Skip to content Skip to footer

వైశాఖ పురాణం 🌹🌹🌹 – 15వ అధ్యాయము

అశూన్య శయనవ్రతము

నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు “మునివర్యా! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.

అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును?

శ్రావణమాసమున శుద్దవిదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు/వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.

తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము అను మాసములందు శ్రీహరిని/రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.

మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ, హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను, శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి పన్నెండు చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.

లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన

శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ

అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.

ఈ వ్రతమును, భార్యలేని పురుషుడును, విధవాస్త్రీయును, దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.

శ్రుతకీర్తి మహారాజు మహామునీ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.

వైశాఖపురాణం 15వ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment