Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – పదిహేనవ భాగము

వృష్ణి వంశ వర్ణనమ్‌

సూతుడిట్లనియె : –

క్రోష్టునికి వృజినీవంతుడు పుట్టెను. వానికి స్వాహి. యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడు . స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరి దక్షిణములైన యజ్ఞములు చేసి చిత్రరథుడను కుమారునిం బడసెను. అతడు మంచి కర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపులదక్షిణుడు. రాజర్షుల వర్తనము ననుష్ఠించినవాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణవిదులాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.

ఈతనికి సుయజ్ఞుడుదయించెను. వానికి ఉషతుడు గల్గెను . అతడు స్వధర్మాదరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రుతావనుడతడు. వాని తనూజుడు మరుతుడు. అతడు రాజర్షి. వాని జ్యేష్టసుతుడు కంబలబర్హిషుడు. అతడు ప్రేత్యభాక్కయ్యు మరణోన్ముఖుడై గూడ ఉత్తమ సంతతిగల కుమారుడు గావలెనని గొప్పధర్మానుష్ఠానము ను కోపముతో గావించెను. నూర్గురు పుట్టిన తరువాత నతనికి యుత్తముడగు కుమారుడొక్కడు ఉదయించెను. అతడు రుక్మ కవచుడు. అతడు కవచధారులైన నూర్గరుత్తమ ధానుష్కులను రణమునందు వాడియైన బాణములతో చంపి అత్యుత్తమ శ్రీ లాభమందెను. వానికి శత్రు సంహారకుడగు పరాజిత్తు వానికి రుక్మేషువుపృధురుక్ముడు జ్యామఘుడు పాలితుడు హరియను మహావీరులు అపరాజితులు సుతులు ఐదుగురు ఉదయించిరి. తండ్రి పాలితుని హరిని విదేహ రాజులకిచ్చెను. ఫృథురుక్ముని యాశ్రయమున రుక్మేషుడు రాజయ్యె. వారిద్దరిచే నంపబడిన జ్యామఘుడు. అశ్రమమందుండెను, అతడు బ్రాహ్మణులచే లెస్సగ బోధింపబడి ఏకాకియై ధనుస్సు పట్టి ధ్వజము రథముంగొని మరియొక దేశమునకు ఏగెను. నర్మదా తీరమున నొంటరిగా తిరుగుచు మేకల మృత్తికావతి ఋక్షవంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరమునందు వసించెను వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను నాతడు మఱియెక భార్యను జేసికొనలేదు.

అతనికొకానొక యద్ధమందు జయము, గల్గెను. అందొక కన్యం గానుకగ బడసెను. ఆమెంగొని భార్యదరికేగి భయముతో కోడలిదిగోయని చూపెను. ఆమె ఎవరి కోడలు ? యనిప్రశ్నించెన, దానిని విని జ్యామఘుడిట్లనెను.

రాజిట్లనియె : –

నీకు పుట్టబోవు కుమారుని కిది భార్యయనెను.

మఱియు సూతుడిట్లనియె

ఆకన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆతపఃఫలముగా శైబ్య వృద్ధయై విదర్భుడనుకుమారుం గనెను, విదర్భుడా రాజపుత్రికయందు క్రధకైశికులను శూరులు విద్వాంసులు నగు నిద్దరు కుమారులుం గాంచెను, వారు రణ విశారదులు. విదర్భుని కుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు దృష్టుడు, అతడు రణధృష్టుడు, ప్రతాపశాలి, వాని కొడుకులు ముగ్గురు. శూరులు, పరమధార్మికులు, అవంతుడు- దశార్హుడు – విషహరుడు దశార్హ సుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి వానివాడు భీమరథుడు . నవరథుడు నవరథుని పుత్రుడు దశరథుడు, వాని కుమారుడు శకుని. శకుని సుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు. వృద్ధక్షత్రనందనుడు, దేవపుత్రసముడు మధువుల వంశమునకు కర్త మధురవక్తయగు మధువనువాడు, మధువునకు వైదర్భియందు పురుషోత్తముడగుపురుద్వంతుడను వాడుదయించెను. మధునికైక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) యను భార్యయందు సర్వగుణొపేతుడు సాత్వతకీర్తిపర్ధసుడగు సత్త్వంతుడు అను వాడు పుట్టెను. అతడు సాత్త్వతులనుపేరు తెచ్చినవాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్నవాడెప్పుడు పరమ ప్రీతినందును ప్రజావంతుడునగును

సూతుడిట్లనియె :-

సత్త్వతుని వలన కౌసల్యయను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదునందనుడగు వృష్టి అనువారలగనెను. వారి విశేషసృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి. భజమానునికి సృంజయకుమారైలు బాహ్యక ఉపబాహ్యక అను భార్యలుండిరి. వారికి బెక్కురు పుత్రులుకల్గిరి. క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు, వీరు బాహ్యక సృంజయియందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దాసకుడు అనువారు ఉపబాహ్యక సృంజయియందు గల్గినవారు.

దేవవృథుడు యజ్వ, తపస్వి. నాకుగుణశాలి కుమారుడుగావలెనని తపోనిష్ఠగొని పర్ణాశానదీజలమాచమించి, తపమాచరించుచుండెను. ఆనదికి సదా తనయందు స్నానము చేయునాతనిపై ప్రేమకలిగెను. కాని యేలాటిప్రియ మాచరించుటయను నాలోచనలో నొక నిశ్చయమునకు రాజాలదయ్యెను. ఈరాజు కల్యాణగుణుడు. ఈతని కీడైన కల్యాణి యెవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారు డుదయింపవలెనన్న నేలాటి యుత్తమ కన్యయితనికి పత్ని కావలెను? అని యేమేమో తనలో దాను గుణించుకొని తుదకు నేనే యేగి యీతనికింతి నగదునని పరమసుందర రూపము ధరించి యానృపతిని వరించెను. ఆమె నాప్రభు విచ్చగించెను.

ఉదారమతియగు ఆ నృపతి ఆ సతియందు తేజస్వియైన గర్భముంచెను. పదియవనెలలో నామె సర్వకల్యాణగుణనిధియగు బభ్రుదేవావృథుడను కుమారుని గాంచెను. ఈతడు ఏడువేల యరువది యాఱుగురు పురుషుల సమృతత్వమొందించెను. యజ్వ, దానవతి, ధీమంతుడు, బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడు నైన యీ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని బ్రసిద్ధులైరి. కాశ్యపదుహిత అంధకుని వలన నల్వురం గనెను కుకురుడు భజమానుడు సనకుడు బలబర్హిషుడు అనువారు వారు. కుకురుని తనయుడు వృష్టి. వాని కొడుకు కపోతరోముడు. వానివాడు తివిరి. కానిసుతుడు పుశర్వసువు వానికి అభిజిత్తు వానికి పుత్ర ద్వంద్వము ఆహుకుడు, శ్రాహుకుఢను బేర ప్రసిద్దిచెందిన వారు ఆహుకుని గూర్చి పూర్వులు ఈ క్రింది గాధనుదహరింతురు.

శ్వేతపరివారముతో గూడి (తెల్లవాళ్ళతో) పసివానివలె ఆహుకు డెనుబది కవచముల దాల్చి మొదట నేగును. పుత్రసంతానము లేనివాడు, నూరువేలేండ్లాయుర్థాయము లేనివాడు ఆపవిత్రకర్ముడు. యజ్వ కానివాడు, భోజరాజు వెంటనుండరాదు. భోజునికి యేనుగులు పదివేలు ధ్వజములు కవచము ధరించినవారు పదివేల మంది. మేఘ ఘోషములు గల రధములు పదివేలు, బంగారు వెండి ఎనుబోతులు ఇరువది యొక్క తూర్పు దిక్కున నేగెడివి. ఉత్తరమున నటులనే నేగెడివి. భోజవంశీయ రాజులందరు వింటినారియే చిరుగంటగ మ్రోగించినట్టి వారు. మహా యోదులన్నమాట. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయల కిత్తురు అని గాధ.

ఆహుకునికి కాశ్యపియను ఆమె యందు దేవకుమారుల బోలు దేవకుడు, ఉగ్రసేనుడు అను వారిద్దరు కుమారులు గల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, సందేవుడు, దేవరక్షితుడు, అనువారు. కుమార్తెలేడుగురు. అతడు వారిని వసుదేవునికిచ్చి పెండ్లిసేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామిన్ని, యనువారు. ఉగ్రసేనుని కొడుకులు తొమ్మండుగురు కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు కంకుడు, సుభూషణుండు, రాష్ట్రపాలుడు, సుతునువు, అనావృష్టి, పుష్టిమంతుడు, అనువారు. వారి చెల్లెం డ్రయిదుగురు. కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంకయునువారు. కుకుర వంశీయుడైన ఉగ్రసేనుడు సంతతితోగూడ వర్ణింపబడెను. మిక్కిలి తేజశ్శాలురైన కుకురుల వశమునువిని ధారణసేయుట వలన వంశాభివృద్ధి నంది సుఖించును.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు వృష్ణివంశనిరూపణమనెడి పదునైదవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment