మన్వంతర కీర్తనము
ఋషులు పలికిరి: –
ఓ బుద్ధిశాలీ లోమహర్షణ ! మన్వంతరముల నన్నింటిని వానియొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనుపు లెందరో వారి కాలమేదియో వారి సమయమందు జరిగిన విశేషములేవియో స్పష్టమున నెఱుగ గోరెదము.
మన్వంతరములను గూర్చిన చరిత్ర సంక్షేపముగ చెప్పెద. వేయేండ్లయిననిది తెలుపనలవికానిది స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షువుడు, పైవస్వతుడు. సావర్ణి (తర్వాత) రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి, ఇపుడు వైవస్వతమన్వంతరము జరుగుచున్నది. అయా మన్వంతరములందలి సప్తర్షులను పుత్రపౌత్ర పరంపరను దేవగణములను తెలుపుచున్నాము.
ఇక రాగల మన్వంతరములలో సావర్ణి మనువుకాలమున రాముడు, వ్యాసుడు, (ఆత్రేయుడు) అశ్వత్థామ (భారద్వాజుడు, ద్రౌణి) అజరుడు శరద్వంతుడు (గౌతముడు) గాలవుడు (కౌశికుడు) ఔర్వుడు (కాశ్యపుడు) వీరేడ్వురు ఋషు లయ్యెదరు. వైరి అధ్వరీవంతుడు. శమనుడు, ధృతిమంతుడు. వసువు అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతియను వారు. సావర్ణి మనువు కుమారులు. వీరిని వేకువవేళ మేల్కొని కీర్తించిన సుఖసమృద్ధియగును కీర్తికల్గును. ఆయుర్భాగ్యాము పట్టును. సావర్ణులయిన, మనువులలో నొకడు వైవస్వతుడు నల్గురు ప్రజాపతి సంతతివారు. పరమేష్ఠికుమారులు మేరుసావర్ణ్యులయిరి. మేరుగిరిపై తపోనిరతి నుండువారు ప్రజాపతిపుత్రుడు రౌచ్యుడు. ( మనువు) రుచికి భూతిదేవియందు గల్గినవాడు. వీరి శ్వేతవరాహకల్పమునందు రాగల మనువులేడుగురు. ఈ పదునాల్గురు మనువులవలన సప్తద్వీపయైన యీ పృథివియెల్ల పట్టణములతో గూడ వేయియుగములు పరిపాలింపబడగలదు. డెబ్బదియొక్క మహాయుగములు ప్రజాపతియొక్క పూర్ణాయుర్దాయము. వీరు మనువులు పదునల్వురు కీర్తివర్ధనులు. వేదములందు పురాణములందు వినిపింతురు. ప్రజాపతులు వీరు. వీరి సంకీర్తనము ధన్యతాసంపాదకము. మన్వంతరములందు సంహారము, సంహారంతమున (లయయందు) సృష్టి – ఈ లెక్క వర్ణింపనలవిగాదు. ప్రళయావసానమున సప్తర్షులతోడ తపోబలముచే బ్రహ్మచర్య సంపత్తిచే శ్రుతముచే (జ్ఞానముచే) కొందరు మహర్షులు శేషించియుందురు. వారినే శిష్టులందురు. యుగ సహస్రసంపూర్తియందు కల్పసమాప్తియై జగత్తు నిశ్శేషమగును. అపుడెల్ల భూతములాదిత్యకిరణముల దగ్ధములగును. వీరు బ్రహ్మను ముందిడుకొని ఆదిత్యగణములతో సురశ్రేష్ఠుడైన నారాయణప్రభువునందు జొచ్చును. కల్పాంతమునందు పునస్సృష్టిసేయు మహానుభావుడాయన. అవ్యక్తము. శాశ్వతము. నైనతత్త్వము. ఆయనయే యీ జగత్తంతము. ఇక వైవస్వతమనువుయొక్క విసర్గ వృత్తాంతము వినిపించెద. పురాణలక్షనములందొకటైన వంశలక్షణముగ ప్రసంగవశమున శ్రీహరి యవతరించిన వృష్టివంశమునటుపై వర్ణించెద వినుండు.
ఇది శ్రీ బ్రహ్మమహాపురాణము నందు మన్వంతరకీర్తనమను అయిదవయ యధ్యాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹