నారదుడు ప్రశ్నించాడు.
మహర్షే! దితి పుత్రులు మరుత్తులైనారని నీవు చెప్పి యున్నావు గదా. అయితే వారలు వాయుమార్గాన చరించుటకు కారణమేమి? వారలకు పూర్వపు మన్వంతరాలలో మరుత్తులుగా నున్న వారెవరు? ఈ వివరం నాకు తెలియ జేయుము. అందులకు పులస్త్యుడిలా చెప్ప సాగెను. నారదా! స్వాయంభువ మనువు నుండి వర్తమాన కాలపు మనువు వరకు గల మన్వంతరాలలో మరుత్తులెవరెవరుండిరో వివరంగా చెబుతున్నా వినుము. స్వాయంభువ మనుపు కుమారుడు ప్రియవ్రతుడు మనువు. అతని పుత్రుడు త్రిలోక పూజితుడు సవనుడు. ఆ సవనుడు అపుత్రకుడుగా మరణించగా నాతని భార్య సుదేవ శోకంతో బాధపడుతూ భర్త శరీరాన్ని దహనం చేయ నివ్వకుండా ఆ లింగనం చేసుకుని కూర్చుకున్నది. నాధా! నాధా అంటూ ఆ పతి పరాయణ విలపిస్తూండగా అంతరిక్షాన్నుంచి ఒక అ శరీరవాణి వినిపించి”ఓ కల్యాణీ! ఏడువకుము. నీ పతి భక్తి నిజ మైనదైనచో నీ భర్తతో పాటు అగ్నిలో పడి పొమ్ము”. అని ఆదేశించింది. ఆ అశరీరవాణి వైపునకు తిరిగి ఆ రాజపుత్రి సుదేవ, నేను నా కోసం విలపించడం లేదు. నా భర్త పుత్రహీనుడైనందులకే శోకిస్తున్నానన్నది. అందుల కానభోవాణి, ఓ విశాలాక్షీ! ఏడువకుము. వెంటనే చితి నెక్కుము. నీకు నీ భర్తవలన ఏడుగురు పుత్రులు కలుగుతారు.ఇది సత్యం. నా మాట మీద నమ్మక ముంచి వెంటనే అగ్ని నారోహించుమని మరల బలికినది. అది విన్నంతనే ఆ బాలిక తన భర్త పవిత్ర శరీరాన్ని చితి మీద పెట్టి భర్తనే ధ్యానిస్తూ దాని మీద కూర్చోని తగులబడి పోయింది. అనంతరం ముహూర్త కాలంలో ఆ రాజు భార్యతో కూడ లేచి ఆకాశాని కెగిరిపోయాడు. అక్కడ కామగమనంతో ఆ సునాభ కుమార్తె అయిన సుదేవతో తిరుగుతుండగా నామె ఋతుమతి (బహష్టు) అయింది. అంత తన దివ్య శక్తి వల్ల భార్యా సహితుడై ఆ నృపతి ఆకాశంలోనే అయిదు దినాలుండి పోయాడు. ఆరవనాడు ఋతుస్నానం చేసిన తర్వాత ఆ ఋతుస్రావం వ్యర్థం కాకూడదని తెలిసికొన్న ఆ రాజు ఆ సుందరితో యదేచ్ఛగా సమాగమం కావించాడు. ఫలితంగా నాతనికి వీర్యస్ఖలమై ఆ శుక్రం భూమి మీద పడి పోయింది. ఓ తపోధనా! శుక్రం అలా జారి పడిపోగానే ఆ రాజు సపత్నీకుడై దివ్యగమనంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
అలా ఆకాశం నుండి జారిన, ఆకాశ వర్ణపు శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు కోరికతో దర్శించారు. అది ఒక పద్మంలో పడి యుండగా దానిని అమృతమని భ్రమించారు. ఓ తపోధనా! ఆ ఋషిపత్నులు ఎల్లప్పుడూ జవ్వనులుగా ఉండాలనే కోరకతో అమృతమని భ్రమపడి ఆ రాజు శుక్రాన్ని త్రాగవలె నని నిశ్చయించు కున్నారు. ఆ విషయం వారలు తమ భర్తలతో చెప్పి వారి అనుమతితో యధావిధిగా స్నానాలు చేసి భర్తలను పూజించి కమలంలోని ఆ శుక్రాన్ని ఏడుగురూ త్రాగారు. పార్థివేంద్రుని ఆ శుక్రాన్ని త్రాగినంతనే ఆ తపస్వుల భార్యలు తమ బ్రహ్మతేజాన్ని కోల్పోయారు. ఆ విధంగా దూషిత శీలలైన తమ భార్యలను వారేడుగురు వదలి వేశారు. ఆ ముని పత్ను లేడుగురు కుమారులను కన్నారు. ఆ ఏడుగురు శిశువులు భయంకరంగా రోదించారు. వారి ఏడుపు ధ్వనులతో జగత్తంతా నిండి పోయింది. అంతట నచటకు లోక పితామహుడు బ్రహ్మ వచ్చి రోదించుచున్న నా బాలురతో ఓ మహాబలులారా! ఏడువకు డేడువకుడు. మీరు మరుత్తులనే పేరుతో ఆకాశగాములౌతారు. అని చెప్పి వారలను తనతో గొని పోయి మరుత్తులుగా ప్రకటించాడు. వారలే నారదా! స్వాయంభువ మన్వంతరాన వెలసిన ఆది మరుత్తులు. ఇక స్వారోచిష మన్వంతరం లోని మరుత్తుల కథ వినుము. స్వారోచిష మనుపుత్రుడు శ్రీమంతుడగు క్రతుధ్వజుడు. అతనికి అగ్ని సమానులైన కుమారు లేడుగురు గలిగారు. వారలు తపస్సుగావించుటకై మహామేరు గిరికి వెళ్లారు. ఇంద్రపదవిని కాక్షించి వారు బ్రహ్మను గూర్చి తపించుట ఎరిగి సహస్రాక్షుడు యింద్రుడు భయపడి అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పూతనను చూచి యిలా అన్నాడు. ఓ సుందరీ! పూతనా! నీవు వెంటనే మహామేరు శైలానికి వెళ్లుము. అక్కడ క్రతుధ్వజుని కుమారులు కఠోర తపస్సు చేస్తున్నారు. నీకు తోచిన యుక్తులన్నీ ప్రయోగించి వారలకు తపోవిఘ్నం కలిగించి రమ్ము. నీకు సిద్ధి కలుగు గాక. ఇంద్రుని ఆదేశాన్ని తల దాల్చి ఆ రూపశాలిని అయిన పూతన త్వరగా నా రాజకుమారులు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్లినది. వారల అశ్రమానికి దగ్గరగా నొక నది మెల్లగా ప్రవహిస్తోంది.
ఆ ఏడుగురు సోదరులూ స్నానార్థం నదికి వెళ్లగా నదే వేళకు చక్కని అంగసౌష్టవంతో అలరారే ఆ అప్సర కూడా నీళ్లలో దిగి స్నానం మొదలు పెట్టింది. ఆవిడ స్నాన సౌందర్యాన్ని చూడగానే ఆ రాకుమారు లందరు మనస్సులు వికారానికి లోనై వారల వీర్యం స్ఖలనమై నీటిలో పడిపోయింది. దానిని ఆ నీటిలో నివసిస్తున్న మహాశంఖుడనే మకరి (మొసలి) భార్య శంఖిని మ్రింగివేసింది. అంతట వారు తపోభ్రష్టులై తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. ఆ పూతన ఇంద్రుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి వెళ్లిపోయిది.తర్వాత బహుదినాల కాశంఖరూపంలో ఉన్న ఆమె మొసలి జాలరి వాండ్ల పెద్ద వలలో చిక్కిపోయింది. వారా విలక్షణమైన మొసలిని బయట పడవేసి ఆ విషయం క్రతుధ్వజుని కుమారులకు నివేదించారు. యోగులైన ఆ మహాత్ములందరూ ఆలోచించుకొని దానిని తమ గృహావరణం లోని బావిలోనికి వదిలారు. తర్వాత క్రమంగా ఆ శంఖిని ఏడుగురు శిశువులను కని వెంటనే దేహత్యాగం కావించింది. తలిదండ్రులు లేక స్తన్యపానం కోసం బావిలో బిగ్గరగా రోదిస్తున్న ఆ బాలుర వద్దకు పితామహుడు వచ్చి, పుత్రులారా! ఏడవకండి. మీ రిప్పటినుంచీ మరుత్తులనే పేరుతో వాయుస్కంధాల మీద సంచరిస్తూ దేవతలు అవుతారు. అని చెప్పి వారలను తనలో కొనిపోయి వాయు మార్గాన వదలి తన లోకానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా స్వారోచష మన్వంతరంలో మరుత్తులు వెలిశారు. ఓ తపోధనా! ఇక ఉత్తముడు మనువుగా నున్న కాలంలోని మరుత్తుల జన్మ విధానం చెబుతున్నా వినుము. ఉత్తమ మన్వంతరంలో నిషధ దేశాధిపతి వపుష్మాను డను వాడు సూర్యకాంతితో రాజ్య మేలేవాడు. అతనికి గుణవంతుడూ ధార్మికుడు నైన పుత్రుడు “జ్యోతిష్మంతు” డను వాడు కలడు. అతడు పుత్రుల కొరకై మందాకినీ నదీ తీరాన తపస్సు చేస్తూండగా నతని భార్య, దేవగురువు పుత్రిక యైన సుందరి కూడా భర్తకు పరిచర్య చేస్తూ తపో జీవనం గడప సాగింది. ఫల పుష్ప సమిధలు సమకూర్చుతూ అతథి సత్కారాలు చేస్తూ అరణ్యవాసం వల్ల నామె కృశించి శల్యమై పోయింది. తపస్తేజంతో వెలిగిపోతూ వనంలో తిరుగుతూ ఉన్న ఆమె నొకపరి సప్తర్షులు చూచి, ఈ కావనంలో యిలా కఠోర తపస్సు చేయుటకు కారణమేమని ప్రశ్నించారు. అందులకా ఇల్లాలు తనూ తన భర్త తనయుల కొరకై తపో దీక్షలో ఉన్నామని చెప్పగా వారలు కరుణించి అమ్మా! మీరింటికి వెళ్లిపోండి. మీకు ఏడుగురు కుమారులు కలిగెదరు. మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరక నెరవేరుతుంది. సందియము లేదని వరమిచ్చి వెళ్లిపోయారు.
అంతట నా రాజర్షి భార్యతో నగరానికి తిరిగి వెళ్లి పోయాడు. తదుపరి చాలా దినాల కారాజు భార్య భర్త వలన గర్భం ధరించింది. ఆవిడ గర్భిణిగా ఉండగానే ఆ రాజు మృతుడైనాడు. ఆ పతివ్రత అమాత్యులు వలదని ఎంత బ్రలిమాలినా అంగీకరిచక భర్త దేహాన్ని చితిపై నుంచి తాను గూడ చితాగ్నిలో దుమికింది. ఓ మహర్షీ! అంతట నామె గర్భంలో నుండి ఒక మాంస ఖండం ఎగిరి వచ్చి బయట నీళ్లలో పడి ఆ శైతల్యానికి ఏడు భాగాలుగా ఆమెను అందులో నుంచి ఉత్తముని మన్వంతరంలో మరుత్తులుద్భవించారు. ఆ ఉత్తముని భ్రాత తామనుని మన్వంతరంలో మరుత్తులుగా జన్మించిన గాథ ఓనారదా! శ్రద్ధగా వినుము. “ఋతుధ్వజు”డను పేర విఖ్యాతుడైన తామస మనువు కుమారుడు తనయుల కోసమై యజ్ఞం మొదలు పెట్టి అగ్నితో తన రక్తమాంస అస్థి రోమ కేశ స్నాయువులు మజ్జా యకృత్తూ చక్కన అగు శుక్రం అన్నీ హోమం చేశాడు. వీర్యం అగ్నిలో బడుతూండగా “వద్దు వద్దు శుక్రం వ్రేల్చ వద్ద” నే శబ్దం బయలు వెడలిన వెంటనే ఆ రాజు మృతుడై పోయాడు. అంతట ఆ హవ్యవాహనుడి నుండి ఆయన లాంటి తేజస్సుతో వెలుగుతూ ఏడుగురు శిశువులు రోదిస్తూ బయట పడ్డారు. వారల ఏడుపు విని పద్మభవుడు వచ్చి, ఏడ్పు మాన్పించి వారలను ‘మరుత్తు”లను గావించాడు. ఆ విధంగా తామస మన్వంతరంలో మరుద్దేవ గణాలు వెలిశారు.
ఇక రైవత మన్వంతరంలోని మరుత్తుల జన్మ ప్రకారం వినుము. రైవతుని వంశంలో శత్రు భయంకరు డగు రిపుజిత్తనే రాజు గలడు. అతనికి పుత్రులు కలుగక పోగా తేజోనిధి అయిన భాస్కరుని ఉపాసించి “సురతి” అను పుత్రకను పొంది యింటికి గొనిపోయెను. తండ్రి యింటిలో ఆ బాలిక పెరుగుతుండగా నా రిపుజత్తు మరణించెను. పితృవియోగం సహించ లేక ఆ బాలిక దేహ త్యాగానికి ఉద్యుక్తురాలైంది. అంత బ్రహ్మ మానస పుత్రులైన సప్తర్తర్షు లామెను నివారించిరి. ఇతర తపస్వులు గూడ ఆమె పై నెంతయో వాత్సల్యం కలిగియుండిరి. అయిననూ ఆమె ఆ దుఃఖ సాగరం భరించలేక చితి పేర్చుకొని అందులో దగ్ధమై పోయింది. ఆ దృశ్యం చూచి, ఆమె నభిమానించిన ఋషు లందరూ అయ్యో!ఎంతకష్టం ! అని ఆక్రోశించారు. తగులబడుతున్న ఆమె శరీరాగ్ని నుండి ఏడుగురు బాలకు లుద్భవించారు. తల్లిని కోల్పోయి ఏడ్చుచున్న వారలను నిరించి లోకపతి అయిన బ్రహ్మ మరుద్గణాలనుగా నియమించాడు. ఓ నారదా! వారే రైవత మన్వంతరంలోని మరుత్తులు. ఇక చాక్షుష మన్వంతరం లోని మరుత్తుల వృత్తాంతమువినుము. ఆ కాలంలో సప్త సారస్వత తీర్థంలో సత్యవాది, శుచివ్రతుడు అయిన మంకియను తపోధనుడు ఘోర తపస్సులో నుండగా దానికి విఘ్నం కలిగించుటకై తుషితదేవతలు “వపు”వనే సుందరిని నియోగించారు. ఆ భామిని నదీ తీరాన చేరి ఆయనకు మనోవికారం కలుగజేయగా ఆయన శుక్రం జారిసప్త సారస్వత జలాల్లో పడిపోయింది. అందుల కాగ్రహెదగ్రుడై ఆ మంకణకు డావపును చూచి కలుగ జేయగా ఆయన శుక్రం జారిసప్త సారస్వత జలాల్లో పడిపోయింది. అందుల కాగ్రహెద్రగుడై ఆ మంకణకు డావపును చూచి గర్జిస్తూ ఓసీ! మూర్ఖురాలా! నీ పాపానికి ఫలం తప్పక అనుభవించుము. పో పో ! నిన్ను యజ్ఞ సభా వేదిక వద్ద నుండగా నొక గుర్రం నాశనం చేస్తుంది.’ అని శపించాడు. అనంతరం మా ఋషి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ సప్త సారస్వతీ జలంలో నుంచి ఏడుగురు మరుత్తులు జన్మించారు. ఓ నారదా! ఈ విధంగా పూర్వమన్వంతరాలలో ఆకాశ వ్యాపకులైన మరుత్తు లెలా జన్మించినదీ నీకు విపులంగా వివరించాను. వీరల జన్మ గాథ శ్రవణం పాప పరిహారం కలిగించి ధర్మాభ్యుదయం చేకూర్చ గలదు.
ఇది శ్రీ వామన పురాణంలో నలభై యారవ అధ్యాయము ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹