Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – అరవై ఎనిమిదవ అధ్యాయం

పులస్త్యుడిలా అన్నాడు :-

శంబర దైత్యుడు వెళ్ళిన పిమ్మట హరుడు నందిని పిలచి నీ యేలుబడిలో గల వారల నందరను, ఓ శిలాదనందనా ! వెంటనే పిలువుమని ఆదేశించాడు. మహేశ్వరుని మాట విన్నంతనే నంది అచమనం గావించి శివగణాల నాయకులందరిని స్మరించాడు. శ్రీమంతుడైన నందీశ్వరుడు స్మరించినవెంటనే వేల సంఖ్యలో, ఆ గణ నాయకులంతా ఎగిరివచ్చి ఆ దేవదేవునకు ప్రణమిల్లారు. నంది చేతులుజోడించుకుని పరమశివునకావచ్చిన వారలనందరును ఎరుకపరిచాడు. ప్రభో శంకరా ! మూడుకన్నులతో జటాధారులైన ఈ వీరులు రుద్రులుగా ఖ్యాతిగాంచారు. వీరి సంఖ్య పదకొండు కోట్లు. ఇక శార్ధూల విక్రమంగలిగి వానరముఖాలతో కనిపించే ఈ యశోధనులు నా పేరుతో విరాజిల్లే శూరులు. ఈ రుద్రులు ద్వారపాలకులు. శక్తిపాణులై శిఖికేతనాలతో ఆ కనిపించే షణ్ముఖులున్నారే వారు అరవై ఆరుకోట్లు. స్కందులనే పేరుగల ఆ వీరులు కుమారులు. ఆరుతలలు కల వీరలు శాఖులు. వీరి సంఖ్యకూడా అంతే. ఇక నా విశాఖులు, నైగమేయులనబడే వారలుకూడ, షడాననులు, అరవైఆరుకోట్ల సంఖ్యలలో ఉన్నారు. శంకరా ! ఆ నిలబడిన ఉత్తమ ప్రమథులు ఏడునందల కోట్లమంది, వారందరకూ నదేసంఖ్యలో మాతృకలున్నారు. ఇక భస్మారుణ శరీరాలతో మూడు కన్నులూ శూలాలు ధరించిన శైవులనే ఈ గణనాయకులు నీభక్తులు. భస్మంతోనే ప్రహరించి శత్రునాశం చేసే పాశుపత గణాధిపతులరుగో, నీ సహాయార్థం వచ్చిన వీరలు లెక్కకు మించి ఉన్నారు. కాలముఖులనే భయంకరులైన, నీ భక్త గణాలు అరుగో జటాధారులై పినాకాలు పట్టుకొని వచ్చారు. ఎర్రని కవచాలు ధరించి ఖట్వాంగాలతో యుద్ధంచేసే ఉత్తమ వ్రతధారులైన నీ భక్తగణాలు యిరుగో, యుద్ధంచేయుటకు వచ్చారు. ఓ జగద్గురూ ! అరుగో మౌనధారులై ఘంటాప్రహారాలు చేసే దిగంబరులైన నిరాశ్రయులనబడే గణనాయకులు వచ్చారు. కమలాలను బోలిన రెండున్నర కన్నులతో, శ్రీవత్సలాంచనాలు ధరించి ఖగాలమీద కొందరు గణాధిపతులు వచ్చారు. మరికొందరు వృషభ కేతనాలతో వచ్చారు. వారు మహాపాశుపతులు. చక్రశూలధరులు, వారు భైరవు (శివ) ని విష్ణువును అభేదబుద్ధితో అర్చిస్తారు. శూలబాణ చాపాలు ధరించి వీరభద్రుని పురస్కరించుకొని వచ్చిన ఈ గణాలు, నీ రోమాలనుంచి ఉద్భవించారు. వీరలూ, యింకనూ వందలూ వేల సంఖ్యలలో ఎందరో గణాల వారలు ప్రభో ! నీకు సహాయం చేయుటకు వచ్చారు. వీరలకు తగిన ఆదేశాలు యివ్వండి.

అలా ఆ గణాల వారందరు ఆ వృషభధ్వజుని సమీపించి ప్రణామాలు గావించారు. వారందరను ఆ హరుడు చేతితో సంభావించి సైగచేసి కూర్చుండజేశారు. మహాపాశుపతులను చూచి స్వయంగా లేచివెళ్ళి ఆలింగనం చేసుకొనగా వారలాయనకు నమస్కారాలు గావించారు. శివుని ఆ విచిత్రమైన ప్రవర్తనచూచి గణాధిపతులంతా చాలా ఆశ్చర్యపడి సిగ్గుతో ముడుచుకొని పోయారు. అలా సిగ్గుపడిన గణాలనుచూచి నందీశ్వరుడాదిగాగల యోగులు నవ్వుతూ సకల గణాధిపుడైన ఆ శూలపాణిని చూచి యిలా అన్నారు. ”దేవా! మీరొక మహా పాశుపతులను మాత్రమే కౌగలించుకొని ఆదరించడం చాచి యితరులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుచేత త్రైలోక్యాభినందనీయాలైన విశేషరూపజ్ఞాన వివేకాది లక్షణాలు వారిలో ఏమేమిగలవో అన్నీ వివరించండి. నందీశ్వరుని మాటలు విని ఆ భూతభావనుడైన హరుడు భావాభావవిచక్షుణులైన ఆ సర్వ గణాలతో యిలా అన్నాడు. ”మీరందరూ భక్తిభావంతో హరుని పూజించినా అహంకార విమూఢులై విష్ణుపదకమలాలను నిందిస్తారు. మీలోని ఆ అజ్ఞానంవల్ల మిమ్ములను నిరాకరించడం సంభవించింది. నేనా భగవంతుడగు విష్ణువునే ! ఆ విష్ణువే అవ్యయుడనైన నాస్వరూపం. మాకు భేదంలేదు. ఒకే తత్వం రెండు రూపాల్లో ఉన్నాము. ఈ రహస్యాన్ని ఈ పురుష శార్దూలాలు గుర్తించినట్లుగా మీ యితర గణాల వారందరూ తెలిసికొనలేకపోయారు. శివభక్తులుగా చలామణి అయ్యే మీలాంటి మూర్ఖుల కారణంగా నేను నిందలకు గురి అవుతున్నాను. ఆ భేదబుద్ధివల్ల మీలోని జ్ఞానం నశించి నందున నేను మిమ్ముల నాలింగనం చేసుకోలేదు”. ఇలా మహేశ్వరుడనగా ఆ గణాధిపతులు మరల యిలా అడిగారు. ”ప్రభూ ! మీరూ జనార్దనుడూ ఒక్కరే ఎలా కాగలరు ? మీరో శుద్ధ, శాంత, నిర్మల, శుక్ల, నిరంజన స్వరూపులు కాగా ఆ విష్ణువు కాలాంజన (కాటుక) సన్నిభుడు ! ఆయన మీతో కలియడం ఎలా సంభవం ? అర్థయుక్తాలైన వారల మాటవిని ఆ జీమూతవాహనుడు (హరుడు) మేఘగంభీర స్వరంతో నవ్వి యిలా చెప్పసాగాడు అయితే అందరూ వినండి. నా కీర్తి ప్రతిష్ఠలను యినుమడింపజేసే విషయాలు చెబుతాను. మీరు ఉన్నత జ్ఞానానికి అర్హులుగారు. అపవాదానికి వెరచి మీ కా రహస్యాన్ని వెల్లడిస్తున్నా. మీ చిత్తాలన్నీ నాయందే లగ్నమైయున్నవి. ప్రయత్నించి మీ శరీరాలను ఏకరూపంగా చేసుకొని వినండి.

”మీరునాకు గావించే క్షీర హవిస్సుల అభిషేకాలుగానీ ఏకాగ్ర చిత్తంతో చేసే చందనలేపాది అర్చనలు గాని నాకు సంతోషం కలిగించవు. మీరొకరంపంతో నా దేహాన్ని రెండుగా చీల్చండి. నరకగాములైన శివభక్తులను రక్షించుకోడానికిలా చెబుతున్నాను. ఎందుకనగా శివభక్తులంతా నరకానికి అర్హులు అనే అపనింద ఈ లోకం నాకు అంటగడుతుంది. తపస్సంపన్నులగు హరభక్తులు గూడ నరకానికి పోతారనే అపవాదుకు పాత్రులయ్యేవారు. ఘోర నరకాల్లో పడకుండా చేసేందుకే నేను యిలా చేస్తున్నాను. శివమయుడా కమలపత్రాక్షుడైన ఏ జగన్నాధు (విష్ణువు) నైతే మీరలు నిందిస్తున్నారో, ఆయన నేనే. మరెవరోకాదు. ఆయన సర్వవ్యాపియైన ఈ శర్వుడే. సర్వగణాధిపుడే ఆయన శ్వేతపీఠ రక్తకృష్ణ వర్ణాలు గలవాడు. అలాంటి ప్రభువు చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆయనను మించిన ధర్మం లోకంలో లేదు. ఆ సర్వ పూజ్యుడు భగవంతుడు నగు సదాశివుడే సాత్విక, రాజసిక, తామసిక, మిశ్రగుణాశ్రయుడు సుమా !” శంకరుడు చెప్పిన ఆ అద్భుత వచనాలు విని శైవాదులైన ప్రమథోత్తములు విస్మయంతో ప్రభో ఆ సదా శివుని మహిమా విశేషాలెట్టివో అనుగ్రహించుడని ప్రార్థించగా నా ప్రమథులకా హరుడు సదానిరంజనమైన ఆ శైవ రూపాన్ని చూపించాడు. అంతట నా గణాలు ఆ ఈశ్వరుని సహస్ర రూపాల్లో సహస్ర ముఖాలు కరచరణాదులతో దండపాణియై సర్వవ్యాపియైన విశ్వమూర్తిగా నవలోకించారు. ఆ తేజస్సును చక్కగా చూడలేక పోయారు. ఆ ప్రభువు చేతిలోని దండాన్నాశ్రయించుకొని సర్వదేవతల ఆయుధాలు కనిపించాయి. మరుక్షణాన ఆ గణాలకాప్రభువు శంకరుడు, ఏకముఖంతో శరీరం నిండా వేలాది శైవ వైష్ణవ చిహ్నాలతో దర్శనమిచ్చాడు. ఆ హరుని విగ్రహంలో సగభాగం విష్ణువు సగ భాగం శివుడు. గరుడధ్వజం ధరించి వృషభం మీద కూర్చొని ఒకపరీ, వృషభధ్వజం పట్టుకొని ఖగవాహనుడై మరొకపరి కనిపించాడు. సర్వగణాగ్రేసరుడైన ఆ త్రినేత్రుడలా అనంతరూపాలు దర్శిస్తుండగా మహాపాశుపత గణాలవారు అసంఖ్యాకంగా వస్తూ ఉన్నారు. అంతట నా బహురూపి ఏకరూపి అయ్యాడు. ద్విరూపధరుడయ్యాడు, రూప రహితుడై కూడ ఆ మహాయోగి ఒక రూపం ధరించాడు. క్షణకాలం తెల్లగా ఉంటే మరుక్షణంలోనే ఎరుపుగా, పచ్చగా, నల్లగా క్షణాలమీద మార్పుచెందాడు.

మరుక్షణాన ఆ రుద్రేంద్రుడు మిశ్రవర్ణంలో కనిపిస్తే ఆ మరుక్షణాల్లో వర్ణహితుడయ్యాడు. మహాపాశుపతుడయ్యాడు, ఇంద్రుయ్యాడు, ప్రభాకరుడయ్యాడు. అనంతరం క్షణార్ధంలో విష్ణువుగా మారాడు, పితామహ బ్రహ్మరూపం ధరించాడు. ఆ అద్భుతానికి వెరగుపడి చూచే ఆ శైవ గణాలకు బ్రహ్మ విష్ణు శివ భాస్కరుల ఏకరూపత బాగా అవగతమైనది. సదాశివుని దేవదేవుడుగా గుర్తించినంతనే ఆ పార్షదులందరూ పాపరహితులయ్యారు. అలా ధూతపాపులైన తన గణాలను చూచి ఆనందించి హరిహరుడైన ఆ శివుడు – శివకేశవాభిన్న దృష్టు పొందిన మీరందరు ధన్యులు. మీ వ్రతాలు ఫలించాయి. నాకానందం కలిగింది. మీరు కావలసిన వరం కోరుకొనుడనగా వారలు దేవా, ఇంతవరకు భిన్న దృష్టితో వ్యవహరించి మేము మూట గట్టుకొన్న పాపాలు నశించు నట్లనుగ్రహించండని వేడుకున్నారు. ఓ నారదా ! అంతట శంభుడు మంచిదని వారందరకు పాపనాశం కలిగించాడు. వారలను గూడ కౌగలించుకొని ఆనందపరచాడు. ప్రణతార్తి హరుడు వృషభ మేఘవాహనుడునగు ప్రభువు చెప్పిన మాటలువిని ఆ గణాధిపతులందరు వేదోక్తమైన క్రమంలో ఆ మందర గిరిని ఆక్రమించి నిలచారు. అలా శివుని పాదాలను నలువైపులా పరివేష్టించి నీలమేఘకాంతితో నిలబడిన ఆ సంఖ్య గణాలతో ఆ శ్వేతమహాపర్వతం మందరం నల్లని చర్మంతో కప్పబడి శరత్కాల మేఘంలాగా వెలిగే హరుని వృషభరాజంలాగా విరాజిల్లింది.

ఇది శ్రీవామన మహాపురాణంలో నలభై ఒకటవ అధ్యాయం ముగిసింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment