Skip to content Skip to footer

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఆరవ భాగము

భాగవత ధర్మములు

నారదుడు అంబరీష మహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.

స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.

అప్పుడు శంఖుడిట్లనెను :-

కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.

రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.

సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.

సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను – అశుభములను, సుఖమును – దుఃఖమును, మంచిని – చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.

కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.

మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.

బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.

ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.

శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |
సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |
దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||

పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.

శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |
సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||

తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |
ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||

చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.

అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment