పులస్త్యుని వచనం :-
దేవమాత ఉదరంలో వామనాకృతితో భగవంతుడు ప్రవేశించినంతనే, ఆ స్వామి చెప్పినట్లే, దైత్యులందరూ తమ తేజస్సును కోల్పోయారు. అలా అసురులందరు తేజో హీనులగుట చూచి బలి, దానవేశ్వరుడైన ప్రహ్లాదునితో యిలా అన్నాడు. ‘తాతా! మీరు పరమ జ్ఞానులు. మన రాక్షస వీరు లంతా యిలా తేజస్సు గోలుపడి యుండుటకు కారణమేదో చెప్పండి.’ అంతట మనుమని ప్రశ్న విని ఆ ప్రహ్లాదుడు ముహూర్తకాలం ధ్యానస్థుడై వారలతేజోహానికి కారణమేమా యని ఆలోచించి అందులకు భగవంతుడగు వాసుదేవుడే కారణ మని తెలుసుకొని, యోగశక్తితో నా సమయాన విష్ణుడెచటనున్నాడా యని అన్వేషించాడు. నారదా! అంతట నా భగవంతుడు నాభికి దిగువ భాగన సప్తపాతాళాలను శోధించాడు. తర్వాత భూమిని దనికి పైన ఉన్న లోకాలను పరిక్రమించాడు. మొదట పద్మాకారంలో ఉన్న భూమిని అనంతరం దాని మధ్య భాగాన గల స్వర్ణశైలం మేరు పర్వతాన్ని సకల ఐశ్వర్యాలతో విరాజిల్లుతున్న దానిని దర్శించాడు. దానిపైన అష్ట దిక్పాలకుల నగరాలనూ వానికి పై భాగాన బ్రహ్మసదనం వైరాజాన్ని కనుగొన్నాడు. దానికి దిగువ భాగాన నొక పుణ్యాశ్రమం కనిపించింది. మృగపక్షి సమాకులమైన ఆ ప్రదేశాన్ని సురలు పూజిస్తున్నారు. ఓ నారదా! ఆ ఆశ్రమంలో అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న దేవమాత అది తిని చూచి శ్రీ హరిని వెదకుటకై అందులో ప్రవేశించాడు. అచట జగత్పిత సర్వభూతవరేణ్యుడైన మాధవుని అదితి గర్బంలో వామనాకృతిలో దర్శించాడు. ఆపుండరీకాక్షుడు శంఖ చక్ర గదా ధారియై సురాసురులచే పరివేష్టితుడై సర్వత్రా వ్యాపించి క్రమంగా మరుగుజ్జు ఆకారంలో యోగశక్తిద్వారా మాతృకుక్షిస్థుడై కనిపించాడు. దైత్యలోక తేజో హరుడు గా నా విష్ణుని గుర్తించి ఆ ప్రహ్లాదుడు ధ్యానముద్రను వీడి ప్రకృతిస్థుడైనాడు. అంతట మనసా మధుసూదనునకు ప్రణామం గావించి మహామతియైన ఆ భక్తాగ్రగణ్యుడు తన మనుమడు, విరోచన నందనుడు నగు బలితో యిలా అన్నాడు.
వత్సా! మనందరకూ ఏ దిక్కు నుండి విపత్తు రానున్నదో దేని వవలన దైత్యులందరు తేజో హీను లయినారో ఆ వివర మంతా చెబుతున్నావినుము. నీతో యుద్థం చేసి ఓడి పోయి, యింద్ర రుద్ర, సూర్యాగ్ని మొదలగు దేవత లందరు త్రైలోకారాధ్యుడైన శ్రీ హరి కడకు పోయి శరణాగతు లయ్యారు. ఆ జగద్గురు వాయింద్రాదుల కభయ మిచ్చి యిప్పుడు అదితి గర్భంలో పెరుగు తున్నాడు. ఆయనే మన వారందర తేజాలు అపహరించా డని నా విశ్వాసము అంధకారం సూర్యోదయాన్ని ఎంతసేపు ఆప గలుగుతుంరి?. ఓ నారదా! ప్రహ్లాదుని మాటలు వింటూనే కోపంతో పెదవులు కంపించగా భావి కర్మ ప్రతాదితుడై ఆ బలి తాతతో యిలా పురుషవచనాలు పలికాడు. ”పితామహా! మన వారందరి భయాలకు కారణం గా నీవు చెబుతున్న ఆ విష్ణు వెవరయ్యా? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నా రాక్షస గణంలో ఎందరో ఉన్నారు? యింద్రాగ్ని రుద్ర మరుద్గణాలకు చెందిన వేలాది దేవతల దర్పాన్ని చూర్ణం చేసి వారలను యుద్థంలో మన వీరులు మట్టి కరిపించారు. పరుగిడుతున్న సూర్యుని రధ చక్రాన్ని బలవంతంగా ఊడ బెరికి విసరి కొట్టిన మహాబలుడు విప్రచిత్తినా సేనా నాయకుడు. అయఃశంకుడు, శివుడు, శంభుడు, అసిలోముడు, విలోమకృత్త, త్రిశిరుడు, మకరాక్షుడు, వృషపర్వుడు, నతేక్షణుడు, వీరలూ, యింకా ఎందరో ఆయుధ ప్రయోగంలో దక్షులు మన ప్రక్కన ఉన్నారు. వీరిలో ఏ వక్కడు పరాక్రమంలోనైనా పదహారవ వంతు కూడాలేని వాడా విష్ణుడు. వాని వల్ల భయమా?” పౌత్రు డాడిన పరుష వచనాలు విన్నంతనే ప్రహ్లాండు క్రోధ తామ్రాక్షుడై వైకుంఠుని ఆక్షేపిస్తున్న అతడిని ధిక్కరిస్తూ గర్జించాడు. ఛీ! ఛీ! మూర్ఖా! దుష్టాత్మా! ఎంత పాపిష్టి నాలుకరా నీది? ఓరి బాలిశుడా! శ్రీ హరిని నిందించిన నీ నాలుక యింకా తెగి ఏల భూమిపై బడదురా? త్రిలోక గురువైన విష్ణు నింద గావించిన నిన్ను సాధు లోకమంతా గ్హరిస్తుందిరా? నీ దుర్బుద్ది ఎంతైనా చింతించ దగినది రా! నీ వంటి వాని తండ్రిని కన్నందుకు ఎంతో విచారిస్తున్నా. నీ లాంటి కఠోరుడు దేవ నిందకుడు పౌత్రు డగుల నా దౌర్భాగ్యము. నీవు ఈ రాక్షస గణ మంతా, నాకు జనార్దనుని కన్న ప్రియు లెవరూ లేరనే విషయం బాగా ఎరుగుదురు. ఆ శ్రీహరి నాకు ప్రాణాల కన్నా ప్రియతముడని తెలిసి కూడా ఆ సర్వేశ్వరేశ్వరుని ఎలా నిందించ గలిగితివి? నీకు నీ తండ్రి పూజ్యుడు, వాని (విరోచనుని)కి నేను తండ్రిగా పూజ్యుడు నైన గురువును, ఇక నాకో, ఆ లోక గురువు విష్ణువు పూజ్యతమ గురువు! అలాంటి పమ డురువునే నిందించిన నీవింకనూ అథః పతనం నొందవేమి? నీ మూలంగా ఈ దానవ జాతి అంతా అప్రతిష్ఠ పాలయింది . నీ వంటి క్రూరుడు వాసుదేవ నిందకుడు రాజుగా ఉండటం వీరల దౌర్బాగ్యం. జగత్పూజ్యుడగు హరిని నిందించిన పాప ఫలంగా నీకు రాజ్య నాశనం కలుగుతుంది. త్రికరణ శుద్దిగా నాకు కేశపుడే ప్రియతముడైతే నీవు రాజ్యభ్రష్టుడవై పోతావు పో! చతుర్దశ లోకాల్లో ఆ దేవుని రూపం కాని వస్తువేదీ లేనట్లయితే నీవు రాజ్య నాశనం అనుభవించి పతితుడవు కమ్ము! సృష్టిలోని సకల భూత జాలానికి శ్రీ హరి కన్నా శరణ్య అంటూ వేరే లెక పోయి నట్లయితే నీవు రాజ్య భ్రష్టుడిని కావడం త్వరలోనే నేను చూస్తాను.
పులస్త్యుడిలా అన్నాడు :- పరమ సాధులైన ప్రహ్లాదుని మాటలు విని బలి ఆపాద మస్తకం కంపించి పోయాడు. వెంటనే ఆసనం నుంచి లేచి చేతులు జోడించుకుని సాగిలపడి ప్రహ్లాదుని చరణాలు పట్టుకుని యిలా విన్నపం చేశాడు. ”గురు జనులు నా యెడ ప్రసన్నులగుదురు గాక! శిశువులు తప్పులు చేసినా తండ్రులు క్షమిస్తారు కదా! ఓ దానవశ్రేష్ఠా! నన్ను శపించి మహెపకారం చేశారు. నేను శత్రువులకు గాని రాజ్యనాశనానికి గాని భయపడు వాడనుకాను. మీ పట్ల నేను చేసిన అవనయం అపరాధం ముందు రాజ్యచ్యుతి ఒక దుఃఖం కానే కాదు. మూర్ఖుడనై మీమనస్సు నొప్పించిన నా యపరాధాన్ని క్షమించండి. పితామహా! నేనే బాలుడను, అనాధుడను, పరమ దుష్ట బుద్దిని. దీనులై ప్రార్థించిన శిశువుల అపరాధా లెట్టివైనా పెద్దలు వారిని క్షమింతురు కదా!” బలి యిలా వేడు కొనగా నా మహాత్ముడగు హరి భక్తాగ్రేసరుడు, క్షణికోద్రేకం వదలి పెట్టి తన తొందర పాటునకు ఆశ్యర్యపడి మనుమని బుజ్జగిస్తూ తీయని మాటలతో యిలా ఓదార్చాడు.
‘నాయనా! బలీ! క్షణిక మోహం నా వివేకాన్ని మరుగు పరిచింది, జ్ఞానాన్ని అపహరించింది. కాబట్టే విష్ణుడు సర్వోపగతుడన్న సత్యం తెలసి కూడ నిన్ను శపించాను. భవితవ్యం యిలా ఉన్నందున నే కాబోలు క్షణికమైన మోహం నా వివేకాన్ని అడ్డగించింది. కనుక నోరాజా! రాజ్యం పట్ల అనురాగం పెట్టుకొనకుము. కానున్న పనులు కాక తప్పదు. వాని నెవ్వరు అడ్డు కొన లేరు. ప్రాజ్ఞుడు, పుత్ర మిత్ర కళత్ర ధన రాజ్యాదులు సంప్రాప్తమైనపుడు సంతోషించుట కాని నశించిన వేళ దుఃఖించుట కాని చేయ రాదు. పూర్వకర్మ విధానాన్ననుసరించాలి. ధృతి మంతు డగు వాడు అపారమైన సంపదలు కలిగి నప్పుడు పొంగి పోరాదు. అలాగే కష్టపరంపర లెదురైనపుడు కుంగి పోవడం కూడ తగదు. ఉత్తములగు వారు ధన క్షయం జరిగితే బాధ పడరు. ధనాగమ వేళ ఆనందం తో గంతులు వేయరు. రెండింటిని ప్రశాంతంగా స్వీకరిస్తారు. ఓ మహాభుజా! నీవు విద్వాంసుడివి కనుక ఈ సత్యాలు గుర్తించి బాధ పడ వలదు. పండితుడగు వాడు విషాదాన్ని దగ్గరకు రానీయడు. మరొక హిత వాక్యం గూడా అర్థ గర్బిత మైనది చెబుతున్నా. అది నీ క్షేమానికి లోక క్షేమానికి గూడ పరమ ఆవశ్యకము. అది తెలసికుని ఆచరణలో పెట్టుము – సర్వభావేన ఆ పురుషోత్తముడు శరణ్యుడగు హరిని శరణు పొందుము. ఆ ప్రభు వొక్కడే నిన్ను భయ ముక్తుని గావింప సమర్థుడు. ఆ ద్యంత రహితుడు, చరాచర గురువు ఈశ్వరుడు సంసార కూపంలో పడిన వారలకు చేయూత అయిన వాడునగు ఆ హరిని విష్ణుని ఆశ్రయించిన వారలకే తాపము కలుగవు. కనుక నో దానవశ్రేష్ఠా! నీ మనస్సు నా ప్రభువు మీదనే లగ్నము చేసి యుంచుము. ఆయనకు భక్తుడ వగుము. నేను కూడ పాప పరిహారార్థ మా యీశ్వరునారాధించి అనంతరము తీర్థయాత్రలకేగెదను. పాప విముక్తుడ నైనం తనే నా ప్రభు వానృపింహ దేవుని చరణాల కడకు చేరుకొనెదను. ”ఓ నారదా! ఆ విధంగా నా మహాత్ముడు బలిని ఊరడించి, హిత మచనాలు పలికి యోగేశ్వరు డగు విష్టుని స్మరిస్తూ దనుజ వీరులకు వీడ్కోలు పలికి తీర్థయాత్రలకై బయలు దేరాడు.
ఇది శ్రీ వామన పురాణంలో ఏబది యొకటవ అధ్యాయం సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹