Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – పంతొమ్మిదవ భాగము

జంబూద్వీపవర్ణనము

సూతుడిట్లనియె : –

సముద్రమునకు ఉత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ”భారతి” యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.

ఇందు మహేంద్రము మలయము-సహ్యము-శుక్తిమంతము-ఋక్షము-వింధ్యము-పారియాత్రములను సప్తకుల పర్వతములున్నవి. భారతపర్షము నుండియే స్వర్గమోక్షముల జీవులు పొందుదురు. పశుపక్ష్యాది జన్మములను నరకమునుగూడ నిటనుండియే పొందుదురు. ఆవాంతరకర్మ ఫలము స్వర్గము పర్యవసానమందు ఆద్యంత్యందిక ఫలమైన మోక్షము గూడ ఇటనుండియే మానవుడు పొందును. ఈ భూమండలమందిక్కడనే కర్మానష్ఠానము విధింపబడినది. అందుచేతనే దీనికికర్మభూమియను పేరుసార్ధకము.

భారతవర్షమున తొమ్మిది ద్వీప విభాగ మయులున్నవి. ఇంద్రద్వీపము, కశేరుపు (కశేతుమంతమని కూడయందురు) తామ్ర పర్ణము, గభస్తిమంతయు, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఈ భారత ఖండ మందు తొమ్మిదవది. సముద్రసంవృతము ఇది దక్షిణదిక్కునుండి ఉత్తరదిక్కుకు వేయియోజనములు.

తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నుందురు. యజన యాజనములు. యుద్ధము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు,

హిమవత్పర్వత ప్రత్యంత పర్వతమునుండి శతద్రు (సట్‌లజ్‌) చంద్రభాగ వేదము, స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద-సురస మొదలయినవి వింధ్యగిరినుండి వెడలుచున్నవి. తాపి-పయోష్ణి నిర్వింధ్య-కావేరి మొదలయినవి ఋక్షపర్వత పాదమందు జనించినవి, గోదావరి-ఖీమరధి-కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాదమందు బుట్టినవి. కృతమాలా-తామ్రపర్ణీప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య-ఋషికుల్య మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్యా-కుమారి మొదలైనవి శు క్తిమత్పర్వత పాదమందు బుట్టినవి. వీనియుపనదులు వేలకొలదియుగలవు.

వాని యందు కురుపాంచాల దేశ ప్రజ నివసించుచున్నది. తూర్పన కామరూప దేశవాసులు, కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు-దక్షిణమునందుండువారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు-అర్బుదులు మారుకులు మాళవులు పారియాత్రనివాసులు మద్రులు రాములు, అంబష్ఠులు పారసీకాదులు వీరందరు నీయీనదుల జలములం ద్రావుదురు. ఈ దేశమలు కలిసిమెలసి ఆనందభరితులై పుష్టివంతులు నైన జనులతో నిండియుండును.

కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగమిక్కడనే కలదు. అన్యత్రలేదు, ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పరలోకముగోరి యిచట దానము లాచరింపబడును.

జంబూద్వీపమందు యజ్ఞపురుషుడు ఉపాసింపబడును విష్ణువు యజ్ఞరూపుడుగ యజ్ఞేవ్వరుడుగ నిచట నుపాసింపబడును ఇతరద్వీపములందు మఱియొక పేరున గొల్వబడును. ఈ జంబూద్వీపమున భారతవర్షము శ్రేష్ఠము. ఇదికర్మభూమి. తక్కినవి భోగభూములు, బహుజన్మఫలభోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము గల్గును.

దేవతలీ భారతభూమిని గూర్చి యిట్లు గానము సేయుచుందురు. స్వర్గాపవర్గములొసంగు భారతభూమియందు మనుష్యులై , వారిలో పురుషులై పుట్టి, అట్టి కర్మభూమియందు జన్మము బడసియు ఫలాభిసంధి లేక సర్వ కర్మఫలమును పరమేశ్వరార్పణమని పరమాత్మయగు విష్ణువునందర్పించి పాపదూరులై ఆ పరబ్రహ్మ మందు లీనమగు వారు ధన్యులు. అనగా పరమేశ్వరార్పణముగ నాచరించిన స్వర్గప్రదమగు కర్మ లీనమైపోయిన తర్వాత దేహబంథమును మఱియెందుపొందుదురో యెఱుగము. ఇంద్రియవంతులై భారత వర్షమున పుట్టినవారు ధన్యులు. తొమ్మిది వర్షములుగల్గి లక్షయోజనముల విరివి గల ఈ జంబూద్వీపమును గూర్చి సంక్షేపముగా దెల్పితిని. ఈ ద్వీపమునావరించి లక్షయోజనములు విస్తారముగల క్షీర సముద్రము వలయాకారముగ నున్నది.

ఇది శ్రీబ్రహ్మపురాణమున భువనకోశమందు జంబూద్వీప నిరూపణమను పందొమ్మిదవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment