Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – యాబై ఐదవ అధ్యాయం

పులస్తుడిలా అన్నాడు : –

ఓ మునీ ! అలా హరుడా గిరిమీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మకు పిలిచి తనకొక గృహం నిర్మించమన్నాడు. అంతటనాతడు స్వస్తిక లక్షణంతో అరవై నాలుగు యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతోచేసిన తోరణాలు, ముత్యాలుపొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటిక సోపాన పంక్తులు, వైదూర్యమణుల చిత్తరువులు, ఏడు విశాలమైన గదులు, సకలవిధాల వసతులు, భోగసామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతిశాయిగా రూపొందింది. అందులోచేరి ఆ దేవదేవుడు గృహస్థులు చేయదగిన యజ్ఞం చేశాడు. అందులో పూర్వీకుల పద్ధతినే హరుడు అవలంబించాడు. ఆ సుందరహర్మ్యంలో చాలాకాలం పార్వతితో సుఖాలనుభవిస్తూ శివుడు గడిపాడు. అంతనొకనాడు వినోదానికై పార్వతిని ”కాళీ’ యని (నల్లపిల్లా!) అని సంబోధించాడు. అందులకా శర్వాణి కోపించి యిలా అన్నది. ”బాణ విద్ధమైన వృక్షం, గొడ్డలివేటుకు తెగిన కొమ్మ తిరిగి చిగిరించగలవు. నోట వెడలిన దురుక్తితో అపశబ్దాలతో గాయపడిన, వ్రణం తిరిగి మానిపోదు. నోటవచ్చిన శబ్దబాణాలకు ఎర ఆయిన ప్రాణి రాత్రింబవళ్ళూ యాతన అనుభవిస్తుంటాడు. కనుక అలా అపశబ్దాలు పలుకకూడదని పండితలు ధర్మశాసనం చేశారు. ఆ శాసనాన్ని నీవు నేడు అతిక్రమించి నా మనస్సు నొప్పించావు. కనుకనో దేవదేవా! నేనీ క్షణమే తపోవనానికి వెళ్లున్నాను. నా తపస్సునంతా వెచ్చించి నీచేత మరల ”కాళి” అని పిలిపించుకోకుండా ఆయత్తమై తిరిగి రాగలను. అలా అని శివుని అనుమతితో ఆ క్షణాన్నే ఆకాశమార్గానవెళ్ళి హిమాద్రి శిఖరాన్ని జేరుకుంది. అది అత్యంత రమణీయంగా మనోహతంగా సాక్షాత్తు బ్రహ్మనిర్మితమా అన్నట్లు కన్నుల పండువు కలిగించింది. అక్కడకు చేరగానే, జయ, విజయ, జయంతి, అపరాజిత అనే పలుగురు దేవాంగనలను స్మరించగానే వారు ఆమె దర్శనం చేసుకున్నారు. ఆమె అనుజ్ఞతో ఆమెకు శుశ్రూషలు చేయసాగారు.

అలా పార్వతి కఠోర తపస్సులోనుండగా హిమాద్రి అరణ్యంనుచి పెద్దపులి ఒకటి అక్కడకు వచ్చింది. ఒంటి కాలిమీద నిలబడి తపంచేస్తున్న కాళినిచూచి ఆమె క్రిందపడిపోయిన తర్వాత తినెదనని నిశ్చయించుకుని ఆమె ముఖంవైపు దీక్షగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. దానికి ఏకాగ్రత సిద్ధించింది. అలా బ్రహ్మనుగూర్చి నూరు సంవత్సరాలు ఆ దేవి తపస్సుచేయగా ఆ పితామహుడు ప్రత్యక్షమై, దేవీ! నీ తపస్సుకు సంతోషించాను. వరం కోరుకోవలసినదన్నాడు. అందులకా ఉమ, స్వామీ మొదట ఈ పెద్దపులికి కావలసిన వరమివ్వండి. దానితో నాకెంతో తృప్తికలుగుతుంది అని అన్నది అంతట అద్భుతదీక్ష నెరపిన ఆ వ్యాఘ్రానికి విఘ్నేశ్నర భక్తి, ధర్మబుద్ధి, అజేయత్వం వరాలుగా యిచ్చి విరించి ఉమను ఏమి కావలెనని ప్రశ్నించాడు. ఆంతటనా కాళి ”ఓ మహానుభావా! నా శరీరం తప్తకుందనంలాగ వెలుగొందునట్లు వరమివ్వండి” అన్నది. అందులకు తథాస్తని బ్రహ్మ తనచోటికి వెళ్ళిపోయాడు. అంతట పార్వతి వంటిమీద నల్లని కోశల (పొర) ఊడిపోయి పద్మకింజల్క సన్నిభమైన స్వర్ణకాంతి కలిగింది. ఆ ఊడిన నల్లని (పొర) కోశాన్నుంచి కాత్యాయని జన్మించింది. ఓ నారదా! అంతట ఇంద్రుడామెను సమీపించి ఆ కాత్యాయనిని దక్షిణగా స్వీకరించి పార్వతిని యిలా అర్థించాడు. ”దేవీ! ఈమెను నాకిచ్చి వేయుము. నీ కోశము నుండి పుట్టిన ఈ కౌశికి నాకు సోదరి కాగలదు. అందుచేత నేను కౌశికుడనయ్యెదను. ”ఇంద్రుని కోర్కెను మన్నించి ఆ సుందరి కౌశికిని, అతనికిచ్చి వేసింది. ఆ సహస్రాక్షుడా కౌశికిని వెంటబెట్టుకొని త్వరత్వరగా వింధ్యాద్రికి చేరుకున్నాడు. ఆమెతో ”ఓ మహాబలశాలినీ ! నీవీ వింధ్యశిఖరాన వింధ్య వాసిని అనే పేరుతో సర్వదేవతలచే కీర్తింపబడుతూ విరాజిల్లుము. ఈ సింహంమీద విహరిస్తూ అమర శత్రువులనందరను సంహరింపుము” అని చెప్పి ఆ దేవరాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు.

నారదా ! ఉమకూడ అట్లు వరాన్ని పొంది తిరిగి మందగిరికి వచ్చి భర్తయైన శివునకుమ్రొక్కి వినయంగా నిలబడింది. అంతనా పార్వతితో కలిసి దేవాధిదేవుడు వేయి సంవత్సరాలు కామోపభోగాలనుభవించాడు. అలా శివుడు కామ క్రీడల్లో మునిగి ఉండగా ముల్లోకాలూ క్షోభించిపోయాయి. సముద్రాలు ఘూర్లిల్లాయి. దేవతలంతా భయంకంపితులై ఇంద్రునితో కలిసి బ్రహ్మవద్దకు వెళ్ళి నమస్కరించి యీ సంక్షోభానికి కారణమేమని అడిగారు. ఆయన, శివుడు పార్వతితో మహామైథున క్రీడలోమునిగి యున్నాడు. ఆ తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోతున్నాయని చెప్పి మౌనం వహించాడు. అంతట దేవతలు యింద్రునితో ”దేవపతీ! త్వరపడుము. శివ పార్వతుల మైథునకర్మ ముగియు లోపల మనమక్కడకు వెళ్ళవలె. అది పూర్తిఅయి బాలకుడు జన్మించినచో అతడు నీ యింద్రాధిపత్యాన్ని హరించి వేస్తాడని భయపెట్టారు. దేవతల మాట వినగానే యింద్రుడి వివేకం విచక్షణా జ్ఞానం నశించి, భయం చోటుచేసుకుంది. అతడా క్షణమే దేవతలను అగ్నిని వెంటబెట్టుకొని మందరగిరి శిఖరాన డేరా వేశాడు. శివుని భవనంలోకి వెళ్ళేందుకు ధైర్యంచాలక చాలసేపు తమలోతామాలోచించుకుని చివరకు అగ్నిని పంపించాడు. అగ్ని శివుని యింటిప్రాంగణం వద్దకు వెళ్ళిచూస్తే నందీశ్వరుడు ద్వారంవద్ద నిలచి ఉన్నాడు. దానికి భయపడి అగ్ని కర్తవ్యం ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద హంసలగుంపు ఈశ్వర భవనంలో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇదే తరుణమని ఎంచి అగ్ని ఒక హంసరూపం ధరించి నందికన్నుగప్పి లోపలకు ప్రవేశించాడు. అక్కడ యింకా సూక్ష్మరూపంలో త్రినేత్రుని జటామండలం మీద ఎగురుతూ శివుడికి వినపడునట్లు మెల్లగా దేవతలు ద్వారంవద్ద వేచి యున్నారని చెప్పాడు. అంతట వెంటనే పార్వతిని వదిలి శివుడు అగ్నితోకలిసి ప్రాంగణంలోకి వచ్చాడు. నారదా ! అలా బయటకువచ్చిన హరునిచూచి దేవతలు సంతోషించారు. అందరూ భూమికి తలలు ఆనించి నమస్కారాలు చేశారు. అంతట శివుడు మీకోర్కె తీర్చగలను. మీరెందుకు వచ్చారో చెప్పండని అన్నాడు. అందులకు దేవతలందరూ – ప్రభూ మమ్ముల కరుణింపనెంచుచో మీ యీ మైథునక్రీడను చాలించండి, అని విన్నవించారు. అందులకా దేవదేవడట్లేయని అంగీకరించి, అయితే ఉద్రిక్తమైన వాయీ శుక్రాన్ని ఎవరు గ్రహిస్తారని ప్రశ్నించాడు.

శంకరుని ప్రశ్నకు ఇంద్ర చంద్ర సూర్యుడు మొదలైన దేవతలు ఊబిలో కూరుకొనిపోయిన ఏనుగుల్లాగ హతాశులయ్యారు. దేవతల దైవ్యాన్ని చూచి అగ్నిముందుకు వచ్చి”శివా నీ శుక్రాన్ని నేను భరిస్తాను, వెంటనే వదులుమనెను. దాహం గొప్పవాడినోట్లో నూనెపోసినట్లు శంకరుడా శుక్లాన్ని అగ్నినోట వదిలాడు. శివ తేజాన్ని అగ్నిపానం చేయగానే దేవతలు స్వస్థులై తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. దేవతలువెళ్ళిన తర్వాత శివుడులోనికి వెళ్ళి పార్వతితో, దేవీ దేవతలందరు వచ్చి ఎంతో కష్టంతో అగ్నిని లోనికిపంపి నన్ను బయటకు పిలిపించుకున్నారు. నీ గర్భంనుంచి పుత్రుడు కలుగకుండా నన్ను నివారించి వెళ్ళిపోయారని చెప్పాడు అది విన్నంతనే కోపంతో నిప్పులుగ్రక్కుచు దేవతల్లో ఎవరికీ కూడ యిక ముందు భార్యలవల్ల పుత్రులు కలుగరాదని భయంకరంగా శపించింది. నాకు ఔరసుడు కలుగకుండా కుట్రపన్నిన దుష్టులు అపుత్రులుగా ఉండిపోతారని శాసించింది. అలా దేవతలకు శాపమిచ్చి గౌరిశౌచాలయంలోకి వెళ్ళి మాలిని పిలిచి స్నానానికి ఏర్పాట్లు చేయమన్నది. మాలిని పరిమళభరితమైన ఉద్వర్తన (నలుగుపిండి) ద్రవ్యంలో ఆ దేవి బంగారు వన్నెగల కరచరణాదులకు నలుగుపెడుతూ ఉంటే పార్వతి తన స్వేదం (చెమట) ప్రభావాన్ని గురించి ఆలోచించసాగింది. నలుగుపెట్టి మాలిని స్నానం చేసేందుకు లోపలకు పోయింది. ఆమె పోగానే తనవంటి నుండి రాలిన నలుగుపిండితో గజముఖము, నాలుగు చేతులు, వెడల్పు ఛాతీ గలిగి పురుషాకృతి గల బొమ్మనుచేసి నిలబెట్టింది. ఇంతలో మాలిని వచ్చి ఆమెకు శిరస్నానం చేయిస్తూ మధ్యలో తనలోతాను నవ్వుకొనడం సాగించింది. నారదా! అది చూచి పార్వతి ఎందుకే నీలో నీవు మాటిమాటికి అలా నవ్వుకుంటున్నువు ! అని అడిగింది. అందుకు మాలిని నవ్వుతూ అవునమ్మా నీకు కొడుకు కలుగుతాడని శివుడు గణాధిపతి నందితో అంటూంటే విన్నాను. అందుకే యిలా నవ్వుతున్నా. దేవతలు ఆయనను కొడుకును కనకుండా నివారించారు కదా!”

మాలిని మాటలు విని పార్వతి యధావిధిగా స్నానం చేసి భక్తితో శంకరుని అర్చించి యింటిలోనికి వచ్చింది శంకరుడుకూడ పార్వతికూర్చున్న భద్రాసనం మీదనే కూర్చుండి స్నానం చేశాడు. అప్పుడాయన క్రింద నిలబెట్టిన నలుగు పిండి బొమ్మను చూచాడు. ఆ నేల ఉమాశంకరుల చమటితో తడిసినందున ఆ బొమ్మ జీవసంగల పురుషుడుగా తొండంతో పూత్కారం చేస్తూ నిలబడింది. ఆ గజాననుడిని తన పుత్రుడుగా గుర్తించి శివుడు మహదానందపడ్డాడు. అతడిని వెంట బెట్టుకొని నందికి చూపించి ఆ సమాచారం చెప్పాడు. తర్వాత స్నానం చేసి ఆత్మపూజ, దేవపితృ పూజలు పవిత్ర మంత్రాలతో గావించి సహస్రనామాలు జపిస్తూ ఉమను సమీపించి, పర్వతపుత్రీ! ఇడుగో సకల గుణాఢ్యుడైన నీ కుమారుడు” ని చూపించాడు. అప్పుడా పార్వతి తన శరీర మలం (నలుగుపిండీ) తో చేసిన బొమ్మగజ ముఖంతో నరుడుగా మారడం చూచి సంతోషించి కౌగిలించుకొని ముద్దాడింది. అప్పుడు శర్వుడు, నాయకుడు (తండ్రి) లేకుండా పుట్టిన ఈ బిడ్డ వినాయకుడని ఉమతో అన్నాడు. ఆ పేరుతో మనసుతుడు దేవతలకు వేలవిధాల విఘ్నాలు కలుగజేస్తాడు. ఇతడిని దేవతలు చరాచరజీవులు పూజిస్తారంటూ పార్వతికి అప్పుగించాడు. సర్వగణాల్లో శ్రేష్ఠుడైన ఘటోదరుడను వానిని విఘ్నాలు కలుగుజేసే మాతృగణాలను భూతాలను వినాయకునకు సహాయకులుగా నియమించాడు. పార్వతి తృప్తికోసంగాను హరుడు తన కుమారుని చూచి కొని ఉమ నిజంగానే పరమానందం పొందింది. నారదా ! తర్వాత పార్వతి శివునితో మందరగిరి సుందర కంధరాల్లో విహారాలు గావించింది. ఆ విధంగా కాత్యాయని మరల జన్మించి పురా సమయాన శంభునిశుంభులనే దైత్యులను సంహరించింది. పర్వత పుత్రిగా మృడాని జన్మగాథ చాలా మంగళకరమైనది. పాపహారి. స్వర్గ యశస్సులు చేకూర్చగలిగి భవ్యవృత్తాంతం. నీకు వివరంగా వినిపించాను.

ఇది శ్రీ వామన పురాణంలో యిరవై ఏడవ అధ్యాయం ( 2 ) సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment