవంతమైన మణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రము యొక్క రంగులోనేపైకి కనపడునో, అదే విధంగా ప్రాణులదేహంలో ఉంటూ వారల కర్మ వాసనల అంతరాన్ని అనుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు.ఆయా జీవుల మనోభావాలచేత పరిచ్ఛిన్నుడైయుంటాడు.అయితే ఆయనకు వారలకర్మ వాసనలేమాత్రము అంటవు. వారలకర్మానుసారమే స్వర్గ నరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్ధిమంతులగువారు జ్ఞాన యోగాది సాధనల ద్వారా తమ మనస్సులను పరిశుద్ధం గావించుకోవాలి. చిత్తశుద్ధి అయినవెంటనే అంతరాత్మ తనంతతానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికిలోను కాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంతవరకు ఎంతకాలం ప్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును పాపాలనుంచి మరలించేవే సత్ర్కియులు. ఈ అనుష్ఠానాలన్నీ చిత్తశుద్ధికోసమే ఉద్ధేశింపబడినాయి. పాపపంకిలమైన యీ దేహాన్ని శుద్ధిపరచుకొనుటకే లోకంలో ఈ జ్ఞానమార్గం ప్రవర్తితమైనది. అలాంటి సత్ర్పవర్తనకు సాధనభూతంగానే, ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను ఏర్పరచినాడు. కాగా ఎక్కువమంది అజ్ఞానాన్ని మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారము అనుకుంటున్నారు. ఇక మీ విషయమే చూచండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనస్సులో తిష్ఠవేసికొని ఉన్నవో కామక్రోధాలు ! నిజమైన జ్ఞానులకు యిల్లే ఆశ్రమం. జ్ఞానులుకాని వారికి ఆశ్రమాలు యింటి కంటె గూడ నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబధమైన భ్రమలకులోనై మీరెక్కడ? నిరీహమైన జీవితమెక్కడ? క్రోధానికి దాసులైన మీరెక్కడ ? ఆత్మజ్ఞానమెక్కడ ? క్రోధాభిభూతుడుచేసే యజ్ఞాలు, యిచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపోవ్రతాదులు బూడిదలోపోసిన పన్నీరువలె నిష్ప్రయోజనకరాలు ! ఈ జన్మలో అవి ఎలాటి ఫలాన్నీ యివ్వవు. కోపిష్టిచేసే పనులన్నీ వ్యర్థచేష్టితాలు !

ఇది శ్రీ వామన మహాపురాణం లోని సరోవరమాహత్మ్యంలోని ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment