Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 -అరవై నాల్గవ అధ్యాయం

నారదుడిలా అన్నాడు :-

ఓ మహర్షీ ! అలా పాతాళానికి వెళ్ళిన అంధకుడేమి చేశాడు? మందరగిరి మీద నున్న శంకరుడేమి చేశాడో దయచేసి చెప్పండి. అందుకు పులస్త్యుడిలా చెప్పసాగాడు. నారదా! పాతాళానికి పారిపోయిన అంధకుడు మదనజ్వాలల్లో తగలబడుతూ భరించలేక తోటి దానవులతో యిలా అన్నాడు. ”ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ శైల పుత్రిని తెచ్చి నాయెదుట నుంచువాడే నాకు నిజమైన స్నేహితుడు, సోదరుడు, బాంధవుడు, జనకుడు.” కామాంధుడై అలా మాటాడే అంధకుని వారిస్తూ ప్రహ్లాదుడు మేఘ గంభీరమైన స్వరంతో యిలా మందలించాడు. వత్సా ! ఆ శైల పుత్రి ఎవరనుకున్నావు ? ధర్మతః నీకు తల్లి అవుతుంది. త్రినేత్రుడు తండ్రి. కారణం చెబుతున్నా వినుము. ధర్మనిరతుడైన నీ తండ్రి అపుత్రకుడైన నందున పుత్రార్థియై పూర్వం మహాదేవునిగూర్చి తపంచేశాడు. అతనికి ఒక గ్రుడ్డివాడైన బిడ్డనిస్తూ శంకరుడిలా చెప్పాడు. హిరణ్యాక్షా ! ఒకసారి వినోదార్ధం పార్వతి నా మూడు నేత్రాలు మూసింది. దానితో యోగంలో ఉన్న నా ఎదుట అంధకారం ఆవరించింది. ఆ చీకటిలో నుంచి నీలమేఘంలాంటి గొంతుతొ ఒక భూతం ఆవిర్భవించింది. అలాంటి ఈ అంధకుడిని నీకు తగిన పుత్రునిగా యిస్తున్నాను తీసుకొమ్ము. వీడు అధర్మానికి పాల్పడి దుష్టమైన లోకులకు బాధలు కలిగించినప్పుడు, ముల్లోక జననిని వాంఛించినప్పుడు గానీ, తన రాక్షసులను బంపి విప్రులను సంహరించినప్పుడు కాని నేను స్వయంగా వీడికి దేహశుద్ధి చేస్తా. అలా చెప్పి శంకరుడు తన మందరాచలానికి తిరిగి వెళ్ళాడు. నీతండ్రి నిన్ను తీసుకొని యింటికి వెళ్ళాడు. పాతాళానికి . ఈ కారణాన పార్వతి నీకు తల్లి అవుతుంది. సర్వలోక గురుడైన శివుడు నీకు సాక్షాత్తు తండ్రి అవుతాడు.

నీవు తపస్సు చేశావు, శాస్త్రాలు చదివావు, సద్గుణుడివి. నీలాంటివాడిటువంటి పాపసంకల్పాలు పెట్టుకోరాదు. ఆ భవుడు త్రిలోకనాధుడు, అవ్యక్తుడు, సర్వనమస్కృతుడు అజేయుడు. ఆయన భార్య నీకు తగినది కాదు. ఓ సురమర్దనా ! ఆ గిరి పుత్రిని, శివుని ఆయన గణాలను జయించనిదే నీవు పొందజాలవు. చేతులతో ఈది సముద్రాన్ని దాటగల వాడు సూర్యుని ఊడబీకి భూమ్మీద పారవేయగలవాడు, మేరుగిరి పెకలించగలవాడే ఆ త్రిశూలిని జయించగలడు.ఒక వేళ అలాంటి పనులు చేయగల శక్తిశాలురున్నప్పటికీ వారందరూ ఏకమైనా సరే హరుని జయింపలేరు. ఇది ముమ్మాటికి నిజం. ఓ దానవా ! దండుడనే రాజు పరస్త్రీ వాంఛతో మూర్ఖుడై రాజ్యంతోసహా నశించి పోయిన విషయం నీవు వినలేదా? అయితే విను. ఒకప్పుడు దండుడనే మహాబలశాలి నరపతి ఉండేవాడు. ఆతడు మహా తేజస్వియగు శుక్రాచార్యుని పురోహితునిగా నియమించుకున్నాడు. ఆయన పర్యవేక్షణలో వివిధాలయిన యాగాలు చేశాడు. శుక్రునికుమార్తె అరజ. ఒక పర్యాయం రాక్షసరాజు వృషపర్వుని వద్దకు వెళ్ళిన శుక్రుడు ఆయన సవర్యలనందుకుంటూ అక్కడే బహుకాలం ఉండి పోయాడు. ఆశ్రమంలో అరజ అగ్నిహోత్రాలు చూచుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకనాడా దండుడాశ్రమానికి వెళ్ళి శుక్రుడెక్కడ అని పరిచారకులను అడిగాడు. వృషపర్వుని యజ్ఞానికి వెళ్ళారని చెప్పగావిని ఆశ్రమం ఎవరు చూస్తున్నారని మరల ప్రశ్నించాడు. గురుపుత్రిక అరజ ఉన్నదని విని లోనికి వెళ్ళి ఆ సుందరిని చూచాడు. అంతటనామె సౌందర్యాన్ని చూచి ఆ ఇక్ష్వాకునందనుడు మృత్యుచోదితుడై కామాగ్నికి లోనైనాడు. వెంటనే తన సేవాపరివారాన్నంతా వెనకకు పంపించాడు. ఆశ్రమ శిష్యులను కూడా బయటకు పంపి తానొక్కడే అరజ ఉన్న చోటకు వెళ్ళాడు. ఆమె ఆ రాజును చాలా సంతోషంతో లేచి స్వాగంతం చెప్పి సోదరభావంతో అతిథి సపర్య చేసింది.

అంత నారాజు నన్ను కామానలందహిస్తోంది. నీ కౌగిలింత అనే చల్లటి నీరు చల్లి దానిని చల్లార్చుమనగా నా అరజ, నరవరా ! తొందరపడి ఆత్మనాశనం చేసుకోనవద్దు. నా తండ్ర మహాకోపిష్ఠి. దేవతలను సైతం దహించివేయగలడు. ఓ మూర్ఖుడా! దుర్వినీతుడవైన నీవు నా తండ్రి శిష్యుడవైనందున నాకు సోదరుడవు గుర్తుపెట్టుకో మని మందలించగా ఆ దైవోపహతుడో సుందరీ, శుక్రుడెప్పుడో నన్ను శాపదగ్ధుణ్ణి చేయగలుగునేమోకాని ఈ క్షణాన్నే కామానలం నన్ను దహిస్తుంది. అనగా నా అరజ క్షణకాలమోర్చుకొనుము. నాతండ్రినే అడుగుము. ఆయననన్ను నీకుతప్పుక యివ్వగలడనగా నీ కామార్తుడో అందాలబరిణా ! యిక నెంతకాలమూ ఓర్చుకోలేను. చేజిక్కిన అవకాశాన్ని వదలుకుంటే తర్వాత ఎన్నో విఘ్నాలు వస్తాయి. అనగా నా అరజ ! రాజకుమారా ! స్త్రీలు అస్వతంత్రలుగదా. నన్ను నా అంతట నేను నీకర్పించుకోజాలను. వేయేల ఆత్మ నాశనాన్ని కొనితెచ్చుకోవద్దు. వెళ్ళిపో. శుక్రశాపానలంలో భృత్యజ్ఞాతి బాంధవులతో సహా దగ్ధంకాబోకుము. అని మందలించింది. అంతట ఆ దండుడు సుందరాంగీ ! పూర్వం దేవయుగంలో జరిగిన చిత్రాంగద చేష్టితం చెబుతాను విను. రూప¸యవ్వన లావణ్యాల్లో మిన్నయైన పద్మినీ జాతికి చెందిన చిత్రాంగద అనే సుందరి విశ్వకర్మ పుత్రిక. ఆ చిన్నది ఒక పర్యాయం సఖులతో నైమిషారణ్యానికి స్నానానికై వెళ్ళి నీళ్ళలోకి దిగునంతలో నచట కుసుదేవ తనయుడు సురథుడను రాజు వచ్చి ఆ స్నాన సుందరిని చూచి మదనాగ్నికి ఎర అయినాడు. ఆ రాజును చూచి ఆ సుందరి సఖులతో ఉన్న వాస్తవం చెప్పింది. ఈ రాజు నన్ను చూచి మోహించి కామాగ్నిలో వేగుతున్నాడు. అటువంటి ఆర్తుడికి నన్ను నేను సమర్పించుకొనడమే యుక్తమైనపని. అన్న చిత్రాంగదను వారించి సఖులు, సుందరీ, ఇంత సాహసము చేయవద్దు. నిన్నర్పించుకొనుటకు నీకు స్వతంత్రత లేదు ! సకల ధర్మవిదుడు శిల్పశాస్త్ర పారంగతుడైన నీ తండ్రి ఉండగా ఇలా ఈ రాజుకు లోబడుట తగదు సుమా అని మందలించారు.

అంతలోపల బుద్దిమంతుడు సత్యవాదియైన సురథుడు మన్మథ పీడితుడై ఆ చిత్రాంగదను సమీపించి యిలా అన్నాడు. ఓ మదిరాక్షీ ! నీ చూపులతోనే నన్ను పిచ్చివాడిని చేశావు. నీ చూపులనే బాణాలతో బాటు మన్మథునికోలలు కూడ నన్ను ప్రహరిస్తున్నవి. కనుక నీ స్తనాలనే మెత్తటి శయ్యమీద నన్ను పరుండబెట్టికొనుము. లేదో, నిన్ను చూస్తూండే కొద్దీ మన్మథుడు నన్ను మాటిమాటికీ ప్రహరిస్తూనే ఉంటాడు. సురథుని మాటలకా సర్వాంగ సుందరి కరగి పోయినసఖులు వద్దంటున్నా వినకుండా తన్నుతాను సమర్పించుకున్నది. ఈ విధంగా ఆ కోమలి పూర్వం ఆరాజు ప్రాణాలు కాపాడింది. అలాగే ఓ సుశ్రోణీ ! నీవు నన్ను కూడా రక్షించదగుదువు. దండుని ఆ మాటలనందుకొని ఆ ఆరజ, అంతవరకేనా రాజా, ఆతర్వాత ఏం జరిగిందీ వినలేదా ? ఆ విషయం నేను చెప్పెద వినుము. అలా తన కుమార్తె స్వతంత్రించి సురథునకు ఆత్మ సమర్పణం చేసుకొనడం వినగానే ఆమె తండ్రి యిలా శపించాడు. ఓసీ! మతి చెడినదానా ! ధర్మమార్గం వదలి స్త్రీ దౌర్బల్యానికి లోనై ఒకడికి ఆత్మసమర్పణం చేసుకున్నావు గనుక యిక నీకు వివాహం జరుగదు. కనుక పురుష సౌఖ్యం భర్త ప్రేమ పొందవు. పుత్రులూ కలుగరు పొమ్ము. ఆ భయంకరమైన శాపాక్షరాలు వెలువడినంతనే కృతకృత్యుడు కాని ఆ సురథుణ్ణి సరస్వతీ నది తన ప్రవాహంలో పదమూడు యోజనాల దురం కొనిపోయి వదలినది. రాజుకనపడక పోవుటతో నామెకూడ మూర్ఛితురాలైంది. అంతట సఖులు సరస్వతీ శీతలోదకాలు ఆమెమీద చల్లి సేదదీర్చుటకు చాలాసేపు ప్రయత్నించారు. అయినా ఆచిత్రాంగద చచ్చినదానివలె పడియుండుటచే మరణించినదని నిశ్చయించుకొని దహనం చేయుటకై కట్టెలు తెచ్చుట కొకరు నిప్పుతెచ్చుట కొకరుగా తలా ఒక ప్రక్క వెళ్ళి పోయారు. సఖులందరూ వెళ్ళిపోయిన తర్వాత తెలివివచ్చి ఆ సుందరి నలువైపులా చూచి నరపతినీ, స్నేహితురాండ్రను కానక ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కండ్లతో హతాశురాలై సరస్వతీ నదిలో పడిపోయింది. ఓ రాజా ! ఆ కాంచనాక్షి సరస్వతి ఆ అభాగ్యురాలిని మహావేగంతో తీసుకుపోయి అలల సుడులతో నిండిన గోమతినదిలోకి నెట్టివేసింది. గోమతి కూడ ఆమె దుస్థితితెలుసుకొని సింహ వ్యాఘ్రాలతో నిండిన ఒక మహారణ్యంలోకి నెట్టివేసింది. ఈ విధంగా ధర్మాన్నెదిరించి స్వతంత్రించిన ఆమె దుస్థితికి లోనైనది. కాబట్టే నేను స్వతంత్రించి ప్రాణప్రదంగా కాపాడుకుంటున్న నా శీలాన్ని నీ కర్పించను అన్నది. ఆ అరజ మాటలు విని ఇంద్రతుల్య బలశాలి అయిన ఆ దండ నృపతి అర్థక్షయం కలుగజేసే స్వార్థంతో నవ్వుతూ యిలా అన్నాడు.

దంతుడిలా అన్నాడు : – ఓ సన్నని నడుముగలదానా ! తర్వాత నామె తండ్రికి పట్టినగతి సురథరాజు వృత్తాంతం కూడా విను. రాజుతో విడదీయబడి ఆ విధంగా మహారణ్యంలో పడిపోయిన ఆ సుందరిని ఆకాశమార్గాన పోతున్న అంజనుడనే యక్షుడు చూచి సమీపించి సాంత్వన వాక్యాలు పలికి, తరుణీ! సురథుని గూర్చి విచారించకుము. తప్పకుండా మరల మీయిరువురకు సమాగమం కలుగుతుంది. నీవు వెంటనే శ్రీకంఠేశ్వరుని దర్శనానికి వెళ్ళుమని సలహాయిచ్చాడు. యక్షుడు చెప్పినట్లా సునేత్రి ఆలసింపక యమునానది దక్షిణ తీరాన ఉన్న శ్రీకంఠదేవుని క్షేత్రానికి వెళ్ళి యమునలో స్నానం చేసి శివుని చూచి తలవంచుకుని అచటనే సూర్యుడు నడిమింటికి వచ్చేవరకు కూర్చున్నది. అంతట అక్కడకు మహాతపస్వి సామవేది పాశుపతాచార్యుడైన ఋతధ్వజుడు దేవుని దర్శనం స్నానం చేయుటకు వచ్చాడు. మన్మథుడు వదలిన రతీదేవి వలె అక్కడ దీనయైయున్న ఆ సుందరి చిత్రాంగదను చూచి ఆ ముని కొంతసేపు ఆలోచించుచుండగా ఆమె లేచి చేతులుజోడించుకొని నిలబడినది. అంతనా తపస్వి, అమ్మాయీ దేవాంగనవలె ఈ నిర్జనారణ్యంలో పడియున్న నీవెవరవు యిక్కడికేల వచ్చితివని అడుగగా నా జవ్వని, ఏమియు దాచక తనకథనంతను వివరించింది.ఆమె కథనంతను విని మహాకోపంతో నా ఋతధ్వజుడు శిల్పినీ విధంగా శపించాడు. తగిన వరునకివ్వవలసిన కుమార్తెను అలా యివ్వక పతితో సమాగమం కలుగకుండా జేసిన ఆ దుష్టుడు వానరాకారుడౌగాక ! అని శాపాక్షరాలు పలికి మరల విధానం ప్రకారం స్నానంచేసి సాయం సంధ్యను ఉపాసించి యథోక్తవిధిగా శ్రీకంఠుని పూజ గావించాడు. తర్వాత నాఋషి భర్తకోసం తపిచే అందమైన కనుబొమలు , పలువరుసగల ఆ చిత్రాంగదను చూచి ఇలా అన్నాడు.

ఓ సుందరీ ! నీవు వెంటనే సప్తగోదావర క్షేత్రానికి వెళ్ళు. ఆ శుభ ప్రదేశంలో మహానుభావుడైన హాటకేశ్వర స్వామిని ఉపాసించుము. అరటికాండముల వంటి తొడలుగలదానా ! నీవక్కడ ఉండగా కందరమాల అనుదైత్యుని పుత్రిక దేవవతి, అంజనుడను యక్షుని కుమార్తె నందయంతి యను తపస్విని, మరొక సుందరి వర్జన్యుని తనయ వేదవతి అక్కడకు చేరుదురు. వీరు మువ్వురూ హాటకేశ్వరుని చరణాలకడ సప్తగోదావర సంగమజలాలలో కలిసినప్పుడు నీవు నీ భర్తను మరల కలుసుకోగలవు. ఆ ముని మాటలు వినినంతనే ఆలసింపక నా చిత్రాంగద సప్తగోదావర సంగమంవద్ద గల హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి శుచిగా భక్తి శ్రద్ధలతో కందమూలఫలాలు తింటూ నా హాటకేశ్వరుని పూజింపమొదలు పెట్టింది. జ్ఞాన సంపన్నుడైన ఆ ఋషి శ్రీ కంఠేశ్వరుని ఆలయం మీద , చిత్రాంగదకు హితము చేయు సంకల్పముతో ఒక మహాఖ్యాన గర్భితమైన శ్లోకం యీ విధంగా వ్రాశాడు. ”ఈ మృగలోచని దుఃఖాన్వితను పరాఖ్రమంతో పోగొట్టజాలిన, త్రిదశుడుగాని, అసురుడుగాని యక్షుడుగాని నరుడు గాని రజనీచరుడు గాని లేడు!” అలా విశ్వకర్మ పుత్రిని ఆదేశించి ఆముని, శరణ్యుడు సర్వజనవంద్యుడైన పుష్కరనాథునీపయోష్ణీ (నదిని సేవించుటకై విశాలాక్షిని సంస్మరిస్తూ వెళ్ళాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment