Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 -అరవై ఐదవ అధ్యాయం

దండుడిలా అన్నాడు :-

ఓ ఆరజా ! ఆ చిత్రాంగద అక్కడ వీరుడైన సురథుడ్ని స్మరిస్తూచాలాకాలం ఉండిపోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపంవల్ల భయంకరాకారంతో వానరుడై మేరుశిఖరాన్నుంచి భూమ్మీద శాలూకినీ నదీతీరాన శాల్వేయ పర్వతం వద్ద భయంకర అరణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్టుడు దేవపతిగా ప్రసిద్ధిగాంచిన తన ప్రియ పుత్రికను వెంట బెట్టుకని అక్కడకు వచ్చాడు. తండ్రితో కలిసివస్తున్న ఆ చంద్రముఖిని చూచి ఆ వానర శ్రేష్ఠుడు బలవంతంగా ఎత్తుకొని పోయాడు. తన కుమార్తెనతడు హరించుకొని పోవుటచూచి మండిపడి ఆ కందరుడు కత్తిదుసి వానిని వెంబడించాడు. తనమీదకు దూకుతున్న దైత్యుని చూచి ఆ కపి దేవవతితో హిమాచలానికి పారిపోయాడు. అక్కడ యమునా తీరాన శ్రీకంఠేశ్వరుని అక్కడకు సమీపంలో ఋషివలెనటువంటి శూన్యాశ్రమాన్ని చూచి ఆ పవిత్రాశ్రమం లోపల వేదవతిని ఉంచి తాను ఆ రాక్షసుడు చూస్తుండగా కాళిందీ జలాల్లో మునిగిపోయాడు. అంత నా దానవుడు వానరంతోబాటు తన కుమార్తె కూడా నదిలో మునిగి చనిపోయిందని భావించి నిరాశుడై తనపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ వానరుడా విధంగా కాళిందీ ప్రవాహంలో కొట్టుకొనిపోయి సజ్జనులకావాసమై ‘శివి’ అనే దేశం చేరాడు. అక్కడ నీళ్ళల్లో నుండి బయటపడి దేవవతిని వదలి వచ్చినచోటకు వెళ్ళాలని త్వరగా బయలుదేరాడు.

అంతట అంజమడను యక్షశ్రేష్ఠుడు తన కూతురు నందయతితో అటువైపు రావడం చూచి ఆమెయే దేవవతి యనుకొని తను నీళ్ళలో దూకడం వ్యర్థమైనదని భావించాడు. అలా అనుకొని ఆమెను పట్టుకొనుటకు లంఘించగా నామె భయపడి హిరణ్వతీ ప్రవాహంలో దూకింది. అలా తన పుత్రిక నదిలో పడిపోవటం చూచి చాలాసేపు దుఃఖించి ఆ యక్షుడంజనాద్రికి వెళ్ళిపోయాడు. అక్కడ మౌనవ్రతంతో ఆ మహాతేజస్వి అనేక సంవత్సరాలు తపస్సులో ఉండి పోయాడు. హరిణ్వతి ప్రవాహంలో కొట్టుకొని పోయిన నందయంతి మహాపుణ్యభూమి అయన కోశల దేశం చేరింది. సాధువు లకు నెలవైన ఆ భూమి మీద విలపిస్తూ పోయిపోయి ఆ సుందరి ఆసంఖ్యాకాలయిన ఊడలతో విశాల ప్రదేశంలో శివుని జటాభారంలాగ విస్తరించిన ఒక మర్రిచెట్టు మూలన ఒకశిలా వేదిక మీద వెళ్ళి కూర్చున్నది. అవటచ్ఛాయలో విశ్రమించిన ఆమెకు ఇలా కొన్ని మాటలు వినబడ్డాయి.”తపోధనుడైన నాతండ్రికి, నీపుత్రుడు మర్రిచెట్టుకు బంధింపబడి ఉన్నాడని చెప్పగ పుణ్యాత్ములు లేరా” ఆ మాటలు విని ఆ సుందరాంగి క్రింద పైన ప్రక్కలా నలువైపులా కలయచూచింది. అంతట నామె ఆ మర్రిచెట్టు చిటారుకొమ్మన, తన జడలతో చెట్టుకొమ్మకు గట్టిగా కట్టి వేయబడిన ఐదేండ్ల బాలకుని చూచి చాలా దుఃఖించి బాబూ ! ఏ పాపిష్ఠుడు నిన్నిలా బంధించాడు? అని అడిగింది. అంత నాబాలకుడా నందయంతితో అన్నాడు. ఓమహనీయురాలా! పరమ దుర్మార్గుడైన ఒక కపి నన్నిక్కడ జడలతో బంధించాడు. కేవలం తపోబలంతో బ్రతికి ఉన్నాను. మహేశ్వరునకావాసమైన పురోన్మత్తపురంలో నా తండ్రి పరమ తపోరాశి ఋతధ్వజుడున్నాడు. ఆ మహాయోగి జపసమాధిలో ఉండగా సర్వశాస్త్ర విసారదుడనై తుమ్మెదలతో ఆవరింపబడి నేను జన్మించాను. అంతట నా తండ్రి నాకు జాబాలి అని నామకరణం చేసి యిలా అన్నాడు. నీవు అయిదువేలేండ్లు బాలుడివిగా ఉంటావు. పదివేలేండ్లు కౌమార్యం యిరవై వేలేండ్లు వనం, తర్వాత నలభై వేలయేండ్లు పైకాలం గడుపుతావు. ఇందులో బాల్యంలో అయిదు వందల ఏండ్లు దృఢ బంధనం అనుభవిస్తాము, కౌమారంలో వేయేండ్లు శరీర బాధతో కష్టపడతావు. వనంలో రెండువేలేండ్లు పరమ సౌఖ్యాలు అనుభవిస్తావు.

ముసలితనమలో, నాలుగువేలేండ్లు భూమ్మీద శయనిస్తూ దుష్టాన్నం భుజిస్తూ బాధలనుభవిస్తావు. ఇలా నా తండ్రి నా విషయం వివరించాడు. నేను అయిదేండ్ల బాలుడుగా నడుస్తూ హిరణ్వతీనదికి వెళ్తుండగా ఆ కపివీరుడు చూచి, మూర్ఖుడా ! మహాశ్రమంలో నేనుంచిన దేవవతిని తీసుకొని ఎక్కడికెళ్తున్నావని భయంతో గడతడలాడుతున్న నన్ను పట్టుకొని నా జడలతోనే ఈ వట వృక్షానికి గట్టిగా కట్టివేశాడు. ఆ దుష్టుడు నేను క్రిందపడకుండా తీగలతో త్రాళ్ళతో, క్రిందా పైన నలువైపులా అభేద్యంగా బంధించాడు. ఇలా లతాయేంద్ర బద్ధుణ్ణి గావించి ఆ వానరుడమర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను చూచినదంతా యథాతథంగా నీకు చెప్పాను. ఇక ఓ సుందరీ! నీవెవరు ? ఎవరితో వచ్చి ఈ మహారణ్యంలో వంటరిగా చిక్కుబడి పోయావు. నాకు చెప్పమని ఆ బాలుడడిగాడు. అందులకా నందయంతి, అంజనుడను యక్షునకు ప్రవ్లూెచ వలన గలిగిన కుమార్తెను నేను. పేరు నందయంతి. ముద్గలమమర్షి నా జాతకం చూచి నేను నరేంద్ర మహిషినయ్యెదనని జోష్యం చెప్పాడు. వెంటనే శుభాశుభసూచకంగా దేవదుందుభులు మ్రెగాయి . పిడుగుల ధ్వనులు వినిపించాయి. అంతనాఋషి ఈ బాలిక రాజుభార్య కావడం తప్పదు. అయితే కన్యగా ఉన్న దినాల్లో ఆపదల్లో చిక్కుంకుంటుందని తుది నిర్ణయం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకు మా తండ్రి నన్ను వెంటబెట్టుకొని పవిత్ర తీర్థానికి వెళ్తుండగా హిరణ్వతి నది తీరాన ఒక వానరం నామీద దూకింది. నేను భయంతో సాగరాభి ముఖంగా పోతున్న హిరణ్వతీ ప్రవాహంలో పడిపోయి నిర్మానుష్యమైన ఈ దేశానికి కొట్టుక వచ్చినాను. అంటూ తన వృత్తాంతమంతా వినిపించింది. అదివని జాబాలి ఆమెతో ఓ కోమలీ! నీవు యమునా తీరానగల శ్రీకంఠకేశ్వర వెళ్ళు. ప్రతి దినం మధ్యాహ్నవేళ కచటకు నా తండ్రి శివుని అర్చించుటకు వచ్చును. ఆయనకాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తే నీకు మేలు తప్పక కలుగుతుందని చెప్పాడు. అదివిని నందయంతి తన కష్టాలు పోగొట్టు కొనుటకై త్వరగా హిమాచలాన యమునా తీరానగల శ్రీకంఠక్షేత్రానికి బయలుదేరి చాలా కాలం కందమూల ఫలాలు తింటూ ప్రయాణం చేసి తుదకుశంకర నిలయానికి చేరుకుంది.

ఆమెలోకవంద్యుడగు శ్రీకంఠకేశ్వరునకు ప్రణమిల్లి అచట వ్రాయబడిన శ్లోకం చదువుకొని అర్థం చేసుకుంది. అంతట నామె కళకళలాడే నవ్వు మొగముతో దాని క్రిందనే జాబాలి చెప్పిన శ్లోకం తాను వ్రాసింది. ఆ వెంటనే తన గాథను కూడ తెలిపే మరొక శ్లోకం కూడా వ్రాసింది ఈ విధంగా ”ముద్గలుడు రాజపత్నివి అవుతావని నాకు జోష్య చెప్పాడు. అయితే నేనీ దురవస్థలో ఉన్నాను. ఎవరో ఒక ప్రభువు నన్ను రక్షించుగాక. ”ఆ శిలావేదకమీద ఆ విధంగా వ్రాసి ఆయె యమునలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ మత్తకోకిల నాదాలతో మారుమ్రోగుతున్న ఆశ్రమాన్ని చూచి ఆ ఋషివర్యుడక్కడ తప్పకుండా ఉన్నాడని అనుకుంటూ ఆ ఆశ్రమం లోపల ప్రవేశించింది. అయితే అక్కడ దివ్యకాంతిలో వెలుగుతున్న పవిత్రురాలు దేవవతి ముఖం ఎండిపోయి, కళ్ళలో ప్రాణం పెట్టుకొని వాడిన తామరపూవులా కనిపించింది. ఆ యక్షపుత్రి తనవైపు రావడం చూచి దైత్యకుమారి లేచి నిలబడి ఈమె ఎవరా, అని, ఆలోచించసాగింది. అంతట వారిద్దరు ఒకరినొకరు సమీపించి స్నేహపురస్సరంగా గాఢాలింగనాలు కావించుకున్నారు. ఒకరి నొకరు ప్రశ్నించుకొని పరస్పర వృత్తాంతాలు తెలుసుకున్నారు. అలా వారు కుశల ప్రశ్నలు వేసుకొనుచుండగా నా తత్వదర్శి అయిన మునిశ్రేష్ఠుడు స్నారార్థం శ్రీకంఠేశ్వరాలయానికి వచ్చి అక్కడ శిలావట్టం మీద వ్రాయబడిన అక్షరాలు చదువుకొని ముహూర్తకాలం ధ్యానస్తుడై అంతా సాకల్యంగా తెలుసుకున్నాడు. అంతట నా ఋతధ్వజుడు త్వరగా స్వామిని అర్చించి’ ఇక్ష్వాకు చక్రవర్తిని చూచుటకు అయోధ్యకు పోయి చేరుకున్నాడు. ఆ రాజ శ్రేష్ఠుని చూచి ఆ తపస్వి ఓ నరశార్దూలా ! రాజా ! నావిజ్ఞప్తి వినుము. సర్వగణోపేతుడు సర్వశాస్త్రకోవిదుడైన నా కుమారుని ఒక వానరుడు నీ రాజ్యసీమలో బంధించియున్నాడు. అర్థశాస్త్రనిధి అయిన నీ కుమారుడు శకుని తప్ప మరెవ్వరు ఆ బాలుని విడిపించ జాలరన్నాడు.

ఓ సన్నని నడుముగల అరజా ! ఆ మునిమాటలు విన నా తండ్రి తన ప్రియ తనయుడు శకునిని ఆయనవెంట వెళ్ళమని ఆదేశించాడు. అంతట మహాభుజుడైన నా సోదరుడు మునివెంట వెళ్ళి ఊడలతో దిశలన్నీ కప్పివేస్తూ ఉన్న ఆ బ్రహ్మాండమైన మర్రిచెట్టును సమీపించి వృక్షం చివర కట్టబడి ఉన్న మునికుమారుణ్ణి చూచాడు. ఆ బాలకుని నలు వైపులా లతలు గట్టిగా బంధించి ఉన్నాయి. అతని జటలతోనే అతడు కొమ్మకు బంధింపబడి ఉన్నాడు. అంత నా రాకుమారుడు విల్లెక్కుపెట్టి అతి నేర్పుతో బాలకునకు దెబ్బతగలకుండా చుట్టూ వానరుడు బిగించిన లతా బంధాలు తెగ కొట్టాడు. కపి కట్టిన లతాపాశాలన్నీ అయిదు వందల సంవత్సరాల తర్వాత ఆ మహావీరుని బాణ ఘూతాలకు తెగి పోయాయి. వెంటనే ఆ ముని త్వరగా తెగిన లతలతో కప్పబడిన ఆ వటశాఖాగ్రానకు ఎక్కి కుమారుని చూడగా నా బాలకుడు జడలచే బంధితుడయినందున శిరోనమ్రభావంతో తండ్రికి నమస్కరించాడు. పుత్ర స్నేహంతో ఋతధ్వజుడా జాబాలిని నుదురుపై మాటిమాటికి ముద్దుపెట్టుకున్నాడు. పూర్తి కట్లు విప్పడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా ఆ వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీద ఎక్కి తాను ప్రయత్నించాడు. అయినా బాలకుని కట్లు ఊడలేదు. అంతట నా వీరుడు శకుని విల్లంబులతో చెట్టుమీదనుంచి క్రిందకు దిగి అతి లాఘంగా బాణాలతో ఒక శరమండపాన్ని కట్టి ఆ కొమ్మను మూడు ముక్కలుగా ఖండిచాడు. అంతట నా జాబాలి తలకు కట్టబడిని చిరుగొమ్మల బరువుతో, ఆ బాణాల మెట్లమీద నుంచి మెల్లగా క్రిందకు దిగివచ్చాడు. ఆ విధంగా ధానుష్కులలో ముఖ్యుడైన రాజకుమారుడు బంధవిముక్తుడిని గావించిన కుమారుడు జాబాలిని, తనమీద బరువతో సహా, వెంటబెట్టుకొని ఆ ఋతధ్వజుడు యమునానదికి వెళ్ళాడు.

ఇది శ్రీ వామన మహా పురాణంలో ముప్పది ఎనిమిదవ అద్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment