పుష్కరిణి – ఫలశ్రుతి
నారదమహర్షి రాజర్షి అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును ‘పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడింటిలోనే తిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.
దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, “ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములు ఉన్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.
శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.
మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయము కంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.
నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.
అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.
ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.
వైశాఖ పురాణం సమాప్తం.
ఓం నమో నారాయణాయ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹