దంతిల కోహల శాపవిముక్తి
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.
శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.
పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.
అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.
శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.
శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.
కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.
ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.
కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి ‘నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.
వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.
వైశాఖ పురాణం 23వ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹