Skip to content Skip to footer

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – పదహారవ అధ్యాయము

వైశాఖవ్రత మహిమ

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.

శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.

వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.

అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.

అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.

వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.

ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిస్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.

ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.

వైశాఖ పురాణం 16వ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment