స్యమంతక ప్రత్యానయనమ్
సూతుడిట్లనయె :- భజమానుని సుతుడు రథముఖ్యుడు, విదూరథుడు, విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికిదత్త – అతిదత్త – శోణాశ్వ – శ్వేత వాహన – ళమి-దండశర్మ -దంతశత్రు – శత్రుజిత్తులు అనుసుతులు. శ్రవణ శ్రవిష్ఠ యును కుమార్తెలు కలిగిరి, శమికుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులు భీమ పరాక్రములు. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. శతధన్వ మధ్యముడు. దేవాంతకుడు, నరాంతుడు. భిషక్కు పైతరుణుడు సుదాంతుడు – అతిదాంతుడు నికాశ్యుడు – కామదంభకుడు – అనువారి కలిగిరి. దేవాంతకుని పుత్రుడు విద్వంసుడగు కంబల బర్హిషుడు. వాని కొడుకులు అసమౌజుడు నాసమేజుడు అనువారు. పుత్ర సంతతి లేని అసమౌజసునికి సుందష్ట్రుడు సుచారువు కృష్ణుడు అను కుమారులను అంధకుడిచ్చెను. వారు అంధకులను పేరందిరి.
గాంధారి మాద్రి కోష్ఠుని యొక్క భార్యలు. గాంధారి తనయుడు మహాబలశాలియగు అనమిత్రుడు. మాద్రి తనయులు యుధాజిత్తు దేవమీఢుషుడు ఇతడు శత్రువులకు గూడమిత్రుడు. శత్రుజేతయగు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులిద్దరు. ప్రసేనుడు సత్రాజిత్తు. వీరు శత్రుసేనల జయించినవారు.
సత్రాజిత్తు ప్రసేనుడు ద్వారపతిలో నుండెను. స్యమంతమను దివ్యమణిని సూర్యోపాసనచేసి వడసెను. అతనికి సూర్యుడు ప్రాణసమానుడైన మిత్రుడు. అతడోకనాడు వేకువజామున రథమెక్కి యొక జలాశయమునకేగి స్నానము చేసి సూర్యోపస్థానము సేయుచుండగా సూర్య భగవానుడెదుట స్పష్టమైన మూర్తితో తేజోమండలాకారముతో సాక్షాత్కరించెను. రాజు ఆయననుజూచి యిట్లనియె. గగనమునందు నిత్యము నిన్నెట్లు చూచుచున్నానో అట్లే తేజోమండలాకారమున నెదుట నిపుడు చూచుచున్నాను. జ్యోతిస్సుల కెల్ల నధిపతిని నీవు నీతోనిట్లు చెలిమి నొందిన నాకు నీవలనగలుగు విశేషమేమి? అనిన,
దీనిని విని యినుడు తనకంఠమునుండి తీసి స్యమంతకమణిని ఏకాంతమున నుంచెను. అంత నాభానుని సాకారముగ నా రాజప్పుడు దర్శించెను. మఱియు నతనితో ముహూర్తకాలము సంప్రీతితో ప్రసంగిచెను. అటుపై భాస్కరుడు బయలుదేరబోవుతఱి నాతడు ప్రభూ! ఏ రత్నము దాల్చి నీవు లోకములన్నిటిని ప్రకాశింపజేయుచున్నావో ఆ మణిరత్నమును నాకు దయ సేయుమని కోరెను. ద్యుమణి యమ్మణిని యారాణ్మణి కిచ్చెను. అదిదాల్చి అమ్మహేశుడు రాజధాని బ్రవేశించెను. అ పురజనులంతట నిడుగో సూర్యుడవనికి దిగి వచ్చుచున్నాడని యాతనింగూర్చి పరువిడిరి. అట్లు పట్టణమెల్ల నాశ్చర్యమున ముంచి యంతఃపురమున కరిగెను. ఆ రత్నము నక్కడ తన తమ్ముడు ప్రశేనజిత్తునకు బ్రీతితో నొసంగెను. అ మణి యావృష్ణ్యంధకులయింట బంగారమును వర్షించుచుండెను. అది వచ్చిన తరువాత మేఘుడు సకాలమున వర్షించుచుండెను. అందెందును వ్యాధిభయము లేదయ్యె. గోవిందుడా ప్రసేనుని మణిరత్నమును దీసికొననెంచెను. కానియతడు శక్తుడయ్య దానిం గైకొనడయ్వెను. అది దాల్ఛి యొకప్పుడు ప్రసేనుడు వేటకుం బోయి యమ్మణింగని బెదరిమీద బడిన సింహము నోటబడి మృతినందెను. అయ్యెద వానిం జంపి పారిపోవు మృగరాజును ఋక్షరాజు సంహరించి ఆ రత్నరాజముంగొని దనగుహం జొచ్చెను. వృష్ణ్యంధకులయ్యెడ ప్రసేనుడు హతుడవుట విని, అంతకుమున్నామణి నిమ్మని కోరియున్నందున నిదికృష్ణుని పనియోమోయని శంకించిరి. అట్లు తనను అనుమానించుట యెరింగి యాపని తాను జేయనివాడయ్యు నయ్యపవాదు తొలిగించుకొన నెంచి హరి యమ్మణింగొని తెత్తునని ప్రతిననేసి వనమేగెను.
ప్రసేనుడు వేటాడిన తాపునందాతని యడుగుజాడలను, ఆప్తజనమ్మువలన విని గుర్తించి, ఆజాడంబట్టి పోయి పోయి ఋక్షవంతమను గిరిని వింద్యపర్వతమున వెదకివెదకి అలసిసొలసి తుదకు గుఱ్ఱముతో గూడ కూల్పబడిన ప్రసేనుంగాంచెను. గాని మణిని మాత్రము గానడయ్యె, ప్రసేనునిశరీరమునకు దగ్గర భల్లుకముచే హతమై పడియున్న సింముజూచెను. అడుగులగుర్తులంబట్టి యాచం పినది భల్లుకమని మాత్రము గ్రహిచెను. అట్లే పయనించి యల్లంతలో నొక గుహను జూచెను. ఆ యెలుగుబంటి బిల మందొక సుందరి యెలుంగు వినవచ్చెను. అట నొకదాది జాంబవంతుని తనయ నొకబాలునెత్తుకొని స్యమంతకమణిం జూపుచు, నాడించుచున్న దానిం జూచెను.
సింహము ప్రసేనుని గూల్చినది. అ సింగము జాంబవంతునిచే గూలినది. ఓ సుకుమారుడా ! ఏడువకు ఈ న్యమంతక మణి నీదే సుమా! అని యనుచున్నమాట ఆ మాటయొక్క వ్యక్తింబట్టి వెనువెంటనే హరి బిలముంజొచ్చెను. కృష్ణ భగవానుడు బిలద్వారమందు బలరామునితో గూడ యదువుల నిక్కడుండుడని నిలిపి శార్జధనువూని లోనికింజొచ్చి జాంబవంతుని జూచెను. అగుహయం దాతనితో వాసుదేవుడు యుద్ధము సేసెను. ఇరువది యొక్క రోజులు వానితో బాహు యుద్ధము గావించెను.
కృష్ణుడు బిలయందు బ్రవేశించిన తరువాత బలరామాదులు ద్వారవతికేగి కృష్ణుడందు హతుడయ్యెనని తెలిపిరి. వాసు దేవుండో, జాంబవంతుని గెలిచి, యాబుక్షాధిపతి తనయును జాంబవతింబొంది తన యపవాదుపోవ నెలుగుల అందరిని అనునయించి స్యమంతకమణిం గైకొని యుపాయమున నా గుహ వెలువడి యావలకేగెను. ఆయనతో విధేయులయిన పరివారము వెన్నంటి వచ్చిరి. ఇట్లాతడు మణిం గౌని వచ్చి అత్మ విశోధనము సేసికొని సర్వసాత్వత జనన మావేశమందు దానిని సత్రాజిత్తున కొసంగెను. అరిజన సంహారియైన హరి లేనిపోని యపవాదునకు గురియై యది పాపుకొనెను.
సత్రాజిత్తు భార్యలు పదిమంది. వారియందు నూర్గురు కుమారులుదయించిరి. అందు ప్రఖ్యాతి గలవారు ముగ్గురు. అందగ్రజుడు | భంగకారుడనువాడు, వాతపతి, వసుమేధుడు, వాని తరువాతివారు. కుమార్తెలు ముగ్గురు, వారిలో సత్యభామ ఉత్తమ (పెద్దదన్నమాట) రెండవది ఉత్తమ వ్రతాచారపరాయణయగు వ్రతిని. ప్రస్వాపిని అనునది మూడవయామె. వారిని సత్రాజిత్తు కృష్ణున కిచ్చెను. భంగకారి కొడుకులిద్దరు. కీర్తిమంతులు, రూపవంతులు సభాక్షుడు, నావేయుడనువారు. (క్రోష్టుభార్యయగు) మాద్రియందు గల్గినవాడు వృష్ణిపుత్రడు, యుధాజిత్తు. వృష్ణి కుమారులు శ్వఫల్కుడు, చిత్రకుడు ననియిద్దరు. శ్వఫల్కుడు, కాశిరాజతనయంబెండ్లాడెను. అమె గాందినియను పేరిది. అమె తండ్రి యామెకు గోవుల నెప్పుడు నిచ్చెడువాడు (అందున నాపేరు ప్రఖ్యాతికి వచ్చినది) అమె యందు పండితుడు, అతిథి ప్రియుడు మహావీరుడు బహుదక్షిణ నిచ్చువాడు మహానుభావుడగు అక్రూరుడుదయించెను. అక్రూరుడేగాక ఉపమద్గువు, మద్గువు, మదురుడు, అరిమర్దనుడు, అరిక్షేపుడు, ఉపేక్షుడు, అరిమేజయుడు, ధర్మపరుడైన ధర్ముడు, గృధ్రభోజుడు, అంధకుడు, ఆవాహుడు, ప్రతివాహుడు, ననువారును సుందరియగు వసుంధరయను కుమార్తెయును శ్వఫల్కునికి కలిగిరి. వసుంధర విశ్రుతాశ్వుని వివాహమాడి పట్ట మహిషి అయినది. ఈమె రూప వనసంపన్న సర్వసత్వ మనోహరయునై యొప్పెను. అక్రూరుని ఉగ్రసేనయందు కులనందనులైన నందనులిద్దరు గల్గిరి. వసుదేవుడు, ఉపదేవుడు అనువారు. దేవ వర్చస్కులు. చిత్రకుని కుమారులు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహుడు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, ధర్ముడు, ధర్మభృత్తు సుబాహువు, బహుబాహువు, యను పుత్రులు. శ్రవిష్ఠ, శ్రవణయను కూతుళ్లు కలిగిరి. కృష్ణుని యీ యవవాద వృత్తాంతము విన్నవానికి ఎన్నడును అపవాదుల స్పర్శ యుండదు.
ఇది శ్రీ బ్రహ్మపురాణమందు స్యమంతక ప్రత్యానయనమను పదునారవ యథ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹