పులస్త్యుడు చెప్ప నారంభించెను : –
దానవేశ్వరుడగు ప్రహ్లాదుడు (బలికి హితోపదేశం చేసి) తీర్థయాత్రలకు వెళ్లిన వెంటనే ఆ విరోచన తనయుడు యజ్ఞం చేయుటకై కురుక్షేత్రానికి వచ్చి చేరాడు. ఆ మహా ధర్మక్షేత్రంలో బ్రాహ్మణ పుంగవుడగు శుక్రాచార్యుడు తమ భృగువంశీయు లగు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాడు. భార్గవులను యజ్ఞానికై పిలిచిన విషయం వినగానే అందున్న ఆత్రేయ గౌతమ గోత్రీయులూ, కౌసిక ఆంగిరసు లగు బ్రాహ్మణులు, ఆకురుజాంగరాన్ని వదలి ఉత్తరంగా శతద్రూ నదీ దిశగా వెళ్లి పోయారు. శతద్రు నదిలో స్నానం చేసి విపాశా నదికి వెళ్లారు. అక్కడ కూడ తృప్తిలభించకపోగా నా నదిలో మునిగి పితరుల నర్చించి అట నుండి సూర్య కిరణాల నుండి స్రవించిన పుణ్య నది కిరణానది చేరి అట స్నానమాడి, ఆ మహర్షులందరు పుణ్య జులయగు ఐరావతిలో మునిగి ఈశ్వరీ నదికి వెళ్లారు. ఓ నారదా! ఆత్రేయాదులగు నా మహర్షులందరు దేవికా నదిలో స్నానాలు చేసి, సమోష్ణీనది మంగళ జాలాలలో మునుగుటకై నదిలో దిగారు. నీళ్లలో మునిగినంతనే వారందరు ఆ జలాల్లో తమ ప్రతి వింబాలను చూచి అబ్బుర పడి పోయారు. మునిగి లేచి బయటకు వచ్చిన తర్వాత గూడ తమ ప్రతిబింబాలను ఆ నీళ్లలో చూచి మరల పరమాశ్చర్యంలో మునిగి పోయారు. స్నానానంతరం తీరానికి చేరి ఆశ్చర్య కర దృశ్యాన్ని గురించి పరస్పరం మాట్లాడు కుంటూ, ఆ అద్భుతమేమా అని ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. అలా వెళ్లుతూ ఉండగా అల్లంత దూరాన పక్షుల కిల కిల ధ్వనులతో నిండి హరుని కంఠ సీమ వలె నల్లగా ఒక విశాలమైన వృక్షముల గుంపు కనిపించింది. ఆ చెట్ల పొదలు ఆకాశాన్నీ పర్వతాన్ని కప్పి వేసి సుదీర్ఘాలయిన ఊడల శాఖలతో భూమిని తాకుతున్నాయి. నాలు గయిదు రంగుల పూల గుత్తులతో సర్వత్రా నిండి శోభలు వెద జల్లు తున్న ఆ అరణ్యం నక్షత్రాల గుంపులతో నిండిన ఆకాశ వీధిలాగా హాయి గొలుపుతూ నయనోత్సవం కావిస్తోంది, ఆ ప్రదేశాన రక రకాల కమలాలతో – రాజీవాలు కోకనదాలు, పుండరీకాలతో చిత్తాలకు ఆహ్లాదాలు కలిగించే పద్మవనం కనిపించింది. ఆ శోభకు పులకించిన హృదయాలతో ఆ తాపసు లందరు, కమలాకరం లోనికి దిగే హంసలకు వలె ఆనంద పరవశులై ఆ వనం లోకి నడచారు.
ఆ వనం మధ్య భాగాన, ఓ నారదా! చతుర్వర్గాలకూ నెలవైన సర్వ జనులచే పూజింప బడే మహా పుణ్యాశ్రమాన్ని ఆ మునులు చూచారు. అక్కడ తూర్పు ముఖంగా మోదుగు చెట్ల గుంపులచే ఆవరింప బడిన ధర్మాశ్రమం ఉంటే పశ్చిమ ముఖంగా చెరకు తోటలతో నిండిన అర్థాశ్రమం నెల కొన్నది. దక్షిణాభి ముఖంగా అరటి అశోక వృక్షాల మధ్య కామ్య ఆశ్రమం, ఉత్తర ముఖంగా శుద్ద స్ఫటిక శోభతో వెలిగే మోక్షాశ్రమం విరాజిల్లుతున్నాయి. కృత యుగాంతాన ఆ ఆశ్రమంలో మోక్షం నివసించగా త్రేతాయుగాంతాన కామం ఆశ్రమ వాసం చేస్తుంది. ద్వాపరాంతాన అర్థానికిక్కడ స్థానం లభిస్తే కలి యుగారంభంలో ధర్మం ఆ ఆశ్రమంలో వాసం చేస్తుంది. ఆత్రేయాదులగు నా మహర్షులా నాలు గాశ్రమాలూ చక్కని జల సమృద్ధితో విలసిల్లే ఆ అఖండ గిరిని చూచి దాని మీద మోజు పడ్డారు. ధర్మాది పురుషార్థ చతుష్ఠయమయుడగుటచే విష్ణు భగవానునకు అఖండ తత్వమను పేరు గలిగినది. అందుకు సూచనగా చతుర్భుజు డగు జగన్నాధుడుగా విష్ణువుకు ప్రతిష్ఠకు ముందు నుంచే కలిగి ఉంది. నారదా! ఆ ప్రభువును. ఆ ప్రదేశాన బహుశ్రుతులు యోగాత్మలు నగు మునులు ఏకాగ్ర చిత్తాలతో బ్రహ్మచర్య దీక్షతో ఆరాధిస్తారు. రాక్షసులకు వెరచి మునులంతా ఆ అఖండ పర్వతాన్నాశ్రయించుకొని ఉంటారు. అశ్మకుట్ట, మరీచిపులను బ్రాహ్మణులు కొందరు కాళింది నదిలో స్నానం చేసి దక్షిణాముఖులై వెళ్లి అవంతి దేశాన విష్ణువు నాశ్రయించి స్థిరపడ్డారు. విష్ణు మహిమ వల్ల రాక్షసుల కాదేశంలోకి ప్రవేశించడం దుర్లభము. ఇక వాలఖిల్యాది మునులు దానవుల భాధకు తాళ లేక బ్రహ్మ చర్య దీక్షితులై రుద్రకోటిని ఆశ్రయించారు. ఇలా రాక్షసుల బాధకు వెరచి గౌతమాంగిరీసాదులగు మునులు తలొక దిశగా వెళ్లి పోయి తల దాచుకొనగా శుక్రాచార్యుల భృగు వంశీయులగు తన విప్రుల నందరను ఆ యజ్ఞానికి రప్పించాడు. అమిత తేజో మయమైన ఆ మహా యజ్ఞవేది యందు భృగ్వాదులగు విప్రోత్తముల నడుమ శుక్రుడు విద్యుక్తంగా ఆ బలి మహా రాజును యజ్ఞ దీక్షితుని గావించాడు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత గంధానులేపనం మాలా ధారణం గావించుకుని కృష్ణజినంతో వీపును కప్పుకొని, కుశ ధర్భాంకురాలతో కళకళ లాడూతూ విశాలలమైన యజ్ఞశాలలో, ఋత్విక్కులు సదస్యులు, హయగ్రీవ, ప్రలంబ బాణ, మయాది దైత్య శ్రేష్ఠులచే పరివేష్ఠితుడై ఆ బలి దైత్యేంద్రుడు ఆసీను డయ్యాడు.
వేయి మంది భార్యలలో నుత్తమురాలు ఋషిపుత్రి అయిన వింధ్యావళి ఆ బలి ధర్మపత్ని పతితో బాటు యజ్ఞ దీక్ష స్వీకరించి భర్త ననుసరించినది. అంతట శుక్రుడు తెల్లని దేహ కాంతితో సర్వ లక్షితమైన యజ్ఞాశ్వాన్ని చైత్రమాసంలో భూమిని చుట్టి వచ్చుటకు వదలగా దాని రక్షణకై దైత్య వీరుడు, తారకాక్షుడు వెంట వెళ్ళాడు. యజ్ఞాశ్వ విసర్జనతో ఊపందుకున్న యజ్ఞ కర్మ మూడు మాసాలు హోమాదులతో విస్తరించింది. దైత్యులు పూజలందు కొంటూ ఉచ్చస్థితిలో నున్న ఆ సమయాన సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించిన వేళ దేవ మాత యగు అదితి వాసుదేవుని వావనాకారంలో పుత్రునిగా ప్రసవించింది. ఆ లోకపతి ఆది పురుషుడు భగవంతుడగు నారాయణు డవతరించగనే బ్రహ్మర్షులతో కలిసి బ్రహ్మ ఆ విభుని సమీపించి, ఓ నారదా! ఇలా స్తోత్రం చేశాడు.
సత్యమూర్తి వగు మాధవా! నీకు నమస్సులు, ఓ శాశ్వతా! విశ్వరూపా! నీకు ప్రణామాంజలులు. శాత్రవారణ్యాలను, మహాపాప కాననాలను భస్మం చేసే దావానల స్వరూపా! నీకుకైమోడ్పులు! పుండరీకాక్షా! విశ్వభావనా! జగదాధారా! పురుషోత్తమా! నీకు నమస్కారములు. నారాయణా! జగన్మూర్తీ! జగత్పతీ! గదాధరా! పీతాంబరధరా! శ్రియఃపతీ! జనార్థనా! మీకు ప్రణతులు. ప్రభూ! నీవు మా యోగక్షేమాలు రక్షించేవాడవు, విశ్వాత్మకుడవు. అవ్యయుడవు, సర్వవ్యాపివి, సర్వం ధరించేవాడవు, ధరణీ ధరుడవు, అన్ని రూపాలు నీవే, అట్టి నీకు జోహారులు! ముల్లోకాలను వర్ధింపజేయు ప్రభూ! వర్దిల్లుము! దేవపూజితా! దేవేశ్వరా! దేవరాజు యింద్రునికి అశ్రుమోచనం కావింపుము! నీవు ధాతవు విధాతవు; సంహర్తవు మహేశ్వరుడవు. మహాలయ రూపివి. మహా యోగివి, యోగశాయివి. నీకు మాటి మాటికి నమస్సులు! ఇలా స్తోత్రం చేసిన తర్వాత ఆ జగన్నాధుడగు శ్రీహరి భగవాన్! నాకు ఉపనయనం చేయుమని అర్థించినంతనే బృహస్పతి గోత్రుడు మహతేజస్వి అయిన భరద్వాజ మహర్షి ఆ భగవంతునకు జాత కర్మాది సంస్కారాలు జరిపి ఆ ఈశ్వరునకు బ్రహ్మ చర్య వ్రత దీక్ష యిచ్చాడు. ఆ సర్వ శాస్త్ర వేది ఉపనయనకాండ పూర్తి చేయగానే అక్కడ సమావేశ మైన వారందరా అద్భుత వటువ నకు కానుక లంద జేశారు.
ఆ ప్రభువుకు యజ్ఞోపవీతం పులహు డొసంగగా నేను (పులస్త్యుడు) తెల్లని కట్టు వస్త్రం యిచ్చాను. అగస్త్యుడు కృష్ణాజినం, భరద్యాజుడు మేఖల (మొలత్రాడు) యిచ్చారు. పాలాశ దండం బ్రహ్మ పుత్రుడు యివ్వగా, అక్ష మాలను వసిష్ఠుడిచ్చాడు. అంగిరసుడు కౌశ్యం ( ధర్భ కూర్చ) యిచ్చాడు. రఘు మహారాజు ఛత్రం సమర్పించగా నృగ మహారాజు పావుకోళ్లు నివేదించాడు. మహాతేజస్వి యగు నా వటునకు బృహస్పతి కమండలం అర్పించాడు. ఇలా ఉపనయన కర్మ సంపన్నం గావించుకుని ఆ భూతభావను డగు భగవంతుడు మహర్షులు స్తోత్రాలు చేస్తూండగా సాంగవేదాధ్యయనం గావించాడు. అంగిరసుడైన భరద్వాజుని వద్ద మహాధ్వని యుక్తమూ మహదాఖ్యానాలతో కూడిన సామవేదం గంధర సహితంగా అభ్యసించాడు. ఓ నారదా! వేద శాస్త్ర సముద్రమైన నా భగవంతుడు లోకచారాన్ని ఆచరణ ద్వారా ప్రవర్తింప చేయుటకు మాత్రమొక నెలరోజులలోనే శ్రుతి పాండిత్యాన్ని గడించాడు. అలా సర్వ శాస్త్రనైపుణ్యాన్ని పొందిన అనంతరమా అవ్యయుడు నక్షరుడు నగుకైతవబ్రహ్మచారి బ్రాహ్మణ శ్రేష్ఠుడగు భరద్వాజునితో యిలా అన్నాడు. బ్రహ్మన్! నా కనుజ్ఞ యిచ్చినచో మహా అభ్యుదయ ప్రదమైన కురుక్షేత్రానికి వెళ్లగలను. అక్కడ దైత్యేయుడగు బలి పుణ్య ప్రదమైన అశ్వమేధయాగం చేస్తున్నాడు. పుణ్య వర్ధకాలయిన నా తేజో అంశాల ప్రభావం వల్ల నే వాటి సంనిధానాన్ని పొంది అతడు భూలోకంలో ఆ యజ్ఞం చేయగలుగుదున్నాడు. వాని నన్నింటినీ అచట చూడ వచ్చు. నాతో రండు. అది విని భరద్వాజుడిలా అన్నాడు. విష్ణో! నీకు నేను ఆజ్ఞ యిచ్చువాడను కాను. నీ యిష్టం వచ్చినట్టు ఉండవచ్చూ వెళ్లవచ్చు. మన మంతా బలి యజ్ఞానికి వెళ్లుదాము. చింతవలదు. అయితే నేను నిన్నోకటి అడుగుతాను. అది నాకెరిగింపుము. ఓ పురుషోత్తమా! ఇప్పుడు నీ వన్నటువంటి తేజో అంశాలు విభూతులలో ఏఏ స్థానాల్లో ఉంటాయో, ఏఏ చోట సన్నిహితుడవై ఉంటావో వాటన్నింటి వివరాలు దయచేసి నాకు చెప్పుము. వాటి స్థానం తెలుసు కోవాని కుతూహల పడుతున్నాను!
భగవద్విభూతి స్థానాలు
అది విని వామన దేవుడిలా అన్నాడు. ఓ గురూ! ఏ ఏ పుణ్య ప్రదేశాలలో బహు రూపినగు నేను నివసింతునో, ఆ వివరం చెబుతున్నా వినుము. ఓ భరద్వాజ! భూమి, ఆకాశం, పాతాలం, సముద్రాలు, దివి, దిక్కులు, సమస్త పర్వతాలు, మేఘాలు, యివన్నీ నా కనురూపాలుగా నుండే నా వివిధావతారాలతోనే నిండి ఉన్నాయి. స్వర్గంలో భూమి మీద, ఆకాశ జలాల్లో, ఉండే స్థావర జంగమ జీవులు, యింద్ర, సూర్య, చంద్ర, యమ, వసు, వరుణ, అగ్ని, లోకపాలకులందరూ, బ్రహ్మమొదలు స్తంబ (జడం) పర్యంతం స్థూలం గానూ సూక్ష్మంగానూ ఉండే బహు విధాలయిన పశు పక్ష్యాదులన్నీ ఈ భూమిని నింపేందుకు నేను సృష్టించినవే. నానుండి ఉద్భవించినవే. దేవ, దానవ, సిద్ధులచే సృజింప బడే నా ప్రధాన మైన ఈ అంశాలు భూమి మీద ఉన్నాయి. ఓ బ్రహ్మణా! వీనిని చూచిననూ కీర్తించిననూ అప్పటి కప్పుడే సకల పాపాలు నశిస్తాయి. సుమా!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹