ఆదిత్యోత్పత్తి వర్ణనమ్
సూతు డిట్లనియె :-
ద్విజోత్తములారా ! కశ్యవునికి దక్షసుతయందు వివస్వంతుడుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూపవనశాలినియైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానందమీయదు . ఆమె మంచి తపస్సుచేసి మంచి దీప్తి గడించుకొన్నది. కాని యాదిత్య మండలము వేడిమి కామె తనూలత వాడిపోయి యంతగ రాణింపదయ్యెను. కశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు “అండమందు మృతుడు కాలేదు” గత అని యొఱుంగక పలికిన కతన నాతనికి మార్తండుడను పేరు రుఢమయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై మల్లోకములను దహింపజేయునదయ్యెను. ఆదిత్యుడు (వివస్వంతుడు) సంజ్ఞాదేవియందు మనువును శ్రాద్ధదేవుడైన యమునింగనెను. యమునయను కన్యనుగూడ గాంచెను. యముడును యమునయు కవలపిల్లలు. సంజ్ఞ శ్యామవర్ణుడైన యా వివస్వంతుని జూచి యోర్వక తనకు సాటియైన ఛాయను (నీడను) మాయామయియైనదానిని కల్పించెను. ఆమె యెదుట నిల్చి ప్రాంజలియై మ్రొక్కి ఓ సుహాసిని ! నా చేయనగు కార్యముం జెప్పుము. నీయాజ్ఞావశనైయున్నాను నన్నుంబనిగొమ్మనియొ.
సంజ్ఞ పలికెను
అబలా ! నేను పుట్టినింటికేగెదను. నీకు భద్రమగునుగాక ! నాయింట నీవు నిశ్శంకముగ నుండవచ్చును. ఈ పిల్లలిద్దరు నీ బాలిక నా సంతానము. వీరిం గనిపెట్టుకొని యుండుము. ఈమాట భగవంతుడు వివస్వంతుని కెన్నడేని జెప్పకుము.
ఆనసవర్ణ – జుట్టుపట్టిలాగునందాక . శాపమిచ్చునందాక ఈ వార్త నేనెన్నడును జెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళిరమ్మనెను.
తపస్వినియైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డలనప్పగించి తండ్రియగు త్వష్ట ప్రజాపతి సమీపమున కేగి సిగ్గున తలవంచుకొని నిలువబడెను. ప్రజాపతిచే భర్తసన్నిధికి పోపొమ్మని పలుమారులు అదలించి బెదిరించి యాదేశింపబడియు నయ్యింతి కాంతుని వంక బోక బడబాకృతిందాల్చి (ఆడుగుఱ్ఱమై) తనరూపము మఱుగుపఱచుకొని ఉత్తకురుభూములందు బచ్చికబయళ్ళలో తిఱుగజొచ్చెను.
రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞయేయని భావించి యామెయందా దిత్యుడు తన కీడైన కొడుకుంగాంచెను. ఇంతమున్ను, పుట్టిన మనుపును బోలినవాడైనందున నితడును”సావర్ణ మనువు” అని పిలువబడుచుండెను.
అమెకు కల్గిన రెండవకుమారుడు శనైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత నామె తనకప్పగించిన సవతిబిడ్డల నాదరింపదయ్యెను. మనువు దానికి సైచి యూరకుండెను. యముడది యోర్వక యా సవతి తల్లిని పాదమెత్తి బెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవుగాక యని శపించెను. యముడా వృత్తాంమును దండ్రికి ప్రాంజలియై విన్నవించెను. నా కామె యిచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడుకొనెను. తల్లి తనయులందరియెడ వాత్సల్యముతో వర్తింపవలయును గదా. ఈ యమ్మ మమ్ములను నిరసించి బ్రతుకనెంచినది. అందువలన నే నామెపై పాదమెత్తితిని, ఎత్తితినే కాని యామె శరీరము తాకింపలేదు. బాల్యముచే లౌల్యముచే నెఱుంగక యేనొనరించిన తప్పును క్షమింపదగుదువు. తల్లి శాపమునకు గురియైతిని గ్రహరాజ! నీయను గ్రహముచే నాపాదము పడిపోకుండుగాక ! అని కొడుకు వాపోవ గరుణించి సూర్యుడిట్లనియె. పుత్ర! ఇందేదో గొప్పకారణముండి తీరును, ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవైన నిన్ను క్రోధమావేశించినది. నీ తల్లిమాట మిధ్య గాకుండుటకు కృములు నీకాలిమాంసము దిని యవని కేగును. ఈరీతి మీయమ్మమాట సత్యము కాగలదు. ఈ విధమైన శాపపరిహారముచే నీవును సురక్షితుడయ్యెద వనెను.
ఆదిత్యుడు సంజ్ఞం జూచి (ఛాయామూర్తిని) బిడ్డలనందర నొక్కరీతిగా గాక యొక్కనియందెక్కువ ప్రేమ నీకెందుల కనియడిగిన నామె యామాట దప్పించెనేగాని నిజము సెప్పదయ్యె. అతడు తనకుదా సమాధానపడి యోగ దృష్టిచే నిజమెఱింగెను. ఆమె నప్పుడు శపింపబూనియు శాపమీయక జుట్టు పట్టుకొని యూచెను. అంతనామె జరిగినదెల్ల పతికి విన్నవించెను. వివన్వంతుడువిని కవలి మామగారగు త్వష్ట చెంత కరిగెను. మామయు నటువచ్చిన యల్లు నాదరించెను. రోషముగొని తనను దహింప నేతెంచినాడని గ్రహించియపు డాతని ననునయించుచు నిట్లనియె.
ఓ అదిత్యమూర్తి ! నీరూపమిది భరింపరాని తేజముచే జూడరాదయ్యె. సంజ్ఞ యిది సైపనేరక పచ్చిక బయళ్ళ తిరుగాడు చున్నది. శుభచారిణయైన నీ సహధర్మచారిణి నిప్పుడు చూడవలయును. అమె శ్లాఘనీయ యోగబల సంపన్నురాలు. గ్రహరాజగు నీకు నామాట యనుకూలము సమ్మతమగు నేని యోగమూని యామె చెంత కరుగును. నీరూపమును జూడముచ్చటగ నొనరింతునని తెలిపి యాతరణిని (సూర్యుని) యంత్రమునెక్కించి చెక్కివైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటినుండీ తరణిబట్టుటన నీపేరు లోకమున రూఢికెక్కెను. దాన నాతనితేజస్సు కొంతడిందువడి రూపము చూడ నందమయి యింపొందెను. ఆ మీద నతడు యోగశక్తిచే నేగి తన భార్యను బడరూపమున జరించు దానినిం జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతములక దృశ్యయైయున్న యయ్యంగనను ఎందును జడియక సంచరించుచున్నంగని తాను నశ్వరూపము దాల్చి ముఖమునంగవయ బోయెను. పరపురుష శంకగొని యామె పెడమెగయయిమున్నతఱి నామెయందు నిక్షిప్తమైన శుక్రమామె నాసికారంద్రముల వెంట చీదివైచెను. అందుండి అశ్వినులు అను దేవవైద్యులు నాసత్యుడు(దన్రులు) అని పేర్కొనబడెడువా రిద్దరుదయించిరి. అష్టమ ప్రజాపతియగు మార్తండునిరను లీయిర్వురు మిక్కిలి యందగాండ్రు. భాస్కరుడు నవ్వల నాకాంతకు మిగులకాంతుడై కానవచ్చె. అమె కూడ తన మనోహరునింగని మిగుల సంతోషించెను.
యముడు మాత్రము తమున్నొనరించినపనికి మిక్కిలి పగచెంది ప్రజలను ధర్మముచే రంజింపజేసి ధర్మరా జనుసార్ధక నామముం బితృదేవతల కాధిపత్యమును లోక పాలకత్వముం బడసెను.
సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరుగిరిపై నిప్పుడును తపము చేయుచున్నాడు. వాని తమ్ముడు శని గ్రహపదవినందెను. త్వష్ట (సూర్యబింబమును) తరణి బట్టగా రాలిన రజమును బ్రోవు చేసి విష్ణుచక్రమునుగావించె. అది దానవాంతకము అప్రతిహతము. యముని తరువాత బుట్టిన యా బాలిక యమునయను పేర లోకపావనియైన నది యయ్యెను. మనువు సావర్ణుడునను పేర నా రెండవ కుమారుడు పిలువబడెను. ఆయన తమ్ముడు శని గ్రహపదవి నంది సర్వలోకపూజితుడయ్యెను. దేవతల యీజన్మ వృత్తాంతమును విన్న యాతడు ఆపదలను బాసి యహాయశస్సునందును.
ఇది శ్రీబ్రహ్మమహాపురాణము నందు ఆదిత్యోత్పత్తి వర్ణనమ్ ఆరవ అధ్యాయం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹