మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు.
ఈ లోపల ఆ ప్రమథులకాశ్రయాలైన కందరాలతో కూడిన ఆ మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు. ఆ దానవులను చూచి ప్రమథులందరు కిలికిల ధ్వనులు చేసి గొప్ప సంరంభంతో అనేకాలయిన తూర్యాలు భేరీలు మోగించారు. ఆ మహానాదం ప్రళయ ఘోషలాగ భూమ్యాకాశాలను నింపివేసింది. ఆకాశమార్గాన వెళ్తున్న విఘ్నరాజైన వినాయకుని చెవిన బడినది. అదివిని క్రుద్ధుడై తన ప్రమథులతో కూడికొని పర్వతశ్రేష్ఠమైన మందరానికి వచ్చి వినాయకుడు తండ్రికి భక్తితో మ్రొక్కి , ఓ జగన్నాథా ఇంకా కూర్చున్నారేల? లేవండి, రణ సన్నద్ధులుకండి అని విన్నవించాడు. విఘ్నేశ్వరుని మాటలువిని పరమేశ్వరుడు అంబికను చూచి, ‘అంధకుని సంహరించుటకు వెళ్తున్నాను. నీవప్రమత్తురాలివిగా నుండవలెను సుమా అన్నాడు. అంతట నా గిరి కుమారి ప్రాణేశ్వరుని మాటిమాటికి గాఢంగా కౌగలించుకొని స్నేహాతిశయంతో ప్రభూ! వెళ్ళి అంధకుని జయించండి అన్నది. అంతటనామె చందన గోడోచనాంజనాది మంగళ ద్రవ్యాలతో భర్తను పూజించి అత్యంత ప్రేమతో ఆయన పాదాలకు నమస్కరించింది. అంతట నా హరుడు మాలిని, జయ, విజయ, జయంతి, అపరాజితలను చూచి మీరందరు యింటిలోనుండి జాగ్రత్తగా గిరి పుత్రిక ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుతూండండని ఆదేశించాడు. అలా అందరకూ చెప్పి సంతోషంతో వృషభారూఢుడై ఆ శూలపాణి ప్రమథగణాల జయజయధ్వనాల మధ్య అంధకుని జయించుటకై బయలుదేరి వెళ్ళాడు. అలా సర్వలోకేశ్వరుడు మహేశ్వరుడు శూలం ధరించి రణభూమికి బయలుదేరగా నోమహర్షీ! ఆయన విజయాన్ని సూచిస్తూ మంగళకరాలైన శుభశకునాలెన్నో కలిగాయి. ఎడమ వైపుగా ఆడ నక్క మోరయెత్తుకొని అరుస్తూ నడిచింది. క్రవ్యాదులు రక్తమాంస పిసాసువులైన మృగాలు సంతోషంతో తమ దాహం తీర్చుకునేందుకు వెంబడించాయి. ఆ పరమశివుని దక్షిణాంగం నఖ శిఖ పర్యంతం కంపించింది. హారీతపక్షి మౌనంగా మెడ త్రిప్పుకొని వెళ్ళింది. ఈ శుభశకునాలను చూచి భూతభవిష్యద్వర్త మాన ప్రభులైన ఆ చంద్రశేఖరుడు నందీశ్వరునితో చిరునవ్వులు చిలుకరిస్తూ యిలా అన్నాడు.
నందీ! ఈ శుభశకునాలు, నాకీరోజు జయం కలుగుతుందని అపజయమంటూ ఉండదని చూపిస్తున్నాయి. శివుని మాటలకా గణాధ్యక్షుడు శిలాదపుత్రుడు మహాదేవా! నీవు జయించుటకు, శాత్రవులను పరిమార్చుటకు సందేహమంటూ ఏముండునని చెప్పి మహాపాశుపతాదులతో సహా రుద్ర గణాల నందరను యుద్ధానికి ఆదేశించాడు. ఆ గణాల వారంతా నానా అస్త్రశస్త్రాలు ధరించి దానవబలం మీదబడి పిడుగులు చెట్లను కూల్చినట్లు వారలను మర్దించ సాగారు. బలవంతులైన ప్రమథుల దాడిని త్రిప్పుకొట్టుటకై ఆ దైత్యదానవులంతా, రోకళ్ళు గుదిబండలు ధరించి ఆ ప్రమథులను చంప నుద్యమించారు. ఆ సమయాన ఆకాశాన నిలచి, ఇంద్ర విష్ణు బ్రహ్మ సూర్యాగ్నులతో గూడి దేవతలంతా ఆ దృశ్యం చూడ సాగారు. అంబరవీథి అంతా, ఓ నారదా! దుందుభులూ గీత వాద్యాల తుముల ఘేషలతో నిండిపోయింది. అలా దేవగణం చూస్తూ ఉండగా నా మహాపాశుపతాది గణాల వారంతా మహాకోపంతో ఆ దానవులను సంహరింపసాగారు. దైత్యసేనాపతి హుండుడు తమ చతురంగబలాలు సంహరింపబడటం చూచి క్రోధోన్ముత్తుడై మహావేగంతో, పట్టుకుచ్చులతో వెలిగే ప్రచండమైన వెండి గుదియ చేత బట్టుకొని ఇంద్రధ్వజంలాగా శత్రువుల మీద విరుచుకొని పడ్డాడు. ఆ గుదియను గిరగిర త్రిప్పుచూ అనేకమంది గణాలను సంహరించాడు. వాని ధాటికి వెరచి రుద్రులు మొదలు స్కందగణాల వారలు సైతం పారిపోసాగారు. అలా భయంతో విరుగుతున్న తనబలాన్ని చూచి గణాధిపతియైన వినాయకుడు తుహుండుని వైపు వేగంగా పరుగెత్తాడు. ఆ వచ్చుచున్న వినాయకుని కుంభస్థలాన్ని గురిచూచి ఆ దురాత్ముడైన హుండుడు తన గుదియను విసిరాడు. ఓ బ్రహ్మర్షీ! వజ్రంతో అలంకరించబడిన ఆ గుదియ వినాయకుని కుంభప్రదేశాన తగిలి, మేరుశిఖరానబడి ముక్కలయ్యే పిడుగునకు వలె తుత్తునియలై పోయింది. పరిఘను విఫలం గావించి తన మేనమామ (తుహుండుని) మీద లంఘిస్తున్న వినాయకుని చూచి, వాడిని రక్షించుకొనుటకై, రాహువు తన బాహుపాశాలతో గట్టిగా బంధించాడు. అంత నామహోదరుడు వాడి బాహుపాశాన్ని విడిపించుకొనుటకై వాడిని లాగి తనగొడ్డలితో తలమీద ప్రహరించాడు. వ్రేటుకు ఎండిన కట్టెలాగ తలరెండుగాచీలి క్రిందపడినా, ఆ రాహువు తనపట్టును వదలలేదు. నారదా! వినాయకుడెంత యత్నించినా తప్పిచుకోలేకపోయాడు.
రాహువు బంధనంలో చిక్కిన వినాయకుణ్ణి చూచి కుండోదరుడనే గణేశ్వరుడు రోకలి పట్టుకొని మహావేగంతో దురాత్ముడగు రాహువును మోదాడు. కలశధ్వజుడనే గణపతి ప్రాసంతో రాహువు గుండెలు చీల్చాడు. ఘటోదరుడు గదతో ప్రహరించాడు. సుకేశ దైత్యుడు ఖడ్గంతో కొట్టాడు. అలా నలువైపుల నుండి చావు దెబ్బలు తిని వివశుడై ఆ రాహువు వినాయకుని వదలిపెట్టాడు. వెంటనే ఆ గణేశ్వరుడు గండ్ర గొడ్డలితో తుహుండుని తల బ్రద్దలుకావించాడు. తుహుండుడు మరణించి రాహువు తిరుగు ముఖం పట్టడంతో, కాలానల సదృశులైన గణేశ్వరులైదుగురు రాక్షసవీరుల సేనలోకి, తమ క్రోధవిషజ్వాలలు వర్షించేందుకు చొచ్చుకొని పోయారు. అలా వారల క్రోధాగ్నికి మాడిపోనున్న తనసేనను చూచి మహాబలశాలియైన బలి వాయువేగంతో గదతో వినాయకుణ్ణి కుంభస్థలం మీద మోదాడు. కుండోదరుడి నడుము విరుగగొట్టాడు. మహోదరుని మాడుపగులగొట్టాడు. కుంభధ్వజుడి కీలుకీలూ ఊడబాదాడు. ఘటోదరుడి తొడలు సంధులు పొడిపొడి చేశాడు. అలా అయిదుగురు గణాధిపులను తిరుగుముఖం పట్టించి, రెట్టించిన శౌర్యంతో ఆ రాక్షస శ్రేష్ఠుడు స్కంద విశాఖాది గణాల వారి మీదకు లంఘించాడు. అలా విరుచుక పడుతున్న బలిని చూచి మహేశ్వరుడు గణశ్రేష్ఠుడైన నందీశ్వరుని పిలచి, ఓ వీరా! వెళ్ళి దైత్యులను జయించి రమ్మని పంపాడు. శివాదేశాన్ని తలదాల్చి ఆ శిలాదనందనుడు వజ్రాయుధం గిరగిరా త్రిప్పి బలితలమీద గట్టిగా కొట్టాడు. దానితో అతడు సృహతప్పి నేలమీదపడిపోయాడు. తన సోదరుని కుమారుడలా మూర్ఛపోవడం చూచి కుజంభుడు రోకలి పట్టుకొని మహాబలంతో త్రిప్పి నందిమీద విసిరాడు. అలా వస్తూన్న రోకలిని మధ్యలోనే ఒడిసి పట్టుకొని మహాబలశాలియైన నంది దానితోటే కుజంభుని తలపగులగొట్టి యమలోకానికి పంపాడు. ముసలంతో కుజంభుణ్ణి చంపి. ఆ నంది వజ్రాయుధంతో వందలాది రాక్షసులను సంహరించాడు. వారందరా గణనాయకుని చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి దుర్యోధనుని అండజేరారు. నంది చేతిలో దెబ్బలుతిని వచ్చిన తనవీరులను చూచి ఆ దైత్య వీరుడు దుర్యోధనుడు మెరుపుతీగవంటి ప్రాసాయుధాన్ని నందిమీదకు చావురా ఈ దెబ్బతో! నంటూ బలంకొద్దీ విసరాడు. ఆ వచ్చే ప్రచండ ప్రాసానిని, కొండెగాడు (పిశునుడ) గూఢరహస్యాలు బయటపెట్టి బ్రద్దలు గావించి నట్లుగా వజ్రాయుధంతో మధ్యలో బ్రద్ధలు చేశాడు. అంతట తన ప్రాసాయుధం వ్యర్థంకావడం చూచి వాడు పిడికిలి బిగించి గణేశ్వరుని మీదకు దుమికాడు. అంతట నందీశ్వరుడు మహావేగంతో వజ్రాయుధం ప్రయోగించి వాడి తలకాయను తాటి పండులాగ ఛేదించి నేల పడగొట్టాడు. ఆ వీరుడు నేలకొరగి పోవడంతో రాక్షసులంతా భయభీతులై వెన్నిచ్చి దశదిశలకూ పారిపోయారు.
తన కుమారుడట్లు హతుడగుట నిరీక్షించి, వాని తండ్రి హస్తి భయంకరమైన బాణాసవం ధరించి నందీశ్వరుని మీదకురికి, యమదండాల్లాంటి బాణాలు వదలి ఆయన శరీరాన్ని చిల్లులుబడజేశాడు. మోఘాలనడ్డుకొని వాన జలధారల్లో మునిగిన కొండల్లాగ నందీశ్వరునితో బాటు వృషభధ్వజులైన గణాలవారంతా ఆబాణధారల్లో మునిగిపోయారు. ఆ బాణ వృష్టికి తట్టుకొనలేక బలవంతులైనప్పటికీ వినాయకాది వీరులుకూడ సింహాన్ని చూచిబెదరిన వృషభాల్లాగ నలువైపులా భయార్తులై పారిపోయారు. అలా తమ గణాధిపతులు తిరోగాములవడం చూచి, తన శక్త్యాయుధంతో ఆ బాణవృష్టిని నివారించి ప్రచండ వేగంతో శత్రువును సమీపించి శక్తితో వాని వృక్షాన్ని చీల్చాడు, కుమారస్వామి. స్కందుని శక్తి పాతానికి హస్తి నేలకొరిగి మరణించగా శత్రుసైన్యం మరల పలాయనం చిత్తగించింది. అసుర సైన్యమలాకకావికలై పోవడంచూచి నంది మొదలైన గణ ముఖ్యులు మహాక్రోధంతో విజృంభించి దానవమూకలను చెండాడసాగారు. అలా ప్రమథుల ధాటికి వెన్నువిరిగి పారిపోయే దానవులు కార్తస్వరదైత్యనాధుని నాయకత్వంలో మరలి యుద్ధభూమికి వచ్చారు, అలా తిరిగివచ్చిన దైత్య సేవలను చూచి ప్రచండ క్రోధంతో బుసలు కొడుతూ వ్యాఘ్రముఖుడైన నందిషేణుడు కూడ తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. వాడిమొనదేరిన పట్టిశాయుధంతో నందిషేణుడు, గదచేతబట్టుకొని కార్తస్వరుడూ తలపడ్డారు. అలా అగ్ని శిఖలా దూకుతున్న కార్తస్వర మహాదైత్యుని చూచి నందిషేణుడు పట్టిశాన్ని గిరగిర త్రిప్పి ప్రచండ వేగంతో వాని నుదుటి మీద ప్రహరించాడు. దానితో ఆ కార్తస్వరుడు వికృతస్వరంతో చావుకేకపెట్టి నేలకొరిగాడు. తన మేనమామ కుమారుడలా హతుడు కావడంతో కాలపాశంలాంటి పాశం ధరించి, తురంగకంధరుడను వీరుడు ముందుకురికి ఆ పాశంతో ఆ నందిషేణుడిని పట్టిశాయుధంతో సహా బంధించాడు. బద్ధుడైన నందిషేణుని చూచి రోషించి మహాబలశాలి అయిన విశాఖుడు శక్తి ఆయుధంతో వచ్చి నిలచాడు. అది చూచి మేటివీరుడైన ఆయఃశిరుడను వాడు పాశం ధరించి కుక్కట ధ్వజుడైన విశాఖునితో తలపడ్డాడు. అదిచూచి విశాఖునికి తోడుగా శాఖుడు నైగముడు వచ్చి ఆయఃశిరుని ఎదుర్కొన్నారు. విశాఖునికి ప్రియం చేసేందుకై శాఖ నైగమేయులిద్దరూ తమశక్త్యాయుధాలతో అయఃశిరుని దేహాన్ని చెరొక వైపునా ఛేదించాడు. అలా ఆ హర కుమారులు మువ్వురూ పీడించగా వాడు రణభూమి వదలి పారిపోయి గణేశ్వరులు చూస్తుండగా, శంబరాసురుని మరుగుచేరాడు. ఆ శంబరుని పాశాన్ని శివుని నలుగురు పుత్రులూ నాలుగు ముక్కలుగా తమ శక్త్యాయుధాలతో ఖండించారు. అలా ఆకాశం నుంచి క్రిందబడిన తన పాశపు ముక్కలను చూచి భయంతో గడగడ లాడుతూ శంబరుడు పారిపోయాడు. కుమారుడు రాక్షసులను మర్దించాడు. రుద్రగణాలచేత మర్దింపబడిన ఆ దానవసేన విషణ్ణవదనంతో భయాందోళనతో పారిపోయి శుక్రాచార్యుని అండజేరింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹