Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – యాబై మూడవ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం

పులస్త్యుడు చెప్పసాగాడు : – ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రనికాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీః తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలబోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేని అందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల తర్వాత ఆ ముగ్గురు బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూచారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిలయను కన్యను ఆదిత్య వసువులు దేవలోకానికి గొనిపోయి బ్రహ్మకు చూపించి ప్రభూ! ఈమె మహిషాసురుని చంపగల పుత్రునికనగలదా చెప్పడన్నారు. అందుకు బ్రహ్మ ఈ తపస్విని శివవీర్యాన్ని ధరించజాలదు. కనుక ఈ చిన్నదానిని వదలిపెట్టండి అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల ఓనారదా బ్రహ్మతో – భగవన్‌ ! నేను జనార్దనుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసి శివ వీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదాక్రాంతుని చేసుకోగలను. అందుకు తీవ్రంగా ప్రయత్నించగలననెను. అది విని కోపించిన విరించి, ధూర్తయైన కుటిలతో ఇలా అన్నాడు.

బ్రహ్మ వచనం : – పాపిష్ఠవైన కుటిలా నాహిత వచనాన్ని ధిక్కరించినందుకు నిన్ను నా శాపాగ్నితో దహించి వేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా బ్రహ్మ శాపానికి గురియై ఆ కుటిల నీరుగామారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా నా పితామహుడు ఋగ్యజుస్సామాథర్వణ వేదాలతో నామెను గట్టిగా బంధించాడు. ఆమెయు అక్కడ బ్రహ్మదేవుని జటామండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతట రాగిణియను బాలికను గూడ దేవతలు బ్రహ్మకడకు గొనిపోగా ఆయన ఆ బాలిక గూడ శివవీర్య ధారణ కనర్హురాలన్నాడు. ఆమె కూడ బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురియై సంధ్యగా నాటినుండీ పిలువబడుతోంది. పర్వతంమీద కృత్తికగా గుర్తింపబడుతూంది. అలా తన కుమార్తె లిర్వురు చేతినుండి జారిపోవుటచూచిన మేనాదేవి మూడవ కుమార్తె కాళిని చూచి, “ఉ – మా” అమ్మా నీవు తపస్సు జేయవద్దని వారించింది. ఆనాటి నుండీ ఆ తల్లి ఆ బిడ్డను “ఉమా” అనే సంబోధించసాగింది. అంతటనా “ఉమ” అడవికి వెళ్ళి పోయింది. అక్కడ తన మనస్సులో శూలపాణి, వృషభ కేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకొని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయెను. అంతట బ్రహ్మమరల హిమగిరి పుత్రికయైన ఆ కాళినిగొని తెమ్మని దేవతలను పంపగా ఆమె తపోగ్నికి భయపడి ఆమె దగ్గరకుగూడ వెళ్ళలేక పోయారు. ఆమె ముందర యింద్రుడు కూడ తన తేజస్సు గోల్పోయి ఆమె తేజస్సు బ్రహ్మతేజాన్ని గూడ మించినదని వక్కాణించాడు. అది విని బ్రహ్మ మిమ్ము లనందరను తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్థాంగి. ఇది తథ్యం. కనుక యిక మీరు మీ చింతలుమాని మీమీ నెలవులకు పొండ”ని ఆదేసించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి యింద్రాదిసురులు భయాందోళనలు వదలి తమ తమ యిండ్లకు వెళ్ళి పోయారు.

అంతట తపస్సు చేస్తున్న ఉమనుకూడ పర్వతేశ్వరుడు వారించి భార్యతోవెళ్ళి యింటికి తీసికెళ్ళాడు.ఆ దినాలలో శంకరుడు నిరాశ్రయమనే కఠోర తపస్సులో మునిగి మేరువు మొదలయిన మహాశైలాల్లో తిరుగసాగాడు. అలా తిరుగుతూ నొకసారి హిమవంతానికి రాగా హిమవంతుడు యథావిధిగా పూజించాడు. ఆ రాత్రి శివుడచటనే ఉండిపోయాడు. మర్నాడు హిమవంతుడాయనను ఆహ్వానించి తపస్సు సమయమంతా తనవద్దనే గడపమని అర్థించాడు. పర్వతేశ్వరుని ప్రార్థన మన్నించి హరుడచటనే ఉండ నిశ్చయించి తన నిరాశ్రయ వ్రతాన్ని వదలి అచటే నిలిచాడు. అచట నొకయాశ్రమంలో శూలపాణి యుండగా గిరికన్యకాళి తన సఖులతో కలసి అచటకు వెళ్ళింది. వచ్చిన గిరికన్యను మరల జన్మించిన తన భార్య సతీదేవిగా గుర్తించిన శివుడామెకు స్వాగతంపలికి మరల తపస్సులో మునిగిపోయాడు. అంతటనా కాళి చేతులు జోడించుకుని సతీ సమేతగా నా హరుని పాదములకు మ్రొక్కెను. అంతనా గిరికన్యను చాలాసేపు తదేకదృష్టితోచూచి శివుడు అలా చేయుట యుక్తంకాదని పలుకుచూ గణాలతో సహా అంతర్హితుడ్యాయడు. జ్ఞాన సంపన్నురాలైన ఉమశివుని ఆ తీవ్రవచనాలు విని దుఃఖించి తండ్రివద్దకు వెళ్ళి యిలా అన్నది. ”తండ్రీ! పినాకపాణి, మహాదేవుడు శంకరుని ఆరాధించుటకై నేను మహారణ్యానికి వెళ్తాను”, అందుకు తండ్రి సమ్మతించగా, నా హిమవత్పర్వతమూలాన్నే లలిత అనే పేరుతో ఘోర తపస్సు చేయసాగింది. ఆమె సఖులు కంద మూలఫలాలు సమిధలు కుశలు తెచ్చి ఆమెకు సపర్యలు చేయసాగారు. పార్వతి వినోదానికై వారలు శూలపాణి శివుని మట్టిబొమ్మను అందంగాచేసి చూపారు. తేజోవంతమైన ఆ బొమ్మనుచూచి ఆమె ఆనందించి సఖులను దీవించెను. పూజా సమయాల్లో మాటిమాటికీ ఆ విగ్రహాన్నే చూస్తూ ఆరాధించేది. ఈ విషయాన్ని కనిపెట్టిన ఆ త్రిపురాంతకుడు సంతోషించి, పలాశదండం , ముంజమేఖల, కృష్ణాజినం కమండలువు ధరించి భస్మాంకిత విగ్రహంతో బ్రహ్మచారి వేషంలో పర్యటిస్తూ ఆమె ఆశ్రమానికి చేరాడు, నారదా ! అలా వచ్చిన హరునిచూచి ఆ కాళి సఖులతో లేచి స్వాగతంపలికి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి యిలా ప్రశ్న చేసింది.

భిక్షువిలా అన్నాడు : – ఓ పార్వతీ ! నీకీ సలహా ఎవడిచ్చాడని అడుగుతున్నాను. చిగురుటాకులను వెక్కిరించే నీ మెత్తటి చేతులెక్కడ ? వీటితో ఆ పాములచేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు ? నీవో చీనిచీనాంబరాలు ధరిస్తావు. అతడో పులితోలు కప్పుకునే రుద్రుడు (భయంకరుడు).నీవు చందన లేపనంచేసుకుండే అతడు బూడిద పూసుకుండాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు !

పులస్త్యుడన్నాడు : – నారదా ! అలా మాటాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి ” అలా అనగూడదు. హరుడు, ఓ భిక్షూ ! సర్వ గుణాల్లో సర్వాధికుడు ! ఆ ప్రభుడు మంగళరూపి కానీ భయంకరాకారుడు కానీ, దనవంతుడు గానీ, దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్తకాగలడు ! ఓ శశిప్రభూ ! ఈతని పెదవులు కదలుచున్నవి. ఇంకా ఏమోవదరోబోతున్నాడీతనిని ఆపండి. ఇతరులను నిందించే వానికన్నా అనిందనువివే వారలు ఎక్కువ పాపంమూటగట్టుకుండారు” అని తన నిశ్చయం వెల్లడిచేసినది. పులస్తుడు ఓ నారదా ! అలాపలికి అచటనుండి లేచిపోవనుద్యమించిన ఆ వరదాయిన ఎదుట శివుడి తననిజరూపంతో నిలచి యిలా అన్నాడు. “ప్రియురాలా! సుఖంగా యింటికి వెళ్ళిపో. నేను త్వరలోనే నిన్ను పొందుటకై మహర్షులను నీ తండ్రి యింటికి పంపుతాను. నీవుపూజించిన ఈ మృణ్మయ శంకర ప్రతిమ నేటి నుండీ భద్రేశ్వరుడుగా లోకంలో ప్రసిద్ధమౌతుంది. దీనిని దేవదానవ గంధర్వ యక్ష కింపురుష నాగమనుష్యాదులు పూజించి శుభాలు పొందుతారు”. హరుని మాటల కలరి ఆ గిరికన్య వెంటనే ఆకాశమార్గానా తన నెలవుకు వెళ్ళి పోయినది. మహాతేజస్వి అయిన శంకరుడు హిమవత్పుత్రిని వదలిపృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడికొని మందర మహాశైలానికి తరలివెళ్ళాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తనయింటికే తెంచిన ఆ త్రిపుర సంహరునిచూచి హర్షసంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగధిరాజు, ఆ దేవునికి స్వాగతంపలికి, కందమూల ఫలాలు దివ్య జలాలు సుగంధిత కుసుమాదులతో వారల నందరను ఘనంగా పూజించాడు.

ఇది శ్రీ వామన మహాపురాణం లోని సరోవర మహాత్మ్యం యిరువది ఏడవ అధ్యాయము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment