భువనకోశద్వీప వర్ణనమ్
మహామతియగు నీవు భరతరాజుల యొక్కయు, దేవదానవ గంధర్వ యక్షోరగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగమాదుల సృష్ట్యాదులను*మృదుమధురముగ, మనః శ్రవణానందకరముగ జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన కుతూహలులమై ఉన్నాము.భువనకోశ సంస్థాన మవధానమున విననున్న మాకది ఆదరములో ఆనతిమ్మని మునులడిగిరి.
సూతుడిట్లనియె: –
మునులారా ! ఇది నూరేండ్లు చెప్పిన దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ+ప్లక్ష+శాల్మల+కుశ+క్రౌంచ+శాక+పుష్కరములు అనునవి సప్తద్వీపములు. ఇవి లవణ=ఉప్పు, ఇక్షు=చెఱకురసము, సురరా=కల్లు సర్పిః=నెయ్యి, దధి=పెరుగు, దుగ్ధ=పాలు, జల=నీరు, నుంగల యేడు సముద్రములచే జుట్టుకొనబడినవి. వీని నడుమ జంబూద్వీపమున్నది. దానికి నడుమ ”మేరువు’ అను బంగారు కొండ యున్నది. అది యెనుబదినాల్గు యోజనములయెత్తు, పదునారువెల యోజనములలోతు, ముప్పది రెండువేల యోజనములు వైశాల్యముగల యుపరిభాగము కలిగియున్నది. మూలము పదునాఱు వేల యోజనముల విస్తారమైయున్నది. భూమియను పద్మమున కది నడిమికర్ణిక=(దుద్దు) వలె నున్నది.
హిమవంతము- హేమకూటము నిషధము ననునవి దానికి దక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి ఉత్తరమునను వర్షపర్వతములున్నవి. రెండు నడుమనున్నవి. అవి లక్ష యోజన ప్రమాణములు, తక్కినవి తొంబదివేల యోజనముల ప్రమాణము గలవి. రెండువేల యోజనముల యెత్తు, అన్ని యోజనముల వెడల్పు గలవి, భారత-కింపురుష-హరివర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తరమందున్నది. ఆది కనకమయము. ఉత్తర కురుభూములక్కడనే యున్నవి. ఈవర్షములొక్కొక్కటి భారత వర్షమువలె తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలవి.
ఇలావృతము దాని నడుమ బంగారు మేరుగిరి గలదు. మేరుపు నలుదిశల నిలావృతము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరువునకు విష్కంభములు. (గడియలు) పదివేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధమాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీనియందు క్రమముగ కదంబము (కడిమి), జంబువు (నేరేడు), పిప్పలము (ఠావి), వటము (మఱ్ఱి) యను చెట్లు పదుకొండు వందల యోజనముల విరివిగల వృక్షములు ”గిరికేతువులు” (పర్వతాగ్ర పతాకములట్టివి) గలవు. జంబూవృక్ష సమృద్ధిం బట్టి యది జంబూద్వీపమ్ము నాబరగె.
ఆ నేరేడు పండ్లు మహాగజ ప్రమాణ రూపమున రాలుచుండునట. అవి ప్రిదిలి కారిన రస మే రైపారి జంబూనది యనంబరగు. ఆజంబూ రసము ద్రావినవారు కష్టము- దుర్వాసన- ముదిమి-ఇంద్రియక్షయము నెఱుంగరు. ఆ జంబూనది యెడ్డునంగల మన్ను-ఆ రసముచే దడిసి సుఖవాయువున నారి జాంబూనదమను బంగార మేర్పడును. ఆది సిద్ధభూషణము అనగా సిద్ధులు ధరించునదన్నమాట.
మేరువునకు తూర్పుచెన భద్రాశ్వము. పడమట కేతుమాలము. అనురెండు వర్షములున్నవి. వానికి నడుమ ఇలావృతము. తూర్పున చైత్రరధము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందనవనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవభోగ్యములు గలవు.
శాంతవంతము, చక్రకుంజము, కురరీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరువు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము. పతంగము, రుచకము, నిషధము, మొదలైనవి దక్షిణదిశ మేరువు యొక్క కేసరపర్వతములు, శిఖివాసము, వ్తెదూర్యము, కపిలము, గంధమాదనము, జానుథి మొదలైనవి మేరు పశ్చిమ కేసరగిరులు. అవి మేరువునంటి జఠరాదిస్ధానములందున్నవి. శంఖకూటము, ఋషభము, హంసము, నాగము, కాలంజరము, మొదలగునవి మేరూత్తరదిశ కేసర శైలములు. మేరువుమీద బ్రహ్మయొక్క నగరము పదునాలుగువేల యోజనముల వైశాల్యముగలది. ఆందెనిమిది మూలలందు అష్టదిక్పాలుర పురములు గలవు. విష్ణు పాదమునుండి వెడలి చంద్రమండలమున ప్రవహించుచు ఆకాశగంగ బ్రహ్మపురి నలువై పుల పడుచున్నది. అట్లుపడి నాల్గుదెసల నాల్గుపాయలైనది. సీత-అలకనంద-చక్షువు, భద్ర. సీత పూర్వశైలమునుండి మరియొక శైలమున కంతరిక్ష సంచారము సేయును. అవ్వల భద్రాశ్వవర్ష పర్వతముమీదుగా సముద్రుంబొందును. ఆలకనంద దక్షిణదిశగా భారతవర్షముంజేరి యేడు భాగములయి సముద్రము జొచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటంగల కేతుమాల వర్షముల జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తరగిరులందాటి యుత్తర కురుభూములం బ్రవహించి ఉత్తరసముద్రముం జేరును.
నీల పర్యతమునుండి నిషధ పర్వతము వరకు పొడవయినదై మాల్యవంతము గంధమాధనమును గలవు. వానినడిమి భాగమున తామరకపువ్వులోని దుద్దువలె మేరువున్నది. మర్యాదాపర్వతమునకు ఆవలలోకాలోకమసు పర్వతమునకు భారతములు, కేతుమాలములు, భద్రాశ్వములు, కురుభూములును రేకులట్లున్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు, అవి దక్షిణోత్తరములందు నీలపర్వతమునుండి నిషధ సర్వతముదాక వ్యాపించియున్నవి. గంధమాదనకైలాస పర్వతములు తూర్పు పడమరలందు నెనుబది యోజనముల పొడవుగల వై నీలపర్వతమునుండి నిషధ పర్వతమువరకు వ్యాపించి సముద్రములో జొచ్చియున్నవి. నిషధము, పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. ఆరెండు దక్షిణోత్తరములందు నీలపర్వతమునుండి నిషధ పర్వతమువరకు దైర్ఘ్యము గల వై మేరు పర్వతమునకు పశ్చిమ భాగముసందు యధా పూర్వముగ నున్నవి. త్రిశృంగము,జారుధియు నుత్తరదిశ వర్షపర్వతములు. తూర్పుపడమరగా వ్యాపించి అవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదాగిరులు నాచే చెప్పబడినవి. వీనిలో రెండు రెండు పర్వతములు మేరుపర్వతమునకు జఠర(గర్భ) భాగములుగా నలుదెసల నున్నవి. మేరువు నలుదెసలగల కేసర పర్వతములు చెప్పబడినవి. అవి చల్లని ఆద్యంతములు గలవి. వాని లోపలగల లోయలు మనోహరములై సిద్దచారణ సేవితములై యుండును. వానియందు రమ్యములైన వురములు వనంబులుగలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయశ్రేష్టములు నరకిన్నరులచే సేవితములై యొప్పును. రమ్యము లైన ఆపర్వతద్రోణు(లోయ)లందు రేయింబవళ్ళు గంధర్వ యక్షరాక్షస దైత్య దానవులు గ్రీడించుచుందురు. ఇవి భౌమస్వర్గములు. అనగా భూమిమీదనున్నస్వర్గభూములు.ధర్మనిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను పాపాత్ములు చేరజాలరు.
భద్రాశ్వపర్వతమందు విష్ణుభగవానుడు హయగ్రీవ స్వరూపుడై యుండును. కేతుమాలమందు వరాహమూర్తి భారతమందు కూర్మమూర్తి, కురుభూములందు సనాతనుడగు గోవిందుడు మత్స్యమూర్తియునై యుండును. సర్వత్ర సర్వస్వరూపుడై ఆ సర్వేశ్వరుడు హరి విశ్వరూపు డై యుండును. సర్వాత్మకు డైన యా విష్ణువు అందరికి ఆధారభూతుడై యుండును.
బ్రాహ్మణులారా! కింపురుషాదివర్షములు ఎనిమిదింటియందుగల జీవులకు శోకము ఆయాసము ఉద్వేగము ఆకలి దప్పిక భయము మొదలైన పుండవు. ఆచటి ప్రజలు స్వస్థులు,నిరాతంకులు (అడ్డులేనివారు) ఏదుఃఖస్పర్శయులేనివారుగను పదిపండ్రెండువేల ఏండ్లాయువు గలవారుగనుందురు. ఆవర్షములందు ఇతరములగు భూమియందలి బాధలు కృత త్రేతాది యుగవిభాగములేదు. వానియందన్నిట నేడేసి కులపర్వతములున్నవి. అందుండి వందలకొలది నదులు పుట్టినవి.
ఇది శ్రీబ్రహ్మమహాపురాణము నందు భువనకోశద్వీపవర్ణనము అను పదునెనిమిదవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹