యముని పరాజయము
అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.
యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.
అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.
సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ
త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా
త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||
నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః
తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||
అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.
అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.
ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.
దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.
వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు ‘అయ్యో’ అని అతిదీనముగ బలికెను.
వైశాఖ పురాణం 17వ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹