Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – యాబై నాల్గవ అధ్యాయం

సరోవర మహత్మ్యం

పులస్త్య మహర్షి చెప్ప మొదలుపెట్టాడు :- అక్కడ చేరిన దేవతలను చూచి నంది ఏదో అనగా మహేశ్వరుడు లేచి భక్తితో శ్రీహరిని కౌగిలించుకున్నాడు. అంతట బ్రహ్మకు నమస్కరించి ఇంద్రుని సంభావించి యితర పదేవతలనందరను యథోచితంగా పలకరించాడు. వీరభద్ర పురోగాములై శివగణాలు పాశుపతగణాలు జయజయ ధ్వానాలు చేస్తూ మందరగిరి చేరారు. అక్కడ నుండి దేవగణాలతో కూడి మహేశ్వరుడు వైవాహిక విధినిర్వహణకై కైలాస శిఖరాలకు వెళ్లాడు. ఆ కొండ మీద దేవమాత అదితి, సురభి, సురస మొదలగు ముత్తైదువలు అలంకరణ కార్యంలో నిమగ్నులయ్యారు. ముఖాన గోరోచన తిలకం, మహాస్థి మకుటం, సింహచర్మం, తుమ్మెదల్లాంటి నల్లటి సర్పకుండలాలు, నాగమణులు కూర్చిన కంకణ, హారకేయూర రూపురాలు, ఎత్తైన జటాభారం ధరించి వృషభారూఢుడై హరుడు అపూర్వమైన శోభతో కనులకు విందు గావించాడు. ఆయనకు ముందు భాగాన శివగణాలందరూ తమతమ వాహనాల మీద వెళ్లగా వెనుక భాగాన అగ్నిని ముందుంచుకొని దేవతలు నడిచారు. నారాయణుడు లక్ష్మిదేవితో గరుత్మంతుని మీద బయలుదేరాడు. బ్రహ్మ హంసనెక్కి శివుని ప్రక్కగా సాగాడు. శ్వేత వస్త్ర ఛత్రాలు ధరించి ఐరావతంమీద యింద్రుడు శచీదేవితో కలసి నడిచాడు. సరచ్ఛిరోమణి యమున శ్వేతచామరం పట్టుకొని తాబేలుమీద బయలుదేరింది. అలాగే సరస్వతీ, హంసకుందేండు ధవళమైన చామరంతో గజాన్ని ఆరోహించి పయన మైంది. ఆరు ఋతువులు పంచవన్నెల పరిమళ భరిత కుసుమాలతో హరుని అనుగమించాయి. ఐరావతం వంటి మదపు టేనుగునెక్కి అనులేపన (అలంకరణ) దృశ్యాలు తీసికొని వృథూదక తీర్థం బయలుదేరింది. తుంబురు గంధర్వులు కల కంఠాలతో గానం చేస్తున్నారు. కిన్నరులు బాజాలు వాయిస్తున్నారు.

అప్సరసలాడుతుంటే మునులు స్తోత్రాలు చేస్తున్నారు. గంధర్వ గణమంతా శూలపాణి ఫాలాక్షుణ్ణి వెంబడించారు. పదకొండు కోట్ల రుద్రులు, పన్నెండు కోట్ల ఆదిత్యులు, ఎనిమిది కోట్ల వసువులు, అరవై ఏడు కోట్ల గణాలు, ఇరువది నలుగురు ఊర్ధ్వరేతస్కులయిన పరమర్షులు, ఓ నారదా, ఆ పరమ శివుని వెంట నడిచారు. వీరలుగాక ఆ వివాహ యాత్రలో లెక్కకు మిక్కుటమైన యక్ష కిన్నర రాక్షస యూథాలు మహా కోలాహలంగా పాల్గొన్నారు. క్షణ కాలంలో శివుడు తనవారలతో ఆ పర్వతాధిపతి నగర సమీపానికి జేరాడు. ఆ పెండ్లి వారలకు ఎదుర్కోలు చెప్పుటకై పర్వతవీరులు నలువైపుల నుండి ఏనుగులమీద వచ్చి నిలచారు. వరుడు కన్యాదాతకు నమస్కరించగా తక్కిన గిరులన్నీ శివునకు సాగిలబడి లేచి నలచాయి. అందులకు శర్వుడెంతో ఆనందించాడు. అలా తన పార్షదులతో దేవతలతో మహావైభవంగా, నందీశ్వరుడు దారి చూపగానే శైలరాజు పట్టణంలో ప్రవేశించాడు. పెండ్లివారలతో హరుడు నగరంలో ప్రవేశించాడని తెలియగానే పురస్త్రీలంతా తాము చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదలిపెట్టి ఉత్కంఠతో పెండ్లికొడుకును చూచేందుకు బయలుదేరారు. ఒక సుందరి సగం కూర్చిన పూలమాల ఒకచేత్తో పట్టుకొని రెండవచేతితో ముడివేసుకుంటున్ని కేశపాశాన్ని పట్టుకొని శివుని చూచేందుకు ఎదురుగా వచ్చింది. మరొకవనిత ఒక పాదానికి పారాణి పెట్టుకొని రెండవ పాదానికి పెట్టకోకుండానే వెళ్ళిచూచింది. మరొక వనిత వన్నెలాడి ఒక కంటికే కాటుక పెట్టుకొని చేతిలో కాటుక తాకపట్టుకొని అలాగే వీథిలోకి వచ్చింది. మరొక తొందరకత్తె పావడా, మొలసూలు చేతులోపట్లుకొని అవి ధరించకుండానే మొండిమొలతో పరుగెత్తింది ! ఉరోజాల బరువుతో త్వరగా నడవలేక బయలుదేరిన ఒక అవ్వని , పెండ్లికొడుకు తన గుమ్మందాటి వెళ్ళాడని తెలియడంతో తన వయో భారాన్ని నిందించుకుంది. ఈ విధంగా ఆ నగర రమణీ లోకం సంక్షోభాన్ని రేకెత్తిస్తూ ఆ వృషభవాహనుడు మామగారి దివ్యభవనానికి చేరాడు.

ఆ విధంగా గృహంలో అడుగు పెట్టిన శివుని చూచి హిమవంతుని యింటిలోగల యాడువారలు ”ఆహా! ఈ అంబిక చేసిన తపస్సు కడుగొప్పది కదా! ఆ ఫలమే దేవశ్రేష్ఠుడైన ఈ హరుని లభించింది. కుసుమాయుధుడైన మన్మథుణ్ణి అనంగుడుగా చేసినది, దక్షయజ్ఞం ధ్వంసం చేసినది ఈ పినాకియే, శూలపాణియే, సూర్యుని నేత్రాన్ని హరించిన హరుడే !” అని ఆశ్చర్యపడుచూ ఆ భవుని యిలా స్తుతించారు. ”శంకరా ! త్రిశూలధరా! శూలహస్తా నీకు నమస్సుతు ! వ్యాఘ్రచర్మధరా! మహాసర్పకుండలధరా! నాగేంద్రహారా! పార్వతీరమణా! నీకు ప్రణామ శతమలు!” అంతఃపురాంగనలావిధంగా స్తోత్రవాక్యాలు పలుకుతూండగా, దేవేంద్రుడు గొడుగుపట్టుకొనగా, సిద్ధయక్షులకు వందనీయుడగునా నాగకంకణుడు, భస్మాలంకృత సర్వాంగుడై, విరించిమనస్సును ప్రమోదభరితం గావిస్తూ విష్ణువు వెంటనంటిరాగా, పవిత్రాగ్నులతో వెలగొందుతున్న వివాహమంగళ వేదికనలంకరించాడు. సపరివారుడై సప్తర్షులతో నేతెంచిన ఆ త్రిపురహరుని చూడగానే అక్కడివారంతా కాళీకుమారిని పెండ్లి కూతురుగా ముస్తాబుచేయుటలో నిమగ్నులయ్యారు. పర్వత ప్రవరులు వచ్చిన పెండ్లివారికి సపర్యలు చేయడంలో హడావుడి పడసాగారు. నిజమేమరి. ఆడపిల్ల పెండ్లిలో పిల్లవైపువారు ఆతుర్దాపడడం సహజమే గదా! అంతఃపురస్త్రీలు పార్వతిని శ్వేతాంబరాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తర్వాత ఆమెసోదరుడు సునాభుడు విహితమైన పూర్వంగకృత్యాలు నెరవేర్చి కాళీని వెంటతబెట్టుకొని శంకరునివద్దకు తీసుకొని వెళ్ళాడు. స్వర్ణనిర్మితమైన ఆ మంగళవేదికవద్ద కూర్చొని దేవతలు, వధూవరులు నెరవేర్చదగు వివాహ కృత్యాలు గమనించసాగారు. శివుడు పార్వతితోకలిసి లోకామమోదితాలైన వైవాహికాచారాలు యథాక్రమంగా నెరవేర్చాడు. ఆ సందర్భంలో చిత్రవిచిత్రాలైన వినోదక్రీడలతో, పుష్పభరితాలయిన వృక్షాలతో సుగంధాలు వెదజల్లే (పన్నీరు) జలసేచనాలతో, గంధపు చూర్ణాలు చల్లుకొనడంతో, రంగు రంగుల మ్రుగ్గులతో, ముత్యాలపేరుల తోరణాలతో, శివపార్వతుల క్రీడార్థం ఆ ప్రదేశాన్నంతా సిందూర రంజితం గావించారు. ఆ విధంగా గిరకన్యతో క్రీడించి హరుడు ఋషులతో నిండిన దక్షిణ వేదకవద్దకు చేరాడు. చక్కగా నిర్మింపబడిన ఆ దృఢమైన మండపంవద్దకు శ్వేతాంబరాలుధరించి, పవిత్రపాణియై, ఉజ్జ్వల మధుపర్కాలతో హిమవంతుడు వచ్చాడు. పూర్వాభిముఖుడై తినేత్రుడు ఉపవిష్ణుడు కాగా , కన్యాదాత సప్తర్షులవైపు తిరిగి కూర్చున్నాడు. సుఖాసనం మీదనున్న జామాత శర్వునితో , అంజలి ఘటించి ఆ నగపతి ధర్మసమ్మితమైన వాక్యం పతికాడు. ”ఓ దేవా! నాపుత్రిక , పులహుతి అన్నపౌత్రి, పితృదేవతల దౌహిత్రి అయిన ఈ కాళీకన్యను నీకు దత్తం చేస్తున్నాను. పరిగ్రహించి నన్ననుగ్రహింపుము. ఓ నారదా! అలా అంటూ ఆ హిమవంతుడు తన కుమార్తెచేతిని హరుని చేతిలో ఉంచి అందరు వినునట్టుగా ”దేవా ! ఈమెను స్వీకరించుడ”ని ఉచ్చైఃస్వరంతో పలికాడు.

శివుడు యిలా అన్నాడు: ”ఓ పర్వతరాజా! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. జ్ఞాతులు బంధువులంటూ ఎవరూ లేరు. ఇల్లు లేదు. కొండ కొమ్ములమీద తిరుగుతూ ఉంటాను. ఇలాంటి నేను నీ కుమార్తెను స్వీకరిస్తున్నాను.” అలా చెబుతూ వరదాయకుడైన ఆ శర్వుడు పార్వతిచేతిని గట్టిగాపట్టుకున్నాడు. నారదా! ఆమె కూడ తన భర్తకరస్పర్శరు పులకించిపోయినది. అంతట మధుపర్కప్రాశంనచేసి శివుడు పార్వతితోకలిసి వేదికపైకెళ్ళి లాజలు (బియ్యపు పేలాలు) అర్పించాడు. అపుడు బ్రహ్మ పార్వతితో, ”కాళీ! స్థిరదృష్టితో చంద్రకాంతితో సమంగా వెలుగుచున్న నీ భర్త ముఖాన్ని చక్కగాచూచి అగ్నికి ప్రదక్షిణం చేయుము” అన్నాడు. వేసవికి తపించిపోయిన భూమి తొలకరి వృష్టికి స్పందించినట్లుగా, భర్త ముఖదర్శనంతో అంబిక అపూర్వమైన చల్లదనాన్ని అనుభవించింది. బ్రహ్మ మరలనామెను భర్త ముఖము చూడమనగా నామె చూచితినినని సిగ్గుతోనుడివినది. అంతట గిరిజతో కలిసి హరుడు అగ్నికి ముమ్మారు ప్రదక్షిణంచేసి, హవిస్సులాజలు అగ్నిలో వ్రేల్చాడు. అంతట బహుమతి కోసం మాలిని, శివునికాళ్ళు రెండూ గట్టిగాపట్టుకున్నది. ”నీవడిగినది యివ్వగలను, కాళ్ళు వదలమ”ని అంటున్న హరునితో నామాలిని, ”ప్రభూ! నాయీ చెలికి మీ గోత్ర సౌభాగ్యం యిస్తేకాని మీపాదాలు విడువను” అని అన్నది. “అట్లే యిచ్చితిని మాలినీ యిక నన్ను వదులుము. నా గోత్ర సౌభాగ్యం ఎలాంటిదో చెబుతున్నా వినుము. ఇడుగో, పీతాంబరం ధరించి శంఖంపట్టిన ఈ మధుసూదనుని సౌభాగ్యం. నేను నా గోత్రంగా ప్రసాదించినదే!” శివుడన్న మాటలు విని, నిజ గోత్ర శుభచరిత్ర శాలియైన ఆ మాలిని, ఆయన కాళ్ళువదలి పెట్టింది. మాలిని శివుని పాదాలు పట్టుకున్న సమయంలో బ్రహ్మ చంద్రునికన్నా మిన్నగా వెలుగుచున్న ఆ కాళి ముఖాన్ని చూచాడు. వెంటనే మారవికారానికి లోనుకాగా అతడి వీర్యం నేలపై పడిపోయింది. దానితో కంగారుపడి ఆయన ఇసుకపైబడినశుక్రాన్ని నిర్వీర్యం గావించాడు. అంతట శివుడు బ్రహ్మతో ”బ్రహ్మ! నీవు బ్రాహ్మణహత్య చేయరాదు సుమా. ఓ పితామహా! ఈవాలఖిల్య మహర్షులు దన్యాత్ముల!” అన్నాడు. అలా అనగానే, ఎనభై ఎనిమిదివేల ఆవాఖిల్య ఋషులులేచి నిలబడ్డారు. ఆ విధంగా వివాహం సంపన్నం కాగానే హరుడు సంతుష్టుడై ఉమతో కలిసి ఆ రాత్రి యథేష్టసుఖాలనుభవించి ఉదయాన్నే లేచాడు. ఆ విధంగా పార్వతిని వివాహమై హరుడు మిక్కిలిగా సంతోషించాడు. దేవతలు, ప్రమథగణాలుకూడ ఆనందించారు. ఆంతట హిమవంతుని సత్కారాలందుకొని ఆయన మందరగిరి తిరిగి వెళ్ళాడు. తన వివాహానికి వచ్చిన బ్రహ్మ విష్ణు యింద్రాది దేవతలను యథావిధిగా సత్కరించి వీడ్కోలు చెప్పినవాడై, ఆ యష్టమూర్తి తన శివగణాలలో మందగిరి మీద నివాస మేర్పరచుకున్నాడు.

ఇది శ్రీ వామన మహా పురాణంలో సరోవర మాహాత్మ్యం యిరవై యేడవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment