పులస్త్యుడిట్లనియెను :-
ఓ కలహప్రియుడవగు నారదా! ఈ కారణాననే బలి దైత్యుని రాజును గావించారు. మంత్రి ప్రహ్లాదుడైనాడు. శుక్రాచార్యుడు పురోహితు డైనాడు. విరోచన పుత్రుడు బలి దైత్యుడు రాజ్యాభిషిక్తుడు గావటం వినగానే మయదానవునితో సహా రాక్షసు లందరు తమ ప్రభువును దర్శించుటకు వచ్చి చేరారు. ఆ వచ్చిన దైత్యుల నందరను యథావిధిగా పూజించి నాకు శ్రేయస్కరమైన కర్తవ్య మేదో చెప్పుడని అర్ధించాడా వినయశీలి యగు బలిరాజేంద్రుడు. అంతట నా దైత్యులందరు ఆ బలితో యిలా అన్నారు – “సురమర్దనా! సావధానంగా వినుము. నీకూ మాకూ మనవారందరకూ శ్రేయస్కరమైన విషయం చెబుతున్నాము. నీ ప్రపితామహుడు హిరణ్యకశిపుడు సర్వదైత్య పాలకుడై ముల్లోకాలకూ ఇంద్రుడై యుండగా, సురశ్రేష్ఠుడైన విష్ణుడు సింహరూపంతో వచ్చి అందరూ చూస్తూండగా గోళ్లతో చీల్చి సంహరించాడు.అంతే కాదు మహాత్ముడగు అంధకుని రాజ్యాన్ని అపహరించేందుకు త్రిశూలి అయిన శంకరుని చేత కుట్ర పన్ని అంతని సంహరింప జేశారు. అంతట పోక మీపిన తండ్రి జంభుని ఇంద్రుడూ, కుజంభుని విష్ణువు, పశువుల మాదిరిగా వధించారు. మహేంద్రుడు శంభు పాక దైత్యులను నీ సోదరుడు సురదర్శనుని తండ్రి యగు విరోచనుని హతమార్చాడు. ఈ అత్యాచారాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాము. “ఆ విధంగా శుక్రుని కారణంగా జరిగిన తన వంశ నిర్మూలన వివరాలన్నీ విని, ఓ నారదా! ఆ బలి, రాక్షసు లందరనూ కూడ దీసుకొని ప్రతీకారానికి ఉద్యమించాడు. వారంతా మహోత్సాహంతో రథాల మీద కొందరు, ఏనుగుల మీద కొందరూ, గుర్రాలెక్కి కొందరూ, పాదచారులై కొందరూ, మహా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధానికి బయలు దేరారు. దేవతలతో తలపడటానికి బయలు దేరిన ఆ రాక్షస బలాన్ని ముందుండి సేనాపతి భయంకరాకారుడు మయ దానవుడు, మధ్యభాగాన బలి, వెనుక నుండి కాలనేమి, ఎడమ పార్శ్వాన మహావీరుడు శాల్వుడు, కుడి పక్షాన మహా భయంకరుడైన తారకాసురుడు నడిపించారు. నారదా! ఆ దానవ వీరులు వేలు లక్షలు అర్బుదాల సంఖ్యలో భూమ్యాకాశాలు ఆక్రమించి ప్రచండ ఘోషతో బయలు దేరాదు.
రాక్షసులు యుద్ధానికి వస్తున్న విషయం విని దేవరాజు యుంద్రుడు, మనం కూడ మన సైన్యాలతో వెళ్లి దానవులతో పోరాడుదము లెండని దేవతలను పురి కొల్పాడు. వెంటనే ఆయన మాతలిగొని వచ్చిన ఉత్తమ రథాన్ని ఆరోహించాడు. ఇంద్రుడు రథారూఢుఢుకాగానే యితర దేవతల లందరు తమ తమ వాహనాల మీద యుద్ధానికి బయలు వెడతారు. ఆదిత్యులు, వసువులు, యక్షులు, రుద్రులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినులు, విద్యాధర యక్ష రాక్షస పన్నగులు రాజర్షులు, సిద్ధులు నానా భూతగణాలు అందరూ గజాల మీద కొందరు, అశ్వాల మీద కొందరు, రథాల నెక్కి కొందరు విమానాలను, పక్షివాహనాల నారోహించి కొందరూ, బయలు దేరి దైత్య సైన్యాల కెదురుగా పయనించారు. నారదా! ఇంతలో నీ విషయం తెలసికొని వినతాసుతుడైన గరుడుడు, ఆయన మీద ఆసీనుడై దేవశ్రేష్ఠుడు విష్ణువు కూడ వచ్చి కలిశారు. ఆ వచ్చిన త్రిలోకనాధుని చూచి, ఇంద్రుడు దేవతలందరితో కలిసి వినమ్ర ప్రణామాలు గావించాడు. దేవ సేనా సమూహానికి ముందు గదాధారియై స్కందుడు నడిచాడు. మధ్యబాగాన యింద్రుడు, జఘన భాగాన విష్ణువు, ఎడమ భాగాన జయంతుడు, కుడివైపు మహాబలశాలి వరుణుడు, సేనా సంచాలనం గావించారు. ఆవిధంగా స్కంద యింద్ర విష్ణు వరుణ భాస్కరులు రక్షించుచుండగా యశస్విని అయిన ఆ దేవసేనా వాహిని నానా ఆయుధాలతో ముస్తాబై ఉదయగిరి పార్శ్వాన చెట్టు చేమలు పక్షిమృగాలు లేకుండా సమతలంగా అందంగా ఉన్న శిలామైదానానికి చేరుకుంది. అంత నా ప్రదేశంలో దేవాసురుల సైన్యాలు రెండు భయంకరంగా నొకదాని నొకటి ఢీకొనగా, ప్రాచీనకాలంలో వానర గజాల మధ్య జరిగిన ఘోరసంగ్రామాన్ని తలపిస్తూ తుముల యుద్ధం సాగింది. ఓ దేవర్షీ! యుద్ధానికి ముందు భాగాన రథాల వేగానికి రేగిన ఎర్రని ధూళి మేఘాలు, సంధ్యాకాలాన పడమటి దిశను కమ్ముకొనే అరుణ మేఘాలను మరపింప జేశాయి. ఆ సంకుల సమరంలో ఏదీసరిగా తెలియ రాలేదు, కనిపించలేదు. కొట్టుడు, చంపుడు, పొడువుడు! అనే భయంకర ధ్వనులు తెరపిలేకుండా నలువైపులా వ్యాపించాయి. రోమహర్షకమైన ఆ యుధ్ధంలో యిరుపక్షాలలోను హతులైన వారల రుధిర ధారలలో ఆ ధూళిమేఘాలు అణగిపోయాయి. అలా ధూళి తగ్గగానే స్కందుని వెంట దేవ సైన్యాలన్నీ ఒక్కపరిగా రాక్షసుల మీద విరుచుక పడ్డాయి. దేవసేనాపతి రక్షణలో దేవతలు దానవులను సంహరించగా మయుని అండ చూచుకుని రాక్షసులు సురలను చెండాడ సాగారు. అంతవరకూ అమృతపానానికి నోచుకోని దేవతలంతా స్కందునితో సహా రాక్షసుల ధాటికి నిలువలేక ఓటమి పాలయ్యారు. దేవతల ఓటమి చూచి శత్రు హంత అయిన శ్రీహరి శార్‌ఙ్గ చాపాన్ని ఎక్కుబెట్టి బాణవర్షంతో నలువైపులా గల శతృవుల నూచకోత కోయ సాగాడు. ఉక్కు మొనలతో పిడుగుల్లాగ తాకే ఆ బాణాలకు హతశేషులయిన రక్కసులు వెన్నిచ్చి పారపోయి మహాదైత్యుడు కాలనేమిని శరము పొందారు.
భయాతురులైన దానవులకు అభయం యిచ్చి, మాధవుని జయింప లేనని, తెలిసికొనిన ఆ కాలనేమి, మాయపన్ని, చికిత్స చేయకుండా ఉపేక్షించిన జబ్బు మాదిరిగా తన శరీరాన్ని పెంచసాగాడు. ఓ నారదా! అలా దేహాన్ని పెంచి చేతికి అందిన దేవతల నందరనీ వారు యక్షులుగానీ, కిన్నరులు గానీ, ఒడిసి పట్టుకొని కొండ గుహ లాంటి నోటిలో వేసుకోసాగాడు! ఆ సంరంభంలో వాడు రాక్షసుల సహాయంతో, యింద్ర చంద్ర సూర్యాదులతో సహా దేవతల నందరనూ, చేతిలో ఆయుధ మంటూ ఏదీ లేకపోయినా కాళ్లతో చేతులతో గోళ్లతో మర్దించ మొదలు పెట్టాడు. వాడి దేహం ప్రళయ కాలాన భూమ్యాకాశాలను భస్మం చేసే కాలాగ్ని చక్రంలాగా దుర్నరీక్ష్యంగా వెలిగి పోసాగింది. ఆ విధంగా దిక్కుల నన్నింటినీ ఆక్రమిస్తూ పెరిగపోతున్న ఆ ప్రబల శత్రువు దేహాన్ని చూచి దేవ గంధర్వ యక్ష సిద్ధసాధ్యాదులు సకల దేవతలు భయంతో వణికిపోతూ ఎటుపడితే అటు పారిపో సాగారు. కాగా గర్వంతో కనులు కానని దైత్యులు ఆనందంతో గంతులేస్తూ సర్వ దేవారాధ్యుడైన ఆ శ్రీహరి మీద తమ తమ శస్త్రాస్త్రాలు వర్షించి ఆయన యశస్సును కళంకితం చేసేందుకు ఉపక్రమించారు. కాలనేమి అండతో మయుడు బలితో కలిసి అలా విజృంభించే ఆ రాక్షసులను చూచి క్రోధారుణ నేత్రాలతో నిప్పులు వర్షిస్తూ, శార్ ఙ్గ ధనుస్సు ఎక్కు పెట్టి శతృ హృదయాలను చీల్చిచెండాడే పిడుగు ల్లాంటి బాణాలు పుంఖాను పుంఖాలుగా ఆ శ్రీహరి గుప్పించిన, రథ గజ, హయాల సహితంగా ముంచివేశాడు. ఆయన చూపులకే శత్రువుల తేజం హరించుకోపోయింది. గుములు గట్టి మేఘాలు పర్వతాన్ని కాలదండాల్లాంటి ఆ అర్ధచంద్ర బాణాల ధాటికోర్వలేక భయాతురులై మయుడు బలి మొదలైన వారంతా వెనుకకు తగ్గి నూరునోళ్లతో భీభత్సం సృష్టిస్తున్న కాలనేమిని ముందుకు పంపారు. వాడు బొబ్బలు పెడుతూ లోకేశ్వరుడైన కేశవుని సమీపించాడు. నడిగొండలాగ గత ఎత్తికొని తనమీదకు వస్తూన్న కాలనేమిని చూచి ధనుస్సును వదలి హరి చక్రం పట్టి నిలబడ్డాడు. దైత్య వృక్ష మూలోచ్ఛేదకుడైన ఆ ప్రభువును చూచి చాలా సేపు వికటాట్టహాసం చేసి ఆ రాక్షసుడు మేఘ గర్జన స్వరంతో యిలా అన్నాడు. “వీడే! రాక్షస లోకాని కంతా గుండె దిగులుగా పరిణమించిన మహా కోపిష్టి శత్రువు! వీడే మధువును సంహరించాడు. హిరణ్యాక్షుణ్ణి పొట్టన బెట్టుకున్నాడు. పుష్ప పూజల కోసం కలువరిచేవాడు. ఈనాటికి నా ఎదుట బడ్డాడు. ఇక నీ ఖలుడెక్కడకు బ్రతికి పోగలడు? తిరిగి ఈ రాజీవాక్షుడు తన యింటికి పోజాలడు!నా ముష్టి ఘాతాలకు నుగ్గునూచమై పోయే వీడి సర్వాంగాలను దేవతలు భయ విహ్వల నేత్రాలతో చూచే గడియ ఆసన్నమైనది. ఈ గడియతో వీడిపని సరి!” అంటూ పెదవులు కంపిస్తూండగా పండ్లు పటపట కొరుకుచు ఆ కాలనేమి దైత్యుడు, మహేంద్రుడు పర్వతం మీద వజ్రాన్ని ప్రయోగించినట్లు తన ప్రచండ గదాదండాన్ని గరుడుని మీద విసిరివేశాడు! ఆ భయంకరమైన గదమీదికి, మధుసూదనుడు తన చక్రాన్ని వదలి దానిని ముక్కలు గావించాడు. గదను భగ్నం చేసి ఆ చక్రం వేగంతో వాడి పెనుబాహువులు రెండూ నరికి వేసింది. బ్రహ్మాండమైన చేతులు రెండూ తెగిపోవడంతో ఆ దుష్టుడు ఎర్రగా మండి పోతున్న పర్వతంలాగా, మరొక వ్యక్తిలాగా కనిపించాడు. అంతటితో కోపం తీరక ఆ రాక్షసాంతకుడు, చక్రంతో వాడి తలను పండిన తాటి కాయలాగ నరికి నేల మీద పడగొట్టాడు. అలా చేతులు తల తెగ, మొండితాటి చెట్టులాగ కబంధ మాత్రుడుగా మిగిలిన ఆ మహాదైత్యుడు చలించని మేరు పర్వతంలాగ నిలచాడు. అలా నిలచిన వాడి మొండెమును, గరుత్మంతుడు తన వక్షోభాగంతో నెట్టివేయగా, ఇంద్రుడు బలుని వజ్రంతో ఆకాశా న్నుంచి భూమిమీదకు పడద్రోసి నట్టుగా ఆకాలనేమి నేలమీద పడిపోయాడు. అలా తమ ప్రధాన సేనాధ్యక్షుడు హతుడు కాగా, దేవసేనల చేతిలో చావు దెబ్బలు తిని శేషించిన దైత్యులు ఆయుధాలు, కవచాలు కట్టుబట్టలతో సహా వదలి ప్రాణ రక్షణకై పారిపోయారు. ఒక్క బాణాసురుడు మాత్రం యుద్ధభూమిన వదలి వెళ్లలేదు
ఇది శ్రీ వామన పురాణంలో నలుబది యేడవ అధ్యాయము ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹