దండకుడన్నాడు : –
ఓ బాలా ! ఆ లోపల యోగయోగీశ్వరుడైన శ్రీ కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్ష అసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారల వాడిపోయిన పూజ అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. ఆది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం . అంత నా కన్య లిద్దరూ నిర్మాల్యం తొలగించి విధిపూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగునా శ్రీ కంఠదేవుని దర్శించడానికి గాలవుడను మహర్షి వచ్చాడు. ఆ బాలికలిర్వురను చూచి ఆ ముని వీరెవ్వరి కుమార్తెలోయని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజ చేస్తూండగా నా కన్యలిరువురు కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధురగానం విని గంధర్వ కామినులని నిశ్చయించుకున్నాడు. జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతట ఆ ముని, శివభక్తి సమేతలై మీమీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీరలెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతట నో చంద్రముఖి ! ఆ బాలికలు తమతమ గాథలు ఉన్నవి ఉన్నట్టుగా వివరించి చెప్పారు. అదివిన్న ఆగాలవుడా రాత్రి యచటనే ఉండి మరునాడుదయం మరల శివుని అర్చించి వారలతో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతట నా యక్ష సురపుత్రికలు చేతులు జోడించుకొని మహాత్మా ! మీబోటి వారలదర్శనం దుర్లభం. పుష్కరారణ్యానికి మీరెందులకు వెళ్తున్నారు. అని అడిగారు. అందులకా తేజస్వి, రాబోవు నెలలో కార్తీక పూర్ణిమ పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది. అందుకోసం వెళ్తున్నానని చెప్పగా నా యువతలు మహానుభావా ! మేముగూడా మీవెంట వచ్చెదము. దయచేసి తీసుకొనిపొండు. మిమ్ము విడచి యిక్కడ యిక ఉండలేమని ప్రార్థించారు.
మంచిది అలాగే రండని సమ్మతించి ఆ మునివరుడు మహేశ్వరునకు మ్రొక్కి ఆ కన్యలను వెంటబెట్టుకొని భక్త్యాదరాలతో పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అచ్చటకు వేలసంఖ్యలో యితర ఋషులు, నరపతులు, జానపదులు వచ్చి చేరుకున్నారు. ఒక్క ఋతధ్మజుడు మాత్రం వెళ్ళలేదు. ఆ కార్తిక పూర్ణిమ పర్వాన ఆ ఋషులంతా ఇక్ష్వాకు నరేశుడు నాభాగుడాదిగా గల రాజులంతా స్నానాలు చేశారు. గాలవముని కూడా ఆ కన్యలతోబాటు పుష్కర జలాల్లో స్నానార్థందిగాడు. నీళ్ళలో మునిగిన ఆముని ప్రవాహ మధ్యన ఒక పెనుచేపను ఎందరో మత్స్యాంగనలతో తిరుగడం చూచాడు. ఆడచేపలలా తిమింగలానితో ప్రేమకలాపాలు జరపబోగా నా మహామత్స్యం వాటితో, ఓముగ్ధాంగనలారా! మీరు ధర్మం ఎరుగరు. ఇందువలన కలిగే విపరేతమైన జనాపవాదాన్ని నేను భరించలేను. కనుక తొందల పడకుడని మందలించాడు. అదివిని ఆడచేపలు, తపస్వి అయిన ఆ గాలవుడే కన్యలను వెంటబెట్లుకొని యథేచ్చగా తిరుగుతుండగా, ఆ మహాత్మునకు లేని భయం, నీళ్ళలోపల ఉండే మీ కేలనని అనగా నా తిమింగలం తపోధనుడై ననేమి? ఆరాగాంధుడు పిల్లవాడిలాగా భయాన్ని, లజ్జనూ వదిలేశాడని చీదరించుకున్నది. ఆ మత్స్యసంవాదంవిని నీళ్ళలో ఉన్న గాలవుడు సిగ్గుపడి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. అరటి కాండలవంటి తొడలుగల ఆ కన్యకలు స్నానం ముగించుకొని నీళ్ళలో మునిగిన ఆ జితేంద్రియుడు గాలవునికై నీరీక్షిస్తూ నిలబడ్డారు. పుష్కర పర్వం ముగిసి వచ్చిన వారంతా, ఋషులు రాజులు జానవదులూ, తిరిగి వెళ్ళిపోయారు. సర్వాంగ సుందరి విశ్వకర్మ తనయ చిత్రాంగద ఒక్కతే నలువైపులా చూస్తూ ఉండిపోయింది. గాలవునితో వచ్చిన కన్యలిద్దరు కూడ, ఆ ముని నీళ్ళలో నుంచి రానందున, తీరాన అలాగే చూస్తూ ఉండిపోగా, వారలు ముగ్గురూ పరస్పరం చూచుకున్నారు. ఇంతలో ఘృతాచి కడుపున జన్మించిన పర్జన్యుని కుమార్తె వేదవతి అనే గంధర్వ కన్య కూడా అక్కడకు వచ్చింది.
ఆమె ధనురాకారంలో ఉన్న పుష్కరమధ్య జలాల్లో స్నానంచేసి సరోవరానికి ఉభయ తీరాల్లో నిలబడిన ముగ్గురు కన్యలను చూచింది. చిత్రాంగదను సమీపించి మృదువుగా, అమ్మా నీవెవరవు ఏ కారణాన ఈ నిర్జన ప్రదేశాన ఉన్నావని ప్రశ్నించింది. ఆ చిత్రాంగద తనకథ యిలా వినిపించింది. నేను ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె చింత్రాంగదను. నేనొకపరి నైమిషారణ్యంలో కాంచనాక్షి సరస్వతిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్ళాను. అక్కడకు వచ్చిన విదర్భరాజు సురథుడు నన్నుచూచి కామార్తుడై శరణువేడుకున్నాడు. సఖులు వారించినా వినక నే నతనికి వశమయ్యాను. ఆకారణాన నా తండ్రి నన్ను శపించినందువల్ల భర్తకు దూరమై ఆత్మహత్యకు పూనుకోగా ఒక యక్షుడు వారించి శ్రీ కంఠక్షేత్రానికి పంపాడు. అక్కడనుండి సప్తగోదావరికి వెళ్ళి ఈ తీర్థ రాజానికి వచ్చాను. ఇక్కడ కూడ ఇంతమంది జనంలో నాభర్త సురథుడు కనిపించలేదు. ఇది నా కథ. ఇక నీవెవరో యాత్రముగిసిన తర్వాత యిచట కేలవచ్చితివో దాచకుండా నాకు చెప్పమన్నది. అందులకా బాలిక ఓకృశోదరి! అయితే ఈ మందభాగ్యురాలి కథ కూడ విను. చెబుతానంటూ యిలా మొదలు పెట్టింది. నేను వర్జన్యునకు ఘృతాచికి పుట్టిన దానను. పేరు వేదవతి. ఒక పర్యాయం వన ప్రాంతంలో క్రీడించుచుండగా ఒక బలశాలియైన వానరం నన్నుచూచి- ఓ దేవవతీ! ఎక్కడకు వెళ్లున్నావు? భూతలాన నిన్నుంచిన ఆశ్రమంనుంచి ఈ మేరు పర్వతానికి ఎవరు తీసుకవచ్చారని గద్దించి పలుకగా నేనంతట ”నా పేరు వేదవతి, నేను దేవవతిని కాను. ఈ మేరుగిరియే నా నివాసమన్నాను. అంతట నాధూర్త వానరం వినక నా వెంటపడగా నేను భయపడి ప్రక్కనేఉన్న ఒక ఎత్తైన బంధుజీవ వృక్షంమీదకు ఎక్కాను. అంతట ఆ దుష్టుని ప్రచండ కరాఘాతానికాచెట్టు విరిగిపడిగా నే నొక కొమ్మను గట్టిగా కరుచుకుని పట్టుకున్నాను. ఆకోతి ఆ చెట్టును సముద్రజలాల్లోకి విసరివేయగా నేను విల విలలాడుతూ కొమ్మతోకూడ పడిపోయాను. ఆ సమయాన ఆకాశాన్నుంచి క్రిందపడుతూన్న ఆ చెట్టును దానితోపాటు నన్నూ స్థావర జంగను ప్రాణులందరు చూచి హాహాకారాలు చేశారు. సిద్ధులూ గంధర్వులూ – ”అయ్యో! ఎంతకష్టం? మహాత్ముడైన మనుపుత్రుడూ వేయి యజ్ఞాలుచేసిన వీరుడూ నైన ఇంద్రద్యుమ్న మహాజాజుకు పట్టపురాణి కాగలదని స్వయంగా బ్రహ్మచేత దీవింపబడిన ఈ సాధ్వికా యీ దుర్దశ ! అంటూ విలపించారు.
ఆ తియ్యని వాణి చెవిన బడిన వెంటనే నేను మూర్చిల్లి పడిపోయాను. అందుచేత ఆ వృక్షాన్ని వేయిముక్కలుగా నరికినదెవరో తెలుసుకోలేక పోయాను. అంతట అగ్ని మిత్రుడు వాయువు ప్రచండ వేగంతో నన్నీచోటికి విసరి వైచినాడు. ఇక్కడ నిన్ను చూచాను. ఇక లెమ్ము. మనంవెళ్ళి పుష్కరానికి ఉత్తరతీరాన నిలబడిన ఆ యిద్దరు కాంతలెవరో అడిగి తెలుసుకుందాము. అని చెప్పి ఆ వేదవతి చిత్రాంగదతో, ఓకవ్యామణీ! ఆ సుందరీల వద్దకు వెళ్ళింది. ఆమె అడిగిన మీదట వారుభయులూ తమతమ వృత్తాంతాలు వినిపించారు. అంతట నాకన్యలు పలువురూ సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వర మహాదేవుని అర్చిస్తూ ఉండిపోయారు. ఈ లోపుగా శకుని, జాబాలి, ఋతధ్వజులుమవ్వురూ ఆ కాంతను వెదకుచూ చాలా ఏండ్లు తిరిగారు. వేయేండ్ల తర్వాత జటాభారంతో అలసిపోయిన జాబాలిని వెంటబెట్టుకొని నిరాశులైనారు. శాకలానికి వెళ్ళారు. ఆ నగరాధిపతి ఇంద్రద్యుమ్న మహారాజు. వారలు వచ్చుటతెలిసికొని అర్ఘ్యపాత్రతో ఎదురుగా వెళ్ళి ఋషులను పూజించి సోదరపుత్రుడయిన శకునిని సంభావించాడు. ఋతధ్వజుడా రాజుతో, రాజన్ మా బిడ్డ నందయంతి తప్పిపోయినది. ఆమెకోసం భూమి అంతా గాలించాం. విసిగి వేసారి పోయాం. మీరు వెంటనే లేని ఆమెను వెదకి మాకు సహాయం వడండని అర్థించాడు. అంతట నా ఇంద్రద్యుమ్నుడు మహామునీ ! కోమలాంగియైన నా భార్య కూడ ఎక్కడనో తప్పిపోయింది. ఆమె కోసం నేనూ వెదకి విసిగిపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకోను? సిద్ధులమాట లాకర్షించి ఆకాశాన్నుంచి పడిపోతున్న ఒక పర్వంతంలాంటి వృక్షాన్ని లాఘవంలో బాణపరంపరతో వేయి ఖండాలుగా ఖండించాను. ఆ సుందరికేమాత్రము దెబ్బతగులలేదు. కాని ఆమె ఎక్కడ పడిపోయినదో ఎక్కడ ఉన్నదో తెలియక నిరంతరం నేనూ వెదకుతున్నాను. అని చెప్పి త్వరగా లేచి మూడు రథాలు తెప్పించాడు. ఋషులిర్వురకూ, శకునికీ రెండు రథాలు యిచ్చి తాను మూడవది ఎక్కి అందరూ నేల నాలుగుమూలలా వెదకుతూ బదరీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కఠోర తపస్సులో వేగిపోతూ, దుమ్ముకొట్టుకున్న జడలతో, కృశించిపోయి. ఎంతో కష్టంతో ఊపిరిపీలుస్తూ ఉన్న ఒక యువ తపస్విని చూచారు.
అతనిని చూచి మహాభుజుడైన ఇంద్రద్యుమ్న నృపతి చిన్నవాడా ! వనంలోనే యింతటి కఠోర తపస్సు ఏమాశించి చేస్తున్నావు? అని ప్రశ్నించగా నతడు, మీరెవ్వరు శోకార్తుడనైన నన్ను యింత ప్రేమాను రాగాలతో అడుగు తున్నారని బదులు చెప్పాడు. అందులకా నరపతి నేను మనువు కుమారుడను. ఇక్ష్వాకు సోదరుడను శాకల నగరాధిపతి నని చెప్పగా నా యువక తపస్వి తన పూర్వగాథ అంతావివరించాడు. ఆదివిని ఆ రాజర్షి, బాబూ ! నీవు శరీర త్యాగం చేసికోవద్దు. నీవు నా సోదరుని కుమారుడవే. రారమ్ము. నీ ప్రియురాలిని అన్వేషించుదమంటూ ఆ కృశించిన యువకుని కౌగలించుకున్నాడు. అతనిని తన రథంమీద కూర్చుండ బెట్టుకొని ఋషుల వద్దకు తీసుక వెళ్లారు. ఋతధ్వజుడు అతనితో, రా బాబూ! రా ! నీకు ప్రియం కలుగజేస్తా. నీవు నైమిషారణ్యంలో చూచిన చిత్రాంగదను నేనే సప్త గోదావరి తీర్థంలో వదలి వచ్చాను.” అనిచెప్పి అందరను చూచి, రండి ! రండి ! సుదేవుని కుమారుని కోసం మనం సప్త గోదావరి సంగమానికి వెళ్దాం. అక్కడే ముగ్గురు కన్యలూ ఇతరులూ మనకు కనిపిస్తారన్నాడు. అలా సదేవ కుమారుని సమాశ్వసించి శకునీ ఇంద్రద్యుమ్నుడు తన పుత్రునితో కలిసి అంతా రథారూఢులై ఆ బాలికామణులు వెళ్ళి సప్తగోదావరానికి బయలుదేరారు. ఈ లోపున ఘృతాచి తనకుమార్తెను గానక విచారమగ్నయై ఉదయగిరిమీద అంతటా వెదకుతూ తిరిగింది. దారిలో తారసిల్లి వానరాన్ని చూచి ఆ అప్సరస, ఓ కపీ! నీవొక కన్యక నెవరినైనా చూచావా నిజం చెప్పమని అడుగగా నా కపి, దేవవతి అనే కన్యను చూచాను. ఆమెనొక మహాశ్రమంలో కాళిందీ తీరాన మృగపక్షి సంకీర్ణమైన అరణ్యంలో వదలి వచ్చాను. ఆ ఆశ్రమం శ్రీకంఠేశ్వరాలయాని కెదురుగా ఉంది. అని చెప్పింది. అందుకామె. ఓ వానర శ్రేష్ఠా ! ఆమె పేరు వేదవతి, రమ్ము మనమచ్చటకు వెళ్ళుదామన్నది.
ఘృతాచి మాటలువిని ఆ వానరం పెద్దపెద్ద అంగలువేస్తూ త్వరగా ఘృతాచిని వెంట బెట్టుకొని కౌశికీనదికి వెళ్ళింది. ఆ రాజర్షులు ముగ్గురూ ఇద్దరు మునులు కూడా రథాలమీద వేగంగా పయనించి కౌశికీనది చేరుకున్నారు. రథాలు దిగి నదిలో పవిత్ర స్నానం చేయుటకు వెళ్ళారు. ఘృతాచి కూడ నదిలోకి స్నానం చేయడానికి దిగగానే ఆ ప్రక్కనే ఉన్న వానరాన్ని చూస్తూనే జాబాలి తండ్రితోను మహావీరుడైన చక్రవర్తితోను యిలా అన్నాడు. తండ్రీ! అడుగో నా జడలు చెట్టుకొమ్మకు కట్టి ఆ దుష్టవానరుడు. మళ్ళీయిటే వస్తున్నాడు. జాబాలి మాటలువింటూనే శకుని కోపంతో మండి పడి మహర్షి నీ రాజునూచూచి, తపోధనా ! మహారాజా ! అనుజ్ఞ యివ్వండి. ఒక్కకోలతో నీ పాడు కోతినినేల గూలుస్తా నన్నాడు. ఆ మాటలు విని సర్మజీవ కారుణ్యమూర్తి అయిన ఋతధ్వజుడు వారించి ”వత్సా ! పొరబడుతున్నావు ! లోకంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. చావులు గాని, బంధనాలు గాని వారివారి కర్మల ననుసరించియే కలుగుతాయి. కనుక నీ ప్రయత్నం విరమించుమని చెప్పి ఆ కపిని చూచి ఓ వానరా! మాకు నీవల్ల ఒక సహాయం కావాల్సి ఉంది. రమ్మురమ్మని” ఆహ్వానించాడు. ఓ అరజా సందరీ ! ముని మాటలువిని ఆ వానరం చేతులు జోడించి ప్రణామంచేసి, ”ఓ బ్రహ్మర్షీ! ఆజ్ఞాపించండి. శాసించండి. నేనేమి చేయవలసి ఉన్నదో అని ప్రార్థించినది. అందుకు ముని, వెనుక నీవు నా కుమారుని జటలతో లతాదికాలతో వటవృక్షానికి బంధించావు. ఈ మహారాజు సహాయంతో ఆ కొమ్మను మూడు ఖండాలుగా నరికి పిల్లవాడిని విడిపించుకున్నాం అయినప్పటికీ జడలతో నీవు కొమ్మకు బిగించిన కట్లు విప్పడం ఎవరికీ శక్యంకాలేదు. అందుచేత నీ పసివాడు గతించి పదివేలేండ్లుగా, తలకు కట్టబడిన కొమ్మబరువు మోస్తూ తిరుగుతున్నాడు. ఆ కట్లు విడదీసి వానిక పూర్తి విముక్తి కలిగించు మనగా నాశాఖామృగం మెల్లమెల్లగా ఆ చిక్కుముడులు విప్పి ఆ జాబాలికి పూర్తి విమోచనం కలిగించింది. అంతట సంతోషించిన ఆ ముని ఆ కపిన ఏదేని వరం కోరుకొమ్మన్నాడు.
ఋతధ్వజుని మాటలువిని వానరుడుగా ఉన్న మహాతేజస్వి విశ్వకర్మ యిలా వరం అడిగాడు. భగవాన్ ! నాకు వరమివ్వరునెంచినచో, ఒకనాడు తమ నాకు యిచ్చిన మహా కఠోర శాపాన్ని ఉపసంహరించండి. ఓ తపోధనా ! తమచే వానరుడుగా శపించబడిన చిత్రాంగద తండ్రిని, అభాగ్యుడనైన విశ్వకర్మ దేవశిల్పిని నేనే అని తెలపుకుంటున్నాను. కపి చాపల్యం వల్ల నేనెన్నియో పాపాలు చేశాను. వానినన్నింటినీ నశింపజేయండి. నన్ననుగ్రహించండి. అంతట ఋతధ్వజుడు ఏనాడు నీవుఘృతాచివల్ల మహాబలుడైన కుమారుని కంటావో ఆనాటితో నీకపిత్వం సమాప్తమౌతుంది. అంటూ శాపాంతం సూచించాడు. అంతట సంతసించి ఆ కపి స్నానార్థం ఆ మహానదిలో దిగాడు. ఇతరులందరూ ఒకరొకరుగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవార్చనలు గావించారు. అనంతరం తమతమ రథాలెక్కి వెళ్ళిపోయారు. ఘృతాచి గగనమార్గానికెగిరి పోగా నా మహాకపి ఆమెను వెంబడించాడు. ఆ సర్వాంగ సుందరిని చేరుకోగానే ఆమెకూడా నా ప్లవంగ శ్రేష్ఠుని విశ్వకర్మగా గుర్తించి కామించింది. అంతట వారిద్దరూ కోలాహలం పర్వతసానుకందరాలలో యథేచ్ఛగా రమిస్తూ ఒకరినొకరు సంతృప్తిపరుచుకుంటూ విహరించారు. అలా విహరిస్తూ చాలాకాలానికి వింధ్యపర్వతానికి చేరు కున్నారు. ఆ విధంగా ఋతధ్వజుడు మిగిలిన నలుగురూ రథాలమీద మధ్యాహ్నవేళకు సప్తగోదావర క్షేత్రానికి ప్రీతులై చేరుకున్నారు. విశ్రాంతి కోసం త్వరత్వరగా రథాలు దిగారు. సారథులు గుర్రాలను కడిగి నిర్మలోదకాలు త్రాగించి చుట్టుప్రక్కలగల చక్కని పచ్చిక బయళ్ళలోకి మేయుటకై వదిలారు. ముహూర్తకాలంలో అవి కడుపునిండా మేతమేసి తృప్తి చెందాయి. అంతట అందరూ రథాలెక్కి హాటకేశ్వరాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో ఉన్న నాస్త్రీ రత్నాలా గుర్రపుడెక్కల చప్పుళ్ళు విని అది ఏమో తెలుసుకుందామని, దేవాలయ పైభాగాలకు ఎక్కి నలువైపులా తేరిపార చూడసాగారు.
పవిత్ర తీర్థంలో స్నానాలు చేస్తున్న ఆ రాజులను చూచారు. చిత్రాంగదవారలలో జటామండలధారియైయున్న సురథుని చూచిచాలా సంతోషంతో దేహం గగుర్పాటొందగా తన సఖులతో యిలా అన్నది. అడుగో అక్కడ నల్లని మేఘంలో వెలుగుతున్న సుందరుడు మహాభుజుడు అతడే! అతడే నేను వరించిన నా భర్త ! రాజకుమారుడు ! సురథుడు ! బంగారు రంగులో తెల్లని జటాభారంతో ప్రకాశించే ఆ తపస్వి, ఆయనే ఋతధ్వజుడు. ఏమాత్రం సందేహం లేదు. అంతట ”నందయంతి” కూడ ఆనందంతో, అడుగో ఆతడు ఆ మహర్షి జాబాలి ! అని అరచినది. అంతట వారంతా ఆ వలభి (మేడ) నుండి క్రిందకు వచ్చి హాటకేశ్వర మహాదేవున కభిముఖంగా నిలబడి ఆ భక్తవత్సలుని యిలా స్తోత్రం చేయసాగారు. ”ప్రభూ ! శర్వా ! శంభో త్రినేత్రా ! సుందరాంగా ! నీకు నమస్సులు ! త్రిలోకేశ్వరా, ఉమావల్లభా, దక్షయాగనాశకా, మదనాంతకా, ఘోరా, పాపహారీ, మహాపురుషా, మహోగ్రమూర్తీ, సర్వజీవనాశకా, శుభంకరా, మహేశ్వరా, త్రిశూలపాణీ, మదనవైరీ, గుహావాసీ, దిగంబరా, మానవాస్థిమస్తకధరా, జటాధారీ, కపాలమాలాధరా, వామనేత్రా, వామదేవా, ప్రజాపతీ, భగుని కన్నుపొడిచినవాడా, ప్రళయంకరా, భీమసేనా, మహాసేననాథా, పశుపతీ, కామాంగ దహనా, యజ్ఞవేదినివాసా, శివా, మహాదేవా, ఈశానా, శంకరా, భీమా భవా వృషభధ్వజా, జటాజూటధరా, ప్రౌఢా, మహానటరాజా, మహారత్న కాంతిధరా, అవిముక్తకా, రుద్రా, రుద్రుల అధినాయకా, స్థాణూ ! ఏకలింగేశ్వరా, కాళిందీ ప్రియా, చక్కని కంఠం గలవాడా, నల్లని కంఠం గలవాడా, అజేయా, శత్రుభయంకరా, సంతోషపతీ, వామదేవా, అఘోరా, తత్పురుషా, మహాఘోరా, సౌమ్యా (అఘోర) మూర్తీ, శాంత, సరస్వతీ వల్లభా, కోనాటా ! సహస్రమూర్తీ, అద్భుతజన్మా ! విభూ కాలాగ్నిరుద్రా హరా, పర్వతప్రియా, సర్వతీర్థాల్లో నివసించువాడా, హంసా, కామేశ్వరా, కేదార నాధా, పరిపూర్ణరూపా ముచుకుందా, తేనెలోతీపిరూపంలో ఉండే ప్రభూ ! ఖడ్గపాణీ ! భయంకరా, విద్యాధిరాజా, సోమ రాజా, మన్మథపతీ, రంజింప జేయువాడా, అంజన రాజకుమారి హృదయంలో నివసించు ప్రభూ! సాగరశయనా, గజముఖా ఘంటేశ్వరా గోకర్ణేశ్వరా! బ్రహ్మయోనీ, వేలాదితలలు నేత్రాలు చరణాలు గల దేవా, హాటకేశ్వరా ! హరా! నీకు నమస్సులు. వేలాది ప్రణామాలు ! ఇలా కోమల కంఠాలతో గంధర్వులను మరిపిస్తూ ఆ బాలికలు హాటకేశ్వరుని గుణగణాలు గానం చేస్తుండగా ఆ ఋషులు నరపతులు స్వామి దర్శనానికై ఆలయంలో ప్రవేశించి ఆ ముల్లోక కర్త త్రినేత్రునికి ప్రణామాలు గావించి మండపంలో కూర్చున్నారు.
స్నానానంతరం ఆలయంలో కూర్చొని వారు హాటకేశ్వరుని మ్రోల గీతాలాపన చేయుచున్న ఆ కన్యలను చూచారు. వారిలో విశ్వకర్మ తనయను గుర్తుపట్టి సుదేవకుమారుడు సంతోషంతో తబ్బిబ్బైనాడు. ఋతధ్వజుడు కూడ చిత్రాంగదను గుర్తించి యోగదృష్టితో సర్వమూ తెలిసికొని సంతోషించాడు. అంతట వారందరూ లేచి త్వరగా వెళ్ళి హాటకేశ్వరుని పూజించి క్రమంగా స్తోత్రాలు గావించారు. ఋతుధ్వజునితో కలిసి వచ్చిన వారలను చూచి, చిత్రాంగద తన సఖులతో లేచి వారలకు నమస్కారం చేసింది. అంతట నామహర్షి కుమారుడూ తక్కిన రాజులతో కలసి వారలకు ప్రత్యభినందనలు తెలిపి అందరూ కూర్చున్నారు. అదే సమయాన ఆ వానరవీరుడు ఘృతాచితో కలసి అక్కడకేతెంచి గోదావరిలో స్నానంచేసి హాటకేశ్వర దర్శనానికి ఆలయంలో ప్రవేశించాడు. అక్కడ తన కుమార్తెను చూచి ఘృతాచీ తల్లిని చూచి వేదవతీ ఆనందాతిరేకంతో ఒకరినొకరు గాఢంగా కౌగలించుకొని జలజలా కన్నీళ్ళు రాల్చారు. అంత నా మహర్షి ఆ కపిని చూచి. నీవు వెంటనే అంజనాద్రికి వెళ్ళి యక్షేశ్వరుడు అంజనునీ, పాతాళానికి వెళ్ళి దైత్యపతి కందర మాలినీ స్వర్గానికి వెళ్ళి పర్జన్య గంధర్వునీ తీసుకొని రమ్మని ఆదేశించాడు. అంతట దేవవతి ఆ కపితో, అయ్యా! గాలవ మహర్షిని గూడ తీసుకొని రండనీ అర్థించింది. అంతట వాయు విక్రముడైన నాకపివీరుడట్లేయని, వాయువేగంతో వెళ్ళి అంజనుని పిలచి అమరగిరికి వెళ్ళి పర్జన్యుని సప్తగోదావరి మహాశ్రమానికి వెళ్ళమని చెప్పి తాను పాతాళానికి వెళ్ళాడు. అచ్చట కందర మాలికి చెప్పి మరల భూమిమీదకు వచ్చి గాలవమునికోసం మాహిష్మతికి వెళ్ళాడు. ఆ పరిసరాలలో మహా తపస్వి యైన గాలవుని చూచి తనతో ఆకాశమార్గాన సప్తగోదావరానికి గొని వచ్చాడు. అక్కడ ఇద్దరు నదిలో స్నానంచేసి ఆలయానికి చేరారు. అచట నా ముని నందయంతిని దేవవతిని చూచాడు. ఆ కన్యలిద్దరామునికి లేచి వినయంతో నమస్కరించారు. గాలవుడంతట మహాదేవుని అర్చించి అచటనున్న ఋషులకభివాదనం చేశాడు. ఆ రాజ శ్రేష్ఠులు లేని నిలబడి ఆ తపస్విని యథావిధిగా పూజించారు. అందరూ సంతోషస్వాంతులై కూర్చున్నారు.
వారలా కూర్చొని యుండగా వానరునిచే పిలువబడిన యక్షగంధర్వదైత్యులూ వచ్చి చేరారు. అంతట ప్రేమతో చెమ్మగిలిన నేత్రాలతో నా ముగ్గురూ తమ తప్పిపోయిన పుత్రికలను కౌగిలించుకున్నారు. ఆ సుందరాంగనలు కూడ కండ్లనీరు పెట్టుకున్నారు. తన తండ్రి ఒక్కడు మాత్రమే లేనందున తన దురదృష్టానికి చింతించి చిత్రాంగద కన్నీరు విడవడం చూచి ఆ ఋతధ్వజుడు పుత్రీ బాధపడకుము. ఈ కపివరుడు నీ తండ్రియేనని సత్యం వెల్లడించగా నా బాలిక సిగ్గుపడి మహాత్ముడగు విశ్వకర్మకీ వానరత్వమెట్లు గలిగెనో కదా ! నాలాంటి కుమార్తె వల్లనే ఈ దుస్థితి కలిగి ఉంటుంది. అందుచే ఈ పాడు శరీరాన్ని వదలి వేస్తానని నిశ్చయించుకొని ఋతధ్వజునితో, స్వామీ ! నన్ను రక్షించండి. నేను పితృహంతకు రాలిని. నా మూలాన్నే నా తండ్రికీ దురవస్థ కలిగినది. నేను చనిపోవుదును. అనుమతి ఇండని వేడుకున్నది. అందులకాముని ”అమ్మా ! విచారించకు; భవితవ్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శరీర త్యాగం చేయవద్దు. కొంచెం ఓపిక పట్టుము. ఈ కపికి ఘృతాచి వలన పుత్రుడు కలుగగానే శాపాంతమై పూర్వపు రూపం పొందుతాడు. నీవు నీ తండ్రిని మరల కలుసుకుంటావని ఓదార్చాడు. ఆ తర్వాత ఘృతాచి చిత్రాంగదను సమీపించి మృదువుగా, పుత్రీ శోకింపకుము. పది నెలలలో నావల్ల నీ తండ్రికి ఔరసుడు కలుగుతాడు. అంతవరకూ వేచి యుండుమని నచ్చజెప్పినది. అదివిని చిత్రాంగద ఎంతో సంతోషించింది. తండ్రి సమక్షాన వివాహం చేసుకోనెంచిన చిత్రాంగద అందుకొరకు ప్రతీక్షించసాగింది. తక్కిన ముగ్గురు కన్యలు కూడా తమ నెచ్చెలితో బాటే తమ వివాహాలుకూడా వాయిదా వేసుకొన్నారు. ఆ స్నేహితురాండ్ర సంకల్పం ఫలించి పదినెలలమీద ఘృతాచి ఆ గోదావరి తీర్థంలోనే నలుడను కుమారుని ప్రసవించింది. పుత్రుడు కలుగగానే కపి రూపం వదలి విశ్వకర్మ తనతొంటి రూపంలో ప్రియపుత్రికను ఆలింగనం చేసుకున్నాడు.
ఆ విధంగా కుమార్తెను కలుసుకొని ఆ సుర శిల్పి దేవరాజు ఇంద్రుని సురకిన్నరాదులను మనసా స్మరించుకున్నాడు. వెంటనే శక్రుడు మరుత్తులు సురలు రుద్రగణాలతో కూడి ఆ విశ్వకర్మ కోర్కె ననుసరించి హాటకేశ్వర క్షేత్రానికి వచ్చి చేరాడు. అలా దేవతలు గంధర్వులు అప్సరసలంతా వచ్చిన తర్వా ఇంద్రద్యుమ్నుడు ఋషిసత్తముడైన ఋతధ్వజనితో యిలా అన్నాడు.
”బ్రహ్మర్షీ ! కందరమాలి కుమార్తెను మీ పుత్రుడు జాబాలికిచ్చి విధిపూర్వకంగా వివాహం జరిపించండి. రూపవంతుడగు శకుని నందయంతిని పరిణయమాడగలడు. నేను వేదవతిని గ్రహించెదను. విశ్వకర్మ పుత్రికను సురథుడు వివాహమాడును. అందులకు మంచిదని ఋతధ్వజుడనగా సంతోషంతో వివాహ సంస్కారం ప్రారంభమైంది. గాలవముని ఋత్విజత్వం వహించి వైవాహిక హోమాలు నిర్వర్తించాడు. గంధర్వులు నృత్యాలు చేస్తూ మంగళ గీతాలు పాడారు. మొదట జాబాలి కందరమాలి కుమార్తెను పాణిగ్రహణం చేసుకున్నాడు. తర్వాత వరుసగా ఇంద్రద్యుమ్నుడు వేదవతిని, శకుని యక్షపుత్రికను సురథుడు, చిత్రాంగదను పరిగ్రహించాడు. ఓ సన్నని నడుముగల కళ్యాణీ అరజా! ఇలా వివాహ కార్యం సంపన్నమైన తర్వాత ఋతధ్వజుడు ఇంద్రాది దేవతలతో, మీరందరు నీ పవిత్ర సప్త గోదావరి తీర్థంలో విశేషించి ఈ వైశాఖ మాసంలో నివసించుట ఉత్తమ మనెను. వారందరు నందులకంగీకరించి అట్లేయుండిరి. అనంతరం దేవతలు తమతమ నెలవులకు వెళ్ళి పోయారు. మునులంతా ఋతధ్వజ జాబాలురతో స్వస్థానాలకు వెళ్ళారు. రాజులు తమతమ భార్యలతో తమ నగరాలకు వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఓ కళ్యాణీ ! చిత్రాంగద వృత్తాంతమంతా సమగ్రంగా నీకు వినిపించాను. ఓ కమలనేత్రీ, నారీరత్నమా ! ఇక ఆలసింపక నన్ను భజింపుమని ఆ దండక నృపతి. శుక్రనందిని అందాన్ని పొగడుతూ చెప్పినంతనే ఆ మానవతి మృదు వచనాలతో ఇలా చెప్పింది.
ఇది శ్రీవామన పురాణంలో ముప్పది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹