దేవాసురాణా ముత్పత్తి కథనం
మునులు లోమహర్షణ ! దేవదానవ గంధర్వోరగ రాక్షసులయొక్క ఉత్పత్తిని విపులముగ తెలుపుమనిరి.
ఆన లోమహర్షణుడిట్లనియె
స్వయంభువునాజ్ఞచే దక్షుడు సృష్టిచేయనారంభించెను. తొలుత మనస్సుచే భూతముల సృజించె. వారు దేవదానవ గంధర్వయక్షరాక్షసాదులు. కాని యాసంతతి యంతగ పెరుగదయ్యెను. అప్పుడు మైథున ధర్మముచే దానిం బెంపదలచి అసిక్నియను దానిని వీరణుడను ప్రజాపతికూతురుం గ్రహించెను. తపస్విని లోకముల ధరింపగలదియునైన ఆమె యందు దక్షుడైదువేల మందిని గాంచెను. సృష్ఠిని పెంపొందించదలచిన యాదక్ష పుత్రులంగని దేవర్షి (నారదుడు) మీరేల యీ సృష్ఠి కార్యము మొనరింతురువలదనియె. అందుచే వారికి వినాశము, అతనికి దక్షశాపము సంభవించెను. మున్ను బ్రహ్మకుదయించినవాడు నారదుడు వీరణుని కూతురగు అసిక్నియం దుదయించి యుండెను. తండ్రివలె దక్షుడు అతనిం గొడుకుగా గనెను. అందువలన దక్షునికుమారులు హర్యశ్వులను పేరొందిరి. వారు నారదుని మాటవిని యెటకో పోయిరి. అపుడు పరమేష్ఠి (బ్రహ్మ) బ్రహ్మర్షుల పురస్కరించుకొని పోయి దక్షుని క్రోధము ఉ పసంహరించుకొన వలసినదని వేడుకొనెను. ఆవల వారిర్వురకు సంధియయ్యెను. ఆ సంధి యేమనగా ” నా కన్య యందు నారదుడు నీకు పుత్రుడయి యుదయింపవలెను” అని. అందులకు దక్షుడు పరమేష్ఠికి ప్రియ యను కన్యనిచ్చెను. ఆమె యందు దక్ష శాప భయముచే నారదుడు జనించెను.
ఆన మునులిట్లనిరి.
ప్రజాపతి కుమారులెట్లు నారదునిచే నాశనమందిరి? ఆ వృత్తాంతమున్నదున్నట్టు మేము వినగోరుచున్నాము.
లోమహర్షు డిట్లనియె- దక్ష సుతులయిన హర్యశ్వులు ప్రజావృద్ధి చేయగోరి రాగా నారదుడు వారింగన యిట్లనియె-
నారదుడిట్లనియె- మీరు మూఢులు. ఈ భూమి ప్రమాణమెంతో యెఱుగరు. అట్లెఱుగకయే సంతానముంగననెంచినారు. క్రిందును మీదును అంతరము నెఱుంగని వారెట్లు బిడ్డలగాంతురు? అన విని వారు నలుదిశలకుబోయిరి. సముద్రముం జొచ్చిన నదులు వెనుదిఱుగని యట్లిప్పటికిని వారు తిరిగిరారైరి. ప్రాచేతసుడయిన దక్షుడు హర్యశ్వులట్లుపోగా వైరిణియందు మరి పుత్రసహస్రముంగనెను. వారు మున్ను నారదుడాడిన పలుకులు స్మరించి దేవర్షి (మనయన్న) బాగుగ చెప్పినాడు. మనమును మనయన్నల జాడనంటి పోవుదము భూమి ప్రమాణమెఱిగి యామీద సృష్టి చేయుదము, యని కూడబలుకుకొని యందరు నన్నిదెసలకుం బోయిరి. వారును ఇంతవరకు వెనుతిరిగి రారైరి. అదిమొదలు సోదరుడు సోదరునిజాడ వెదుకబోయెనేని యక్కడ నశించునుకాని తిరిగిరాడు. ఇది యెఱింగినవాడీ పని జేయరాదు.
దక్షుడాపుత్ర నష్టమెరిగి వైరిణియందు అరువదిమంది గన్యలను మరల బుట్టించెను. అతడు పదిమందిని ధర్మునికి, కశ్యపునకు పదముగ్గురను, ఇరువదియేడుగురను సోమునికి, నల్గురను అరిష్టనేమికి, ఇర్వురను బహుపుత్రునకు, ఇద్దర నంగిరసునికి, ఇద్దరను విద్వాంసుడైన కృశాశ్వునికి నిచ్చెను. వారి పేరులు వినుడు.
అరుంధతి – వసువు – యామి – లంబా – భానువు – మరుత్వతి – సంకల్ప – ముహూర్త – సాధ్య – విశ్వ వీరుబదిమంది. వీరి సంతానమును వినుడు. విశ్వకుమారులు, విశ్వదేపులు, సాధ్యకొడులు సాధ్యులు, మరుత్వతి కొడుకులు మరుత్వంతులు, వసు కుమారులు వసువులు, భాను బిడ్డలు భానువులు, ముహూర్తకొడుకులు మహూర్తులు, లంబ కొడుకు ఘోషుడు, యామి కూతురు నాగవీధి పృథివికి సంబంధించిన సంతతియెల్ల అరుంధతియందు జనించెను. సంకల్పకు విశ్వాత్ముడయిన సంకల్పుడు పుట్టెను. యామిజయయిన నాగవీధియందు వృషలుడుc బుట్టెను. ప్రచేతస కుమారుడయిన దక్షుడు సోమునికిచ్చిన కన్యలందరు నక్షత్ర నామములజ్యోతి శాస్త్రమునందు ప్రసిద్ధులయి యున్నారు. జ్యోతిర్మండలము నందు పురోగమించువారు దేవతలు. ఖ్యాతివంతులు మఱి యెనమండ్రు అనలుడు, వసువులు, ఆపుడు, దృవుడు, సోముడు, ధవుడు, అనిలుడు, అగ్ని ప్రత్యూషుడు, ప్రభాసుడు, అనువారు. ఆపునికొడుకులు గణింప వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, మునియు. దృవకుమారుడు కాల భగవానుడు, (లోక ప్రకాలనుడు) లోకమందు కాలగణమున బడునన్నమాట. సోముని కొడుకు వర్చస్సుడు, (ఆయనయే వర్చస్వి) ధవునికి మనోహర అనుదానియందుదయించిన వారు ద్రవిణుడు, హుతహవ్యవహుడు, శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు. అనిలుని భార్య శివ. ఆమె బిడ్డలు మనోజవుడు అవిజ్ఞాతగతి యను వారిద్దరు. అనలుని కొడుకు కుమారుడు రెల్లుదుబ్బునందు శోభిల్లువాడు, అతని తమ్ములు శాఖ-విశాఖ-నైగమేయులనువారు. కృత్తికలు గన్న సంతానమగుట కార్తికేయుడనబడుచుండువాడు కుమారుడు. ప్రత్యూషునికొడుకు దేవలుడని ఋషి. దేవలునకి ఇద్దరు కొడుకులు క్షమాశీలురు, పండితులు, బృహస్పతి చెల్లెలు పరస్త్రీ బ్రహ్మవాదిని. యోగసిద్ధినంది యెల్ల జగమ్ము సంచరించెను. ఆమె ప్రభాసుని భార్య. అతడు వసువులలో నెనిమిదవవాడు. విశ్వకర్మయను ప్రజాపతి యామెయందుదయించెను. వేలశిల్పములకాయన కర్త, త్రిదశలకు (దేవతలకు) అతడు వార్ధకి (వడ్రంగి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. కశ్యపునివలన సురభి ఏకాదశరుద్రులంగాంచె. ఆమె మహాదేవుని ప్రసాదమువడసి తపస్సుచే ప్రభావితయయి, ఈ సంగతి గనెను.
ఏకాదశరుద్రులు- అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. రుద్రశతము పురాణములందు వర్ణింపబడి యున్నది. చరాచరభూతసంఘము వారిచే నిండియున్నది. కశ్యపప్రజాపతి భార్యలు- అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖన, సురభి, వినత, తామ్ర క్రోధనశ, ఇల, కద్రువు, ముని యనువారు, పూర్వమన్వంతరమువారు.
చాక్షుష మన్వంతరము నందు సర్వలోక హితము గోరి దేవతలొకకరికొకరు కలిసికొని వేగముగరండు అదితియందు ప్రవేశించి జనింతము. అందువలన మనకు శ్రేయస్సు కలుగc గలదు అనుకొనిరి.
సూతుడిట్లనియె. . . ఇట్లనుకొని యా దేవతలు చాక్షుషమన్వంతరమందు కశ్యపునకు దక్షకుమార్తెయగు నదితియందు జన్మించిరి. విష్ణువు ఇంద్రుడుతిరిగి పుట్టిరి. అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు వరుణుడు అంశుడు, మహాతేజస్వి యగు భగుడు నను ద్వాదశాదిత్యులుదయించిరి.
సోముని భార్య లిరువదియేడుగురు మంచి కాంతివంతులైన కుమారుల గనిరి, అరిష్టనేమి భార్యల యొక్క సంతతి పదునార్వురు జ్ఞానియయిన బహుపుత్రుని యొక్క సంతతి నలుగురు విద్యుత్తులు (మెఱపులు) చాక్షుష మన్వంతరమందు ఋక్ఛాఖీయులు కృశాశ్వుడను దేవర్షియొక్క కుమారులు. బ్రహ్మర్షిచేత సత్కరించపబడినవారు మహాపురుషులు దేవ ప్రహరణులను వారు జనించిరి. వీరందరూ సహస్ర యుగాంతమున మరల యవతరింతురు. వీరు స్వేచ్ఛా జన్ములు ముప్పదిమూడు దేవగణములు- అని వీరినే పిలుతురు. ఆకాశమున సూర్యునకుదయాన్తమయములు గల్గినట్లు వీరికిని యుత్పత్యవసానములుగలవు. ప్రతియుగమందిట్లు దేవతలు గల్గుచుందురు.
కశ్యపుని వలన దితికి హిరణ్యకశిపు హిరణ్యాక్షులు జనించిరి అని వినియుంటిమి. విప్రచిత్తి భార్య సింహిక. ఆమె పుత్రులు మహాబలవంతులు, సైంహికేయులు. హిరణ్యకశిపుని పుత్రులు బలశాలురు. వారు నల్గురు హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. హ్లాదుని కుమారుడు హ్లదుడు. హ్లదుని కుమారులిద్దరు. శివుడు, కాలుడు, యనువారు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అతని కొడుకు బలి. బలి కుమారులు బాణుడు మొదలుగా నూర్గురు. వారందరూ తపోధనులు. ధృతరాష్ట్రుని మొదలు విప్రచిత్తి వరకు కశ్యపప్రజాపతికి పెక్కుమంది కలిగిరి. ఈ దానవులకు విప్రచిత్తి ప్రధానుడు. వీరి పుత్రపౌత్రగణము గణించి చెప్పుట సాధ్యముcగాదు. వీరిలో స్వర్భావని కూతురు ప్రభ.
సురభి ఆవులను గేదెలను ప్రసవించెను. ఇర చెట్లను, తీగలను తృణజాతులను గనెను. ఖన యక్షులను రాక్షసులను గనెను ముని యను నామె అప్సరసలను గాంచెను. అరిష్ట సిద్ధగంధర్వులను ప్రసవించెను స్థావర జంగమాత్మకమైన యీసంతతి కశ్యపునకు సంబంధించినది. వారిమనుమలు, మునిమనుమలు, వేలకొలది పుట్టిరి. ఇది స్వారోచిష మన్వంతరమున జరిగిన సృష్టి, వైవస్వత మన్వంతరమునందు వరుణ దేవతాకమైన క్రతువు జరుగగా బ్రహ్మ హోతగానుండి చేసిన హోమమువలన కల్గిన సృష్టి నిప్పుడు చెప్పుచున్నాడు.
లోగడ కల్పమునందు పుట్టిన సప్తమహర్షులను ఈ కల్పమందు తిరిగి బ్రహ్మ సప్తర్షులుగా గల్పించెను. ఆ మీద దేవదానవులకు యుద్ధము జరిగెను. అందు దితి సంతానము రాక్షసులు నశించిరి. దితికశ్యపునకు మొఱపెట్టుకొనెను. కశ్యపుడు ఆమె మొఱవిని ఇంద్రుని చంపగలిగిన కుమారుని వరముగా ననుగ్రహించెను.
నీగర్భమందు జనించువాడు ఇంద్రుని చంపగలడు. కాని నీవు ఆగర్భమును శుచిగా వ్రతము చేయుచు ధరింపవలెనన నామె యట్లేయని గర్భవతి యయ్యెను. అవ్వలకశ్యపుడామె యందు గర్భాధానమొనరించివెళ్ళిపోయెను. ఆమె దేవతలనందరిని నిరోధింపగల్గు తేజస్సును గర్భమున దాల్చి వ్రతముబూని యొకానొకపర్వతమునకు తపస్సుకొఱకేగెను.
ఆమె వ్రతలోపమెప్పుడు జరుగునాయని చూచుచున్న ఇంద్రుడు నూరేండ్లతరువాత పాదములు గడుగుకొనక పరుండుట జూచి యామెగర్భమున ప్రవేశించి, వజ్రాయుధముతో దానినిఏడుతునకలు గావించెను.
వజ్రహతుడైన ఆ శిశువు రోదనము చేసెను. ”మారోదీః” ఏడువకుమని మరిమరి చెప్పెను. ఆ గర్భము ఏడుతునకలయ్యెను. ఇంద్రుడు రోషముగొని దానిని మరి యేడుతునకలు చేసెను. ఆతునకలే మరుత్తులను పేరనేర్పడిరి. ఆ నలుబది తొంబండుగురును నింద్రునకు సహాయులైన దేవతలుగూడయైరి.
తరువాత దేవతా గణములను ప్రజాపతులను గానొనరించి పృథువు మొదలుగాగలవారికి రాజ్యములను గూడ విభాగించి ఇచ్చెను. హరియే సాక్షాద్విష్టువు, ప్రజాపతియు, పర్జన్యుడును, పవనుడు, జిష్ణువునై ఈజగత్తును సృష్టించెను. ఈభూత సృష్టినిచక్కగ నెరిగినవారికి పునర్జన్మము కలుగదు. పరలోకభయమెక్కడ నుండి కలుగును.
ఇది బ్రహ్మ పురాణమున దేవాసురోత్పత్తి కథన మను తృతీయాధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹