పులస్త్య వచనము :-
నారదా ! కశ్యప మర్షి భార్యదనువు. ఆమెకు యింద్రునికన్న బలవంతులగు మువ్వురుకు కుమారులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు శంభుడు, రెండవవాడు శంభుడు మూడవవాడు మహాబలినముచి. ఇంద్రుడు వజ్రాయుధంతో నమునిచి చంపుటకుద్యమింపగా నతడు సూర్యుని రథంతో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవిగాక వాడితో ఇంద్రుడు సంధిచేసుకొని వాడికి ఆస్త్రస్త్రాలతో చావులేకుండునట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అవధ్యుడైవాడు సూర్యరథం వదలి పాతాళానికి చేరుకున్నాడు. నీళ్ళలో మునిగిన వానికి సముద్రపు నురుగు (ఫేనం) కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు జరుగు గాక అని సంకల్పించి ఆ నురుగును చేతులో పట్టుకొని గట్టిగా నోటిని ముక్కును చెవులను కన్నులను దానితో గట్టిగా రుద్దుకున్నాడు. ఆ నురుగలో ఇంద్రుడు రహస్యంగా తన వజ్రాయుధం సృష్టించాడు.అంచేత వాడిముక్కు చెవులు కండ్లు భిన్నాలైపోయి మరణించాడు. నియమ విరుద్ధంగా జరిగిన ఆ దనుజవధ వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య చుట్టుకోగా తన తీర్థంలో మునిగి ఆ పాపం పోగొట్టున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆ నముచిసోదరులు శుంభనిశుంభలు కోపాతిరేకంతో గొప్ప సన్నాహాలుచేసి దేవతలను బాధించసాగారు దేవతలు యింద్రుని నాయకత్వంలో వారలతో పోరి ఓడిపోయారు. ఆ దానవులు యింద్రుని ఐరావతాన్ని యముని మహిషాన్ని వరుణుడి ఛత్రాన్ని మరుత్తలగదను కుబేరుడి శంఖపద్మాది నిధులనూ బలప్రదర్శనం చేసి అపహరించారు. ఆ విధంగా ముల్లోకాలు వంచేసుకొని ఆ రాక్షస వీరులు భూలోకానికివచ్చి అక్కడ మహా అసురుడు రక్తబీజునిచూచి నీ వెవెవ్వడవని ప్రశ్నించారు. అందుకువాడు నేను రక్తబీజునిగా పేరొందిన మహాబలుడను మహిషాసురుని సచివుడను. మా ప్రభువు మంత్రులు చండముండులనే వీరులు దేవికి భయపడి ఈ సముద్ర జలాల్లో దాగుకున్నారు. కాగా మా పభువైన మహిషుడు దేవిచేత వింధ్య శైలం మీద వధింపడినాడు అని తన కథ చెప్పి మీరెవరు. ఎవరి కుమారులు మీ పేరులు బలపౌరుషాలు తెలుపమని అర్థించాడు.
శుంభనిశుంభులన్నారు :-
నేను దనువు ఔరసపుత్రుడను, పేరు శుంభుడు. ఇతడు నా అనుజుడు నిశుంభుడనువాడు. ఇంద్ర రుద్ర దివాకరాది దేవతలెందరనో ఇతడు జయించాడు. సరే ఇక చెప్పుము. మహిషాసురుని వదించినదెవరు ? యీ క్షణాన్నే సైన్యంతో వెళ్ళి వధించి వస్తాను ”నారదా! వారిద్దరూ నర్మదతీరాన అలా మాటాడుకుంటూండగానే చండ ముండులనే రాక్షసులు జలావాసం వదలి అక్కడు వచ్చి రక్తబీజుని ఆశ్రయించి, మృదువైన భాషలో, నీవెవరితో మాటాడుతున్నావని అడిగారు. అందుకతడు వీరిద్దరు శుంభనిశుంభులను దైత్యులు మహాబలశాలురు. వీరిద్దరి సాయంతో మహిషుని చంపిన ఆ దుష్టురాలిని జయించి, ఆ మహిశారత్నాన్ని వివాహమాడతాన్నాడు. అందుకు చంద్రుడు యిలా అన్నాడు. ”అలా అనకుము. ఆ త్రిలోక రత్నం ప్రభువైన శుంభునకేతగి ఉంటుంది. ఆమెను శుంభునకు రూపశాలిని అయిన కౌశికిని నిశుంభునకు ఏర్పాటు చేద్ధాము” అంతట శుంభుడు సుగ్రీవుడను దూతను వింధ్యవాసిని యొద్దకు పంపించాడు. అతడువెళ్ళి దేవితో మాటాడి కోపంతో తిరిగివచ్చి శుంభని శుంభులతో ఇలా అన్నాడు. ”ప్రభూ! మీ తరపున నేనువెళ్ళి ఆ దేవితో రాక్షస లోకంలో సర్వోన్నతుడూ మహాపరాక్రమవంతుడునగు శుంభుడు ముల్లోకాలకూ అధినేత. ఆ మహారాజు యింట్లో ప్రపంచంలో గల రత్నాలన్నీ ఉన్నయి. ఆయన చండముండుల వలన నీవు స్త్రీ రత్నానివని విన్నాడు. నిన్ను తననుగాని తన తమ్ముడు నిశుంభుని గాని పెండ్లాడవలసినదిగా నాద్వారా సందేశం పంపాడని చెప్పాడు. ఆ మాటలకామె పకపక నవ్వి ఇలా అన్నది. సుగ్రీవా! నీవు చెప్పింది నిజమే. త్రిలోకాధిపతి శుంభుడు రత్నాలు ఉంచుకోతగినవాడే. అయితే నేను నీతులు గాలికి వదిలేసి నన్ను యుద్ధంలో జయించినవానినే పెండ్లాడతానని నిశ్చయించుకున్నాను అని చెప్పింది. అందుకు నేను త్రిలోకాలు జయించినవాడు నిన్ను జయించలేడా ? వేరుమాటాడక రావలసినదనగా అందుకామె, అందులకు నేనేమి చేయగలను ? అనాలోచితంగా ఒక నిర్ణయం తీసికొన్నాను. ఆమనోరథం మార్చుకోను. నీవువెళ్ళి శుంభుడితో చెప్పమని త్రిప్పిపంపించినది స్వామీ. ఆమె మాటలు మీకు చెప్పేందుకు తిరిగివచ్చాను. ఒక్క విషయం. ఆమె కోటి అగ్నులతో సమానంగా వెలిగిపోతోంది. ఇది మనస్సులో పెట్టుకొని తర్వాత ప్రయత్నాలు చేయండి.
పులస్త్యుడిలా అన్నాడు :-
సుగ్రీవుని మాటలు విని ఆ మహారాక్షసుడు దూరంగా కూర్చొనిఉన్న ధూమ్రాక్షుడనే రాక్షస వీరునిచూచి, ”ధూమ్రాక్షా ఈ క్షణమేవెళ్ళి ఆ దుష్టురాల్ని నేరస్థురాలిని, బానిసను మాదిరి జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిధా, పో! దాని పక్షాన ఎవరైనా, పితామహుడైనా సరే, నిలబడ్డాడంటే నిర్దాక్షిణ్యంగా వధించి, ఆమెను లాగుకొని రా ! అని ఆజ్ఞాపించాడు. శుంభుని ఆదేశం వింటూనే ధూమ్రాక్షుడు ఆరు వందల అక్షౌహిణుల రాక్షస బలంతో వింధ్యాద్రికి పరుగు తీశాడు. అక్కడ దుర్గాదేవిని చూడగానే దిగ్భ్రమ కలిగింది. వెంటనే ఆమెనుచూచి – ఓ మూర్ఖా ! కౌకికీ ! వచ్చి శుంభుణ్ని వరించలేకపోతే నిన్ను బలవంతంగా జుట్టుపట్టి లాగుకొని పోతానని గర్జించాడు, అబలనైన నేనేం చేయగలను ? నీ యిష్ట ప్రకారమే చెయ్యమన్నది. అంతట ధూమ్రలోచనుడు గదనెత్తుకొని దేవిమీదికి లంఘించాడు. తన మీదకు దూకుతున్న ఆ దుష్టుని చూచిఅంబిక హుంకారంగావించింది. దానితో తన సైన్యంతో సహా వాడు అగ్నిలోబడిన సమిధల్లాగా మాడి బూడిదైపోయారు. దానితో చరాచర జగత్తంతా హాహాకారాలతో దద్దరిల్లింది. ఆ భీషణ రవాన్ని శుంభుడు కూడా విని మహాబలవంతులైన శంభ నిశుంభులను రురుదైత్యుణ్ని యుద్ధానికి పంపాడు. వారంతా గజాశ్వరథ పదాతులతోకూడిన అసంఖ్యసేనతో ఆ కౌశికి ఉన్నచోటికి వెళ్ళారు. వందల కోట్ల సంఖ్యలో వస్తూన్న ఆ రాక్షస సేనను చూడటంతోటే కౌశికి వాహనం సింహంజూలు ఝుళిపించి పంజాచాపి గర్జిస్తూ దానవమూక మీదపడి సంహారకాండ సాగించింది. కొందరను పంజాదెబ్బలతో, కొందరను కోరలతో చీలిస్తే మరికొందరను గోళ్ళతో పరిమార్చింది. అలా సింహంచేతనూ గిరకందరాల్లో ఉండే భూతగణాలూ తదితర దేవి అనుచరులచేత వధింపబడి చావుదెబ్బలు తింటూ ఆ దానవులు తమ నాయకులు చండ ముండుల వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఆర్తనాదాలు చేస్తున్న తమ బలగాలను చూచి ఆ మహసురులు మండిపడి అగ్ని మీద దుకే శలభాల్లాగా దేవిమీదకు దుమికారు. ఆ క్రోధోన్మత్తులను చూడగానే, కోపంతో దేవి భృకుటి ముడిబడింది. అంతనామె ఫాలభాగాన్నుంచే కరాళాకృతితో కళ్యాణిఅయిన కాళి ఊడిపడి ఖట్వాంగం కరవాలం ధరించి మాంసశుష్కమై రక్తసిక్తమైన శరీరంతో నరముండమాల మెడలో వ్రేలాడుతూంటే శత్రుమూకలను సంహరింపసాగింది. కొందరను కత్తితో నరుకగా కొందరను తలలను ఖట్వాంగంతో నుగ్గుచేసింది. ఎందరనో రథగజాశ్వాలతో సహా యమసదనానికంపింది. అంతనాయంబిక కాళిక నోటిలోని ఎందదనో శత్రువీరులను చర్మాంకుశ ముద్గరఘంటా గజయంత్రాలతోసహా విసిరివేయగా నాచండి తన విశాలమైన కోరలమధ్య వారందరను నమిలి పొడిపొడిగావించింది. ఒకడిని జుట్టుపట్టుకొని మరొకడిని మెడపట్టుకొని నేలబడగొట్టి కాళ్ళతో మర్దించి మృత్యువుకప్పగించింది. ఆ విధంగా దేవి సైన్యాధిపతితోసహా శత్రుబలాలన్నింటినీ భక్షించడం చూచి రురుడు కాలికి బుద్ధి చెప్పసాగాడు. అది చూచిన దుర్గ ఖట్వాంగంతో తలమీద ప్రహరించగా వాడు నరుకబడి మహా వృక్షంలాగా నేలకొరిగాడు.
అలావాడు పడిపోవడం చూచి ఆ దుర్గ చెవి నుంచి చరణాల వరకు గల తన కోశాన్ని (కవచం) కోసి దానితో జడ నల్లింది. అందులో ఒకటి ఉపయోగించకపోగా దాన్ని నేలకు విసిరి కొట్టింది. అందులో నుంచి నూనెకారుతున్న జుట్టుతో, సగం నలుపూ, సగం తెలుపూ అయిన దేహంతో ఒక రౌద్రాకృతి బయలుదేరి, ”నేను కనీసం ఒక మహాదైత్యుడి నైనా సంహరిస్తాన”ని బొబ్బ పెట్టింది. అంచేత ఆమెకు చండమారి అనే పేరు వచ్చింది. ఆమెను చూచి దేవి, ”కళ్యాణీ! నీవు వెళ్ళి చండముండుల కట్టి తీసుకొని రమ్ము. నేను స్వయంగా వారలను వధిస్తా”నని ఆజ్ఞాపించింది. అంతటనా దేవి చండముండులను వెంబడించగా వాండ్లు దక్షిణ దిక్కుగా గుడ్డలూడిపోగా పరుగిడసాగారు. అంతనాదేవి గరుడునిలాంటి వేగంగల గాడిదమీదనెక్కి వారల వెంటబడినది. అంతటనామెకు యముని మహిషం పౌండ్రం కనిపించగా, కాల సర్పం లాంటింది దాని కొమ్ము పెకలించి పట్టుకొని త్వరగా రాక్షసులననుగమించింది. ఆ దైత్యులు భూమి వదలి గగనమార్గానకు పోగా దేవి కూడ గాడిదమీద వారల వెంటనే విజృంభించింది. దారిలోనొకచోట కర్కోటక మహాసర్పాన్ని తినబోతున్న గరుడపక్షి కనిపించింది. దేవిని చూడడంతో ఆ పక్షి భయంతో కంపించి మాంసం ముద్దగా అయిపోయింది. దానివంటి మీదిరెక్కలన్నీ ఊడిపడ్డాయి. అంతట ఆ చండమారి ఆ రెక్కలనూ కర్కోటక నాగాన్ని చేజిక్కించుకొని రాక్షసులను వెంబడించి భయంతో గడగడవణికిపోతున్న ఆ చండముండులను పట్టుకున్నది. వారలనాకర్కోటక నాగంతో బంధించి వింధ్యకుగొని తెచ్చింది.
అంతట భయంకరమైన కోశా (కవచా)న్ని దేవికి సమర్పించి, గరుడుని ఈకలతో అలంకరించబడిన ఆ రాక్షసుల తలలను తులలేని మాలగా చండికకు యిచ్చింది. వానితోబాటు సింహం చర్మంతో చేసిన వడ్డ్యాణాన్ని గూడ సమర్పించుకొని కడుపార రాక్షస రుధిరం త్రాగింది ఆ చండమారి సమర్పించిన ఆ చండముండుల శిరస్సులను ఆ దుర్గాదేవి మహాక్రోధంతో ఖండించింది. అంతట శుష్కరేవతీదేవి వారల సర్పాలతో నొకశిరోవేష్టనం తయారుచేసి చండమారితో కౌశికివద్దకు వెళ్ళి ”భగవతీ!దైత్యుల శిరస్సులను నాగరాజుతోగూర్చి చేసిన ఈ ఉత్తమ శిరోవేష్టనాన్ని స్వీకరించు”మనెను. దేవి దానిని తీసికొని చండమారి శిరస్సున అలంకరించి ”నీవు భయంకరమైన కార్యం సాధించావు. ఈ చండముండుల శిరోమాలను ధరించి నేటి నుండీ ‘చాముండ’ అనే శుభనామంతో ఖ్యాతిని గాంచగలవనెను. ఈ మాటలు చెప్పి ఆ త్ర్యంబకేశ్వరి చండముండుల శిరోమాల ధరించి దిగంబరంగా ఉన్న ఆ చాముండతో యికవెళ్ళి మిగిలిన శత్రువులనందరను మట్టుపెట్టుమని ఆదేశించింది. అట్లేయని ఆ రాసభవాహిని దున్నపోతు కొమ్ముతో విజృంభించి శత్రుసైన్యాన్ని సంహరించింది. మిగిలిన వారలందరను మ్రింగివేసింది. ఆ విధంగా అంబిక, చర్మముండ, సింహంభూతగణాలచేతుల్లో నిశ్శేషంగా వధించబడి ఆదనుపుంగవులంతా శంభులోకానికి చేరారు.
ఇది శ్రీ వామన మహాపురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹