నారదుడిలా అడిగాడు
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! మలయ పర్వతం మీద యింద్రుడు తన స్వంత పనులెలా నిర్వర్తించుకొనెనో ఆ వివరాలు తెలయ చెప్పండి. అందుల కాపులస్త్యుడో నారదా ! మలయ పర్వతానికి వెళ్లి యింద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యమూ తన కార్యమూ చెబుతున్నా వినుము. అంధకాసురుడి అనుచరులలో, యుద్ధంలో ఓడిపోయిన మయతారాది రాక్షసులు పాతాళానికి వెళ్లవలెనని ఉత్సహించి వెళ్లుతూ దారిలో సిద్ధులకు నివాసాలయిన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదులతో అలరారే మలయ పర్వతాన్ని చూచారు. మహా సర్పాలతో చుట్టుకొనబడిన చల్లని చందన తరువులతో మాధవీ కుసుమ పరిమళంతో నిండిన ఆ గిరి మీద ఋషులు శివార్చనలు గావిస్తున్నారు. యుద్ధ వ్యాయామంతో అలసి పోయిన మయుడు, తారుడు మొదలయిన రాక్షసులచ్చటి చల్లని వాతావరణం చూచి ఆ చెట్ల నీడల్లో కూర్చొనియుండగా, సుగంధంతో కూడిన దక్షిణ వాయువు మెల్లగా వీచినది. ఆ సుఖానికి ముగ్ధులై వారచటనే స్థిరంగా ఉండిపోయారు. లోక పూజ్యులైన దేవతలను ద్వేషించ సాగారు. ఆ విషయం తెలిసి కొనిన శివుడు యింద్రుణ్ణీ దేవతలనూ అక్కడకు పంపాడు. దారిలో ఆ దేవరాజుకు కామధేనువు కనిపించగా నాతడా గోమాతకు ప్రదక్షిణం చేసి, అందమైన మలయగిరినీ, అచట యిష్ట భోగాల్లో మునిగియున్న దానవులందరనూ చూచాడు. వెంటనే ఆ బలారి ఆ రాక్షసులను యుధ్ధానికాహ్వనించగా వారంతా బాణ వర్షం కురిపిస్తూ ఆయన మీద కెత్తి వచ్చారు. అద్భుత దర్శనుడైన ఆ శక్రుడు రథం మీద కూర్చొని, ఓ నారదా! కొండలను మేఘాలను మేఘాలు కమ్ముకున్నట్లు ఆ దానవులను తన బాణాలతో కప్పి వేశాడు. అలా మయుడు మొదలయిన రాక్షసులను బాణాలతో ముంచెత్తి పాకుడనే మహాసురుణ్ణి వాడిమొనగల్గి గ్రద్ద ఈకలతో అలంకరించబడిన బాణాలతో సంహరించాడు. పాక దానవుని శాసించినందున ఆయన కానాటి నుండి పాకశాసనుడను పేరు కలిగింది. బాణసుర పుత్రుడైన పురుడనే మరొక రాక్షస వీరుణ్ణి బాణ పరంపరతో చీల్చి చెండాడి పురందరుడనే బిరుదు కూడ పొందాడు.
అలా గోత్రభేది చేతిలో వారలు మడిసిన తర్వాత మిగిలిన రాక్షస బలాలు ఓడిపోయి పాతాళానికి వెళ్లిపోయాయి. ఈ పని నిర్వహించేందుకే త్రినేత్రుడు యింద్రుని మలయాచలానికి పంపాడు. ఇంకేమి వినగోరుతున్నావని పులస్త్యుడనగా నారడుడో బ్రహ్మర్షీ! ఇంద్రునకు గోత్రభేది యను పేరేల కలిగెనో చెప్పి నాసంశయం తీర్చండి అనగా నా పులస్త్యుడిలా చెప్పసాగాడు. నారదా! ఇంద్రుడు హిరణ్యకశిపు మరణానంతరం ఏమి చేసినదీ గోత్రభేది ఎలా అయినది సావధానంగా వినుము. తన కుమారులు చంపబడుట చూచి దితికశ్యప మహర్షిని, చేరి, నాధా! నా భర్తవగు నీవు నాకు ఇంద్రుని వధించగల పుత్రుని అనుగ్రహించుమని ప్రార్ధించింది. అందులకా కశ్యప మహర్షి, ప్రియురాలా! నీవు వంద దివ్య సంవత్సరాలు శుచిగా ఆచారానుష్ఠానం చేసినచో శత్రుహంత లోకాధిపతి అయిన పుత్రుడు కలుగుతాడని చెప్పగా నాదితి అందుకు సమ్మతించినది. అంతనా బ్రహ్మర్షి యీమెకు గర్భదానం చేసి తాను ఉదయగిరికి వెళ్లిపోయాడు. ఆ ముని వెళ్లిన వెంటనే సహస్రాక్షుడాశ్రమంలో చేరి, దితిని సమీపించి అమ్మా! నీ వంగీకరిస్తే ఈ స్థితిలో నీకు శుశ్రూష చేస్తానమ్మా అని అడిగాడు. అందుల కామె మంచిదని ఒప్పుకోగా ఆ పురందరుడు అత్యంత వినయంతో సమిధలు ఆకులు ఆమెకు తెచ్చియిస్తూ బిలం కోసం వెదకే మహావిషసర్పంలాగా, కార్యార్థియై ఆమెను కనిపెట్టి ఉన్నాడు. అలా తపోనిష్ఠలో ఉండగా, పది వందలేండ్లు పూర్తి కానుండగా ఆ తపస్విని తలకు స్నానం చేసి జుట్టు విరబోసికుని మోకాళ్లమీద తల ఆనించి, వెంట్రుకలు పాదాలకు తాకునట్లు వంగి చిన్నకునుకు తీసినది. అలా ఆమె అశుచిగా ఉండటం గమనించి వెంటనే ఆ సహస్రాక్షుడామె ముక్కరంధ్రాల్లో గుండా మాతృజఠరంలో ప్రవేశించాడు.అక్కడ నడుము మీద చేతులుంచుకుని పైకి చూస్తూ తేజస్వి అయిన శిశువును చూచాడు. ఆ బాలుని ముఖం మీద శుద్ధ స్పటికం లాంటి మాంసపేశి (ముక్క) ని చూచి రెండు చేతులతో పట్టుకొని కోపంతో ఆ శక్రుడు గట్టిగా నలిపాడు.అది పైభాగాన క్రింది భాగాన సాగి పెద్దదై నూరంచులుగల వజ్రంగా మారింది.
ఓ నారదా ! ఆ వజ్రంతోనే ఆ శక్రుడు దితి గర్భంలోని శిశువును ఏడు ముక్కలుగా ఖండించాడు.ఆ శిశువు కీచు గొంతుతో ఏడ్చాడు. మూర్ఖుడా! అలా కర్కశ ధ్వనితో ఏడువకు మంటూ మరల ఆ ఏడు ఖండాలను ఒక్కొక్కటి ఏడు ముక్కలుగా ఖండించాడు -ఆ ఏడుపు విని దితి మేల్కొని ఇంద్రుని దుశ్చేష్టితం తన పుత్రుని రోదనంగా తెలుసుకున్నది. “మారుద” “మారుద” ఏడవకుము ఏడవకుమంటూ ఇంద్రుడు ఖండించినందువలన ఆ నలభై తొమ్మిదిమంది మరుత్తులు అయ్యారు. తల్లి గావించిన అపచారం వల్ల అలా జన్మించి ఇంద్రుని భృత్యులై ముందు (వాయువులై) నడుస్తూ ఉంటారు. అంతట వజ్రపాణియై మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చి శాపభయంతో దితి ఎదుట చేతులు జోడించి నిలచి – తల్లీ! నీకుమారుని మృతికి నేను కారణం కాదమ్మా. నీవు అశుచివైనందుననే యిలా జరిగినది. నామీద కోపపడకు తల్లీ! అని అర్ధించగా నామె “యిందులో నీ తప్పు లేదు బాబూ! దైవవిధియే యిలా ఉన్నది. కాకపోతే వ్రత పరిసమాప్తి దశలే నేనశుచిగా ఎందుకు ప్రవర్తించాలి! అని సమాధానపడినది. అంతట నాదితి ఆ బాలకులను సముదాయించి యింద్రుని వెంట పంపి వేసినది. నారదా! ఇలా పూర్వకాలంలో భయార్తుడై తన కుటుంబానికి (గోత్రానికి) చెందిన స్వంత సోదరులనే వజ్రంతో భిన్నం చేసినందున భగవంతుడైన మహేంద్రుడు గోత్రభిత్తుగా పిలువబడినాడు.
ఇది శ్రీ వామన పురాణంలో నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹