Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – తొంబై ఒకటవ అధ్యాయము

పులస్త్యుని వచనము:-

నారదా ! అలా భగవంతుడగు విష్ణుడు బయలు దేరగానే భూమి కంపించింది! పర్వతాలు కదలి పోయాయి సముద్రాలు క్షోభించాయి.! నక్షత్ర మండల మంతా తమ గతులు తప్పాయి. యజ్ఞం చాలా కలవర పడిపోయింది. అయ్యో! మధుసూధనుడు నన్నేమి చేయనున్నాడో గదా! పూర్వం మహేశ్వరునకు వలె ఈ వాసు దేవుడు గూడనన్ను దగ్ధం చేస్తాడా ఏమి! బుక్సామ మంత్రాలతో బ్రాహ్మణులు చక్కగా సమర్పించి నప్పటికీ ఆ ప్రభువునకు భయపడి యజ్ఞా గ్నులాహవిద్భాగాలను స్వీకరించ లేదు. ఆ భయంకర ఉత్పాతాలను చూచి దైత్య నాయకుడగు బలి చేతులు జోడించు కొని శ్రుక్రాచార్యులతో యిలా అన్నాడు ఆచార్య వర్యా! గాలి తాకిడికి కదిలి పోయే అరటి చెట్టు మాదిరి భూమి చలిస్తోంది. మన అసురులు సమర్పించే మంత్ర పూతాలయిన హవిస్సులను అగ్నులు స్వీకరించడంలేదు అందువలన పర్వతాలు ఊగి పోతున్నాయి! సముద్రాలు క్షోభిస్తున్నాయి. ఆకాశాన ఎప్పటి వలె నక్షత్రాలు సంచంచరించడం లేదు. దిక్కులు తెలివి తప్పి పోతున్నాయి. ఎవరి దోషం వల్ల ఈ విపరీతాలు జరుగుతున్నాయో దయతో సెలవీయండి. బలి మాటలు విని ఆ శుక్రుడు అందులకు కారణాలు గ్రహించి శిష్యునితో యిలా హితం పలికాడు. దైత్యేశ్వరా! చక్కగా వ్రేల్చబడిననూ హవిర్భాగాలను అగ్నులు స్వీకరించక యున్నవనుచో యిచ్చటకు వాసుదేవుడు తప్పక వస్తూ ఉండాలి. ఆయన అడుగుల భారాన్ని వహించ లేకనే పర్వతాలతో కూడిన భూమి కంపిస్తోంది. ఓ రాజేంద్రా! ఆయన నడుస్తూ ఉంటే సముద్రాన్నీ క్షోభించి చెలియ కట్టలు దాటు తున్నాయి. శుక్రుని మాటలు విని బలి ఆ భార్గవుని తో మహా ఉత్సాహ పూరితుడై సత్య ధర్మ సహితాలూ హితకరాలు అయిన మాట లన్నాడు భగవాన్‌! వాసుదేవుడే వస్తున్నప్పుడు ధర్మార్ధ కామ సమ్మితంగా నేను చేయ వలసిన కర్తవ్య మేదో యివ్వవలసినది భూగజాశ్వమణి కనకాది సంపద ఏదో ఆ ప్రభువు తోనేమి మాట్లాడనగునో, స్వలాభాము, ఆయన లాభము, వీనిలో దేనిని అనుష్ఠించ వలెనో, ఈ విషయాలన్నీ నాకు ప్రియకరంగా, హిత కరంగా, సత్య విహితంగా సెలవివ్వండి. దైత్య నాధుని ఉత్తమ వచనం విని త్రికాల జ్ఞాని అయిన ఆ భార్గవుడు బాగా యోచించి యిలా అన్నాడు అసురేంద్రా! శ్రద్ధగా వినుము వేదాలు అసురులకు యజ్ఞభాగ భోక్తృత్త్వాని నిషేధించినవి శ్రుతి ప్రమాణంగా ఆ యజ్ఞ భాగార్హులయిన దేవతలు ఈ నీ యజ్ఞంలో తిరస్కరింప బడినారు. వేదోక్తంగా దేవతలకు వారి భాగాలు యివ్వక పోవడం అందుకు వ్యతిరేకంగా దైత్యులకు హవిస్సులు యివ్వడం చూచి శ్రీహరి వచ్చు చున్నాడు ఆయన యజ్ఞానికి వచ్చినపుడేమి చేయవలెనని నీవు నన్నడిగితివి అందుకు నా సమాధానం విను ప్రభూ! ఆ విష్ణువుకు ఈ యజ్ఞంలో భూకనకాదులననేల కడ కొక గడ్డి పరక కొన (తృణా గ్రం) కూడానీవు యివ్వకూడదు. అయితే తియ్యగా వ్యర్థపు మాటలు సామ ధోరణిలో ఆయనతో యిలా అనాలి. ఎవరి ఉదరంలో భూర్భవస్వర్లోకాల పాలకులు, రసాతలాధీశులు, ఎప్పుడూ నివసిస్తూ ఉంటారో, అటువంటి నీకు ఎవరు మాత్రం ఏమి యివ్వగలనరు ప్రభూ! శుక్రుని హిత భోధ విని వదాన్యుడగు బలి యిలా అన్నాడు. ఓ భార్గవా! నేను యింతవరకు ఎలాంటి హీన శీలుడు వచ్చి చేయి చాచినా నా దగ్గర ఏమీ లేదు. నీకే మీ యివ్వదలచను పొమ్మని ఏ నాడూ అనలేదు. అలాంటప్పుడు లోకేశ్వరుడగు జనార్దనుడే వచ్చి ఆర్థిస్తే ఎలా కాదనగలను ఆచార్యా !-

ఐశ్వర్యం కాంక్షించు వారందరు బాహ్మణులను గౌరవించవలెనను సూక్తి ఒకటి కలదు. అది నిజ మని ప్రపంచంలో కనిపిస్తూంది. పూర్వాభ్యాసవశాన జన్మాంతరాన గూడా పూర్వ జన్మపు అలవాట్లు మనోవాక్కాయాలలో వెంట నంటియుంటాయని స్ఫుటంగా తెలస్తుంది. ఓ ద్విజోత్తమా! తాము పూర్వం మలయ పర్వతాన జరిగిన కోశ కార పుత్రుని వృత్తాంతం వినలేదా! అది విని శుక్రుడు బలి తో ఓ మహాభుజా! ఆ గాథ ఏమోనేను వినలేదు. నీవు వినిపించుము. వినవలెనని కుతూహలంగా ఉందని అనగా బలి యిలా చెప్పసాగాడు. ఓభృగుకుల శ్రేష్ఠా! ఈ యజ్ఞ సమయాన పూర్వాభ్యాస బలానికి సంబంధించిన సత్య గాథను వినిపిస్తున్నాను. వినండి బ్రహ్మన్‌! పూర్వం ముద్గల ముని పుత్రుడు జ్ఞాన విజ్ఞాన నిధీ తపో నిరతుడు నగు కోశకారుడను వాడు గలడు. ఆయన భార్య పేరు ధర్మిష్ఠ, వాత్స్యాయనుని కుమార్తె. ధర్మశీల, సాధ్వి, పతివ్రత, ఆమె వలన నా మునికి జడాకృతి (మెద్దు) అయిన కొడుకు గలిగాడు. ఆ శిశువు మూగవానికి వలె మాటాడక గ్రుడ్డి వలె చూడక ఉండగా నా బ్రాహ్మణి మూగి, గ్రుడ్డి, మొద్దుగా తలంచి పుట్టిన ఆ రోజు తన యింటి వాకిటి ముందు వదిలేసింది. అంతట అక్కడకు పసి కందులను అపహరించే ఒక పాపిష్టి రాక్షసి సూర్పాక్షి అనేది తన బక్క చిక్కిన శిశువుతో వచ్చింది. తన బిడ్డను ఆ వాకిట వదలి. ఆ రక్కసి ఆ బ్రాహ్మణ బాలుని తీసుకొని శాలోదర పర్వతం మీద భక్షించేందుకు వెళ్లింది. దాని భర్త గ్రుడ్దివాడైన ఘోదరుడను వాడామెను చూచి ప్రియురాలా! ఏమి తీసి కొచ్చావని అడిగాడు. అందులకది ఓ రాక్షసేశ్వరా! నా బిడ్డను కోశకారుడను బ్రాహ్మణుని వాకిట వదలి అతని శిశువుని తీసుక వచ్చానని చెప్పగా నాతడు కళ్యాణీ! నీవు పొరపాటు గావించాడు మహాజ్ఞాని అయిన ఆ బ్రాహ్మణడు కోపించెనా! మనలను శపించ గలడు కనుక వెంటనే ఈ ఘోరాకారుడైన మనుష్య శిశువును వదలి పెట్టి మరొక బాలునెవరినైన కొని రమ్మనెను.

భర్త మాటలు విన్నంతనే కామ చారిణి అయిన ఆ భయంకరక్కసి త్వరగా ఆకాశమార్గాన ఎగిరి పోయింది. (ఇక అక్కడ) ఇంటి బయట వదలివేయబడిన రాక్షస బాలుడు నోటిలో బొటన వ్రేలు పెట్టుకొని మధురంగా ఏడవసాగాడు. చాలా సేపు ఆ ఏడుపుని విని ధర్మిష్ట భర్తతో ఓ విప్రోత్తమా! చూడు నీ కుమారునకు మాట వచ్చినది! అంటూ భయంతో యింట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆ బ్రాహ్మణుడు కూడా బయటకు వెళ్లి రూపు రేఖలలో తన పుత్రుని వలెనే ఉన్న ఆ శిశువును చూచి భార్యతో యిలా అన్నాడు. ధర్మిష్టా! మన శిశువు నేదో భూతం ఆవేశించి నట్టుంది. మంచి రూపం గలవారెవరో మనలను వంచించుట కు ఈ భూమి మీద తిరుగుతున్నట్టుంది. మంత్రవేత్త అయిన ఆ కోశకారుడు అలా అంటూ చేతిలోలో దర్భకర్రపట్టుకొని నేల మీద ఏదో మంత్రం వ్రాసి ఆ శిశువును బంధించాడు. ఇంతలోపల ఆ సూర్పాక్షి తిరిగి వచ్చి వారలకు కనిపించకుండా నా బ్రాహ్మణ బాలకుని యింటికి దూరంగా నేల మీదకు విసిరేసింది. వెంటనే నేల మీద పడిన తన కుమారు నా కోశకారుడు పట్టేసుకున్నాడు. ఆ రాక్షసి మాత్రం మంత్ర బద్దుడైన తన శిశువును తిరిగి తీసుకో జాలక అక్కడక్కడా ఎగురుతూ భర్త వద్దకు తిరివెళ్లి బ్రాహ్మణ పుత్రునీ, తన పుత్రునీ యిద్దరినీ పోగొట్టుకొన్న విషయం చెప్పింది. రాక్షసి వెళ్లిపోయిన పిదప మహాత్ముడగు కోశకారుడా రాక్షస శిశువును భార్యకు అప్పగించాడు తన పుత్రుని మాత్రం తాను స్వయం కపిల గోవు క్షీరాలు పెరుగూ చెరకు రసం త్రాగిస్తూ చక్కగా పెంచాడు. ఇద్దరు బాలురు పెరిగి ఏడేండ్ల వారయ్యారు. తండ్రి తన పుత్రునకు నిశాకరుడనీ. రాక్షసిపుత్రునకు దివాకరుడనీ పేర్లు పెట్టి వరుసగానిర్వురకూ ఉపనయనాలు చేశాడు. ఉపనయనాంతరం దివాకరుడు వేదాధ్యయనం చేస్తే నిశాకరుడు మంద బుద్ది అయినందున, చదువు కోలేక పోయాడు.

అతనిని తల్లి దండ్రులు బంధువులు, గురువులు, ఆ మలయ నివాసు లందరూ ఏవగించుకుని నిందించారు, తండ్రి కోపంతో ఆ బాలుణ్ణి ఒక నీరు లేని బావిలో పడ ద్రోసి పెద్ద బండతో దానిని కప్పి వేశాడు. అలా ఆ బావిలో పాపమా బాలుడు చాలా ఏండ్లు పడి ఉన్నాడు. దాని మీద ఉసిరకచెట్లు పెరిగి కాయలు కాశాయి. ఆచార్యా! అలా పదేండ్లు గడచిన మీదట వాని తల్లి ఎందుకో ఆ అంధకూపం వద్దకు వెళ్లి పైన పెద్ద బండను చూచి ఏవరీ బావిని బండతో కప్పివేశారని పెద్దగా అరచింది. బావిలో ఉన్న నిశాకరుడు తల్లి స్వరం వని నా తండ్రే నన్నీబావిలో వేసి శిలతో కప్పివేశాడని లోపల నుండి చెప్పాడు. ఆ వాణి విని ఆమె భయంతో బావిలో నుండి మాటాడునదెవరని అడిగింది. అందుల కాస్వరము నేను నీ కుమారుడను నిశాకరుడనువాడ నని బదులు చెప్పగా నామె నిశాకరుడను కుమారుడు నాకు లేడే నాకొడుకు దివాకరుడని చెప్పగా నా బాలుడు తన ఉదంతమంతా పూస గ్రుచ్చినట్లుగా వివరించాడు అది విని తత్తర పాటుతో నా సుందరి ఆ బండను తొలగించి వేసింది. ఆ (బాలుడు) బయటకు వచ్చి తల్లికి పాదాభివందనం చేశాడు. అచ్చముగా తన రూపురుఖలతో నొప్పి యున్న ఆ బాలుని చూచి ఆ ధర్మిష్టి యింటికి తీసుక వెళ్లి భర్తతో తన వారందరకు చూపి అతడు చెప్పిన దంతా వారకు తెలిపింది. అది విని తండ్రి ప్రేమతో బాబూ చిన్నప్పుడు నీవు మూగి వలె ఎందుకున్నావు? ఈ హఠాత్పరిణామం ఏల కలిగిందని అడిగాడు. బుద్దిమంతుడు బ్రాహ్మణోత్తముడగునా కోశకారుని ప్రశ్న విని ఆ బాలుడు తల్లి దండ్రుల కాశ్చర్యం కలుగునట్లుగాయిలా అన్నాడు.

తండ్రీ నేనిన్నాళ్లు మందమతిగా మూగిగా, గుడ్డివానిగా ఎందుకు నడుచు కున్నానో ఆ కారణం చెబుతున్నా వినుము. ఓ విప్రా! పూర్వం నేను బృందారక వంశంలో వృషాకపికి మాల యను భార్య వల్త పుత్రుడుగా పుట్టాను. తండ్రి నాకు ధర్మార్ద కామాలతో పాటు శృతి స్మృతి ఐతిహాసాల తో గూడిన మోక్షశాస్త్రం నేర్పించాడు. అలా సకల శాస్త్ర కోవిడనైనందున విద్యామదం తలకెక్కి చెడు దారులు తొక్క సాగాను. మదం వల్ల లోభం, దాని వల్ల తెలివి, నశించడంతో వివేక భ్రష్టుడనయ్యాను. ఆమూఢత్వం వల్ల పాపాభిరతి ఎక్కువై పరదారల ననుభవిస్తూ, పరద్రవ్యాపహరణ చేస్తూ పూర్తిగా చెడి పోయాను. ఒక పర్యాయం పరస్త్రీ సంగమం, దొంగతనాన్ని పురస్కరించుకొని ఉరిశిక్షకు గురియై మరణించి వేయేండ్లు రౌరవ నరక యాతన లనుభవించాను, అప్పటికీ పాపం పూర్తిగా తీరక ఒక మహారణ్యంలో వ్యాఘ్రజన్మ యెత్తి జీవ హింస చేస్తూండగా ఒక రాజు నన్ను పట్టి బంధించి నగరానికి గొని పోయి బోనులో బంధించి ఉంచాడు. అంత నొక నాడా రాజు వంటరిగా గదా పాణియై ఏక వస్త్రం ధరించి పట్నం వెలుపల వేటకై వెళ్లాడు. ఆ పులి జన్మలో గూడ ధర్మార్ద కామ శాస్త్రాలన్నీ కరతలామలకంగానే ఉన్నాయి. రాజు బయటకు వెళ్లిన తర్వాత నారాజు భార్య జిత అనే అపూర్వ సుందరి నా బోను వద్దకు వచ్చింది. ఆమె అందం నవయవ్వనం అంగ సౌష్ఠవం చూడగానే నాకు పూర్వ జన్మ వాసన వల్ల కామోద్రేకం కలిగి ధర్మ శాస్త్రాలకు వలెనె కామ సంబంధమైన పలుకులు ఆమెతో యిలా పలికాను. ఓ రాజపుత్రీ నవవనంతో మిస మిస లాడే కల్యాణీ! నీ కోకిల ధ్వనితో నా చిత్తాన్ని అపహరించి వేశావు. నిన్ను పొందనిదే నా కూరట గలుగదు. అందులకా జవ జవ లాడు నడుముతో, వక్షోజ భారంతో నూగిసలాడే ఆ కామిని ఓ వ్యాఘ్రమా! భోనులో నున్న నీవు నన్నెట్లు పొదగలవనగా నా పులి బోను తలుపూడదీయుము ఒక్క గంతులో నిన్ను కలుసు కుంటా నన్నాను. అందుల కాగడు పరి జాణ పగలైనచో ఎవరైనా చూడగలరు. రాత్రి కానిమ్ము అప్పుడు తలుపు తీయుదును. స్వేచ్చగా మన మిద్దరం రతి సౌఖ్యాలను భవించవచ్చు అని చెప్పగా కామాతురుడైన వ్యాఘ్రడు అబ్బా! నే నంత వరకు తాళలేను వెంటనే నా కోర్కె తీర్చు మనగా ఆ తెగువరి బోను తలుపు తెరచింది. వెంటనే ఒక్క అదుటున బయటకు దూకి ఆ పులి రాణిని కౌగిలిలో బంధించింది.

రాజు భార్యను నేను బలాత్కారంగా రమింప బోవుట చూచి బల శాలులైన పెక్కురు రాజ సేవకులు శస్త్రాలు ధరించి నన్ను చుట్టు ముట్టి రోకళ్లతో మోది త్రాళ్లతో గొలుసులతో బంధించారు. చావు తప్పదని యెంచి నేను మానవ భాషలో నన్ను హింసింపకు డని పెద్దగా అరిచాను. అందుకు వారు వెరగు పడి నన్నొక భూత మని తలచి చెట్టుకు గట్టిగా బంధించి చావగొట్టారు. ఓ తపోధనా! అలా పరస్త్రీ గమ్యం కారణంగా మరణించి వేయేండ్లు నరకానంతరం ఒక తెల్లని గాడిదగా పుట్టాను. పెక్కురు భార్యలు గల అగ్ని వేశ్యుడను బ్రాహ్మణ గృహంలో సర్వశాస్త్ర జ్ఞానం తో తిరగ సాగాను ఆ బ్రాహ్మణుని భార్యలను ఆదరంతో వీపుపై నెక్కించుకుని సరదాగా తిప్పే వాడిని. పూర్వపుకామేచ్ఛ ఏమాత్రం తగ్గలేదు. ఒక పర్యాయమా ద్విజుని భార్యలలో నవరాష్ట్రానికి చెందిన విమతి యను యువతి పుట్టినింటికి బయలు దేరగా నామె భర్త ఆమెతో మన తెల్ల గాడిద నెక్కి పోయి నెల రోజులలో తప్పక తిరిగి రమ్మని చెప్పాడు. అంతనా సుందరి నామీదనెక్కి పగ్గాలు వదలి త్వరగా వెళ్లుతూ మర్గ మధ్యంలో ఆగినా వీపు నుంచి దిగింది ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో దిగి స్నానం చేసి తడిసిన వస్త్రాలతో పైకి వచ్చింది. తెల్లని తడి చీరెలో ఆమె అందమైన శరీరం లోని అంగాలు ఉపాంగాలు స్పష్టంగా బలిష్ఠంగా కనిపించడంతో మరల నా కామ వాంఛ తీవ్రమై ఆమె మీదకు పరుగెత్తగా ఆమె భయంతో క్రింద పడి పోయింది. కామాతురతో తోనే నామె మీదవెళ్లి పడి పోయాను. యజమానుడు ఆమె వెను వెంటనే పంపిన మనుషులు నన్ను చూచి కర్ర లెత్తుకొని మావైపు పరుగెత్తారు. దానితో భయపడి నేనా సుందరిని వదలి దక్షిణ దిశగా పరుగిడి దారిలో ఒక వెదురు పొదకు చిక్కుకొని నా ముక్కు తాడు బిగుసుక పోయింది. దానిని విడిపించు కొన లేక అక్కడే నీరు ఆహారం లేక ఆరు రాత్రులు గడపి మరణించాను. మళ్లీ యధా ప్రకారం ఘోర నరకం అనుభవించి చిలుకగా పుట్టాను. అరణ్యంలో విహరిస్తూవుంటే ఒక క్రూరుడైన శబరుడు నన్ను పట్టుకొని పంజరం లో బంధించి ఒక కోమటి పుత్రునకు విక్రయించాడు. ఆతడు ధనికుడు, శాస్త్రాలు తెలిసి మాటలు నేర్చిన చిలుక నయినందున నేనున్నచో యింట్లో ని దోషాలు పోతా యని నమ్మి అంతఃపురంలో యువతు లయిన భార్యల వద్ద నన్ను వదిలాడు వారలు నాకు అన్నం నీరు దానిమ్మ గింజలు కమ్మని భక్ష్యాలు పెడుతుంటే నా పలుకులతో ఆ మదవతులను రంజింపచేస్తూ బాగా పుష్టంగా బలిసి పోయాను. ఒకనాడు తామర రేకుల వంటి కన్నులు బలిసిన చన్నులు గుండ్రని పిరుదులు సన్నని నడుముతో యవ్వన మదంతో విర్ర వీగు తున్న ఆ పణిక్పుత్రుని ప్రియురాలు చంద్రావళి అనునది నా పంజరం తెరచి నన్ను చేతిలో పట్టుకొని తన చన్నుల మీద నెక్కించు కోగానే నేను కామంతో విజృంభించి ఆమె బిగుతుగా నున్న స్తనాల పైన గెంతు తూ ఆమెను రంజింప చేస్తూ నా కోరిక తీర్చు కోసాగాను. అలా నేను మగ పోడుములు పోతుండగా ఆజాణ నన్ను తన కంఠహారంలోని మర్కట బంధానికి కట్టి వేసుకుంది అలా బద్దుడనై పాప ఫలంగా మరణించాను. మరల ఘోర నరకం అనుభవించి పాప శేషం వల్ల ఒక చండాలునింటి ఎద్దుగా బుట్టాను.

ఆ చండాలు డొకనాడు నన్ను బండికి గట్టి అడవికి తీసి కెళ్తున్నాడు. బండి మీద తన భార్యను కూర్చుండ బెట్టి తాను ముందు నడుస్తున్నాడు. వాడి వెనుక నేను బండి లాగుతూ పోతున్నాను. ఇంతలో వాని జవరాలైన భార్య గొంతు విప్పిబండి మీద కూర్చోని హాయిగా పాట పాడుతూంది. ఆ మద విహ్వలాంగి పాట వినగానే నా యింద్రియాలు పట్టు దప్పాయి. వాని సంక్షోభాన్ని అణచు కోలేక ఒక పరి వెను తిరిగి చూచి, అకస్మాత్తుగా వెనుకకు పరుగు దీశాను. కాడికి నా మెడ గట్టిగా బంధింప బడి ఉన్నందున క్రింద బడి మెదఒరుసు కుని ప్రాణాలు విడిచాను. మరల పది వందల యేండ్లు నరక యాతన లనుభవించి అనంతరం నీ యింట్లో జన్మించాను. ఇంత వరకు నే నెత్తిన జన్మలన్నీ నాకు వరుసగా జ్ఞాపక మున్నాయి. పూర్వాభ్యాసం వల్ల శాస్త్ర జ్ఞానంతో బాటు బంధనం కూడ సంక్రమించింది. జాత స్మరుడ నగు నేను యిక మీద మనో వాక్కాయాలతో ఎలాంటి పాపాలు చేయ బోను. శుభాశుభాలు, స్వాధ్యాయం, శాస్త్రం జీవికౌ బంధనం కాని వధకానీ యివి ఏవైనా పూర్వ జన్మాభ్యాసం వల్లనే కలుగుతాయి. తండ్రీ! పూర్వ జన్మల స్మృతి కలిగిన మానవులకు పాప నివృత్తి కలుగుతుంది. కనుక పాప రహితుడ నైన నేనిక మంచిని పెంచు కొనుటకు శేషించిన పాప లేశ క్షయార్థం అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటాను. మీరు సుపుత్ర డగు దివాకరుని గార్హస్థ్య ధర్మంలో ప్రవేశ పెట్టండి. ఓ ఆచార్యా! ఇలా చెప్పి తలి దంద్రులకు ప్రణమిల్లి ఆ నిశాకరుడు మురారి పుణ్య సదనం సంస్తవనీయం, పురాతన తమమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. ఈ విధంగా గురూత్తమా! పూర్వాభ్యాస బలం వల్ల మానవులకు దానాధ్యయనాది గుణాలు అలవాట్లు ఏర్పడతాయి. దానాధ్యయనాలను నేను యింతకు పూర్వపు జన్మలలో ఆచరించాను. అవి నన్ను వదలవు. మహర్షే! దాన తపోధ్యయనాలు, చౌర్యం పాతకం, గృహదహనం, జ్ఞానం, దర్మ, అర్ద, కామ, యశో, కీర్తులు యివన్నీ పూర్వా చరిత కర్మల వల్లనే సంక్రమిస్తాయి.

నారదా! శుక్రాచార్యునితో యిలా చెప్పి, మహా బల శాలి యగు నా దైత్యేశ్వరుడు బలి చక్రవర్తి, చక్ర గదా ఖడ్గ ధరుడు కైటభ సంహారి యగు నారాయణుని సన్నిధానం కల్పించుకుని, ఆ ప్రభుధ్యానంలో నిమగ్నుడైనాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment