Skip to content Skip to footer

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఏడవ అధ్యాయము

వాల్మీకి జన్మ

నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

తమయెదురుగానున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి ‘ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలా మంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టు తొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.

ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు ‘రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.

అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.

అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment