జంబూద్వీపవర్ణనము రెండవ భాగము
సూతుండిట్లనియె : –
క్షీరసముద్రముచే జంబూద్వీపము చుట్టబడినట్లు ప్లక్షద్వీపము లవణోదధిచే పరవృతమై యున్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్షద్వీపము. ప్లక్షద్వీపేశ్వరుడు మేధాతిది. వాని కుమారులు ఏడుగురు. శాంతమయుడు (జ్యేష్ఠుడు) శిశిరుడు సుఖోదయిడు ఆనందుడు శివుడు క్షేమకుడు ధ్రువుడు. వారీ ద్వీపము నేలినవారు. వారిపేర మఠ్యాదా(హద్దు) కౌరవ పర్వతము ఏడు గలవు. అట్లే వర్షపర్వతములు మఱి ఏడుగలవు. మునులారా ! వాని పేర్లు వినుడు. గోమోదము-చంద్రము నరదము-దుందుభి-సోమకము-సుమనస్సు-వైభ్రాజము అనునవి.
పుణ్యాత్ములారా! రమ్యములగు ఈ వర్ష పర్వతములందును, వర్షములందును ప్రజలు దేవగంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్యవంతములు. ఆందుజనులు మృతినందరు. అధివ్యాధులు లేక సర్వకాలము సుఖముందురు. అందు నదులు గూడా ఏడే. సముద్రగాములు. వానిపేర్లు ఆనుతప్త శిఖ విప్రాశ త్రిదివ-క్రము-అమృత-సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానములైన నదులు, పర్వతములు పేర్కొనబడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. ఆచటివారు ఎప్పుడును ఆనదీ జలములనే త్రాగుచుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.
ఆ ప్రదేశము ఏడింటియందును యుగ వ్యవస్థలేదు. ఎల్లప్పడు త్రేతాయుగ సమముగనే కాలము నడచును. ప్లక్షద్వీపము మొదలు శాకద్వీపము దనుక జనులు అయిదువేలేండ్ల ఆయువు గల్గి నీరోగులయి యుందురు, వర్ణాశ్రమ విభాగానుసార అక్కడ ధర్మము నాల్గు విధములుగా నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు.
ఆర్యకులు కురువులు వివిళ్వులు భావులు ననుపేర విప్రక్షత్రియ వైశ్యశూద్రూలు అను నాలుగు వర్ణముల వారుందురు.
జంబూద్వీపమున జంబువృక్షమున్నట్లు అంతపరిమాణముగల జువ్విచెట్టు ప్లక్షద్వీప మధ్యమందున్నది. అందుచే దానికా పేరుగల్గినది, అందు ఆర్యకాదివర్ణముల వారిచే జగత్కర్తయు సర్వేశ్వరుడును సోమరూపియు నగు నాహరి ఆరాధింపబడును, ప్లక్షధ్వీప ప్రమాణముగల ఇక్షు (చెఱకురసము) సముద్రముచే ప్లక్షద్వీపమావరింపబడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్షద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మలద్వీపమును గూర్చి తెలిసికొనుడు.
ఇక శాల్మలద్వీపము:- దీనికి వీరుడైన వువష్మంతు డధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము, హరితము, జీమూతము’ రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభమునను పర్షపర్వతములేడును ప్రసిద్ధములు. శాల్మలద్వీపము ఇక్షు రససముద్రముచే పరివేష్టితము. ఈద్వీపము ప్లక్షద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్నగర్భములైన సప్తకులాచలములు సప్తనదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము. కంకము, మహిషము, కకుద్మంతము అను పర్వతములున్నవి. ద్రోణగిరి యందు మహౌషధు లుండును, ఇందలి నదులు:- శ్రోణి-తోయ-వితృష్టా-చంద్ర శుక్ర-విమోచని-నివృత్తి అనునవి. అవి స్మరణమాత్రాన పాపముల హరించును.
ఇందలివర్షములు శ్వేతము-లోహితము-జీమూతము-హరితము-వైద్యుతము-మానసము-సుప్రభము ననునవి. ఇందు చాత్యుర్వర్ణవ్యవస్థ యున్నది, కపిల=తేనెరంగు అరుణ=ఎఱుపు పీత = పసువు కృష్ణము=నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములవారిందు నివసింతురు. ఇచట యాగకర్తల కుపాస్యదైవము విష్ణువు. యజ్ఞమందు వాయు స్వరూపునిగ నా దైవమును యజ్వలు సేవింతురు. అతి మనోహరమైన యీ ద్వీపమందు దేవతలు సన్నిధి సేసియుందురు. శాల్మల వృక్షముండుటచే నీద్వీపమునకు శాల్మలద్వీపమని పేరు. కుశద్వీపము చుట్టును నురాసముద్రమున్నది. అదిశాల్మలద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.
ఇందు రాజైన జ్యోతిష్మంతుని కుమారులు:- ఉద్భిదుడు-వేణుమంతుడు- సైరధుడు-రంధనుడు-ధృతి-ప్రభాకరుడు-కపిలుడు అసువారి పేరులతో వర్షములునున్నవి. ఇందు మనుజులతోబాటు దైత్య దానవ దేవ గంధర్న యక్ష కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రాహ్మణాది చాతుర్వర్ణ ప్రజలు వరునగాదములు, శుష్మిణులు, స్నేహులు, మాందహులు ననుపేర నుందురు. అక్కడ పరబ్రహ్మరూపుడు జనార్ధనుడారాధ్యదైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు చేసి ఆదికారిక పురుఘలుగా అవతరింపవలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమయిన ముక్తిసే కోరుదురని తాత్పర్యము. విద్రుమము హేమశైలము ద్యుతిమంతము పుష్టిమంతము కుశేశయము హరి మందరము ననునవియచ్చట వర్షపర్వతము లేడు.
ధూతపావ, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్నచిన్న యేరులు వేలకొలది సర్వపాపహరములైన అక్కడ నున్నవి. కుశద్వీపమధ్యమున కుశస్థంబమున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచద్వీపముచే నాపృతమయి యటనున్నది,
ఇక క్రౌంచ ద్వీపము కుశద్వీపము కంటె రెట్టింపు నిడివి గలది. ఇచట ద్యుతిమంతుని కుమారు లేడుగురు, పరిపాలకులు. కుశగుడు-మందగుడు-ఉష్ణుడు-పీవరుడు-అంధకారకుడు-ముని-దుందుభి యనువారు. దేవగంధర్వనిషేవితములు రమ్యములు నైన వర్షపర్వతము లిందున్నవి. అవి క్రౌంచము, వామనము, అంధకారకము. దేపవ్రతము, ధమము, పుండరీక వంతము, దుందుభి అనునవి యొకదానికంటెనొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవగణములతోగూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు.
బ్రాహ్మణాది చాతుర్వర్ణములు నిందుగలవు. ఇందు ప్రధాన నదులు ఏడు. గౌరి-కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజప, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యానయోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దనుడారాధింపబడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. ఆది యాధ్వీపపరిమాణము గలది. దానిచుట్టును శాకద్వీపమున్నది.
శాకద్వీపపతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారిపేర నున్నవి. అందేడువర్షపర్వతములు ఉదయగిరి-జలధార=రైవతకము శ్యామము-అంభోగిరి-ఆస్తికేయము-కేసరి యనునవి. సిద్దగంధర్వసేవితమై యిచట శాకమను(టీకుగాని కడిమిగాని)మహావృక్ష మున్నది. దాని యాకుల గాలితాకినచో పరమాహ్లాదము గల్గును. అక్కడపవిత్రములయినచతుర్వర్ణప్రజలతోగూడిన జనపదములు గలవు. ఆచటి జనులు నిరాతంకులు ఏ అభ్యంతరములు లేనివారు నీరోగులు. నదులు మహాపుణ్యములు. పాపభయహరములు. సుకుమారి-కుమారి-నళిని-రేణుక-ఇక్షువు-ధేనుక-గభస్తి అనునవి యేడు చిన్నచిన్నయేరులు, గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జను లానదీసలిలములను ద్రావుదురు. ఈనదులు స్వర్గమునుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖదుఃఖములు, శాస్త్రముహద్దుమీరినడచుటఅనునవిలేవు. మగులు మాగధులు మానసులు మందగులు ననుపేర బ్రాహ్మణాది చాతుర్వర్ణ ప్రజ లచట నివసింతురు.
శాకద్వీపవాసుల కులదైవము విష్ణువు, సూర్యరూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింపబడును.
శాకద్వీపము అదే ప్రమాణముగల క్షీరాభ్దిచే నావరింపబడియున్నది. క్షీరాభ్ది పుష్కరద్వీప సమావృతము, శాకద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము.
పుష్కరద్వీపమందు సవనుని కుమారులు మమావీతుడు, ధాతకి యనువారు. వారిపేర పర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తరమనునదొక్కటియే. అది యీద్వీపము నడుమ వలయాకారముననున్నది. ఏబదివేలయోజనముల యెత్తు, అంతే వెడల్పు గలది. అది పుష్కరద్వీపమండలమునునడిమికి రెండు భాగములు సేయుచున్నట్లున్నది. దాని మూలమునే యీ ద్వీపము రెండువర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పదివేలెండ్లు జీవింతురు.
వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంపబడువాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు, భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈవర్షద్వయమున పుష్కరద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు కొండలులేవు. ద్వీపములులేవు.
మనుష్యలందరి వేషమొక్కటే. వారు దేవసమరూపులు. అట వర్ణాశ్రమాచార ధర్మవిచక్షణ లేదు. వేదత్రయము వార్త దండనీతి శుశ్రూష యనునవి లేనేలేవు. ఈవర్షద్యయము భూలోక స్వర్గమే. కాలము జరారోగములు లేక సర్వసుఖప్రదమగును ఈరెండుఖండములందు పుష్కర ద్వీపమందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మయుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింపబడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టుకొన్నది. దానివ్రమాణము పుష్కరద్వీపసమానము.
ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింపబడియున్నవి. ద్వీపములన్నియు సమ ప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి. అన్ని సాగరములందలి నీరు నెల్లప్పుడును నమము. హెచ్చుతగ్గులులేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు, చంద్రుని వృద్ధిననుసరించి అందలి నీరుపొంగును. ఆపొంగు క్రుంగుకూడ నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగ పొంగును తగ్గును. శుక్లకృష్ణ పక్షములందు చంద్రోదయ అస్తమయములందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నండును. పుష్కరద్వీపవాసులందరు నన్ని వేళల స్వయంసంప్రాప్తమైన షడ్రసోపేతభోజనము సేయుచుందురు,
స్వాదూదక (మంచినీటి) సముద్రము చుట్టు లోకమున్నది, దానికి రెట్టింపు బంగారుభూమి. జంతురహితము ఆమీద లోకాలోకపర్వతము పదివేలయోజనములు విరి వైనది, అంతేయెత్తును అంతే లోతుగలది. ఆ శైలము నావరించి చీకటి యున్నది. ఆచీకటి ఆండకటాహమంతట నావరించి యున్నది. ఇంతవరకుగల యీ భూమి యేబదికోట్ల యోజనముల ప్రమాణము గలది. బ్రహ్మాండ కటాహముతో ద్వీపములతో పర్వతములతో నీధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాధిక్యముగల దై సర్వ జగదాధారమై యున్నది.
ఇది శ్రీబ్రహ్మపురాణమందు సముద్రద్వీప పరిమాణవర్ణనము అను ఇరువదవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹